EPAPER

Musi river : మూసీకి జలకళ సాధ్యమే..

Musi river : మూసీకి జలకళ సాధ్యమే..

Musi river : ఒకప్పుడు పుష్కల జల నిధులతో, జీవకళ తొణికిసలాడిన నది మూసీ. దేశంలో పలు రాజధానులు నదీ తీరాల వెంట వెలిసినా, రాజధాని మధ్యలోనుంచి ప్రవహించే నది మూసీ ఒక్కటే కాగా, ఆ రాజధాని మన భాగ్యనగరం కావటం విశేషం. ఒకనాడు తియ్యని జలధారలతో భాగ్యనగర వాసుల దాహాన్ని తీర్చిన ఈ జీవనది కాలంతో బాటు వచ్చిన మార్పులకు, మనిషి స్వార్థానికి క్రమంగా కుచించుకుపోయింది. భాగ్యనగరం విస్తరించే కొద్దీ పెరిగిన జనాభా మూలంగా ఇది నేడు కాలుష్య కాసారంగా మారింది. ఈ నదికి పూర్వవైభవం తెచ్చేందుకు గత ప్రభుత్వాలు అనేక ప్రయత్నాలు చేసినా ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయాయి. పైగా, అప్పట్లో వారి ప్రయత్నాలన్నీ మూసీ సుందరీకరణకు, శుద్ధీకరణకో పరిమితమయ్యాయి. కానీ, రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత పాలకుల మాదిరిగా తాత్కాలిక ఉపశమన చర్యలకు పూనుకోకుండా, ఏకంగా మూసీకి పునరుజ్జీవం కల్పించాలనే దిశగా ఓ పెద్ద సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది.


ALSO READ:ఆన్‌లైన్ డ్రామారావు కేటీఆర్ – చామల కిరణ్ కుమార్ రెడ్డి

అనంతగిరి నుంచి..
వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ నది దారి పొడవునా జీవకోటి దాహం తీరుస్తూ, 240 కిలో మీటర్లు పారుతూ నల్గొండ జిల్లాలో కృష్ణా నదిలో కలుస్తుంది. సముద్రమట్టానికి 2,168 అడుగుల ఎత్తులో పుట్టి తూర్పు దిశగా ప్రవహించి హైదరాబాద్ గుండా ప్రవహించే ఈ నదికి 4వేల చదరపు మైళ్ల క్యాచ్‌మెంట్ ఏరియా ఉంది. మూసీ పూర్వనామం ముచికుంద అనే మాట కూడా ఉంది. మూసీ జన్మస్థానాన్ని ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు దర్శించాడని కూడా చెబుతారు. అయితే, ఈసా, మూసా అనే రెండు పాయలు కలిసినందునే దీనికి మూసీ అనే పేరొచ్చిందనే కథనమూ ఉంది. హైదరాబాద్‌లోని లంగర్ హౌస్ ప్రాంతంలో బాపూఘాట్ వద్ద ఈసీ, మూసా కలిసి మూసీ నదిగా ప్రయాణం మొదలుపెడుతుంది. ఒక్క రాజధాని పరిధిలోనే సుమారు 35 కి.మీ దూరం మేర ఈ నది ప్రవహిస్తుంది.


