Pakistan vs India: పాకిస్తాన్ ఉగ్రవాదానికి స్వర్గధామమని ఎన్నో అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేశాయి. ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్‌లకు, జమ్మూ కశ్మీర్‌లోని పలు ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ బ్యాకప్‌గా ఉందనే వాదన అంతా ఒప్పుకున్నారు. పాకిస్తాన్‌లో 22కు పైగా ఉగ్రవాద శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నారని రుజువులు కూడా ఉన్నాయ్. ఈ నేపథ్యంలో, కొత్తగా మరో ఉగ్ర గ్రూపును తయారుచేయడం పాకిస్తాన్‌కు వెన్నతో పెట్టిన విద్య. అయితే, ఈ ప్రత్యేకమైన ఉగ్ర మూకను కశ్మీర్ కోసమే తయారుచేస్తున్నారా అనే సందేహమే ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. దీని కోసం, జిహాదీలను రెడీ చేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి.
పాకిస్తాన్ ప్రభుత్వాన్ని పడగొట్టి, ఇస్లామిక్ ప్రభుత్వాన్ని నెలకొల్పడం
పాకిస్తాన్‌లో ఉగ్రవాద శిబిరాలను నడుస్తున్నాయనీ.. వాటిపై పాక్ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవట్లేదని భారత్ ఎప్పటి నుండో ఆరోపిస్తోంది. పాకిస్తాన్‌లో 22 ఉగ్రవాద శిక్షణా శిబిరాలు నడుస్తున్నాయని.. వాటిలో తొమ్మిది మసూద్ అజార్ స్థాపించిన జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందనివేనని గతంలోనే భారత్ వెల్లడించింది. సరిహద్దును దాటి భారత్ భూభాగంలోకి వచ్చి ఉగ్రదాడులు చేయడానికి ఈ విధంగా పాక్ ప్రభుత్వం సహరిస్తుందని పేర్కొంది. అయినా, పాక్ మాత్రం ఏమీ తెలియనట్లు నటిస్తోంది. పాకిస్తాన్ ఉగ్రవాదానికి అంతర్జాతీయ కేంద్రంగా ఉందని ఎన్నో నివేదికలు వెల్లడించాయి.
భూమ్మీద అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంగా వర్ణించబడే, పాకిస్తాన్ సెమీ అటానమస్ గిరిజన ప్రాంతం, వాయువ్య పాకిస్తాన్‌లోని శుష్క పర్వత ప్రాంతం దీనికి కేంద్రంగా ఉన్నట్లు అంతర్జాతీయ నివేదికలు రూఢీ చేశాయి. అల్ ఖైదా కార్యకర్తలు, పాకిస్తానీ తీవ్రవాదులు, ఇస్లామిక్ ప్రపంచంలోని జిహాదీలతో పాటు.. సైద్ధాంతిక బోధన కోసం యునైటెడ్ స్టేట్స్, యూరప్ నుండి కూడా ముస్లిం రాడికల్స్ ఇక్కడకు వస్తారని నిఘా రిపోర్ట్‌లు చెబుతున్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా పనిచేస్తుందన్నది వీటి సారాంశం. ఈ ఉగ్ర మూకలు పాకిస్తాన్‌లోనే కాక భారత్ వంటి స్వదేశాలలో కూడా తీవ్రవాద దాడులకు పన్నాగం పన్నుతున్నాయి.
