EPAPER

Land Fraud: అక్రమాల పుట్ట ఇంకా అవసరమా? జూబ్లీహిల్స్ సొసైటీలో అక్రమాలెన్నో- ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్ స్టోరీ

Land Fraud: అక్రమాల పుట్ట ఇంకా అవసరమా? జూబ్లీహిల్స్ సొసైటీలో అక్రమాలెన్నో- ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్ స్టోరీ

– జూబ్లీహిల్స్ సొసైటీలో అక్రమాలెన్నో!
– ఖాళీ జాగాలతో సాగించిన దందాలెన్నో!
– కోట్లు వెనకేసుకున్న పాత, కొత్త కమిటీలు
– సొసైటీ మాటున సైలెంట్ దందాలు
– చేతులు మారిన వందల కోట్లు
– దొడ్డిదారిన అధ్యక్షుడిగా రవీంద్రనాథ్
– పాత కమిటీ అధ్యక్షుడు నరేంద్ర చౌదరి దారిలోనే అక్రమార్జన
– నాగేందర్ ప్రసాద్‌కు ఓ రూల్.. రవీంద్ర నాథ్‌కో రూలా?
– సభ్యుల తొలగింపు వెనుక రూ.200 కోట్ల అవినీతి
– చిరంజీవికి స్థలం కేటాయించడం వెనుక రూ.17.85 కోట్ల స్కామ్
– ఇంకా రూ.వందల కోట్ల స్కాములు.. ఇష్టారాజ్యంగా సవరణలు
– అడ్డదారిలో డబ్బు వసూలు చేసి సంస్థలకు సభ్యత్వాలు
– రిజిస్ట్రార్ ఆఫ్ కో ఆపరేటివ్ సొసైటీ కమిషనర్‌కు సభ్యుల ఫిర్యాదు
– బడాబాబుల నీడలోని ప్రభుత్వ స్థలాలను హైడ్రా కాపాడుతుందా?
– జూబ్లీహిల్స్ సొసైటీపై స్వేచ్ఛ ఎక్స్‌క్లూజివ్ స్టోరీ – పార్ట్ 3


దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809

స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో అక్రమాలకు లెక్కేలేదు. తవ్వేకొద్దీ ఇక్కడ కబ్జాల బాగోతాలెన్నో బయటకు వస్తూనే ఉంటాయి. అక్రమంగా వందల కోట్ల రూపాయలు చేతులు మారిన లింకులు కనిపిస్తాయి. ఆఖరికి ప్రభుత్వ భూములు, పార్క్ స్థలాలను సైతం కబ్జా పెట్టిన తీరు చూస్తే ఇదేం కమిటీ అని అనిపించక మానదు. అసలిది ఇన్నాళ్లుగా ఎలా కొనసాగుతోంది అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇదే క్రమంలో కమిటీ సభ్యులు రిజిస్ట్రార్ ఆఫ్ కో ఆపరేటివ్ సొసైటీ కమిషనర్‌కు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఇందులో అనేక అక్రమాలను ప్రస్తావించారు సభ్యులు.


Also Read: జూబ్లీహిల్స్‌లో బయటపడ్డ మరో భారీ బాగోతం.. 36 ఏండ్ల నుంచి..

