Murder Attempt Case: ఆయన వైసీపీ మాజీ ఎంపీ. ఇప్పటికే మహిళ హత్యకేసులో రిమాండ్ లో ఉన్నారు. అయితే తాజాగా మరో హత్యాయత్నం కేసు కూడా నమోదు చేసి పోలీసులు, ఆయనకు షాకిచ్చారనే చెప్పవచ్చు. ప్రస్తుత రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పై దాడి ఘటనలో పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది.
బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ఇప్పటికే రిమాండ్ లో ఉన్నారు. వెలగపూడి మహిళా హత్యకేసులో రిమాండ్ లో ఉన్న నందిగం సురేష్ పై పోలీసులు తాజాగా మరో కేసు నమోదు చేశారు. 2023 మార్చి 31న సత్య కుమార్ పై దాడి ఘటనలో ఏ1గా నందిగం సురేష్, ఏ2గా బోరుగడ్డ అనిల్ గా పేర్కొంటూ గుంటూరు జిల్లా తుళ్ళూరు పోలీస్ స్టేషన్ లో మరో హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్న నందిగం సురేష్, కోర్టు విచారణకు హాజరవుతున్నారు. అలాగే బోరుగడ్డ అనిల్ గుంటూరు పోలీసుల కస్టడీలో ఉండగా, మరో కేసు ఆయనపై నమోదు కావడం విశేషం.
ఇప్పటి మంత్రి సత్యకుమార్, నాడు బీజేపీ నేతగా మూడు రాజధానుల శిబిరం దగ్గరకు వెళ్లి సంఘీభావం తెలిపారు. ఆ సమయంలో అప్పటి సీఎం జగన్ ను ఉద్దేశించి సత్యకుమార్ విమర్శించారు. అలాగే రాజధాని రైతులకు మద్దతు తెలిపారు. అప్పుడే పలువురు బీజేపీ కార్యకర్తలపై దాడికి పాల్పడగా, కొందరు కార్యకర్తలు గాయపడ్డారు. ఈ దాడిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, సత్యకుమార్ పై దాడికి యత్నించిన పలువురిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ప్రస్తుతం ఆ దాడికి సంబంధించి నందిగం సురేష్, బోరుగడ్డ అనిల్ పై మరో కేసు నమోదైంది. ఈ కేసులకు సంబంధించి టీడీపీ కూటమి కక్షపూరితంగా వ్యవహరిస్తుందని, కావాలనే కేసుల్లో ఇరికిస్తున్నట్లు వైసీపీ విమర్శిస్తోంది. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలనలో భాగంగానే వైసీపీ నేతలపై కేసులు నమోదు చేస్తున్నారని, కూటమి చర్యలను ప్రజలు గమనిస్తున్నట్లు వైసీపీ నాయకులు తెలుపుతున్నారు.