Big Shock to YS Jagan: ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద గెలిచాడు. ఆ గెలుపుతో తనకు తిరుగులేదు అనుకున్న కనీసం మంత్రి పదవి రాకపోవడం తో బాధపడ్డా ఆ బాధను దిగమింగుకొని 2024 ఎన్నికల్లో మల్లి అదృష్టాన్ని పరీక్షించుకుందామని బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. ఇక అప్పటి నుండి వైస్సార్సీపీ కి దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుంటున్నారు. ఈ పాటికే మీకు అర్ధం అయిపోయి ఉంటుంది ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరనేది .. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గ్రంధి శ్రీనివాస్ ఇప్పుడు వైసీపీని వీడబోతున్నారు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. పవన్ పై గెలుపుతో గుర్తింపు తెచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సొంత పార్టీ లో గుర్తింపు లేక నిజంగానే పార్టీని వీడే ఆలోచన చేస్తున్నారా ?
పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు జిల్లాలో ప్రచారం ఊపందుకొంది. 2004లో కాంగ్రెస్ నుండి గెలుపొందిన ఆయన 2019లో వైసీపీ నుండి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై గెలిచినా కనీస గుర్తింపు లేదని గ్రంధి అనుచరులు బహిరంగం గానే విమర్శలు చేశారు .. గ్రంధి శ్రీనివాస్‌కు మంత్రి పదవి ఖాయం ఇక ప్రకటన వెలువడటమే తరువాయి అనుకుంటున్న తరుణంలో లిస్ట్ లో గ్రంధి పేరు లేకపోవడంతో గ్రంధి శ్రీనివాస్ తో పాటు అయన అనుచరులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.
మంత్రి పదవి రెండు సార్లు చేతి దాకా వచ్చి జారిపోయినా , వైసీపీ అధిష్టానం సరిగా పట్టించుకోకపోయినా మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిమీద ఉన్న అభిమానంతో గ్రంధి శ్రీనివాస్ పంటి దిగువన పార్టీలో కొనసాగారు. అవమానాలు దిగమింగుకుంటూ ఎక్కడా బయటపడకుండా , కనీసం తన వర్గీయుల దగ్గర కూడా మాటవరసకు అయినా అధిష్టానం పై విమర్శ చేయకుండా హుందాగా నడుచుకున్నారు . 2019 లో గెలిచినప్పటికీ తనకు వ్యక్తిగతంగా వైసిపి అధిష్టానం ఏమి చేయకపోయినా మరల 2024లో రెట్టించిన ఉత్సాహం తో ఎన్నికల రంగంలోకి దిగారు. చివరి వరకు మళ్లీ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ప్రచారం జరిగినా ఆయన వెనుకంజ వేయలేదు. చివరికి టిడిపి నుండి జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే అంజిబాబు పోటీ చేసి కూటమి బలం తో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి వీచిన వ్యతిరేక పవనాలతో గ్రంధి శ్రీనివాస్‌పై విజయం సాధించారు.
అసలు తన ఓటమి కి తమ పార్టీ లోని ఒకవర్గం తీవ్రంగా పని చేసిందని గ్రంధి తన అనుచరుల దగ్గర ఫీల్ అయ్యారట. ఎన్నికల ముందు చేయించుకున్న అన్ని సర్వేల్లో గ్రంధికి క్లీన్ మెజారిటీ వచ్చిందంట. అయితే ఎన్నికల్లో సొంత పార్టీ నేతలు పొడిచిన వెన్నుపోటుతోనే ఓటమి పాలయ్యానని ఆయన బాధపడ్డారంట, ఎన్నికలు అయి ఇన్నాళ్లు అవుతున్న మాజీ సీఎం జగన్‌ను గ్రంధి కలవకపోవడంతో ఆయన పార్టీ మారుతారు అనే ప్రచారానికి బలం చేకూరుతుందంటున్నారు. పార్టీ పిలుపునిచ్చిన ఏ కార్యక్రమంలో కూడా గ్రంధి శ్రీనివాస్ పాల్గొనడం లేదు. జగన్ సమక్షంలో నిర్వహించిన సమావేశాలకు కూడా గ్రంధి శ్రీనివాస్ హాజరు కాలేదు. తాడేపల్లి లో వైసీపీ అధినేత జగన్ సమక్షంలో పశ్చిమగోదావరి జిల్లాలోని కీలక నేతల సమావేశానికి భీమవరం నియోజవర్గ ఇన్చార్జిగా ఉన్న గ్రంధి శ్రీనివాస్ గైర్హాజరయ్యారు. ఇదంతా చూస్తూ భీమవరం వైసిపి కార్యకర్తలు గ్రంధి శ్రీనివాస్ అలక మానాలని విజ్ఞప్తి చేస్తున్నారట . ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా కూడా గ్రంధి శ్రీనివాస్ అందుబాటులో లేకపోవడం తో వైసీపీ కార్యకర్తలకు సైతం ఎం జరుగుతుందో అర్ధం కావడం లేదంటున్నారు.
