Israel Attacks Iran | ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగరంపై శనివారం ఉదయం ఇజ్రాయెల్ దాడి చేసింది. టెహ్రాన్ నగరం పరిసర ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించినట్లు సమాచారం. ఇజ్రాయెల్ సైన్యానికి చెందిన 100 ఫైటర్ ప్లేన్లు టెహ్రాన్ సమీపంలోని మిలిటరీ స్థావరాలపై దాడు చేశాయని అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఈ దాడి చేసినట్లు ఇజ్రాయెల్, అమెరికా ధృవీకరించాయి. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ పై దాదాపు నాలుగు వారాల క్రితం ఇరాన్ 200 బాలిస్టిక్ మిసైల్స్ తో దాడి చేసింది.
హిజ్బుల్లా అగ్రనేత హసన్ నస్రల్లా హత్యకు ప్రతీకారంగా తాము దాడి చేశామని ఆ సమయంలో ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ చేసిన దాడికి తగిన సమయం చూసి సరైన సమాధానం చెబుతామని ఆ సమయంలోనే యూద దేశం ఇజ్రాయెల్ ప్రతినిధులు తెలిపారు. ఆ కారణంగానే తాజాగా ఇరాన్ రాజధానిపై దాడి జరిగినట్లు ఇరాన్ కు చెందిన తస్నీమ్ న్యూస్ మీడియా తెలిపింది. ఈ దాడిలో ముందు అనుకున్నట్లు ఇరాన్ అణు స్థావారాలు లేదా ఆయిల్ రిఫైనరీలపై బాంబులు వేయకపోవడం గమనార్హం. ఈ దాడి చేయడానికి ఇజ్రాయెల్ F-35 ఫైటర్ జెట్ విమానాలు కూడా ఉపయోగించినట్లు తెలుస్తోంది.
Also Read: ‘ఇది మీ దేశం కాదు’.. ఆస్ట్రేలియా పార్లమెంటులో బ్రిటన్ రాజుకు ఘోర అవమానం
అయితే అధికారిక మీడియా మాత్రం ఆ పేలుళ్లు తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేషన్ కు సంబంధించినవని తెలిపింది. “టెహ్రాన్ పరిసరాల్లో శనివారం ఉదయం భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. కానీ అవి ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేషన్ కు సంబంధించినవి. ఇజ్రాయెల్ పై దాడికి ఇరాన్ సిద్ధమనేందుకు ఈ శబ్దాలే ఉదాహరణ”, అని ఇరాన్ అధికారిక న్యూస్ ఛానెల్ తెలిపింది. అయితే టెహ్రాన్ కు సమీపంగా ఉన్న కరాజ్ నగరంలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని తస్నీమ్ న్యూస్ తెలిపింది.
మరోవైపు టెహ్రాన్ సమీపంలో ఉన్న చాలా మిలిటరీ స్థావరాలను ఇజ్రాయెల్ టార్గెట్ చేసిందని అంతర్జాతీయ మీడియా రిపోర్ట్. ఈ దాడుల తరువాత ఇజ్రాయెల్ సైన్యం అధికారిక ప్రతినిధి డేనియల్ హగేరి మాట్లాడుతూ.. ఇరాన్‌పై చేసిన దాడులు ఇజ్రాయెల్ ఆత్మరక్షణలో భాగమని చెప్పారు. ఇరాన్ తిరిగి దాడి చేస్తే.. అందుకు సిద్ధంగా ఉన్నామని.. ఇజ్రాయెల్ పౌరులందరూ భద్రతా నియమాలన్నీ పాటించాలని సూచించారు. దాడి తరువాత ఇరాన్ తిరిగి మిసైల్స్ ప్రయోగిస్తుందని ఇజ్రాయెల్ అంచనా వేస్తోంది. ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు, రక్షణశాఖ మంత్రితో భద్రతా ఏర్పాట్లపై చర్చించారని తెలుస్తోంది.
టెహ్రాన్ పై దాడిలో ఎటువంటి నష్టం జరగలేదని, దేశంలోని ఆయిల్ రిఫైనరీ, మెహ్రాబాద్ ఎయిర్ పోర్ట్, ఇమామ్ ఖొమైనీ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ అన్నీ క్షేమంగానే ఉన్నాయని ఇరాన్ అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతాని ఇరాన్ రాకపోకలు చేసే అన్ని విమానాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read: యుద్ధం ముగించడానికి హమాస్ రెడీ.. ‘గాజాలో ఇజ్రాయెల్ దాడులు అపేస్తే.. ‘
మరోవైపు టెహ్రాన్ పై దాడి గురించి తమకు ముందే ఇజ్రాయెల్ సమాచారం అందించిందని అమెరికా తెలిపింది. అమెరికా వైట్ హౌస్ జాతీయ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి సీన్ సవేట్ మాట్లాడుతూ.. ఇరాన్ లోని మిలిటరీ స్థావరాలపై దాడి చేస్తున్నట్లు ఇజ్రాయెల్ తమకు ముందే సమాచారం అందించిందని.. అక్టోబర్ 1, 2024న 200 మిసైళ్లతో ఇజ్రాయెల్ పై ఇరాన్ చేసిన దాడికి ఆత్మరక్షణ కోసం ఇజ్రాయెల్ ఈ దాడి చేసినట్లు తమకు ఇజ్రాయెల్ అధికారులు వివరణ ఇచ్చారని అన్నారు. ఈ దాడి గురించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ కు తెలియజేశామని అన్నారు.