EPAPER

KTR: కేటీఆర్ కొత్త ఫార్ములా.. ‘నోటి’కి బదులు నోటీసులతో జవాబు, ఈ ‘పరువు’ పంచాయతీలు ఎన్నాళ్లో?

KTR: కేటీఆర్ కొత్త ఫార్ములా.. ‘నోటి’కి బదులు నోటీసులతో జవాబు, ఈ ‘పరువు’ పంచాయతీలు ఎన్నాళ్లో?

KTR: నేను ఎవరినైనా అనొచ్చు.. కానీ నన్నెవరూ అనొద్దు.. మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా ఇదేనా. అంటే ప్రత్యర్థుల నుంచి అవునన్న సమాధానమే వస్తోంది. ఎందుకంటే గతంలో కేటీఆర్ చాలా సార్లు నోరు జారారు. మొన్నటికి మొన్న ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డ్యాన్సులు వేసుకోవాలన్నారు. మహిళా కమిషన్ ఆగ్రహానికి గురయ్యారు. విచారణకూ హాజరై వివరణ ఇచ్చుకున్నారు. అంతకు ముందు అసెంబ్లీ సమావేశాల్లో సీఎంను ఏకవచనంతోనూ పిలిచి ఆ తర్వాత మాటలు వెనక్కు తీసుకున్నారు.


కొత్తగా తనపై విమర్శలు చేసేవారిపై లీగల్ నోటీసులు సంధిస్తున్నారు. ప్రతి విమర్శలకు ‘నోటి’ని కాకుండా నోటీసులనే నమ్ముకుంటున్నారు. అంతకు ముందు మంత్రి కొండా సురేఖ విషయంలోనూ అదే చేశారు. తాజాగా కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన కామెంట్లపైనా లీగల్ నోటీసులనే నమ్ముకున్నారు. వారంలో క్షమాపణ చెప్పకపోతే చట్టప్రకారం చర్యలు తప్పవంటూ కౌంటర్ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు.

రాజకీయం అన్నాక విమర్శలు ప్రతివిమర్శలు కామన్. అంత మాత్రాన లీగల్ నోటీసులతో నోరు మూయిస్తానంటే ఎవరైనా బెదురుతారా? అందుకే బండి సంజయ్ కూడా కౌంటర్ నోటీసులు ఇస్తానంటున్నారు. ఇంతకీ కేటీఆర్ లీగల్ నోటీసులతో రాజకీయ అపరిపక్వత బయటపెట్టుకుంటున్నారా? దీనిపై రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారో చూద్దాం.


‘‘బండి సంజయ్ చదువుకున్నది లేదు. ఎప్పుడైనా పరీక్షలు రాశాడా… ఆయనకు తెలిసిందేమీ లేదు. చెప్పినా అర్థం కూడా కాదు. పేపర్ లీకులే ఆయనకు తెలుసు’’ గ్రూప్ వన్ అభ్యర్థులకు మద్దతుగా కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన ఆందోళనకు కౌంటర్ ఇస్తూ కేటీఆర్ చేసిన కామెంట్లు ఇవి. సో మొదట వ్యక్తిగతంగా కామెంట్స్ చేసింది కేటీఆర్. ఆయన ఉన్నది ప్రతిపక్షంలో. అవతల ఉన్న నాయకుడు కేంద్రంలో అధికార పక్షంలో ఉన్నారు. పైగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి. ఊరుకుంటారా.. ఇష్యూ పర్సనల్ దాకా వెళ్లడంతో ఊగిపోయారు. అంతే పర్సనల్ గా కేటీఆర్ పై కామెంట్లు చేశారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే చీకటి జీవితం బయటపెడుతానని ఘాటు వార్నింగ్ కూడా ఇచ్చారు.

సో పర్సనల్ అటాకింగ్స్ తో ఇద్దరి మధ్య రాజకీయం వేడెక్కింది. మాటకు మాట, సవాల్ కు ప్రతిసవాల్ జరిగిపోయాయి. నిజానికి రాజకీయాల్లో ఇలాంటి డైలాగ్ లు విసురుకోవడం, విమర్శలు చేసుకోవడం ఈ రోజుల్లో కామన్ అయ్యాయి. ఎలా చూసుకున్నా ఇష్యూ అక్కడికి ఆగిపోవాలి. కానీ అక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. సీన్ కట్ చేస్తే కేటీఆర్.. కేంద్రమంత్రి బండి సంజయ్ కు లీగల్ నోటీసులు పంపారు. తన పరువుకు భంగం కలిగించేలా బండి సంజయ్ మాట్లాడారని నోటీసుల్లో కేటీఆర్ పేర్కొన్నారు. డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్, రేవంత్ తో కలిసిపోయానన్న వ్యాఖ్యలను నిరూపించాలన్నారు. వారం రోజుల్లోగా తనకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని.. లేదంటే న్యాయపరమైన చర్యలు తప్పవని బండి సంజయ్‌ను కేటీఆర్ హెచ్చరించారు.

