EPAPER

PM Modi ASEAN SUMMIT: ‘వ్యాపారమే కాదు ఆర్థిక, సామాజిక అవసరాల్లో సహకారం కావాలి’.. ఆసియా దేశాలతో ప్రధాని మోదీ

PM Modi ASEAN SUMMIT: ‘వ్యాపారమే కాదు ఆర్థిక, సామాజిక అవసరాల్లో సహకారం కావాలి’.. ఆసియా దేశాలతో ప్రధాని మోదీ

PM Modi ASEAN SUMMIT| ఆసియా ఖండం కేంద్రంగా అంతర్జాతీయ రాజకీయం వేడెక్కుతోంది. యూరప్, మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు ఊపందుకుంటుంటే… ఆసియాన్ దేశాలు అప్రమత్తంగా ఉండాలని తాజాగా మోడీ పిలుపునిచ్చారు.తాజాగా, లావోస్‌లో జరిగిన 21వ ఆసియాన్-ఇండియా సమ్మిట్‌‌లో జరిగిన చర్చ అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యింది. ఆసియాన్ మీట్‌లో చైనా ప్రస్తావన పదే పదే వచ్చింది. ఈ వేదికపై చైనాను కట్టడిచేసే విధంగా మోడీ పావులు కదిపారు. ఆసియాన్ దేశాలతో కలసి పలు తీర్మానాలు చేసుకున్నారు. చైనాకు చెక్ పెట్టే దిశగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. భారత్‌, ఆసియాన్ దేశాల మధ్య ఒడంబడికలు మరింత బలోపేతం చేయడానికి అవసరమైన అన్ని వ్యూహాలు ఈ వేదికపై అమలు చేశారు. ఇంతకీ, ఈ సమ్మిట్‌లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఇందులో, చైనాను ఇరుకునపెట్టే అంశాలేంటీ…?


ఏ దేశమైన తన సమగ్రతను కాపాడుకోవాలని చూస్తుంది. దానికి అపాయం ఏర్పడుతున్నప్పుడు ముందుగా పొరుగునున్న దేశాలతో వ్యూహాత్మక సంబంధాలను తెలివిగా బలోపేతం చేసుకోవాలి. శత్రువుకి తెలియకుండానే చుట్టుపక్కల ప్రాంతాల్లో వల పన్నాలి. అయితే, ఇదంతా పొరుగు దేశాలకు ఉన్న విశ్వాసం ఆధారంగానే జరుగుతుంది. కేవలం, దేశాల మధ్య వ్యాపారం మాత్రమే బంధాన్ని బలోపేతం చేయదు. ఒక దేశ సార్వభౌమత్యాన్ని ఇతరులు గౌరవించినపుడు… సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక అవసరాల్లో ఇచ్చిపుచ్చుకునే వెసులబాటు ఉన్నప్పుడు… రాజకీయ సంబంధాలు మెరుగ్గా ఉన్నప్పుడు మాత్రమే ఇదంతా సాధ్యమవుతుంది. సరిగ్గా, ఇలాంటి వ్యూహమే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరుగుతోంది. అక్టోబర్ 10న లావోస్‌లో నిర్వహించిన 21వ ఆసియాన్-ఇండియా సమ్మిట్‌లో భారత ప్రధాని మోడీ ప్రభావవంతమైన పాత్ర పోషించారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న భారత పరపతిని ఏ మాత్రం తగ్గనీయకుండా మాట్లాడారు. యావత్ ఆసియా తరఫున మోడీ శాంతి సందేశానికి వకాల్తా తీసుకున్నారు. ఈ యుగం యుద్ధాలది కాదు అని చెప్పిన పిలుపుకు తగ్గట్లే ఆసియాన్ దేశాల మధ్య శాంతి అవసరాన్ని ఎత్తి చూపారు. అలాగే, చైనా దుందుడుకు చర్యలను కూడా ప్రస్తావించారు. బెదిరింపుల ద్వారా శాంతిని సాధించలేమనీ… సౌత్ ఈస్ట్ ఏషియాలో చైనా చర్యలను కట్టడి చేయడానికి వ్యూహం పన్నారు.

