CM Revanthreddy: రాబోయే రెండేళ్లలో జాతీయ క్రీడలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది రేవంత్ సర్కార్. అందుకు సంబంధించి చకచకా అడుగులు వేస్తోంది. త్వరలో స్పోర్ట్స్ యూనివర్శిటీ బిల్లు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.
శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో తెలంగాణ క్రీడా విధానంపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. తెలంగాణ స్పోర్ట్స్ పాలసీలో భాగమైన యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగానకు సంబంధించి కీలక అంశాలపై చర్చించారు.
దీనిపై అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి. అందులో ఆయన కొన్ని మార్పులు చేర్పులు చేశారు. రూపొందించబోయే స్పోర్ట్స్ పాలసీ దేశంలో బెస్ట్‌గా ఉండాలన్నారు. వివిధ రంగాలకు చెందిన ఆటగాళ్లు, నిపుణులతో సంప్రదింపులు జరపాలని సూచన చేశారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించు కోవాలన్నారు. ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా ఉన్న స్టేడియాలను అప్‌గ్రేడ్ చేయాలన్నది సమావేశంలో ప్రధాన పాయింట్.
సౌత్ కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీతోపాటు ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ వర్సిటీ అనుసరిస్తున్న విధానాలపై స్టడీ చేయాలన్నారు. కేవలం 10 రోజుల్లో స్పోర్ట్స్ పాలసీకి సంబంధించి గవర్నింగ్ బాడీని ఖరారు చేయాలన్నారు.
జిల్లాలు, రాష్ట్ర, నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయి గేమ్స్ క్యాలెండర్‌ను వెంటనే రూపొందించాలన్నారు. రాబోయే రోజుల్లో జాతీయ క్రీడలకు ఆతిధ్యమిచ్చేలా ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ ను సంప్రదింపులు చేయాలన్నారు. సీఎం రేవంత్ దూకుడు చూసి ఆధికారులే ఆశ్చర్యపోవడం కొసమెరుపు.