అంతకు ముందు రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ పై పరువు నష్టం దావా కూడా వేశారు కేటీఆర్. వంద కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశారు. తనను ఎవరైనా విమర్శస్తే ఇక ఊరుకునేది లేదని…, కోర్టుకు ఈడుస్తానని, చట్టం ముందు నిలబెడుతానంటూ వరుసగా లీగల్ నోటీసులు పంపే పని పెట్టుకున్నారు కేటీఆర్. నిజానికి రాజకీయాల్లో ఇలాంటి లీగల్ నోటీసులు ఇస్తే ప్రతిగా మరిన్ని నోటీసులు ఇచ్చేందుకు ప్రత్యర్థులు రెడీగా ఉంటారు. ఎవరైనా బెదురుతారా? కామెంట్లు చేసేటప్పుడే ఇవన్నీ చూసుకోవాలని గుర్తు చేస్తున్నారు.

ఇదంతా రాజకీయ అపరిపక్వతే అన్న పాయింట్ తెరపైకి వస్తోంది. పాలిటిక్స్ లోకి వచ్చి ఇన్నేళ్లయినా.. రాజకీయాలు వంటబట్టలేదా అన్న టాక్ నడుస్తోంది. పొలిటికల్ విమర్శలన్నిటికీ లీగల్ నోటీసులు ఇచ్చుకుంటూ వెళ్తే ఇక అదే పనిలో కేటీఆర్ ఉండాల్సిందే అన్న చర్చ కూడా నడుస్తోంది. ఎందుకంటే నువ్వొకటంటే.. నే రెండంటా అన్నట్లుంది ఇప్పటి రాజకీయం. పైగా రాజకీయాల్లో భాష కూడా రోజురోజుకూ దిగజారిపోతోంది. అన్ పార్లమెంటరీ పదాలు పెద్ద ఎత్తున వాడుతున్నారు. ఇలాంటి సమయంలో లీగల్ నోటీసులు పని చేస్తాయా.. అన్నది హాట్ డిబేట్ గా మారింది.

లీగల్ నోటీసులతో నోరు మూయించే ప్రయత్నాలు చేస్తే ప్రత్యర్థులు సైలెంట్ గా ఉంటారని కేటీఆర్ ఆలోచన చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. కానీ ఈ కథ చాలా దూరం వెళ్తుంది. రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలా లీగల్ నోటీసులు ఇస్తున్నారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడు కేంద్రమంత్రి బండి సంజయ్ కి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. నెక్ట్స్ ఏం జరుగుతుంది? సింపుల్ గా కౌంటర్ నోటీసులు పంపే అవకాశం ప్రత్యర్థి నేతకూ ఉంటుంది కదా. ఇప్పుడు బండి సంజయ్ కూడా చేస్తున్నది అదే. తనను మొదట వ్యక్తిగతంగా అంటేనే తాను పర్సనల్ కౌంటర్ ఇచ్చానని కేటీఆర్ కు గుర్తు చేస్తున్నారు. నోటీసుకు నోటీసుతోనే బదులిస్తానంటున్నారు.

లీగల్ నోటీసులతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వారు ఎవరూ లేరంటున్నారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. తనను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక లీగల్ నోటీసు ఇవ్వడం చూస్తుంటే జాలేస్తోందన్నారు. కేటీఆర్ సుద్దపూస కాదని, ఆయన బాగోతం అంతా ప్రజలకు తెలుసన్నారు కేంద్రమంత్రి. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు వ్యవహారం లో ఏం జరిగిందో, ఆ కేసులను ఏ విధంగా నీరుగార్చారో అందరికీ తెలుసు అని, ఇప్పటి వరకు మాటకు మాటతోనే బదులిచ్చానని ఇక లీగల్ నోటీసులకు నోటీసులతోనే జవాబిస్తానని కాచుకోవాలంటూ సవాల్ చేశారు. ఈ లీగల్ నోటీస్ వార్ కాస్తా ఇప్పుడు మరో లెవెల్ కు వెళ్లింది.

