US Elections 2024: అమెరికా ఎన్నికల హడావిడిలో ఉంటే అమెరికా శత్రువులు మాత్రం మరో స్కెచ్ వేస్తున్నారంట. ఇటీవలి ఇంటెలిజెన్స్ నివేదికలు సంచలన విషయాన్ని వెల్లడించాయి. చైనా, రష్యా, ఇరాన్ వంటి అమెరికా విరోధులు యూఎస్‌లో అల్లర్లు సృష్టించడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిపాయి. అమెరికా ఎన్నికల తర్వాత ట్రంప్ హత్యకు కుట్ర జరుగుతున్నాయనే వార్తలూ వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంతా..? నిఘా నివేదికలు ఏం చెబుతున్నాయ్..? అసలు, అమెరికాపై కుట్ర ఎందుకు జరుగుతుంది..?
నవంబరు 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉండడంతో.. యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, యూఎస్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీ పోటీ కొనసాగుతోంది. ఇప్పటికే కొనసాగుతున్న ముందస్తు పోల్స్‌ను బట్టి తీవ్రమైన పోటీ ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి. అయితే, హారిస్, ట్రంప్ మధ్య హోరాహోరీగా జరుగుతున్న ఈ పోటీ నేపధ్యంలో అమెరికాకు ప్రాణ సంకటం పొంచివుందని నిఘా నివేదికలు చెబుతున్నాయి. 2024 ఎన్నికల తర్వాత అమెరికాలో అశాంతికి ఆజ్యం పోయడానికి, రాజకీయ విభేదాలను మరింతగా పెంచడానికి, చైనా, రష్యా, ఇరాన్‌లతో సహా కొన్ని విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్నాయనీ.. యూఎస్‌లో ఎన్నికల తర్వాత ఏదో చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని నేషనల్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్ డిక్లాసిఫైడ్ నివేదిక హెచ్చరించింది.
అయితే, దీనికి సంబంధించి, ఏడు పేజీల మెమోరాండంలో.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇతర మాజీ యూఎస్ అధికారులను హతమార్చడానికి ఇరాన్ కుట్ర చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రయత్నాలు ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా, ఎన్నికల తర్వాత కూడా కొనసాగే అవకాశముందని ఇందులో హెచ్చరించారు. ఈ శత్రు దేశాలు ఇప్పటికే, యూఎస్ ఎన్నికలకు సంబంధించి తప్పుడు ప్రచారాలు, సైబర్‌టాక్‌లు, నిరసనలకు పరోక్ష మద్దతు ఇస్తుందని తెలుస్తోంది. వీటి ద్వారా అమెరికా ఎన్నికల్లో ఇప్పటికే వీటి జోక్యం స్పష్టమయ్యిందని నివేదిక తెలిపింది. ఇక, ఈసారి, ఎన్నికల అనంతర పరిణామాలను అస్థిరపరిచడానికి ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను ఉపయోగించుకుని, మరిన్ని ప్రయత్నాలను ముమ్మరం చేయవచ్చని నివేదిక వెల్లడించింది.
Also Read: టెహ్రాన్ పై ఇజ్రాయెల్ దాడి.. సమాధానం తప్పక ఇస్తామన్న ఇరాన్
అయితే, అమెరికా ఎన్నికలు ఎప్పుడూ సురక్షితంగానే జరిగినప్పటికీ.. ఎన్నికల తర్వాత.. ముఖ్యంగా ఓటు చివరి ఫలితాలు, సర్టిఫికేషన్, శాంతియుతంగా అధికార మార్పిడి జరిగే సమయంలో విదేశీ జోక్యానికి అవకాశం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా, నిరసనలను ఎక్కువ చేయడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం ద్వారా అమెరికా ప్రజాస్వామ్య ప్రక్రియకు అంతరాయం కలిగిస్తారని సందేహాలు ఉన్నాయ్. తమ భౌగోళిక రాజకీయ లాభం కోసమే శత్రు దేశాలు ఈ గొడవలు సృష్టిస్తున్నట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఎన్నికల ఫలితాలపై విశ్వాసాన్ని దెబ్బతీయడానికి, ఎన్నికల అనంతర ప్రక్రియలకు అంతరాయం కలిగించడంలో భాగంగా.. సైబర్ బెదిరింపులకు దిగుతారని నివేదిక వెల్లడిస్తోంది.
నివేదిక ప్రకారం, రష్యా, చైనా, ఇరాన్‌లు కలిసే అమెరికా ఎన్నికల మౌలిక సదుపాయాలకు వ్యతిరేకంగా సైబర్‌టాక్‌లను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే, ఈ దేశాల్లోనే అమెరికాను అల్లకల్లోలం చేసే సాంకేతిక సామర్థ్యం ఉంది. అలాగని, వీళ్లు అమెరికా ఓట్ల లెక్కలను మార్చే అవకాశం లేదని కూడా నిఘా విభాగం చెబుతోంది. అయితే, శత్రు దేశాలు చేసే ఎలాంటి దాడులనైనా గుర్తించే టెక్నాలజీ అమెరికాకు కూడా ఉన్నట్లు నిఘా అధికారులు చెబుతున్నారు. ఇలాంటిది ఏదైనా గుర్తిస్తే.. ప్రతీకారం తీర్చుకోడానికి అమెరికా వెనుకాడదని కూడా అంటున్నారు. అయితే, ఈ దేశాల ప్లాన్ అంతవరకూ రాదని కూడా అధికారులు పేర్కొన్నారు. ఈ దేశాల నుండి వచ్చే ప్రమాదాల్లో.. అమెరికా ఎన్నికల సమగ్రతపై గందరగోళం సృష్టించడం, ఓటు ఫలితాల గురించి సందేహాలకు దారితీసే పరిస్థితులను కల్పించడం, అనధికారిక నివేదికల గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం వంటివి చేయొచ్చని అంటున్నారు.