నిజాంల చొరవ..
మూసీకి 1908 సెప్టెంబర్ 26, 27, 28 తేదీల్లో వచ్చిన వరదతో హైదరాబాద్ నగరం మునిగిపోవటంతో 15 వేల మంది చనిపోగా, 80 వేలమంది నిరాశ్రయులయ్యారు. అప్పట్లోనే ఉస్మానియా ఆసుపత్రి ఆవరణలోని చింత చెట్టుపైకి ఎక్కి సుమారు 150 మంది ప్రాణాలు కాపాడుకున్నారు. దానికి గుర్తుగానే 2002లో నాటి ప్రభుత్వం ఈ చింత చెట్టుకు ‘ప్రాణధాత్రి’ అని నామకరణం చేసి కాపాడుతూ వచ్చింది. మూసీ వరద భీభత్సాన్ని చూసిన ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్, నాటి ప్రముఖ ఇంజనీర్ విశ్వేశ్వరయ్యను పిలిపించి సమగ్ర నీటి ప్రణాళిక రెడీ చేయించారు. ఈ క్రమంలోనే గండిపేట (ఉస్మాన్ సాగర్), హిమాయత్ సాగర్ జలాశయాలను నిర్మించి, ఆ జలాలను తాగునీటికి వాడారు. ఆ తర్వాత 1930, ‌1954, ‍1970, 2000లో మూసీ ఉప్పొంగినా, రాజధానికి ఎలాంటి నష్టం చేకూరలేదు. తర్వాత వచ్చిన ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్.. సర్ మీర్జా అలీ అనే ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్‌ను పిలిపించి మూసీ పరివాహకంలో 14 పార్కులు నిర్మించారు. భాగ్యనగర వాసులు సాయంకాలంలో పిల్లాపాపలను తీసుకుపోయి, ఈ నదీ తీరం వెంట సేదదీరేవారు.

ఎన్నో ప్రయత్నాలు..
మూసీ ప్రక్షాళనకు 1997లో నాటి రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ‘నందనవనం’ ప్రాజెక్టును ప్రకటించింది. నదీ గర్భాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మొదలైన ఈ ప్రాజెక్టులో భాగంగా బాపూఘాట్ నుంచి నాగోల్ వరకు అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులైన వారికి కర్మన్ ఘాట్ వద్ద రూ.8కోట్లు వెచ్చించి 1858 ప్లాట్లు అభివృద్ధి చేసి, 1095 కుటుంబాలకు ఇచ్చి పునరావాసం కల్పించారు. 1999 నాటికి ఇదే ప్రాజెక్టులో భాగంగా చాదర్ ఘాట్ వద్ద నదీ గర్భంలో 10 మీటర్ల కాంక్రీట్ కాలువ నిర్మించారు. కానీ, పర్యావరణవేత్తలు అభ్యంతరాలతో ఈ ప్రాజెక్టు 2001లో ఆగింది. తర్వాత 2005లో ‘సేవ్ మూసీ’ ప్రాజెక్టును నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించింది. రూ.908 కోట్లతో మూసీని సుందరీకరించాలనేది ప్రణాళిక. ప్రాజెక్టు వ్యయం, పునరావాసం, ప్రక్షాళన, సుందరీకరణ వేర్వేరుగా చేయాల్సిరావటం వంటి పలు కారణాలతో ఈ ప్రాజెక్టు ముందుకు కదలలేదు. బీఆర్ఎస్ హయాంలో 2017 మార్చి 25న జీవో నెం.90 ద్వారా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి, బాపూ ఘాట్ నుంచి మూసీ ఎగువన 57.5 కి.మీ, దిగువన మరో 57.5 కిలోమీటర్లు.. అంటే మొత్తం 115 కిలోమీటర్ల పరిధిలో నది కాలుష్యాన్ని తగ్గించి పరిశుభ్రమైన పరిస్థితులు కల్పించాలని భావించారు. అలాగే, మూసీ సుందరీకరణ, అభివృద్ధికి రూ.16,635 కోట్లతో అంచనాలూ రెడీ చేశారు. మూసీ నది ఉత్తర, దక్షిణ ఒడ్డులను కలిపేలా రూ.545 కోట్లతో 14 చోట్ల వంతెనలకు ప్రణాళికను రూపొందించారు. అయితే, కొత్తపేట నుంచి నాగోలు, హైకోర్టు, ఛాదర్ ఘాట్ ప్రాంతాల్లో వాకింగ్ ట్రాకులు, పార్కులు, ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు వంటివి మాత్రమే ఆచరణలోకి వచ్చాయి. హైకోర్టు వద్ద భారీగా నిధులు వెచ్చించి రబ్బర్ డాం కట్టి, పైనుండి వ‌చ్చే నీటిని నిల్వ చేసి పక్కనే వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసినా, మురుగు నీటి వాసనకు జనం అటు అడుగే పెట్టలేదు.