Also Read: దేశ రాజకీయాల్లో జగన్ చిచ్చు.. పేపర్ బ్యాలెట్ ఎన్నికల పాట పాడుతున్న వైసీపీ


ఇండియా-ఆసియాన్ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వం వహించారు. ఆసియాన్ దేశాలతో వ్యాపారానికి అత్యంత కీలకంగా ఉన్న ఇండో-ఫసిఫిక్ సముద్ర సమస్యలపై ఈ సమ్మిట్‌లో చర్చలు జరిగాయి. ఇండో-ఫసిఫిక్ సముద్రంలో పెరుగుతున్న చైనా పట్టు కోసం ప్రయత్నించడాన్ని భారత్‌తో పాటు అమెరికా కూడా తీవ్రమైన సమస్యగా పేర్కొంది. అందుకే ఈ సమ్మిట్‌లో, ఆసియాన్ దేశాలతో పాటు భారత్ ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, భద్రత, సముద్ర భద్రత, నావిగేషన్ స్వేచ్ఛ, ఓవర్‌ఫ్లైట్‌ను నిర్వహించడం, ప్రోత్సహించడం వెనుక ప్రాముఖ్యతను సమగ్రంగా చర్చించినట్లు తెలుస్తోంది. దీని కోసం, 1982 యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ వంటి అంతర్జాతీయ సంఘాల ప్రమాణాలు, సిఫార్సుల ప్రకారం నడవాలని తీర్మానించారు. అంతేగాక, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా… ప్రపంచమంతా గుర్తించిన సూత్రాలపై ఆధారపడి… అవరోధం లేని, చట్టబద్ధమైన సముద్ర వాణిజ్యాన్ని ఆమోదించాలని కోరారు. అలాగే, వివాదాలు లేకుండా ఆసియా దేశాల మధ్య శాంతియుత పరిష్కారాలను ప్రోత్సహించాలని ఈ సమ్మిట్‌లో పిలుపునిచ్చారు.

ఇక, సౌత్ చైనా సముద్రంలో ఆసియాన్ దేశాల కార్యకలాపాలపై ప్రభావవంతమైన చర్యల అమలుకు మద్దతు ఇస్తున్నట్లు ఈ సమ్మిట్‌లో తీర్మానం చేశారు. అలాగే, దక్షిణాదిలో సమర్థవంతమైన, వాస్తవిక ప్రవర్తనా నియమావళికి సంబంధించి, అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా చర్యలు తీసుకునే దిశగా ఆసియాన్-ఇండియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై సంయుక్త ప్రకటన చేశాయి. మల్టీ యాంగిల్ గ్లోబల్ ఆర్కిటెక్చర్‌తో పాటు ప్రపంచంలో పెరుగుతున్న భారత్ పాత్రను ఈ సమ్మిట్ రూఢీ చేసింది. ఐక్యరాజ్య సమితి చార్టర్‌లో పొందుపరిచిన ప్రయోజనాలు, అంతర్జాతీయ చట్టాన్ని గౌరవించడంలో తమ నిబద్ధతను భారత్ పునరుద్ఘాటించింది. ప్రధాన అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ వ్యవహారాల్లో ఇండియా-ఆసియాన్ దేశాల పాత్ర కీలకంగా ఉండే విధంగా నిర్ణయాలు తీసుకోడానికి మోడీ పిలుపునిచ్చారు.

సముద్ర భద్రత, ఉగ్రవాద వ్యతిరేకత, సైబర్‌ భద్రత, సైనిక వైద్యం, అంతర్జాతీయ నేరాలు, డిఫెన్స్ ఇండస్ట్రీ, మానవతా సహాయం, విపత్తు ఉపశమనం, శాంతి పరిరక్షణ, మందుపాతర తొలగింపు కార్యకలాపాలు వంటి విశ్వాసాన్ని పెంపొందించే చర్యలలో సహకారాన్ని బలోపేతం చేయడానికి అన్ని దేశాలు అంగీకరించే విధంగా మోడీ ఒప్పందాలను రూపొందించారు. ఇందులో భాగంగా… అన్ని దేశాల మధ్య సందర్శనల మార్పిడి, ఉమ్మడి సైనిక వ్యాయామాలు, సముద్ర వ్యాయామాలు, నౌకాదళాల మధ్య పోర్ట్ కాల్స్, డిఫెన్స్ స్కాలర్‌షిప్‌ల వంటి సహకారానికి సంబంధించి సంయుక్త ప్రకటనలు చేయించారు. అలాగే, ఐక్యరాజ్య సమితి బహుపాక్షిక సంబంధాన్ని బలోపేతం చేయడానికి, ప్రపంచ ఆందోళనలను పరిష్కరించడానికి, భాగస్వామ్య లక్ష్యాలను కొనసాగించడానికి, ఆసియాన్ దేశాల ప్రజల ప్రయోజనం కోసం స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడం కోసం పలు ప్రక్రియలను ప్రోత్సహించడానికి కూడా ఈ సమ్మిట్‌లో నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే, ప్రస్తుత గ్లోబల్ ట్రేడింగ్ పద్ధతులకు అనుగుణంగా, పరస్పర ప్రయోజనకరమైన ఏర్పాట్లను ప్రోత్సహించడానికి ఆసియాన్-ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ ఒప్పందం సమీక్షను వేగవంతం చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా, ఆసియాన్-ఇండియా మధ్య ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయాలని అనుకున్నారు.

