EPAPER

Nellore Politics: సై అంటే సై.. నెల్లూరు మంత్రుల మధ్య ఇసుక దుమారం

Nellore Politics: సై అంటే సై.. నెల్లూరు మంత్రుల మధ్య ఇసుక దుమారం

Nellore Politics: నువ్వా.. నేనా?.. సై.. అంటే..సై.. అంటూ ఇద్దరు మంత్రులు లోలోన రాజకీయం నడుపుతున్నారట. విషయాన్ని గోప్యంగా ఉంచినా.. ఎప్పుడో ఒకరోజు బయటపడక తప్పదన్నట్లు.. ఇసుక టెండర్ల రద్దు వ్యవహారంతో విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో ఇద్దరు మంత్రుల మధ్య.. ఆదిపత్య పోరు కొనసాగుతుందనే వార్తలకు బలం చేకూరిందట. దీంతో స్తబ్దుగా ఉన్న అమాత్యుల మధ్య కోల్డ్ వార్.. కూల్ గా బయటపడిందని వార్తలు గుప్పుమంటున్నాయి. అసలు ఏమా వైరం.. ఎవరా నేతలు?


ఇంటి గుట్టు..లంకకు చేటు. ఈ నానుడి ఎవరికైనా వర్తిస్తుంది. లోలోపల వార్‌ నడుస్తున్నా.. ఏదో ఒకరోజు బ్లాస్ట్ అవ్వక తప్పదు. కూటమి సర్కారు అధికారంలోకి రాగానే రాజకీయ సమీకరణాలు చాలా వరకూ మారాయనే టాక్ నడుస్తోంది. అధికారుల బదిలీల నుంచి.. నా అనుకున్న వారికి పోస్టింగ్ ఇప్పించే అంశం వరకూ.. కొందరు నేతలు చక్రం తిప్పారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను కాదని.. మంత్రులు జోక్యం చేసుకోలేదన్నది కూడా కీలక అంశమేనంటున్నాయి రాజకీయ వర్గాలు. అయితే.. ఎమ్మెల్యేలతో కాదు సరిస్థాయి మంత్రులతో పోటీ పడాలని అనుకున్నారు కాబోలు.. నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ మంత్రులు.. ఒకరితో ఒకరు ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నారట.

మంత్రుల మధ్య వార్ నడుస్తుంటే అధిష్టానం చూసుకుంటుంది కదా అనేది కూడా పాయింటే. సైలెంట్‌గా ఉన్న విషయాన్ని ఎందుకు టచ్‌ చేయటం ఎందుకని భావించారేమో. అయితే.. ఎక్కడో చోట.. ఎప్పుడో ఒకప్పుడు వ్యవహారం బయటపడాల్సిందేగా. ఈ క్రమంలోనే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇద్దరు మంత్రుల మధ్య రాజకీయం రచ్చకెక్కిందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. అదీ.. ఇసుక టెండర్ల వ్యవహారంలో ఓ మంత్రి నానా హంగామా చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తన అనుచరులకు కాదని ఇతరులకు.. ఇసుక రీచ్ లను కేటాయించడంపై ఆ మంత్రి.. తెగ ఫీల్ అయిపోతున్నారట.


పెన్నా నదిలో ఇసుక రీచ్‌లకు నాలుగు చోట్ల ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. వాటిలో ఇసుక తరలింపునకు అధికారులు టెండర్లు కూడా పిలిచారట. ఎక్కువమంది ముందుకు రాకపోవడంతో పాటుగా పెన్నానది నుంచి స్టాక్ పాయింట్ కు ఇసుకను రవాణా చేసేందుకు ప్రభుత్వం 114.94 పైసలు ధర నిర్ణయించింది. ఓ వ్యక్తి మాత్రం కేవలం 36 రూపాయలకే టెండర్ వేశారట. దీన్ని గమనించిన కలెక్టర్.. ఈ వ్యవహారాన్ని అందుబాటులో ఉన్న మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లారట.

Also Read: వైసీపీకి మరో ‘మేడమ్‌’ గుడ్ బై..

అప్పటికే రాజకీయ ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో.. లక్కీడిప్‌ ద్వారా రీచ్‌లు కేటాయించాలంటూ మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు. ఉన్న కొద్దిమందికి లాటరీ విధానంలో కలెక్టర్ రీచ్‌లను కేటాయించారట. అప్పటివరకు ఓ మంత్రికి అనుకూలంగా ఉన్నవారు టెండర్లు వేసినట్లు బయటవారికి తెలియదనే వార్తలు బయటకు వచ్చాయి. టెండర్లు దక్కకపోవడంతో ఆ మంత్రి.. నానా హైరానా చేశారట. అసలు టెండర్లు ఎలా నిర్వహిస్తారంటూ జిల్లా స్థాయి అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడడంతో.. చేసేది లేక అధికారులు ఇసుక టెండర్లు రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చిందట.