ఎవరి పరువుకు ఎలా భంగం కలిగింది.. ఏ ఆరోపణలు చేశారు.. వాటికి ఆధారాలు ఉన్నాయా.. ఇలాంటి వాటి చుట్టూ ఇప్పుడు రాజకీయం తిరగడం ఖాయమే. మ్యాటర్ కాస్తా లీగల్ గా మారడంతో ఒకరిపై మరొకరి విమర్శలను డీకోడ్ చేసే సీన్ వస్తుంది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో లీగల్ నోటీసులు పంపడం ద్వారా మాజీ మంత్రి కేటీఆర్ రాజకీయంగా ఎలాంటి వ్యూహంతో వెళ్తున్నారన్నది హాట్ టాపిక్ గా మారుతోంది. జనరల్ గా చేసుకున్న విమర్శలకు నోటీసులు ఇవ్వడం అంటే రాజకీయ అపరిపక్వతేనా అన్న చర్చ కూడా జరుగుతోంది. నిజానికి ఇలాంటి నోటీసులు ఇస్తే.. ఎవరి లీగల్ పాయింట్లు వారికి ఉంటాయి. అవన్నీ బయటకు తీస్తారు. చట్టపరంగానే ఎవరి కౌంటర్ వారు ఇచ్చుకుంటారు. సో తెలంగాణలో ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉంది. ఇలాగే లీగల్ నోటీసులు అంటే అప్పటిదాకా ఇంకెన్ని ఇవ్వాల్సి ఉంటుందోనన్న చర్చ జరుగుతోంది.

ఆయన అనొచ్చు.. వేరేవారు అనకూడదా?

బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలపై కేటీఆర్ చేసిన కామెంట్స్ ఎవరూ మరిచిపోలేరు. దానిపై ఆయన స్పందిస్తూ.. యథాలాపంగా వచ్చినవి తప్ప కావాలని అనలేదు అని విమర్శలు వచ్చాక జవాబు ఇచ్చుకున్నారు. మహిళల గురించి ఇలా యథాలాపంగా బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు బస్సుల్లో చేసుకోండని ఎవరైనా అంటారా? కానీ కేటీఆర్ మాత్రం అన్నారు. నోరు జారితే వెనక్కు తీసుకోలేం. ఇది కావాలని అన్నారా.. లేదంటే అనుకోకుండా వచ్చిందా అన్నది వేరే విషయం. నిజానికి లోపల ఏముంటుందో అదే నోటి నుంచి బయటికొస్తుందంటారు. ఇప్పుడు కేటీఆర్ విషయంలోనూ అదే జరిగిందా అన్న చర్చ జరుగుతోంది.

కేటీఆర్ కు ఇంట్లో నేర్పిన సంస్కారం ఇదేనా అని అప్పట్లో మంత్రులు విమర్శించారు. అటు కేటీఆర్‌ వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమిషన్ అప్పట్లో సుమోటోగా తీసుకుంది. మహిళల పట్ల కేటీఆర్‌ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా.. కించపరిచేలా ఉన్నాయని కమిషన్‌ పేర్కొంది. విచారణకు హాజరుకావాలన్నది. మహిళలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో కమిషన్‌ ముందు విచారణకు కూడా హాజరై వివరణ కూడా ఇచ్చుకున్నారు.

గతంలో అసెంబ్లీలో ద్రవ్యవినిమియ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డిని కేటీఆర్ ఏకవచనంతో మాట్లాడారు. దీనిపై అధికార పక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో తన మాటలను వెనక్కు తీసుకుంటున్నట్లు చెప్పారు. నోరు జారనేల తిరిగి వెనక్కు తీసుకోవడమేల అన్న పాయింట్లు అప్పుడూ వినిపించాయి. ఇప్పుడు కూడా బండి సంజయ్ పై కేటీఆర్ చేసిన కామెంట్లు చాలా దుమారంగా మారాయి. బండి పరీక్షలు రాయలేదని, చెప్పినా అర్థం కాదని, పేపర్ లీకులు చేయడం తెలుసు అని ఇలాంటివి పర్సనల్ గా వెళ్లాయి.

నేతల నోటి దురుసుతోనే ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయం కేటీఆర్ కు తెలియంది కాదు. అయినా అదే వైఖరి కంటిన్యూ చేస్తున్నారన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. తాజాగా బండి వర్సెస్ కేటీఆర్ డైలాగ్ వార్ కాస్తా లీగల్ వార్ గా మారింది. కేటీఆర్ లీగల్ నోటీసులపై బండి నోటీసులతోనే వస్తా కాచుకో అని రియాక్ట్ అవగా… కేటీఆర్ మళ్లీ చిట్ చాట్ లో కామెంట్స్ చేశారు. తాను లీగల్ నోటీసుల విషయంలో మోడీని ఫాలో అవుతా అంటున్నారు.