చేతులు మారిన వందల కోట్లు

జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ 1962లో ఏర్పడగా, తర్వాత అందులో ప్లాట్ల కేటాయింపును పూర్తిచేసి, రోడ్లు, ఖాళీ ప్రదేశాలను జీహెచ్ఎంసీకి అప్పగించారు. 1991లో దీనికి సంబంధించిన ఫైనల్ లేఅవుట్‌ను జీహెచ్ఎంసీ నుంచి పొందారు. వాస్తవానికి ఆ తర్వాత ఈ సొసైటీ కొనసాగాల్సిన అవసరమే లేదు. కానీ, అలాగే కొనసాగుతూ రావటంతో కొందరు వ్యక్తులు అనేక ఆర్థిక, విధానపరమైన అక్రమాలకు పాల్పడుతూ వచ్చారు. నాటి నుంచి ఇందులో జరిగిన అనేక అక్రమాలపై పలు విచారణలు, విజిలెన్స్ నివేదికలు, సీఐడీ విచారణలు, కోర్టు ఆర్డర్లు వచ్చినా, మేనేజింగ్ కమిటీలోని వ్యక్తులు తమ రాజకీయ పలుకుబడితో, సొసైటీలో స్వార్థ ప్రయోజనాల కోసం నాడు వదిలేసిన బహిరంగ స్థలాలను, సొసైటీకి ఉన్న మిగులు భూములుగా చెబుతూ వాటిని ప్లాట్లుగా మార్చి, వందల కోట్లకు అమ్మి సొమ్ము చేసుకున్నారు. బ్లాక్ మనీ, మనీ లాండరింగ్ వంటి చర్యలకూ పాల్పడ్డారు. సొసైటీకి ఇప్పుడున్న కమిటీ 2021లో ఎన్నికైంది. అధ్యక్షుడు రవీంద్రనాథ్, మేనేజింగ్ కమిటీలోని వారి మద్దతు, మీడియా, రాజకీయ రంగాలలో తనకున్న పలుకుబడితో పాత కమిటీ అధ్యక్షుడు నరేంద్ర చౌదరి మాదిరిగానే అక్రమాలకు తెగబడుతున్నారు. అదేంటని అడిగిన సభ్యులను తీవ్రంగా బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలో సొసైటీకి చెందిన గత, ఇప్పటి కమిటీల కాలంలో జరిగిన, జరుగుతున్న పలు ఆర్థిక, పాలనా పరమైన అక్రమాల వివరాలను, ఆధారాలతో సహా కమిషనర్‌కు వివరించారు సభ్యులు. దీనిపై లోతైన విచారణ జరిపి ఈ అక్రమ వ్యవహారాల్లో చేతులు మారిన రూ.142. 81 కోట్ల అవినీతిని బయటికి తేవాలని కోరారు.

సభ్యుల తొలగింపు వెనుక 200 కోట్ల అవినీతి

ఇప్పుడున్న మేనేజ్‌మెంట్ కమిటీ, భారీగా డబ్బు కొట్టేసేందుకు సొసైటీలో 800 మందికి సభ్యత్వాన్ని ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు ఆ సభ్యులకు కొన్ని కండిషన్స్ పెట్టింది. సొసైటీలో కట్టబోయే పెద్ద అపార్ట్‌మెంట్ సముదాయంలోని రూ.2 కోట్ల విలువైన ఫ్లాట్‌ను ఒకటైనా కొనాలని తెలిపింది. విచిత్రమేంటంటే సొసైటీ స్థలంలో కట్టాలనుకుంటున్న ఆ భవనానికి జూబ్లీహిల్స్ సొసైటీకి ఏ సంబంధం లేదని చెప్పటమే గాక, కనీసం దాని నిర్మాణాన్ని కూడా బయటి వ్యక్తులే చేసేలా ప్లాన్ జరుగుతోంది. కొత్తగా 800 మందిని చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న కమిటీ, తమ అక్రమాలు బయటకుండా ఉండేందుకు అంతే సంఖ్యలో పాత సభ్యులను తొలగించేందుకు కుట్ర చేస్తోంది. కోఆపరేటివ్ సొసైటీ చట్టాన్ని ఉల్లంఘించి జనరల్ బాడీ మీటింగ్‌లో తీసుకుంటున్న అనేక నిర్ణయాలను తోసిపుచ్చుతూ ఇప్పటి సొసైటీ మేనేజింగ్ కమిటీ చేస్తున్న అనైతిక, అక్రమాలపై అనేక పత్రికలలో కథనాలు వచ్చాయి.

