Drugs Quality Test Fail : దేశీయ మార్కెట్లో విక్రయించే ఔషధాల అనుమతులు, నాణ్యతా ప్రమాణాలను సెంట్రల్ డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ (CDRA) పరిశీలిస్తుంటుంది. ఇటీవల ఈ సంస్థ నిర్వహించిన భద్రతా తనిఖీల్లో ఆందోళనకర ఫలితాలు వెలువడ్డాయి. భారతీయ మార్కెట్లో అందుబాటులోని అనేక ఔషధాలకు నాణ్యతా పరీక్షలు చేసిన అధికారులు.. వాటిలో కొన్ని నకిలీ ఉత్పత్తులని తేల్చారు. మరో 49 ఔషధాలు ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం లేని నాసిరకం మందులుగా గుర్తించారు. వీటిలో ప్రముఖ ఫార్మా కంపెనీలు తయారు చేస్తున్న మెడిసిన్స్ కూడా ఉండడంతో అధికారులను సైతం ఆశ్చర్యపరిచింది.
మార్కెట్లో ఎక్కువగా విక్రయాలు జరిగే కాల్షియం సప్లిమెంట్ షెల్కాల్ 500 (Shelcal 500), కాంబినేషన్ డ్రగ్ పాన్-డి(Pan D) , విటమిన్-డీ3 (Vitamin D3) మందులు కూడా ఔషధ పరీక్షలో విఫలమయ్యాయి. ఇవ్వన్నీ లైఫ్ మ్యాక్స్ క్యాన్సర్ ల్యాబోరేటరీస్ తయారు చేసే ఔషధాలు కావడం గమనార్హం. సెంట్రల్ డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ (CDRA) మార్కెట్ నుంచి 3 వేలకు పైగా నమూనాలకు సేకరించి నాణ్యతా పరీక్షలు నిర్వహించగా ఈ విషయం వెల్లడైంది. అయితే.. మొత్తం పరీక్షల్లో ఇది కేవలం 1.5 % అంటున్న అధికారులు ఈ విషయంలో ప్రభుత్వం సత్వరంగా స్పందించి, తదుపరి చర్యలు తీసుకుంటుందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించింది.
ఫార్మా రంగంలో మంచి గుర్తింపు పొందిన ఆల్కెమ్ హెల్త్ సైన్స్, అరిస్టో ఫార్మాసూటికల్స్, హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ వంటివి కూడా ఈ జాబితాలో ఉన్నాయి. అయితే… ఈ ఫలితాల కారణంగా ఈ ఫార్మా కంపెనీలు తయారు చేసిన అన్ని ఔషధాలు నకిలీవి లేదా నాసిరకమైనవిగా చెప్పలేమని, కేవలం పరీక్షలు నిర్వహించిన బ్యాచ్ ఔషధాలకే ఆ ఫలితాలు పరిమితం అవుతాయని డ్రగ్ కంట్రోలర్ జనరల్ రాజీవ్ సింగ్ రఘువన్షీ వెల్లడించారు. నాణ్యతా పరీక్షల్లో విఫలమైన బ్యాంచులకు చెందిన మెడిసిన్స్ ను మార్కెట్ల నుంచి రీకాల్ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు సీడీఆర్ఏ (CDRA) తెలిపారు. హిందుస్థాన్ యాంటీబయోటిక్స్ నుంచి మెట్రోనిడాజోల్ మాత్రలు, రెయిన్బో లైఫ్ సైన్సెస్ నుంచి డోంపెరిడోన్ మాత్రలు ఉన్నాయి. కర్ణాటక యాంటీబయోటిక్స్ & ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేసే పారాసెటమాల్ మాత్రల నాణ్యతపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read : జైల్లో గ్యాంగ్స్టర్ బిష్ణోయి ఇంటర్వ్యూ.. 2 డిఎస్పీలు సహా 7 పోలీసు అధికారులు సస్పెండ్
అయితే… ఈ ఆరోపణలపై డ్రగ్స్ తయారీ సంస్థలు విభేదించాయి. మార్కెట్లో తమ లేబుళ్లతో ఉన్న ఔషధాలను తాము ఉత్పత్తి చేయలేదని, అవి నకిలీ ఉత్పత్తులని తేల్చిచెప్పాయి. తాము ప్రతీ ఉత్పత్తిని చాలా జాగ్రత్తగా, అన్ని భద్రతా, నాణ్యతా ప్రమాణాల ప్రకారమే తయారు చేస్తున్నామని వాదిస్తున్నాయి. అయితే.. ఈ విషయంలో మరింత లోతుగా దర్యాప్తు చేస్తేనే ఔషధాల నకిలీల నుంచి ప్రజలను కాపాడవచ్చని ఆరోగ్య నిపుణులు కోరుతున్నారు. నకిలీ, ప్రమాణాలు పాటించని ఔషధాల వినియోగం కారణంగా అనేక దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అంటున్నారు.
ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తీసుకునే ఔషధాలే ప్రాణాలు తీస్తే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.