ఆఫ్ఘన్ తాలిబాన్‌ల మాదిరి ప్రభుత్వాన్ని నెలకొల్పే స్థాయికి మారడం
ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్‌లకు, జమ్మూ కశ్మీర్‌లోని ఇతర ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ శాశ్వత మద్దతు ఇస్తుందనే వాదన అందరూ ఒప్పుకున్నదే. పాకిస్తాన్‌లో ఉన్న తీవ్రవాదాన్ని తుడిచిపెట్టేయడానికి అమెరికా కీలకమైన వ్యూహాత్మక భాగస్వామిగా ఉండటమే దీనికి నిదర్శనం. అనేక రకాల మిలిటెంట్ గ్రూపులు పాకిస్తాన్ లోపల, బయట పనిచేస్తున్నాయి. అవి, వారి సెక్టారియన్ నేపథ్యం.. అలాగే, వారి కార్యకలాపాల ప్రాంతాల ద్వారా వేరు వేరుగా పనిచేస్తాయంతే. అయితే, వారి లక్ష్యాల్లో కొన్న గ్రూపులు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని పడగొట్టి, ఇస్లామిక్ ప్రభుత్వాన్ని నెలకొల్పడం.. ఇంకొన్ని, భారతదేశంలోని జమ్మూ కశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవడం.. మరికొన్ని, ఆఫ్ఘన్ తాలిబాన్‌ల మాదిరి ప్రభుత్వాన్ని నెలకొల్పే స్థాయికి మారడం వంటి పనులు నిర్వహిస్తాయి. అయితే, గ్రూపులు ఎన్ని ఉన్నా వీళ్లంతా జిహాదీ గ్రూపులుగానే తమ కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. దీని కోసమే శిక్షణ కూడా తీసుకుంటారు. సరిగ్గా అలాంటి శిక్షణే అబోటాబాద్‌లో కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా, ఒక పూర్తి స్థాయి జిహాదీ తీవ్రవాదిని తయారు చేయాడానికి శిక్షణ ఇస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.
Also Read: ఆర్ధికంగా నలిగిపోతున్న చైనా.. ఆ ఒప్పందం వెనుక భయంకర నిజాలు
మతపరమైన, సెక్టారియన్ ఉద్వేగాన్ని నింపే ‘టాసిస్’ దశ
అయితే, ఒక జిహాదీకి శిక్షణ ఇవ్వడానికి ఆరు దశలు ఉంటాయి. అందులో మొదటి దశ, ‘టాసిస్’. ఇందులో కేవలం బోధనలు ఉంటాయి. ఇందులో సైనిక నైపుణ్యాల వంటివి చెప్పరు. ఇది శిక్షణ తీసుకుంటున్న వారిలో మతపరమైన, సెక్టారియన్ ఉద్వేగాన్ని నింపే సమయం. ఈ దశ సాధారణంగా ఒక నెల ఉంటుంది. ఉదాహరణకు, లష్కరే తోయిబా రిక్రూట్‌మెంట్‌లను అల్-ఎ-హదీత్ బోధనలకు మార్చడానికి ఈ దశను ఉపయోగిస్తారు. బోధన దశ తర్వాత వచ్చేది, ‘అల్ రాద్’. ఇందులో మూడు నెలలు బోధన ఇస్తునే… సైనిక శిక్షణలో శిక్షణ పొందినవారి పరిచయం కూడా ఉంటుంది. అయితే, ఈ దశలోనే, ఉగ్రవాద సంస్థలు ట్రైనీల్లో కొందరిని సెలక్ట్ చేసుకుంటారని తెలుస్తోంది. ఈ దశలో జిహాద్ జీవితానికి సరిపోయే వారిని నిర్ధారించుకోవడానికి వారికి మానసిక, శారీరక పరీక్షలను నిర్వహిస్తారు. ఇలా మొదటి నాలుగు నెలలూ ఆధ్యాత్మికంగా, తేలికపాటి సైనిక కార్యకలాపాలను పరిచయం చేసిన తర్వాత వచ్చే దశ, ‘గెరిల్లా శిక్షణ’. ఇది ఆరు నెలలు కొనసాగుతుంది. ఇక, ఈ దశ పూర్తయిన తర్వాత, జిహాదీని సాంకేతికంగా రంగంలోకి దింపుతారు. అయితే, దీనికి కమాండర్ నుండి అనుమతి, ట్రైనీ నుండి సమ్మతి కూడా తీసుకుంటారు. దీనితో ట్రైనింగ్ పూర్తవుతుంది.