అప్పటివరకు స్తబ్దుగా ఉన్న వారి మధ్య రాజకీయ పోరు బయటపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇసుక రీచ్‌ల దుమారం కాస్తా.. చాలా దూరమే వెళ్లిందట. తనకు ఇష్టం లేకుండా కాంట్రాక్ట్ వచ్చినందుకు కాను.. ఆ కాంట్రాక్టర్ ను పిలిచి మంత్రి నానా దుర్భాషలాడాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. ఇద్దరు మంత్రుల మధ్యా ఆదిపత్య పోరును..క్యాష్ చేసుకునేందుకు YSRCP పావులు కదుపుతోందట. అవకాశం దొరికినప్పుడల్లా ఏదో విధంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండ కడుతూ.. ఆ పార్టీ నేతలు వడివడిగా అడుగులేస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారట. మంత్రి ఇచ్చిన ఆదేశాలను భేఖాతరు చేస్తారా అంటూ కాకాణి ఫైర్ అయ్యారట. అసలు విషయం చెప్పకనే ఓ మంత్రికి అవమానం జరిగిందంటూ చెప్పటం హాట్ టాపిక్‌గా మారింది. ఆ మంత్రికి.. ఇచ్చే కనీస గౌరవం ఇదేనా అంటూ తనదైన శైలిలో అనటంతో అమాత్యుల మధ్య ఆధిపత్య పోరు మరోసారి తెర మీదకు వచ్చిందనే టాక్ నడుస్తోంది.

ఈ విషయాన్ని తెలుగుదేశం అధిష్టానం కూడా సీరియస్ గానే తీసుకుందట. ప్రెస్‌మీట్‌లో అభిప్రాయాలు వెల్లడించే అంశాల్లోనూ ఆచితూచి వ్యవహరించాలని.. ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇసుక రీచ్‌ల వ్యవహారం, మంత్రి ప్రమేయం వంటి అంశాలపై.. అధిష్టానం ఇప్పటికే సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. సీనియర్‌ మంత్రుల మధ్య విషయంపై అధినేత ఎలా స్పందిస్తుందనే అంశం సస్పెన్స్‌గా మారిందనే వార్తలు వినిపిస్తున్నాయి. వీలైనంత వరకూ సమన్వయంతో ఇద్దరూ ముందుకు వెళ్లేలా సూచించే పరిస్థితి కనిపిస్తోందా.. లేనిపక్షంలో శాఖల పరిధిని కేటాయించి.. ఒకరిశాఖలో మరొకరు వేలు పట్టకుండా చేసే అవకాశం కూడా లేకపోలేదనేది పొలిటికల్ వర్గాల్లో చర్చ సాగుతోంది.

ఏది.. ఏమైనా.. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా అధిష్టానం కట్టడి చేసేందుకు సిద్ధమవుతోందని సమాచారం. ప్రతిపక్షాలు ఆరోపించేందుకు ఛాన్స్ ఇవ్వకుండా… పరిస్థితులను చక్కదిద్దేందుకు అధిష్టానం చర్చలు చేస్తుందనే టాక్ నడుస్తోంది.

Related News

US Election 2024: క్లైమాక్స్‌లో అమెరికా ఎన్నికలు.. ఆ పార్టీ గెలిస్తేనే భారత్‌కు మేలు..!

Mekathoti Sucharitha: వైసీపీకి మరో ‘మేడమ్‌’ గుడ్ బై..

YS Jagan: చిలకా ఏ తోడు లేకా బెంగళూరు వైపు ఒంటరి నడక..?

Iran Israel War: ప్రాణ మిత్రులు బద్ద శత్రువులు ఎలా అయ్యారు? ఇరాన్-ఇజ్రాయెల్ నడుమ చిచ్చు ఎలా మొదలైంది?

Kavitha: కవితకు ఏమైంది? సవాలు చేసి సైలెంట్ అయ్యారు ఎందుకు?

Salman Khan: సల్మాన్ నిజంగానే ఆ జింకను కాల్చాడా? ఆ రోజు అతనితో ఉన్న హీరోయిన్స్ ఎవరు? వారికీ ముప్పుందా?

Big Stories

×