EPAPER

Police department : ఒత్తిళ్ల మధ్య నాలుగో సింహం

Police department : ఒత్తిళ్ల మధ్య నాలుగో సింహం

Police department : ప్రపంచమంతా నిద్రలో ఉంటే తాము మాత్రం రెప్పవాల్చకుండా శాంతి భద్రతల పరిరక్షణకై కాపలా కాస్తుంటారు. ఎండ, వాన, పగలు, రాత్రి, పండగ పబ్బంతో సంబంధం లేకుండా లాఠీ పట్టుకుని ప్రాణాలను లెక్కపెట్టకుండా విధులు నిర్వహిస్తూ ఉంటారు. ఒకసారి డ్యూటీ ఎక్కితే మళ్లీ ఇంటికొచ్చే దాకా నిలువుకాళ్ల కొలువే. భార్యాబిడ్డలకు దూరమై పూర్తి సమయం విధి నిర్వహణకే వెచ్చిస్తారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేం. సంపన్నుడి నుంచి సామాన్యుడి వరకు అత్యవసర పరిస్థితిలో ముందుగా ఆశ్రయించి సాయం కోరేది పోలీసులనే.


దేశం బయటినుంచి దండెత్తి వచ్చే శత్రువుల నుంచి దేశాన్ని కాపాడేవారు సైనికులైతే, అంతర్గత శత్రువుల నుంచి ప్రజలను కాపాడి, భద్రతకు భరోసా ఇచ్చేది, సామాజిక ఆస్తులను సంరక్షించేది మన పోలీసులు. విధి నిర్వహణ కోసం ఉత్సాహంగా రోడ్డెక్కి సంఘవిద్రోహుల కుట్రలకు బలై మరలిరాని లోకాలకు తరలిపోయిన ఖాకీ వీరులెందరో. సమాజానికి ఇంత చేస్తున్న మన పోలీసుల ధైర్యసాహసాలను కొనియాడేందుకు, విధి నిర్వహణలో అమరులైన వారి వెలకట్టలేని త్యాగాలను సంస్మరించుకోవటానికే మనం ఏటా అక్టోబరు 21న పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నాం.

ALSO READ : వీటికి గూగుల్ ఎప్పుడో గుడ్​బై చెప్పేసిందని మీకు తెలుసా?


పోలీసు అమరవీరుల దినోత్సవం వెనక ఓ అద్భుతమైన వీరోచిత గాధ ఉంది. స్మరించుకునే రోజుకు మహోన్నత చరిత్ర ఉంది. సరిగ్గా 64 ఏండ్ల క్రితం.. అంటే 1959, అక్టోబరు 21 టిబెట్ సమీపంలోని లడక్‌లోని అక్సాయ్‌చిన్‌ వద్ద మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల్లో పదిమంది కేంద్ర రిజర్వు పోలీసులు (సీఆర్‌పీఎఫ్‌) విధి నిర్వహణలో ఉన్నాయి. ఈ సమయంలో ఊహించని రీతిలో చైనా సైనికులు భారీ సంఖ్యలో సరిహద్దులోకి చొచ్చుకు రాగా, మన జవాన్లు వారిని అడ్డగించారు.

ఈ క్రమంలో జరిగిన కాల్పులలో ఒళ్లంతా తూట్లు పడుతున్నా.. మన జవాన్లు చివరి నిమిషం వరకు అసాధారణ ధైర్యసాహసాలతో పోరాడుతూ, ఒక్కరొక్కరుగా నేలకొరిగారు. ఈ ఘటన నాడు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ క్రమంలోనే అన్ని రాష్ర్టాల పోలీసు ఉన్నతాధికారులు 1960 జనవరి 9న సమావేశమై, వారి అమరత్వం పొందిన అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటించాలని తీర్మానించారు. నాటి నుంచి ఏటా అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్నారు.

విధినిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలను స్మరించుకునే ఈ సమయంలో ఆ అమరుల కుటుంబాల పరిస్థితిని తలచుకుంటే దు:ఖం రాకమానదు. ఏ కుటుంబాన్ని కదిలించినా హృదయం ద్రవించే కన్నీటి గాధలే. తల్లి గర్భంలో ఉండగానే తండ్రిని కోల్పోయిన పిల్లలు కొందరైతే, ఊహ తెలియని వయస్సులోనే కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయిన పిల్లలు మరెందరో ఉన్నారు. పెళ్లైన మూణ్నాళ్లకే తమ ఐదోతనాన్ని కోల్పోయిన నవ వధువులెందరో. భర్త పోయి సమాజంలో తగిన గౌరవం లేక, జీవచ్ఛవాల్లా బతికే ఆడబిడ్డలెందరో. అయినవారందరూ ఉన్నా, భర్త లేక ఏ శుభకార్యాలకూ వెళ్లలేని బాధను అనుభవిస్తూ మౌనంగా, దీనంగా తమ బిడ్డల కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటున్న వారెందరో.

