⦿ ఆమప్రాలి కాటా తిరిగొస్తారని ప్రచారం
⦿ రాష్ట్రానికి రప్పించాలని ప్రభుత్వం ప్రయత్నాలు
⦿ తెలంగాణ నుంచి వెళ్లిన ఐదుగురిలో..
⦿ ఒక్కరికే పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
⦿ మిగిలిన నలుగురికి పెండింగ్‌లో పోస్టులు
⦿ ఏపీలోనే ఉంటే సీఎంవో లేదా పవన్ పేషీలోకి?
⦿ వీలుకాకుంటే జీవీఎంసీ బాధ్యతలు ఇచ్చే ఛాన్స్
అమరావతి, స్వేచ్ఛ :
ఐఏఎస్ ఆమ్రపాలి కాటా మళ్లీ తెలంగాణకు విచ్చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ నుంచి ఆమ్రపాలి కాటా, రోనాల్డ్ రాస్, వాకాటి ఆరుణ, వాణి ప్రసాద్, ప్రశాంతి డిప్యుటేషన్‌పై వెళ్లారు. క్యాట్, హైకోర్టును ఆశ్రయించగా ఏపీకి వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పాయి. దీంతో తెలంగాణలో రిలీవ్ అయ్యి ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేశారు. అయితే ఈ ఐదుగురిలో ప్రశాంతికి మాత్రమే పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వం. మిగిలిన నలుగురు అధికారులకు మాత్రం ఎలాంటి పోస్టింగ్‌లు ఇవ్వలేదు. అయితే ఆమ్రపాలి, రోనాల్డ్ రాస్ ఇద్దరూ ఇంటర్‌స్టేట్ డిప్యుటేషన్ కింద తిరిగి హైదరాబాద్‌కు పంపే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అందుకే సీఎం చంద్రబాబు వీరి పోస్టింగుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఎందుకంటే ఈ ఇద్దరినీ రాష్ట్రానికి తెచ్చుకోవడానికి రేవంత్ ప్రభుత్వం గట్టిగానే పట్టుబడుతోందని తెలుస్తోంది. అందుకే పోస్టుల విషయంలో పెండింగ్ కంటిన్యూ అవుతోందని అమరావతి వర్గాలు చెబుతున్నాయి.
వెళ్లకపోతే..?
ఒకవేళ ఆమ్రపాలి తెలంగాణకు వెళ్లే పరిస్థితి లేకుంటే సీఎంవోలో కీలక పదవి ఇస్తారని తెలుస్తోంది. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా తన పేషీలోకి తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. సబ్ కలెక్టర్‌గా కెరీర్ మొదలై, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా, జీహెచ్ఎంసీ కమిషనర్‌గా పనిచేసిన అనుభవం ఆమ్రపాలికి ఉండటంతో ఆమెకు ఎలాంటి హోదా దక్కబోతోంది అనేది తెలియట్లేదు. సీఎంవో, డిప్యూటీ సీఎం పేషీలో వీలుకాని పక్షంలో ఆమ్రపాలికి జీవీఎంసీ కమిషనర్ బాధ్యతలు అప్పగించే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. దీనికి తోడు ఆమ్రపాలికి విశాఖపట్నంతో మంచి అనుబంధం కూడా ఉంది. ఆంధ్ర యూనివర్శిటిలో ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేశారు.
చెక్ పెట్టాలంటే..
2010 బ్యాచ్‌కు చెందిన ఆమ్రపాలి వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా తొలి బాధ్యతలు చేపట్టి, పీఎం ఆఫీసులో డిప్యూటీ సెక్రటరీ వరకూ పనిచేసిన అనుభవం ఉంది. ఇలా వివిధ హోదాల్లో పనిచేసి ఎన్నో సంచలన నిర్ణయాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అర్బన్ ప్లానింగ్‌లో ఆమ్రపాలి నైపుణ్యం, అనుభవాన్ని లెక్కలోకి తీసుకుని జీవీఎంసీ బాధ్యతలు అప్పగించాలని సర్కార్ భావిస్తోందని తెలుస్తోంది. ముఖ్యంగా విశాఖలో కబ్జాలు పెరిగాయని స్వయాన ప్రభుత్వ పెద్దలే ఆరోపిస్తున్న పరిస్థితి. వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే డేర్ అండ్ డ్యాషింగ్ ఆఫీసర్ ఒకరు కావాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఆమ్రపాలికి ఈ బాధ్యతలు అప్పగిస్తే అభివృద్ధితో పాటు జీవీఎంసీ పాలనను గాడిలో పెడతారని ప్రభుత్వ పెద్దలు అనుకుంటున్నారని సమాచారం.