Sharmila On YV Subbha Reddy: మాజీ సీఎం వైఎస్ జగన్ ఆస్తులకు సంబంధించి మరో మారు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఏకంగా తన బాబాయ్, ఎంపీ వైవి సుబ్బారెడ్డిని టార్గెట్ చేస్తూ షర్మిళ మాట్లాడడం విశేషం. తాను మాట్లాడిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నట్లు, తన బిడ్డలపై ప్రమాణం చేసేందుకు సిద్ధమని, అయితే వైవి సుబ్బారెడ్డి కూడా ప్రమాణం చేసేందుకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు షర్మిళ.
నిన్న తన ఎక్స్ ఖాతా ద్వారా వైఎస్సార్ అభిమానులకు మూడు పేజీల లెటర్ విడుదల చేసిన షర్మిళను ఉద్దేశించి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ విమర్శలపై షర్మిళ మాట్లాడుతూ… జగన్ మోచేతి నీళ్లు త్రాగే వారిలో మొదటి స్థానంలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఉంటారన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆర్థికంగా బలపడిన నేతలలో సుబ్బారెడ్డి, ఆయన కొడుకు ఉన్నారని, అందుకే జగన్ కు మద్దతుగా మాట్లాడతారని తాను భావించానన్నారు. నిన్న వైవి సుబ్బారెడ్డి మాట్లాడారు.. రేపు సాయి రెడ్డి కూడా మాట్లాడతారంటూ షర్మిళ వ్యాఖ్యానించారు.
తన లెటర్లో రాసిన ప్రతి విషయము వాస్తవమని, తన బిడ్డలపై ప్రమాణం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు, అలాగే వైవి సుబ్బారెడ్డి కూడా అదే రీతిలో ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నారా అంటూ సవాల్ విసిరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆఖరి రోజులలో ఆస్తి మొత్తం సమానంగా అందరికీ పంచాలని చెప్పిన విషయాన్ని జగన్ విస్మరించారన్నారు. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఆస్తులు జగన్ కు సంబంధించినవి కాబట్టి జైలుకు వెళ్లారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అయితే ఆస్తులు తన పేరుపై గల భారతి కూడా జైలుకు వెళ్లాలి కదా.. ఆస్తులు ఉన్నంత మాత్రాన, జైలుకు వెళ్తారా అంటూ షర్మిళ ప్రశ్నించారు.
కన్నీళ్లు పెట్టుకున్న షర్మిళ..
తమ ఆస్తులకు వివాదంపై షర్మిళ మాట్లాడుతూ తీవ్ర కన్నీటి పర్యంతమయ్యారు. తనను టార్గెట్ చేసి, వైసీపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారని, అదే తన తండ్రి వైఎస్సార్ జీవించి ఉంటే తమకు ఈ స్థితి వచ్చేదా అంటూ షర్మిళ కన్నీటితో మాట్లాడారు. ఏకంగా తల్లి, చెల్లిపై కేసులు వేసిన ఘనత జగన్ కే దక్కుతుందని, తనకు ఆస్తులు ముఖ్యమంటూ వైవి సుబ్బారెడ్డి చేసిన కామెంట్స్ పట్ల షర్మిళ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ జైలుకు వెళ్ళిన సమయంలో తనతో పాటు, తల్లి విజయమ్మ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశామని, అ కష్టాన్ని నేడు వైసీపీ నాయకులతో పాటు, మాజీ సీఎం జగన్ మరచిపోయారన్నారు. తన అన్న కోసం ప్రాణాలు కూడా అర్పించేందుకు సిద్దమైతే, తన కోసం జగన్ ఒక్క పని చేశారా అంటూ షర్మిళ ప్రశ్నించారు.
కాగా మీడియాతో మాట్లాడుతూ షర్మిళ కన్నీటి పర్యంతం కావడం, అలాగే తనకు జగన్ అంటే ఇష్టమని, తానెప్పుడూ తన అన్న కుటుంబం బాగుండాలని కోరుకుంటానంటూ చెప్పడం విశేషం.