మురుగుమయం..
మూసీ పునరుజ్జీవానికి నదిలోకి కొత్తగా మురుగు చేరకుండా చూడటం, చేరుతున్న మురుగును శుద్ధి చేయటమే రెండు అంశాలు కీలకమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ సీవరేజీ బోర్డు పరిధిలో రోజూ 1950 మిలియన్ లీటర్ల (ఎంఎల్‌డీ) మురుగునీరు ఉత్పత్తి అవుతుండగా, అందులో 772.3 ఎంఎల్‌డీల మురుగునీరు 25 సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల (ఎస్టీపీ) ద్వారా శుద్ధి అవుతోంది. బీఆర్ఎస్ హయాంలో రూ.3866 కోట్లతో 31 ఎస్టీపీల సాయంతో 1259.5 ఎంఎల్‌డీ నీరు శుద్ధి చేయాలని ప్రణాళిక రెడీ చేశారు. వీటిలో మూసీకి ఉత్తర ప్రాంతాలలో 402.5 ఎంఎల్‌డీ సామర్థ్యంతో 8 ఎస్టీపీలు, మూసీకి దక్షిణ ప్రాంతాల్లో 480.5 ఎంఎల్‌డీ సామర్థ్యంతో 6 ఎస్టీపీలు, హుస్సేన్ సాగర్-కూకట్‌పల్లి మధ్య 376.5 ఎంఎల్‌డీ సామర్థ్యంతో 17 ఎస్టీపీలు నిర్మాణంలో ఉండగా, వీటిలో నేటికి కేవలం 6 ఎస్టీపీలు రెడీ అయ్యాయి.

పడిపోయిన ఆక్సిజన్ లెవెల్స్
మురుగు ధాటికి మూసీ తన జీవత్వాన్ని కోల్పోయిందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పరీక్షల్లో తేలుస్తోంది. ఇటీవల గండిపేట్, బాపుఘాట్, ముసారాంబాగ్, నాగోల్, పీర్జాదీగూడ, ప్రతాప సింగారం, పిల్లాయి పల్లి ప్రాంతాల్లో మూసీ నీటి నమూనాలను పరిశీలించగా వీటిలో కేవలం గండిపేట్ వద్ద మాత్రమే నీటిలో ఆక్సిజన్ స్థాయి చెప్పుకోదగినట్లుగా ఉందని తేలింది. మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ జలచరాలూ బతకలేనంత తక్కువ ఆక్సిజన్ మాత్రమే ఉన్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. నదీ పరిసర ప్రాంతాలలో మురుగు నిలిచి దోమల పెరుగుదల భారీగా పెరుగుతోంది. డ్రైనేజీ పైపులు, పశు వ్యర్థాలు, చికెన్ షాపులు, తోళ్ల పరిశ్రమల వ్యర్థాలన్నీ నదిలోకే. ఏకంగా రివర్ బెడ్‌లోనే 8 వేల నివాసాలొచ్చాయి.

రేవంత్ రాకతో..
కాగా, రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ పరివాహక ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్ పరిధిలోని 39 ఎస్టీపీలకు రూ.3849 కోట్లను కేటాయిస్తూ ఆగస్టులో కేటాయించింది. మూడు ప్యాకేజీల్లో (ప్యాకేజీ-1లో 16, ప్యాకేజీ-2లో 22, ప్యాకేజీ-3లో భారీ ఎస్టీపీ ఒకటి) వీటిని నిర్మించి, మొత్తం 972 ఎంఎల్‌డీ మురుగునీరు శుద్ధి చేయాలని టార్గెట్‌గా పనిచేస్తోంది. అలాగే, 2024-25 బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించారు. మూసీ పునరుజ్జీవానికి కట్టుబడి ఉన్నట్లు గత జులై 20న గోపన్‌పల్లిలో ఫై ఓవర్ ప్రారంభోత్సవ సందర్భంగా సీఎం క్లారిటీ ఇచ్చారు. అలాగే, మూసీ ప్రాజెక్టులో నిర్వాసితులయ్యే వారి కోసం 16వేల ఇళ్లను కేటాయిస్తూ గత సెప్టెంబరు 26న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే చాదర్ ఘాట్ ప్రాంతంలోని మూసా నగర్, శంకర్ నగర్ ప్రాంతాల్లోని కొందరు డబుల్ బెడ్ రూం ఇళ్లకు తరలివెళ్లటం, మరికొన్ని ప్రాంతాల వారు ఈ దిశగా అడుగులు వేస్తున్న దశలో విపక్షాలు రంగ ప్రవేశంతో ఈ ప్రయత్నానికి భంగం కలిగింది.