రాహుల్ గాంధీకి గతంలో ప్రధాని మోడీ లీగల్ నోటీసులు ఇవ్వలేదా అని గుర్తు చేస్తున్నారు. బండి సంజయ్ తనకు లీగల్ నోటీసులు ఇస్తే తాను మళ్లీ మళ్లీ అవే నోటీసులు పంపుతానంటున్నారు. పైగా ఉడుత ఊపులకు భయపడేది లేదన్న బండి సంజయ్ ఎందుకు భయపడుతున్నారని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇంత చేసి కేటీఆర్.. నోటీసుల చుట్టూనే రాజకీయం తిప్పుతారా అన్న చర్చ జరుగుతోంది. ఇన్నేళ్ల రాజకీయ అనుభవంలో లీగల్ నోటీసులతో ప్రత్యర్థిని కట్టడి చేయొచ్చా చేయరాదా అన్నది క్లారిటీ లేకుండా పోయిందా అన్న ప్రశ్నలైతే వస్తున్నాయి. ప్రతి మాటకు లీగల్ నోటీసులంటే ఇక రాజకీయాల్లో వాద ప్రతివాదాలు ఉండవు. మాటలుండవ్, మాట్లాడుకోవడాల్లేవ్ అన్నట్లుగా సీన్ మారుతుంది.

ఎందుకంటే రాజకీయాల్లో ఒకరిపై మరొకరు చేసుకునే ప్రతి మాట తూటానే. తాజా లీగల్ నోటీసులతో తనపై ఎవరూ గట్టిగా మాట్లాడకుండా ఉండాలని కేటీఆర్ అనుకుంటున్నారా అన్న టాక్ నడుస్తోంది. నోటీసులు ఇచ్చినంత మాత్రాన కేటీఆర్ ను ఎవరూ విమర్శించకుండా ఉంటారా అన్నది కూడా కీ పాయింటే. ఎందుకంటే పర్సనల్ గా అవతలి పార్టీ నాయకులపై విమర్శలు చేసినప్పుడు.. అలాంటి పర్సనల్ ఎటాకింగ్స్ కేటీఆర్ పై రావడం కూడా అంతే సహజం. ఇప్పుడు కేటీఆర్ వర్సెస్ బండి సంజయ్ ఎపిసోడ్ లో కూడా జరిగింది ఇదే. రాజకీయ విమర్శలపేరు చెప్పి, ఎలాంటి ఆధారాలు లేకుండా నీచమైన వ్యాఖ్యలు చేసే వారికి కొండా సురేఖపై వేసిన 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా ఒక గుణపాఠం కావాలంటున్నారు.

Also Read: కేంద్రమంత్రి బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు, క్షమాపణలు చెప్పాల్సిందే

మరి మనం అవతలి వారిపై చేసే కామెంట్లకు జవాబు ఏది అన్న ప్రశ్నలకు జవాబు ఉందా అన్న పాయింట్ చుట్టూ రాజకీయం తిరుగుతోంది. తనపై బీఆర్ఎస్ నుంచి ట్రోల్స్ చేయడంతో మంత్రి సురేఖ.. కేటీఆర్ పై ఇటీవలే తీవ్రస్థాయిలో కామెంట్స్ చేశారు. తనను ట్రోలింగ్ చేస్తే కనీసం స్పందించకపోవడంతో ఫైర్ అయ్యారు. తమపై సోషల్ మీడియాలో పిచ్చిరాతలు రాయిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. అయితే తన వ్యాఖ్యలపై ఎవరైనా నొచ్చుకుంటే క్షమాపణలు చెబుతున్నానని ఆ మరుసటి రోజు అన్నారు. సో ఫైనల్ గా వంద కోట్ల పరువు నష్టం మ్యాటర్ కోర్టుకు చేరింది. అక్కడ ఎవరి వెర్షన్ వారు వినిపించుకునే అవకాశం ఉంది. ఏం జరుగుతుందన్నది తర్వాతి విషయం. అయితే ప్రతి పొలిటికల్ మ్యాటర్, వాద ప్రతివాదాలను లీగల్ నోటీసుల చుట్టూ కోర్టుల చుట్టూ తిప్పాలనుకోవడమే ఇప్పుడు హాట్ డిబేట్.

Related News

Telangana Bjp: తెలంగాణ బీజేపీ నేతలకు టాస్క్ రెడీ.. నిరూపించుకుంటే పదవులు ఖాయం

Sunil Bansal on T BJP Leaders: బీజేపీ నేతలకు.. బన్సల్‌ ట్రీట్మ్‌మెంట్

TSquare designs: టీ-స్క్వేర్ డిజైన్లు.. పలు మార్పులు, వాటికే ఎక్కువ ఛాన్స్

BRS: బీఆర్ఎస్ పేరు మార్చే యోచన, కేటీఆర్ సంకేతాలు .. మరి కలిసొస్తుందా?

IAS Amoy kumar: ఐఏఎస్ అమోయ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, భూముల అక్రమాలపై తీగలాగుతున్న ఈడీ

Diwali bonus: సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్.. నేడే ఖాతాల్లో నగదు జమ

Korean firm Shoealls: సీఎం రేవంత్ టూర్ ఫలితాలు .. ముందుకొచ్చిన కొరియా షూ కంపెనీ

Big Stories

×