తప్పుడు మార్గాన అధ్యక్షుడిగా రవీంద్రనాథ్

గతంలో నాగేందర్ ప్రసాద్ అనే సభ్యుడు తన ప్లాటును బయటి వ్యక్తులకు అమ్ముకున్నాడు. అయితే, మేనేజింగ్ కమిటీ ఎన్నికలలో పోటీచేసి గెలిచాడు. దీనిపై పలువురు ఫిర్యాదు చేయగా, అరుణాదేవి గణేష్ అనే ఆఫీసర్ విచారణ జరిపి నాగేందర్ ప్రసాద్ సభ్యుడే కాదని, ఎన్నికలో పోటీ చేయటం అక్రమమని తేల్చారు. అయితే, ఇప్పటి అధ్యక్షుడు రవీంద్రనాథ్ కూడా తప్పుడు పద్దతిలోనే కమిటీకి అధ్యక్షుడయ్యారు. ఈయన తన ప్లాట్‌ను 2019 జనవరి 24న అమ్మేశారు. దీంతో ఆయన అదే రోజు సభ్యత్వాన్ని కోల్పోయినట్లే. కానీ, 2021 మార్చి 21న జరిగిన ఎన్నికల్లో పోటీచేసి ఏకంగా మేనేజింగ్ కమిటీకి అధ్యక్షుడైపోయారు. ఈ సొసైటీలో తన కంపెనీకి ప్లాట్ ఉంది కనుక టెక్నికల్‌గా తాను సభ్యుడినని ఆయన వాదిస్తున్నారు. ఈ అంశంపై అటు సొసైటీకి, కోఆపరేటివ్ శాఖ కమిషనర్‌కు, హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. దీనిపై జిల్లా కోఆపరేటివ్ శాఖ అధికారి ఒక నివేదికను సమర్పించనున్నట్లు కోర్టుకు తెలిపారు. నాగేందర్ ప్రసాద్ విషయంలో విచారణ చేపట్టిన ఆఫీసర్, సొసైటీలోని తమ ప్లాట్ అమ్ముకున్న వారు సభ్యత్వం కోల్పోతారని నివేదికలో స్పష్టంగా చెప్పారు. ఇదే నియమం అధ్యక్షుడైన రవీంద్రనాథ్‌కూ వర్తిస్తుంది. అయినా, ఆయన అడ్డదారిలో అధ్యక్షుడై, నాలుగేళ్లలో అనేక అక్రమాలకు పాల్పడ్డారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు, సొసైటీకి నష్టం వాటిల్లినందున తక్షణం అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: 111 జీవోలో.. ‘రాజ్’ దర్బార్, బావమరిది కళ్లలో ఆనందమే లక్ష్యం – జన్వాడలో కేటీఆర్ భూ జైత్రయాత్ర

అడ్డగోలుగా స్థలాల అమ్మకం

1. సొసైటీలోని 595 చదరపు గజాల ప్రభుత్వ స్థలాన్ని చిరంజీవికి అక్రమంగా అమ్మారు. దీని వెనుక రూ.17.85 కోట్ల స్కామ్ ఉంది. ఆఖరికి ఫిర్యాదుదారులను భయపెట్టి, వెనక్కి తీసుకునేలా చేశారు. ఈ అంశంపై విచారణ జరిపిన ఆఫీసర్ తన నివేదికలో 595 చదరపు గజాల స్థలం ప్రభుత్వానికి చెందినదని, జూబ్లీహిల్స్ సొసైటీ వెంటనే ఈ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని ఆదేశించారు. చిరంజీవి చెల్లించిన రూ.3.83 కోట్లను తిరిగి చెల్లించి, సేల్ డీడ్ క్యాన్సిల్ చేయమని సూచించారు. ఈ చర్య సభ్యులను మోసం చేయటమేనని, ఇది కోఆపరేటివ్ చట్టంలోని 83 బీ సెక్షన్ ప్రకారం శిక్షార్హమైన నేరమని తేల్చారు.