థేమ్స్ ఉదాహరణ..
ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు తమ నదులను కాపాడుకోవటంపై శ్రద్ధ చూపుతున్నాయి. ఉదాహరణకు.. లండన్‌లోని థేమ్స్ నది దాదాపు 200 ఏళ్ల పాటు పారిశ్రామిక విప్లవం కారణంగా పారిశ్రామిక వ్యర్థ జలాలు, మానవ వ్యర్థాలతో నిండిపోగా, 1957లో దానిని ‘బయోలాజికల్లీ డెడ్’ గా లండన్ నాచురల్ హిస్టరీ మ్యూజియం ప్రకటించింది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఎంతో కృషి చేశాక గానీ, నేటికి ఆ నది తిరిగి పూర్వపు వైభవాన్ని సంతరించుకోగలిగింది. నిరుటి జనవరిలో లండన్ పర్యటనకు వెళ్లిన సీఎం ఈ నదిని పరిశీలించటమే గాక థేమ్స్ నది పాలకమండలితో సమావేశమై చర్చించారు. అలాగే, గుజరాత్‌లోని సబర్మతినీ ఇదే పరిస్థితి నుంచి తిరిగి పునరుజ్జీవింపజేశారు.

పునరుజ్జీవమే లక్ష్యం..
గత ప్రభుత్వాల మాదిరిగా పైపైన సుందరీకరణకు బదులుగా వందేళ్ల నాడు ఆ నది ఎలా ఉందో తిరిగి ఆ పరిస్థితి తీసుకొచ్చేందుకు సర్కారు ప్రయత్నిస్తోంది. మెయినహార్ట్‌, రియోస్‌, కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌, ఝా, సోమ్‌ అనే ఐదు కంపెనీల కన్సార్షియంకు మూసీ పునరుజ్జీవపు బాధ్యతలు అప్పగించారు. అనంతగిరి నుంచి తిరిగి సూర్యాపేట వరకు ఈ నది తిరిగి జలకళను సంతరించుకోవటమే గాక ఈ నదికి రెండువైపులా టూరిజం హబ్‌లు, హెరిటేజ్ కారిడార్లు, పర్యావరణ హితమైన నిర్మాణాలు రానున్నాయి. తద్వారా భాగ్యనగరపు శిగలో మూసీ పరీవాహక ప్రాంతమంతా మరో ప్రత్యేక ఆకర్షణగా మారనుంది.

Related News

Lady Aghori Naga Sadhu: మహిళా అఘోరితో ‘బిగ్ టీవీ’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.. సంచలన విషయాలు!

Congress : ఆన్‌లైన్ డ్రామారావు కేటీఆర్ – చామల కిరణ్ కుమార్ రెడ్డి

Musi River : మూసీ నిర్వాసితులకు సర్కారు చేయూత

Hyderabad: మియాపూర్‌లో చిరుత సంచారం.. హైదరాబాద్ వాసుల్లో భయం భయం!

Mallanna Sagar : మల్లన్న సాగర్ బాధితులకు న్యాయం జరిగిందా? హరీష్ రావు మాటల్లో నిజమెంత!

KTR court issue : ఇదేం పద్ధతి? కేటీఆర్‌పై నాంపల్లి క్రిమినల్ కోర్టు అసహనం

Big Stories

×