Also Read: సీఎం చంద్రబాబు ఎమోషనల్.. ఆ రాత్రి ఏం జరిగిందంటే, చావు గురించి ఆలోచించి
భీమవరం నియోజకవర్గంలో వైసిపి అంతర్గత పోరు లో తాను సమిధ అయ్యాను అని గ్రంధి ఫీల్ అవుతున్నారట . పశ్చిమ గోదావరి జిల్లా లో ఏ వైసీపీ నాయకుడు చేయని అభివృద్ధి గ్రంధి శ్రీనివాస్ చేసాడని అయన అభిమానులు సోషల్ మీడియాలో ఊదరగొడుతుంటారు. భీమవరం నియోజకవర్గం లో ఎంతో కాలం గా పెండింగ్ లో ఉన్న 100 పడకల ఆసుపత్రికి నాలుగు ఎకరాలు తన సొంత స్థలం ఇచ్చారని , 30 గ్రామాల ప్రజలకు ఉపయోగపడే తాడేరు బ్రిడ్జికు తన సొంత నిధులు 3 కోట్లు ఖర్చు పెట్టారని అటువంటి గ్రంధి శ్రీనివాస్ వైసిపి ని వీడితే తీవ్ర నష్టం జరుగుతుందని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు . అధికారం ఉన్న సమయంలో భీమవరం లో అప్పటి నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజూ అతిగా ఇన్వాల్వ్ అవడం , గ్రంధి శ్రీనివాస్ ప్రమేయం లేకుండా తన సామాజిక వర్గానికి లబ్ది చేకూర్చేలా ప్రసాద రాజు వ్యవహరించడం గ్రంథిని తీవ్రంగా కలిచి వేసిందంట.
అలాగే నియోజకవర్గానికి శాసనమండలి ఛైర్మెన్ మోషేను రాజు సైతం తనకు సహకరించలేదని గ్రంధి శ్రీనివాస్ వైసిపి అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళారట .. తన ఓటమి కి గల కారణాలను , వైసిపి ప్రధాన నాయకుల వ్యవహార తీరు ను గ్రంధి శ్రీనివాస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తే మాజీ సీఎం జగన్ కనీసం ఆ ఫైల్ చూడలేదని ఆయనకు తెలిసిందంట. ఓటమి అనంతరం కనీసం ఫోన్‌లో కూడా అందుబాటు లోకి రాకపోవడం గ్రంధి శ్రీనివాస్‌ను తీవ్రం గా బాధించిందని అయన అనుచరులు చెప్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే తాను ఎవరి వ్యవహారం తో ఇబ్బంది పడ్డానో వారిలో ఒకరికి వైసిపి జిల్లా పగ్గాలు అప్పగించడంతో ఇక తనకు విలువ ఏముందని గ్రంధి ఫీల్ అయ్యారంట . ఇదే అదనుగా టిడిపి నాయకులూ ఒక అడుగు ముందుకు వేసి గ్రంధి శ్రీనివాస్ తమ పార్టీ లోకి రావాలని ఆహ్వానం పంపుతున్నారంట.
టిడిపి నేత బీద మస్తాన్ రావు ఇప్పటికే గ్రంధికి టచ్ లోకి వెళ్లారంట. టిడిపి జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి సైతం ఆయన చేరికపై పార్టీ అధిష్టానం ఇష్టమే తన ఇష్టమని చెప్పారంట. ఇక గ్రంధి శ్రీనివాస్ ఓకే చెప్పడమే ఆలస్యం అంటూ టిడిపి నేతలు చెప్పుకుంటున్నారు. అదలా ఉంటే గ్రంధి శ్రీనివాస్ సైలెంట్ అవ్వడంతో విషయం కనుక్కోవాలని మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, పేర్ని నాని లను రాయబారులుగా మాజీ సీఎం జగన్ పంపించారంట. వైసిపిలో ఉండాలని మనస్పర్ధలు ఏమన్నా ఉంటే కూర్చుని మాట్లాడుకుందాం అని జగన్ మాటగా మాజీ మంత్రులు చెప్పారంట. గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో తాను పార్టీకి ఎంత కష్టపడింది పార్టీ తనను ఏ విధంగా అవమానించిందో మాజీ మంత్రుల దగ్గర గ్రంధి శ్రీనివాస్ గోడు వెల్లబోసుకున్నారంట. ఆ క్రమంలో గ్రంధి నిర్ణయం ఎలా ఉండబోతుందనే చర్చనీయాంశంగా మారింది.
అడుగడునా వైసిపిలో అవమానాలు ఎదురయినా మాజీ సీఎం జగన్ కోసం తీవ్రం గా కష్టపడ్డ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మౌనం ఇప్పుడు కార్యకర్తలను అయోమయం లో పడేస్తుంది. గత మూడు సార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సుమారు 300 కోట్లకు పైగా వైసిపి కోసం ఖర్చుపెట్టిన గ్రంధి శ్రీనివాస్ నే పట్టించుకోని వైసిపి అధిష్టానం ఇక తమని ఏం పట్టించుకుంటుందని కేడర్ వాపోతుంది. రాబోయే రోజుల్లో నియోజకవర్గ పునర్విభజన జరిగితే భీమవవరం రెండు నియోజకవర్గాలు అవుతుందని , భీమవరం టౌన్, భీమవరం రురల్ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక దాంట్లో టిడిపి నుండి గ్రంధి పోటీ లో ఉంటారని ప్రచారం మాత్రం జోరందుకుంటుంది. మరి చూడాలి గ్రంధి నిర్ణయం ఎలా ఉంటుందో?