2. సొసైటీలోని 845 చదరపు గజాల ప్రభుత్వ స్థలాన్ని సుధారాణికి అక్రమంగా అమ్మారు. దీని వెనుక రూ.20 కోట్ల స్కామ్ జరిగింది. 2021 మార్చిలో ఎన్నికై బాధ్యతలు చేపట్టిన సొసైటీ మేనేజింగ్ కమిటీ, సొసైటీ పరిధిలోని 845 చదరపు గజాల ప్రభుత్వ స్థలాన్ని జీహెచ్ఎంసీ, సబ్ రిజిస్ట్రార్‌తో కుమ్మక్కై సుధారాణికి గజం రూ.60,000 చొప్పున రూ. 5,44,18,000కు అమ్మింది. అయితే, ఈ డబ్బు ప్రభుత్వానికి చేరాల్సి ఉండగా, చెక్ మాత్రం జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ పేరిట జారీ అయింది. ఇక్కడ చదరపు గజం రూ.3 లక్షలుంటుంది. ఈ లెక్కన ఈ భూమి విలువ రూ.25,35,00,000. ఈ అక్రమంపై 2022 నవంబరు 14న జీహెచ్ఎంసీ విజిలెన్స్ విభాగం నోటీసులు ఇచ్చింది.

3. సొసైటీలోని 461 చదరపు గజాల ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా అమ్మారు. రూ.10.86 కోట్ల స్కామ్ జరిగింది. జీహెచ్ఎంసీ, సబ్ రిజిస్ట్రార్‌తో కుమ్మక్కై సొసైటీ మేనేజింగ్ కమిటీ, సాంబశివరావు అనే వ్యక్తికి 461 చదరపు గజాల ప్రభుత్వ స్థలాన్ని, గజం రూ.60,000 లెక్కన రూ.2,96,88,400కి అమ్మకం జరిగింది. ఇక్కడా చెక్ ప్రభుత్వానికి కాకుండా జూబ్లీహిల్స్ ఖాతాలోనే జమ అయింది. ఇక్కడ గజం రూ.3 లక్షల లెక్కన మార్కెట్ విలువ రూ.13,83,00,000గా ఉంది. ఈ అక్రమంపై జీహెచ్ఎంసీ విజిలెన్స్ విభాగం నోటీసులు ఇచ్చింది.

4. సొసైటీలోని ప్లాట్ నెంబర్ 304జీ ని అక్రమంగా అమ్మేశారు. రూ.12.46 కోట్ల స్కామ్ జరిగింది. 1988, మార్చి 21న ఎంవీ నటరాజన్ అనే సభ్యుడికి 529 చదరపు గజాల ప్లాటును సొసైటీ కేటాయించినా, అతడి పేరున అది రిజిస్టర్ కాలేదు. ఆయన మరణం తర్వాత సభ్యత్వం ఎంఎన్ శంకర నారాయణన్‌కు 2019 మే 29న బదిలీ చేశారు. దీనిని 2024లో ఆయన పేరున రిజిస్టర్ చేశారు. అంటే, 36 ఏళ్ల నాడు కేటాయించిన ప్లాటును ఇన్నాళ్లూ సొసైటీ తన హయాంలోనే ఉంచుకుని, దీనిని శంకర నారాయణన్ అనే వ్యక్తికి అమ్మి ఒక్కరోజులో రూ.5 కోట్లు లబ్ధి పొందారు. కానీ, ఈ అమ్మకంతో సొసైటీ అధ్యక్షుడు రవీంద్ర నాథ్, ట్రెజరర్ నాగరాజు, మరో 13 మంది సభ్యులు, సొసైటీ ఏవో ప్రమీలా రాణి, సర్వేయర్ శ్రీనివాస్ రెడ్డి కుమ్మక్కై రూ.16 కోట్లను దుర్వినియోగం చేశారనే అనుమానాలున్నాయి.

