Dussehra : దసరా, దీపావళి పండగల సందర్భంగా ఉద్యోగస్థులకు తమ సంస్థ యాజమాన్యాలు బోనస్‌లను ఇస్తుంటాయన్న సంగతి తెలిసిందే. ఉద్యోగి స్థాయి ఆధారంగా రూ. వేల నుంచి రూ.లక్షల వరకు ఇది ఉంటుంది. చాలా మందికి ఈ పాటికి వచ్చే ఉంటుంది. దీన్ని చాలా మంది ఇచ్చినప్పుడు ఉపయోగించేస్తుంటారు. అనవసర ఖర్చులు కూడా చేస్తుంటారు. ఇలా చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు పలువురు.
బోనస్‌గా వచ్చిన డబ్బును సక్రమంగా వినియోగిస్తే ఆర్ధిక ప్రణాళికకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి ఒకవేళ మీరు బోనస్ ఖర్చు పెట్టకపోయి ఉంటే, దాంతో ఉపయోగపడేలా, మరింత ఆదాయం వచ్చేలా ఏం చేయచ్చో ఈ కథనంలో తెలుసుకుందాం.
రుణాలు తీర్చుకోండి – మీకేమైనా చిన్న మొత్తాల్లో అప్పులు, లేదా వ్యక్తిగత, గృహ రుణాలుంటే త్వరగా వాటిని బోనస్ డబ్బులతో తీర్చేసుకోండి. దీంతో కొంచెం భారం తగ్గుతుంది.
అత్యవసర నిధిలో జమ – ప్రతి వ్యక్తి 6 నెలల ఖర్చులకు సరిపడా అత్యవసర నిధిని తప్పకుండా ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. ఒకవేళ అంత మొత్తం ఏర్పాటు చేసుకోకపోయి ఉంటే, ఈ బోనస్‌ను అత్యవసర నిధిలో జమ చేయండి.
పొదుపు చేయండి – బోనస్ డబ్బును బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం మంచిది. కొంతకాలం తర్వాత దానికి వడ్డీ కూడా వస్తుంది. అప్పుడు మీరు ఎక్కువ మొత్తంలో పొందవచ్చు. అలా బోనస్తోనూ ఆదాయం ఎంచక్కా పెంచుకోవచ్చు.
షేర్లు – స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టొచ్చు. కానీ ఇది చాలా రిస్క్‌తో కూడుకున్న పని. ఎంతో అనుభవం, పూర్తి అవగాహన ఉంటేనే ఇలా చేయాలి. లేదంటే పెట్టకపోవడమే ఉత్తమం.
మదుపు – మ్యూచువల్ ఫండ్స్‌లో రిస్క్ తక్కువ ఉంటుంది. దీర్ఘ కాలంలో మంచి లాభాలు వస్తాయి. కాబట్టి బోనస్‌ను పెట్టుబడిగా ఇందులో పెట్టుకోవచ్చు.
బంగారం – బంగారం కొనుగోలు ఉత్తమం. ఇది ఎన్నో తరాల నుంచి వస్తున్న సంప్రదాయ పెట్టుబడి. డబ్బుకు ఏ ఢోకా ఉండదు. లేదంటే ప్రభుత్వం అందించే గోల్డ్ బాండ్స్‌లోనూ పెట్టుబడులు పెట్టండి. గోల్డ్ పైన పెట్టుబడి ఎప్పటికీ వృథా కాదనే విషయాన్ని గుర్తు పెట్టుకొని కొంటే భవిష్యత్తులో ఎంచక్కా ఉపయోగపడుతుంది.
స్కిల్స్ – మీ వృత్తిలో మరింత నైపుణ్యం పొందాలనుకుంటే ఆ డబ్బులతో కోర్సులను నేర్చుకోండి. అంటే మీ పెట్టుబడి వృథా అవ్వొద్దు. తద్వారా ఉద్యోగ స్థాయిలో మరింత పైకి వెళ్లొచ్చు. స్థాయికి తగ్గట్టుగా జీతం కూడా పొందవచ్చు.
షాపింగ్ – ఇవన్నీ కాకుండా మీకు అస్సలు ఆర్థిక ఇబ్బందులు లేవనుకుంటే అప్పుడు బోనస్ డబ్బులతో పండగ చేసుకోండి. ఫ్యామిలీని షాపింగ్‌కు తీసుకెళ్లండి. వారితో సరదాగా గడపండి. ఎప్పటి నుంచే కొని ఇవ్వాలనుకున్న గిఫ్ట్ ఏదైనా కావల్సిన వారికి కొని ఇవ్వవచ్చు.
దానం – దానం చేస్తే పుణ్యం దక్కుతుందంటారు కగా. కాబట్టి అవసరాల్లో ఉన్న వారికి ఈ బోనస్ డబ్బులో ఎంత కొంత ఇచ్చి ఆదుకోండి. లేదంటే స్వచ్ఛంద సంస్థలకు డొనేట్ చేయండి. అది కూడా వీలును బట్టి చేయాలని ఇబ్బంది పడే పరిస్థితి తెచ్చుకోకూడదని హెచ్చరిస్తున్నారు.