ఇక, సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడానికి పరస్పర ఆసక్తి ఉన్న రంగాలకు సంబంధించి సరఫరా గొలుసుల్లో సంభావ్య ప్రమాదాలను గుర్తించడం, వాటిని ముందస్తుగా పరిష్కరించడంపై సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. అలాగే, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, ప్రజారోగ్య అత్యవసర సంసిద్ధత, ఆరోగ్య సంరక్షణ నిపుణుల శిక్షణ, వైద్య సాంకేతికత, ఫార్మాస్యూటికల్స్, టీకా భద్రత, స్వీయ-అంతర్గత రంగాలలో సహా ప్రజారోగ్యంపై సహకారాన్ని మెరుగుపరచడం ద్వారా ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. ఇక, ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ ఆర్థిక నిర్మాణం, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులతో సహా బహుపాక్షిక గ్లోబల్ గవర్నెన్స్ ఆర్కిటెక్చర్‌కు సంబంధించి బహుపాక్షికతను బలోపేతం చేయడం, సమగ్ర సంస్కరణల ప్రాముఖ్యతను కూడా ఈ సమ్మిట్‌లో నొక్కి చెప్పారు. దీనితో, చైనా మినహా భారత్, ఇతర ఆసియాన్ దేశాలకు మరింత దగ్గరయ్యింది. గతంలో చైనా-ఆసియాన్ సమ్మిట్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నడుచుకున్న వ్యాపారాత్మక తీరు కంటే భిన్నంగా మోడీ ఈ సమ్మిట్‌ను లీడ్ చేశారు.

21వ శతాబ్ధాన్ని ఆసియా శతాబ్ధంగా భావిస్తున్నట్లు ప్రధాని మోడీ సమ్మిట్‌లో వ్యాఖ్యానించారు. ఈ శతాబ్దం ఆసియా దేశాలదే అని… ఆసియాన్ దేశాలైన మలేషియా, థాయ్‌లాండ్, బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, వియత్నాం, లావోస్, సింగపూర్ నేతలను ఉద్దేశించి మోడీ వ్యాఖ్యానించారు. ఇక, ఈ సమ్మిట్‌లో పాల్గొన్న యూఎస్ స్టేట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకన్ కూడా చైనా దుడుకు చర్యలను విమర్శించారు. సౌత్ ఈస్ట్ చైనా సముద్రాలపై పెరుగుతున్న చైనా చట్టవిరుద్ధమైన చర్యల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. చైనా చర్యలే ప్రజలకు ప్రమాదకరంగా మారాయనీ… ఎంతో మందిని గాయాలకు గురిచేసిందనీ… ఆసియాన్ దేశాల నుండి నౌకలకు హాని కలిగించిందని పేర్కొన్నారు. మయాన్మార్, తైవాన్ వంటి దేశాలను ఉద్దేశించి మాట్లాడుతూ… పలు వివాదాలకు శాంతియుత పరిష్కార కట్టుబాట్లకు విరుద్ధంగా చైనా చర్యలు ఉన్నాయని వెల్లడించారు. అయితే, చైనాకు చెక్ పెట్టే దిశగా మోడీ ఆసియాన్ దేశాలతో మరింత స్నేహాన్ని పెంపొందించడానికి పది సూత్రాల ప్రణాళికను ప్రకటించారు.

Related News

Sahara Desert Floods: ఎడారిలో వరదలు.. ఒక్కరోజులో 100mm భారీ వర్షంతో రికార్డ్!

Trump Biopic: థియేటర్లలోకి ‘ది అప్రెంటీస్’, ట్రంప్ కు ఎదురు దెబ్బ తప్పదా?

PM MODI East Asia Summit: ‘యుద్ధాలతో గ్లోబల్ సౌత్ దేశాలకు నష్టం ‘.. లావోస్ లో ప్రధాని మోదీ!

20 Killed in Balochistan: పాకిస్తాన్ లో దారుణం.. బొగ్గుగనిలో 20 మంది హత్య!

Israel Hits UN Base: లెబనాన్ ఐరాస కేంద్రంపై దాడి చేసిన ఇజ్రాయెల్.. ఖండించిన ప్రపంచ దేశాలు

Naga Skull Auction: యూకేలో మనిషి పుర్రె వేలం.. భారత ప్రభుత్వం ఆగ్రహం

Big Stories

×