Also Read: బూదాటి పాపం పండింది..! లెక్కలతో సహా ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్

ఇష్టారాజ్యంగా సవరణలు

కోఆపరేటవ్ సొసైటీ రిజిస్ట్రార్, కోర్టులు, ట్రైబ్యునల్స్ నిర్దేశించిన సొసైటీ నియమాలకు తూట్లు పొడుస్తున్నారు. అధ్యక్షుడు, సెక్రెటరీ, ట్రెజరర్ కలిసి ఇష్టారాజ్యంగా సవరణలు చేసి ప్లాట్లను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. కోఆపరేటవ్ సొసైటీ చట్టం ప్రకారం, ఒక ప్లాటుకు యజమానిగా ఒక వ్యక్తి మాత్రమే ఉండాలి. కానీ, మేనేజింగ్ కమిటీ ఈ రూల్‌ను పక్కనబెట్టి అడ్డదారిలో బయటి వ్యక్తుల నుంచి డబ్బు వసూలు చేసి, కొన్ని సంస్థలకు సొసైటీలో సభ్యత్వాన్ని కల్పించటం, తద్వారా వారికి క్లబ్ మెంబర్‌ షిప్ దక్కేలా చేస్తోంది. ఇది సొసైటీ నియమం 5, కోఆపరేటివ్ సొసైటీ సెక్షన్ 19కి వ్యతిరేకం.

రిజిస్టర్ చేసిన సంస్థలు ఇవే
ప్లాట్ నెంబర్ 1192 – సాన్‌హోక్ హాస్పిటాలిటీ ఎల్ఎల్‌పీ
ప్లాట్ నెంబర్ 1243 – స్వేతగిరి గ్రీన్ ల్యాండ్స్ ప్రై. లిమిటెడ్
ప్లాట్ నెంబర్ 1241 – బ్రహ్మపుత్ర గ్రీన్ ల్యాండ్స్ ప్రై. లిమిటెడ్
ప్లాట్ నెంబర్ 1230 – ప్రజాపతి ఆగ్రో అండ్ ఫామ్స్ ప్రై. లిమిటెడ్
ప్లాట్ నెంబర్ 103 – ఎన్ఎస్ఎన్ ఇన్వెస్ట్‌మెంట్స్

సొసైటీని మూసివేయాలి

సొసైటీ తరపున ప్రతినెలా ఒక మ్యాగజైన్‌ను ప్రచురిస్తున్నారు. అందులో మేనేజింగ్ కమిటీ గురించిన గొప్పలే ఉంటున్నాయి. 2023 – 24కు గానూ దీని ప్రచురణకు పెట్టిన ఖర్చు రూ.66,57,890 కాగా, దీని మీద వచ్చిన ఆదాయం మాత్రం రూ.13,74,873 మాత్రమే. 2019 ఆగస్టు 26న కమిషనర్, రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ, ఈ జూబ్లీహిల్స్ సొసైటీని మూసివేయాలని ఒక సర్కూలర్(ఆర్‌సీ నెం.2/353/2019/హెచ్‌ఆర్ – 2) జారీ చేసింది. ఏ లక్ష్యంతో ఈ సొసైటీలు ఏర్పడ్డాయో, అవి నెరవేరినందున, 60 ఏళ్లు పైబడిన ఈ తరహా సొసైటీల ద్వారా మనీలాండరింగ్ జరిగే అవకాశాలు లేకుండా చేసేందుకు వీటిని మూసివేయాలని అందులో ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ సొసైటీ మూసివేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.

Related News

Discrimination: జైళ్లను కూడా వదలని కుల వివక్ష

world mental health day: ప్రపంచ వ్యాప్తంగా మానసిక ఆరోగ్య సమస్యలున్నవారిలో.. భారత్‌లోనే అధికమంటా!

Haryana Congress: కాంగ్రెస్‌ను ఆదుకోలేకపోయిన జవాన్, కిసాన్, పహిల్వాన్.. బీజేపీకి కలిసొచ్చిన అంశాలివేనా?

AP Liquor shops: లిక్కర్ ఫికర్.. ఏపీలో మద్యం షాపు లైసెన్స్ టెండర్లు డీలా, 951 దుకాణాలకు దరఖాస్తులు నిల్

Kolagatla Veerabhadra Swamy: కూతురు కోసం పాట్లు.. జనసేన వైపు కోలగట్ల చూపు? అప్పుడు తిట్లు, ఇప్పుడు పవన్ జపం

Damagundam Forest: అన్నింటికీ ఆలవాలమైన దామగుండాన్ని కాపాడుకుందాం

Big Stories

×