Bomb Threat Flight : ఇటీవల దేశంలోని విమానాశ్రయాలకు, విమానాలకు బాంబు బెదిరింపు ఘటనలు ఎక్కువయ్యాయి. వీటిలో దాదాపు అన్నీ నకిలీ బెదిరింపులే కావడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి నకిలీ వార్తల వ్యాప్తితో దేశంలో శాంతి భద్రతలు సహా ఇతర సమస్యలు వస్తున్నాయంటూ దేశంలోని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లకు ఓ అడ్వైజరీ జారీ చేసింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అన్ని సోషల్ మీడియా సంస్థలు తప్పనిసరిగా భారతీయ ఐటీ నియమాలు, భారతీయ న్యాయ సంహితలోని నిబంధనలకు కట్టుబడి ఉండాలని సూచించింది. సోషల్ మీడియా సంస్థలు వారి ప్లాట్ ఫామ్ లలో దేశానికి హాని కలిగించే చర్యలు, సహా నకిలీ బాంబు బెదిరింపు వార్తల సమాచార వ్యాప్తిని నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని కోరింది.
సోషల్ మీడియా వేదికగా అనేక నకిలీ వార్తలు వ్యాప్తిలోకి వస్తున్నాయన్న కేంద్రం… బాంబు బెదిరింపుల వంటి హానికర చర్యల కారణంగా దేశంలో ఎయిర్ లైన్స్ సేవల్లో అంతరాయం, ప్రయాణికుల్లో అనవసర భయాందోళనలు పెరిగిపోతున్నాయని అభిప్రాయపడింది. ఇలాంటి నకిలీ వార్తలు ఫార్వార్డింగ్, రీ-షేరింగ్, రీ-పోస్టింగ్ వంటి వాటి కారణంగా వేగంగా ప్రజల్లోకి వెళుతున్నాయని, ఫలితంగా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని తెలిపింది. ముఖ్యంగా వరుస బాంబు బెదిరింపులతో ప్రజల్లో విమాన ప్రయాణాలపై ఆందోళనలు పెరిగిపోతున్నాయన్న కేంద్ర ప్రభుత్వం… నకిలీ బాంబు బెదిరింపు వార్తలను ఆయా ప్లాట్ పామ్ లు సమర్థవంతంగా నిరోధించి.. దేశ ప్రజల్లో విశ్వాసాన్ని నింపేందుకు ప్రయత్నించాలని సూచించింది.
కాదంటే సోషల్ మీడియా సంస్థలపై చర్యలకు సిద్ధం…
దేశంలో సేవలందిస్తున్న అన్ని సోషల్ మీడియా సంస్థలు తప్పనిసరిగా భారతీయ ఐటీ చట్టాలను, నిబంధనల్ని పాటించాలని లేని పక్షంలో వారికి కల్పిస్తున్న సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఇది… ఆయా సోషల్ మీడియా సంస్థల్లో పోస్ట్ అయ్యే థార్డ్ పార్టీ కంటెంట్ నుంచి బాధ్యత వహించాల్సిన అవసరం లేకుండా రక్షణ కల్పిస్తుంది. ఇది కోల్పోతే… ఆయా వేదికల్లో పోస్ట్ అయ్యే ప్రతీ పోస్ట్ కు ఆయా సంస్థలు చట్ట ప్రకారం బాధ్యత వహించాల్సి ఉంటుంది. దాంతో పాటే.. కేంద్ర ఐటీ శాఖ మరిన్ని సూచనలు చేసింది.. నకిలీ సమాచార వ్యాప్తి దేశ ఆర్థిక పరిస్థితులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, అలాంటి వార్తల వల్ల సమాజంలో ఆందోళనలు పెరిగిపోతాయని తెలిపింది. ఈ కారణంగానే… నకిలీ వార్తలు, ముఖ్యంగా నకిలీ బాంబు బెదిరింపు వార్తల కట్టడికి సోషల్ మీడియా సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకోనున్నాయో తెలుపుతూ కేంద్రానికి 72 గంటల్లో సమాచారం అందించాలని కోరింది.
Also read : వామ్మో.. మీరు వాడుతున్న ఈ మందులు నకిలీవట, CDRA తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెల్లడి
ఈ వారంలో కోల్ కత్తా, భువనేశ్వర్, ఝర్సుగూడ ఎయిర్పోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇలాంటి నకిలీ సమాచారం, బెదిరింపుల కారణంగా విమానయాన ప్రయాణికులు, సెక్యూరిటీ ఏజెన్సీలు ప్రభావితం అవుతున్నాయన్న కేంద్ర ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ… వీటి కారణంగా ఎయిర్ లైన్స్ సేవల్లో తీవ్ర అంతరాయం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.