Saudi Arabia Mukaab| ఏడారి దేశం సౌదీ అరేబియా తాజాగా ఒక కొత్త బిల్డిండ్ నిర్మాణం ప్రారంభించింది. ఆ భవనం పూర్తి అయితే ప్రపంచంలోనే అతిపెద్ద విస్తీర్ణంలో ఉన్న బిల్డింగ్ గా రికార్డు సృష్టిస్తుంది. ఎందుకంటే ఈ భవన విస్తీర్ణం, ఎత్తు లాంటి కొలతలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. పైగా దీన్ని ఒక క్యూబ్ షేపులో నిర్మాణం చేయడం విశేషం. ఈ ప్రాజెక్ట్ పేరుని ప్రస్తుతానికి ‘ది ముకాబ్’ అని నామకరణం చేశారు.
ది ముకాబ్ ఎత్తు 400 మీటర్లు ఉండేలా నిర్మాణం ప్లానింగ్ జరిగింది. ఇది సౌదీ అరేబియాలోని రాజధాని నగరం రియాధ్ లో నిర్మించబడుతోంది. ఈ ఒక్క బిల్డింగ్ అమెరికా న్యూ యార్క్ కు చెందిన ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కంటే 20 రెట్లు పెద్దది. ఇది విస్తీర్ణంలో చాలా పెద్దది అని ముందుగానే చెప్పడంతో కొలతల విషయానికి వస్తే.. ఈ బిల్డింగ్ ఫ్లోర్ స్పేస్ 2 మిలియన్ స్క్వేర్ మీటర్లు (20 లక్షల స్క్వేర్ మీటర్లు) ఉంటుందని అని సమాచారం.
50 బిలియన్ అమెరికన్ డాలర్ల ఖర్చు
రాజధాని రియాద్ నగరంలోని న్యూ మురబ్బా డిస్ట్రిక్ట్ లో ది ముకాబ్ నిర్మాణం జరుగుతోంది. ది ముకాబ్ నిర్మాణం ఖర్చు తెలిస్తే.. కళ్లు తేలిపోవాల్సిందే. ఎందుకంటే ఈ అద్భుత భవనం నిర్మించడానికి సౌదీ ప్రభుత్వం 50 బిలియన్ అమెరికన్ డాలర్లు (దాదాపు రూ.4 లక్షల 20 వేల కోట్లకు పైగా). భారీ విస్తీర్ణంలో నిర్మాణం జరుగుతున్న ఈ భవనం లో ఆఫీసులతోపాటు మొత్తం 1,04,000 ఇళ్లు కూడా ఉంటాయి. ఈ అద్భుత నిర్మాణంలో రిటైల్, కార్పొరేట్, కల్చరల్.. ఇలా అన్ని హంగులు ఉండేలా పని జరుగుతోంది.
సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ విజన్ 2023 ప్రకారం.. ‘ది ముకాబ్’ ఒక బిజినెస్ హబ్ తోపాటు ఒక టూరిస్ట్ డెస్టినేషన్ గా కూడా రూపొందిద్దుకోనుంది. అందుకే ఇందులో పర్యాటకుల కోసం సెంట్రల్ ఏట్రియం స్పేస్ కూడా ఉంటుంది. స్వదేశీ పర్యాటకులతోపాటు విదేశీ టూరిస్టులను సైతం ఆకర్షించేందుకు ఈ కట్టడంలో వింతలు కూడా ఉంటాయని సమాచారం. మొహమ్మద్ బిన్ సల్మాన్ 2023లోనే ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యాధునిక డౌన్ టౌన్ రూపంలో దీన్ని నిర్మిస్తామని ప్రకటించారు.
Also Read: డిగ్రీ చదవకుండానే సంవత్సరానికి రూ.5 కోట్లు సంపాదిస్తున్న యువతి.. ఎలాగంటే?..
సౌదీ అరేబియాలోని న్యూ మురబ్బా డెవలప్మెంట్ కంపెనీ అనే నిర్మాణ సంస్థ ది ముకాబ్ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. సౌదీ అరేబియా ప్రధాన ఆదాయం చమురు. అయితే ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా దేశ ఆర్థిక వ్యవస్థ కోసం ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే దేశంలో ఏడారి మధ్యలో నియోమ్ అనే కొత్త నగరాన్నే సృష్టిస్తోంది. సౌదీ పక్క దేశమైన యుఏఈలో దుబాయ్, అబుదాబి రాజ్యాలు కొన్ని దశాబ్దాల క్రితమే ఈ తరహాలో అభివృద్ధి సాధించాయి. ఇప్పుడు అక్కడ ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పౌరులు స్థిరపడాలనుకుంటున్నారు.
అయితే సౌదీ అరేబియా ప్రభుత్వానికి ఇలాంటి చారిత్రక కట్టడాలు నిర్మించాలని తలపెట్టినప్పుడు సమస్యలు ఎదరవుతూనే ఉంటాయి. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెద్దా టవర్ నిర్మాణాన్ని సౌదీ అరేబియా ప్రభుత్వం మొదలుపెట్టింది. కానీ టెక్నికల్ కారణాల వల్ల 2018లో పని ఆగిపోయింది. ఆ తరువాత ఇంతవరకూ దాని నిర్మాణం పూర్తి కాలేదు. అలాగే ఏడారి మధ్యలో ది లైన్ పేరుతో 170 కిలోమీటర్ల పొడవున ఒక నగరం నిర్మిస్తామని చెప్పి అది ఇప్పుడు 2.4 కిలోమీటర్లకే పరిమితమైంది.
కానీ ది ముకాబ్ నిర్మాణంలో మాత్రం యువరాజు సల్మాన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని సమాచారం. దీంతో ముకాబ్ మరో 5 సంవత్సరాలలో పూర్తి కావచ్చని ఆశిద్దాం.