పోలీసు ఉద్యోగుల జీతాలు ప్రస్తుతం కొంత పెరిగినా అమరులకు అందించే సాయంలో పెద్ద మార్పులేకపోవటంతో వీరి జీవితాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. ఏడాదికోమారు పోలీసు అమరవీరుల దినోత్సవం రోజు తప్ప.. తమను పట్టించుకున్నవారే లేరని అమరుల కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు, విధి నిర్వహణలోని పోలీసుల పరిస్థితి నానాటికీ ఒత్తిళ్లమయంగా మారుతోంది. పలుకుబడుల చట్రంలో అధికారులు నలుగుతుంటే.. కింది స్థాయి సిబ్బందిని కొరత వేధిస్తోంది. డబుల్‌, ట్రిపుల్‌ డ్యూటీలతో మానసికంగా, శారీరకంగా నలిగిపోయి, అనారోగ్యాల బారిన పడుతున్నారు. ప్రభుత్వ జీతంతోనే స్టేషన్‌లో తెల్లకాగితాలతో సహా సరిచేసుకోవాలసిన పరిస్థితి. సర్కారు పనిపై వెళ్లినా సొంత సొమ్ము ఖర్చుపెట్టు కోవాల్సిందే. చివరికి సీఎం బందోబస్తుకు వెళ్లి నిలువుకాళ్లపై గంటలపాటు నిలబడి డ్యూటీ చేసినా భోజనం డబ్బులు వచ్చేది ఎప్పటికో. మరోవైపు ప్రజాప్రతినిధుల దర్పాన్ని సంతృప్తి పరచడం, అసాంఘిక శక్తులతో పోరాటం ఇలా మొత్తంగా చెప్పుకోలేని ఒత్తిడిని పోలీసులు అనుభవిస్తున్నారు. అయినా, నైరాశ్యానికి గురికాకుండా, తమ బాధలను ఎక్కడా వెల్లడించకుండా, అంతే గంభీరంగా యూనిఫాం వేసుకుని విధులు నిర్వహిస్తూనే ఉండటం చిన్న విషయం కానేకాదు.

ఐక్యరాజ్య సమితి సిఫారసుల ప్రకారం ప్రతి లక్ష మంది జనాభాకు కనీసం 222 మంది పోలీసులు ఉండాలి. మన దేశంలో 128 మంది మాత్రమే పనిచేస్తున్నారు. వారిలో అత్యధికులు వీవీఐపీల భద్రత, ట్రాఫిక్ విధులకు పరిమితం. శాంతిభద్రతల కోసం పనిచేస్తున్నది అరకొర సిబ్బందే.

దేశవ్యాప్తంగా పోలీసులు తీవ్రమైన పని ఒత్తిడితో సతమతమవుతున్నారని, రోజులో సగానికిపైగా టైం డ్యూటీలోనే ఉంటున్నారని కామన్‌‌కాజ్‌‌, లోక్‌‌నీతి సీఎస్‌‌డీఎస్ నిర్వహించిన జాతీయ సర్వే లెక్కతేల్చింది. దేశంలో పోలీసులు సగటున 14 గంటలు పనిచేస్తుంటే తెలంగాణలో ఇది మరింత ఎక్కువగా ఉందని వెల్లడైంది. పని భారం పెరగడం, ఎమర్జెన్సీ డ్యూటీ, సిబ్బంది కొరత, వయసుతో బాట వచ్చే అనారోగ్య సమస్యలు, కుటుంబ బాధ్యతలు నిర్వహించలేకపోతున్నామనే దిగులు పోలీసులను వేధిస్తోందని ఈ సర్వే వివరించింది.

దీని ఫలితంగా నిద్రలేమి, సమయానికి తిండి తినక అనారోగ్యం, ఊబకాయం, గ్యాస్ట్రిక్‌‌ సమస్యల బారినపడుతున్న పోలీసుల సంఖ్య ఏటికేడు దేశవ్యాప్తంగా పెరుగుతున్నట్లు వెల్లడైంది. ఈ సర్వేలో సుమారు 51 శాతం మంది పోలీసులు తమకు వీక్లీ ఆఫ్‌‌ లేదని, 26 శాతం మంది నెలలో ఒక రోజు, 4 శాతం మంది నెలలో రెండ్రోజులు సెలవు తీసుకుంటున్నట్లు చెప్పారు. 19 శాతం మంది ఈ ప్రశ్నకు స్పందించలేదు. వీక్లీ ఆఫ్‌‌ లేకపోవటంతో వ్యక్తిగత జీవితమేనది లేకుండా పోయి తీవ్రఒత్తిడికి లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్న పోలీసుల సంఖ్యా ఏటికేడు పెరుగుతూనే ఉంది. విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి ప్రాణాలర్పించిన పోలీసు వీరులకు నివాళి అర్పిస్తూనే, మన కోసం పనిచేసే పోలీసుల బాధలను నిబద్ధతతో పట్టించుకోవాలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం పోలీసు సంస్కరణలకు నడుంబిగించాల్సి ఉంది.

Related News

RAHUL GANDHI : ఆదివాసీ, వనవాసీలకు తేడా చెప్పేసిన రాహుల్ గాంధీ… ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై మండిపాటు

BJP Corporator Son: పాకిస్థాన్ అమ్మాయితో బీజేపీ నేత కొడుకు పెళ్లి.. ఎలా చేసారో తెలుసా?

Blast In Delhi: ఢిల్లీలో భారీ పేలుడు అలజడి.. భయాందోళనలో ప్రజలు

Jharkhand Bjp : ఝార్ఖండ్’లో బీజేపీ తొలి​ జాబితా విడుదల​, మాజీ సీఎం చంపయీ సోరెన్‌, సీఎం వదిన సీతా సోరెన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారంటే ?

Navya Haridas BJP : ప్రియాంక గాంధీపై పోటీకి సై అంటున్న న‌వ్య హ‌రిదాస్‌, దేశం దృష్టిని ఆకర్షిస్తున్న వయనాడ్, నీదా నాదా అంటున్న కాంగ్రెస్, బీజేపీ

Kashmir Marathon: 2 గంటల్లో 21 కిమీ పరుగెత్తిన ముఖ్యమంత్రి.. ‘ట్రైనింగ్ లేకుండానే సాధించాను’

Big Stories

×