BJP Attack Kejriwal| ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై శుక్రవారం బిజేపీ నాయకులు దాడి చేయడంతో ఒక్కసారిగా దేశ రాజధానిలో రాజకీయాలు వేడెక్కిపోయాయి. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్ అయిన అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీలోకి వికాస్ పురి ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం పాదయాత్ర చేస్తుండగా.. ఆ ప్రాంతంలోని బిజేపీ నాయకులు ఆయనపై దాడి చేశారు. మరో నాలుగు నెలల్లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే కేజ్రీవాల్ ప్రజలలో తమ పార్టీ బలబలాను నిరూపించుకునేందుకు పాదయాత్ర చేపట్టారు.
తనపై జరిగిన దాడి ఘటనపై స్పందిస్తూ.. భారతీయ జనత పార్టీ తీరుపై కేజ్రీవాల్ మండిపడ్డారు. ఆయన మీడియాతో శనివారం సాయంత్రం మాట్లాడుతూ.. “నిన్న బిజేపీ పెద్దలు నాపై దాడి చేయడానికి రౌడీలు, గూండాలను పంపించారు. వికాస్ పురిలో నేను పాదయాత్ర చేస్తుండగా.. వారు నాపై దాడి చేశారు. బిజేపీని ఒక్కటే అడుగుతున్నాను. నన్ను చంపేయాలని మీకుందా?.. మీకు నిజంగానే బలముంటే ఎన్నికల్లో నాతో తలపడండి. మీ బలాన్ని నిరూపించుకోండి. ఢిల్లీ ఓటర్లకు కూడా ఇదే నా సూచన. బిజేపీని సమర్థించవద్దు. ఆ పార్టీ ప్రస్తుతమున్న ఉచిత పథకాలను రద్దు చేస్తుంది.” అని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.
Also Read: ‘కష్టజీవుల బతుకులు భారం.. ఏమీ మిగలడం లేదు’.. రాహుల్ గాంధీ ట్వీట్ వైరల్
మరోవైపు ఢిల్లీ మంత్రి, ఆప్ పార్టీ నాయకుడు సౌరభ్ భరద్వజ.. కేజ్రీవాల్ పై దాడిని ఖండించారు. మాజీ ముఖ్యమంత్రిపై దాడి చేయడం నీచ రాజకీయాలకు ఉదాహరణ అని చెప్పారు. కేజ్రీవాల్ పై దాడి చేసిన వారిని తాము గుర్తించామని తెలిపారు. దాడి చేసిన ఇద్దరిలో ఒకరు బిజేపీ ఢిల్లీ యువ మోర్చ ఉపాధ్యక్షుడు రోహిత్ షెరావత్ కాగా, మరొకరు బిజేపీ యువ మోర్చ సెక్రటరీ అరుణ్ దాగర్ అని వారి పేర్లు వెల్లడించారు. వీరిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో బిజేపీ కార్యకర్తలుగా ఉన్నాయని.. వారు సాధారణ పౌరులు కారని స్పష్టం చేశారు.
అయితే ఆప్ నాయకులు చేసిన ఆరోపణలను బిజేపీ నాయకులు తిప్పికొట్టారు. ఇదంతా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం చేస్తున్న రాజకీయాలని.. ఆ దాడి వారే స్వయంగా చేయించి.. బిజేపీ కార్యకర్తలపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని ఢిల్లీ అసెంబ్లీ ప్రతిపక్ష లీడర్ విజేంద్ర గుప్త చెప్పారు.
మరోవైపు సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేఖ్ యాదవ్.. అరవింద్ కేజ్రీవాల్‌పై జరిగిన దాడిని ఖండించారు. ట్విట్టర్ ఎక్స్ లో ఆయన ఈ విధంగా పోస్ట్ చేశారు. “ప్రజాస్వామ్యంలో ఇటువటి ఘటనలు జరగడం బాధాకరం. ఈ దాడి ఎవరు చేయించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారతదేశ రాజకీయాల్లో ద్వేషం, హింస సిద్దాంతాలు గల పార్టీ ఏదో అందరికీ తెలుసు. హింసకు పాల్పడడమే ఓటమికి నిదర్శనం,” అని రాశారు.
మహారాష్ట్ర నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియ సూలే కూడా కేజ్రీవాల్ పై జరిగిన దాడిని ఖండించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్న మన దేశంలో ప్రత్యర్థులపై హింసాత్మకంగా దాడి చేయడం ఏ మాత్రం సమర్థనీయం కాదని చెప్పారు.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా అరవింద్ కేజ్రీవాల్ పై జరిగిన దాడిపై మండిపడ్డారు. ఢిల్లీ ప్రజల నుంచి కేజ్రీవాల్ కు లభిస్తున్న మద్దతును బిజేపీ ఓర్వలేకే ఇలాంటి దాడులు చేయిస్తోందని ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.