‘దోష్కా’, ‘జాండ్లా’ అనే అడ్వాన్స్ లెవల్
ఒకవేళ, ట్రైనీకి మరింత ప్రత్యేక శిక్షణ అవసరమైతే, ఆ ఉగ్రవాదిని ‘దోష్కా’, ‘జాండ్లా’కు అనే అడ్వాన్స్ లెవల్‌కు పంపుతారు. ఏడు నుండి పది రోజుల దోష్కా శిక్షణ ఆ వ్యక్తికి చేతితో పట్టుకునే ఆయుధాలను ఉపయోగించడం నేర్పుతుంది. అలాగే, ఆటోమేటిక్ ఆయుధాలను ఎలా ఉపయోగించాలో, పేలుడు పదార్థాలను ఎలా తయారు చేయాలో నేర్చుకుంటారు. దీనితో పాటు, టెక్నికల్ వ్యవహారాల వంటి ప్రత్యేక శాఖల్లో కూడా వాటి వాటికి సంబంధించిన శిక్షణలు ఇస్తారు. నిజానికి, ఒక్కో ఉగ్రవాద సంస్థ వాటికున్న వనరులను బట్టి శిక్షణ పద్ధతులను కూడా మార్చుతూ ఉంటాయి. ఇక, ప్రస్తుతం అబోటాబాద్‌లో నడుస్తున్న శిక్షణ కూడా దాదాపు ఇలాగే ఉండొచ్చు. అయితే, ఉన్న సమాచారం మేరకు అక్కడ సైనిక శిక్షణ నడుస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇదే నిజమైతే, ఇక్కడ శిక్షణ తీసుకుంటున్న ట్రైనీ మిలిటెంట్లు ఆధ్మాత్మిక బోధన దాటి వచ్చినవారే అయి ఉండాలి. అంటే, ఈ దశలోనే లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాయిద్దీన్, జైషే మహమ్మూద్ ఉగ్రవాద సంస్థలు వీరిని పంచేసుకున్నట్లే లెక్క. ఇక, మరో చివరి దశను దాటితే వీళ్లంతా పూర్తి స్థాయి ఉగ్రవాదులుగా రంగంలోకి దిగే అవకాశం ఉంది.
కశ్మీర్ ఆక్రమణ కోసం ఏర్పడిన హిజ్బుల్ ముజాహిదీన్..
అయితే, కశ్మీర్ లోయపై దృష్టి కేంద్రీకరించి, అక్కడ తీవ్రవాద గ్రూపులను తయారు చేసి, వారిలో చాలా మందిని ఉగ్రవాదులుగా మార్చే సమూహాలు ప్రధానంగా నాలుగు ఉన్నాయి. అవి, జమాతే ఇస్లామీ, హిజ్బుల్ ముజాహిదీన్, జైషే మొహమ్మద్, లష్కరే తొయిబా. ఇందులో జమాతే ఇస్లామీ, ఇస్లామిక్ రాజకీయ పార్టీగా బ్రిటీష్ ఇండియాలో స్థాపించారు. అయితే, మిగిలిన మూడు ఉగ్ర సంస్థలు కశ్మీర్ కేంద్రంగానే ఏర్పడిన కరుడు గట్టిన తీవ్రవాదులు స్థాపించిన సంస్థలు. ఇప్పుడు ఈ మూడు సంస్థలు సంయుక్తంగా శిక్షణ ఇస్తున్న ఉగ్ర మూకలను ఎక్కడ దించుతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులోనూ, మసూద్ అజార్ స్థాపించిన జైషే మహ్మద్ స్థాపన కూడా బాల్‌కోట్ కేంద్రంగానే జరిగింది. అందుకే, కేవలం, కశ్మీర్‌ను కేంద్రంగా చేసుకునే ఈ ఉగ్ర మూకలు పనిచేస్తాయనడంలో సందేహం లేదు. అంతేగాక, ఇటీవల భారత హోం మంత్రి అమిత్ షాతో సహా చాలా మంది కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. అందుకే పాకిస్థాన్ ఈ ఉగ్రమూకలను రెడీ చేస్తుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇక, దీనిపై పాక్ ఎలా స్పందిస్తుందో… భారత్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.