EPAPER

Discrimination: జైళ్లను కూడా వదలని కుల వివక్ష

Discrimination: జైళ్లను కూడా వదలని కుల వివక్ష

Caste based discrimination in Jails: ఆధారంగా మనుషులపై వివక్ష చూపడం అనే సామాజిక నేరం దేశంలో శతాబ్దాలుగా కొనసాగుతోంది. ఆధునిక యుగంలోనూ సమాజంలో కుల వివక్ష కనిపిస్తోంది. ఆఖరికి ఖైదీలను సంస్కరించడానికి ఉద్దేశించిన జైళ్లలోనూ కుల వివక్ష తప్పడం లేదు. కింది కులాల ఖైదీలకు కష్టమైన పనులు అప్పగించడం, వేరే వార్డులు కేటాయించడం, వారిపై దాడులు, హింస సర్వసాధారణంగా మారిపోయింది. ఈ పరిణామంపై తాజాగా, దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. కుల ఆధారంగా ఖైదీలపై వివక్ష చూపడడం తగదని తేల్చిచెప్పింది. కారాగారాల్లో ఖైదీలందరినీ సమానంగా చూడాలని ఆదేశించింది. వివిధ రాష్ట్రాల్లోని కారాగారాల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, కులం ఆధారంగా ఖైదీలపై వివక్ష చూపుతున్నారని పేర్కొంటూ మహారాష్ట్రలోని కల్యాణ్‌ ప్రాంతానికి చెందిన జర్నలిస్టు సుకన్య శాంత సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిట్‌) దాఖలు చేశారు. స్టేట్‌ ప్రిజన్‌ మాన్యువల్‌ నిబంధనలను పిటిషనర్‌ సవాలు చేశారు. ఈ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్‌ జేపీ పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది.


Also Read: ప్రపంచ వ్యాప్తంగా మానసిక ఆరోగ్య సమస్యలున్నవారిలో.. భారత్‌లోనే అధికమంటా!

ఖైదీలను కులం ఆధారంగా విభజిస్తున్న మాన్యువల్‌లోని నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. మూడు నెలల్లోగా నిబంధనల్లో సవరణలు చేయాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. ఖైదీలపై వివక్షను అంతం చేసేలా అన్ని రాష్ట్రాలూ జైలు మాన్యువల్‌ నిబంధనలు మార్చాల్సిందేనని తేల్చిచెప్పింది. జైళ్లలో చోటుచేసుకున్న కుల వివక్ష ఘటనలను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. మూడు నెలల తర్వాత వీటిని ‘విచారించాల్సిన కేసుల జాబితా’లో చేర్చాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. తమ తీర్పుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ నివేదిక సమర్పించాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. నిర్బంధంలో ఉన్నవారికి సైతం గౌరవంగా జీవించే హక్కు ఉందని ధర్మాసనం ఉద్ఘాటించింది. మానవులంతా సమానంగా జన్మించారని ఆర్టికల్‌ 17 చెబుతున్నట్లు గుర్తుచేసింది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌లో జైలు మాన్యువల్‌ నిబంధనలు మార్చాలని స్పష్టంచేసింది.


‘జైలు మాన్యువల్‌లో కులం కాలమ్‌ అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. కింది కులాల ఖైదీలతో మరుగుదొడ్లు కడిగించడం, సెప్టిక్ ట్యాంక్‌లు శుభ్రం చేయించడం వంటి పనులు, అగ్ర కులాల ఖైదీలకు సులభమైన వంట పనులు అప్పగించడం ముమ్మాటికీ వివక్షే అవుతుందని, ఈ నిర్ణయం రాజ్యాంగంలోని 15వ ఆర్టికల్‌ను ఉల్లంఘించడమే అవుతుందని, ఇది అంటరానితనం తప్ప మరొకటి కాదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. కులాల ప్రాతిపదికన ఖైదీలకు గదులు కేటాయించటం, ఒకే కులం వారిని ఒకే చోట ఉంచటం వంటివన్నీ వారి ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించడమేనని, నాటి వలసవాద వ్యవస్థకు చిహ్నాలని పేర్కొంది. పని విషయంలో అందరికీ సమాన హక్కు ఉండాలని సుప్రీంకోర్టు తీన తీర్పులో వెల్లడించింది. ధర్మాసనం తరపున ఈ తీర్పును రాసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్.. ఈ తీర్పునిచ్చే క్రమంలో మాట్లాడుతూ వివిధ జైలు మాన్యువల్స్‌లోని అనేక నిబంధనలు ఆర్టికల్ 21 మరియు ఆర్టికల్ 23 స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని, ఇవి ఖైదీల హక్కులను హరించటమేగాక, కొన్ని వర్గాలను నిర్దిష్ట శ్రమలకే పరిమితం చేస్తున్నాయని అన్నారు.

Also Read: అన్నింటికీ ఆలవాలమైన దామగుండాన్ని కాపాడుకుందాం

పౌరులంతా సమానమేనంటూ రాజ్యాంగం రాసుకొని దశాబ్దాలైనా కులం అనేది కారాగారాల్లో ప్రభుత్వ పర్యవేక్షణలోనే వ్యవస్థీకృతం కావటంపై సుప్రీం చేసిన వ్యాఖ్యలను ప్రజాస్వామ్యవాదులంతా ఆహ్వానించారు. ఈ అనాగరిక విధానానికి చెక్ పెట్టాలని, సర్వోన్నత న్యాయస్థానం అన్ని రాష్ట్రాలకూ, కేంద్రానికీ సూచిస్తూ, మూడు నెలల్లోగా జైలు మాన్యువల్స్‌లో మార్పులు తేవాలని తాఖీదునివ్వడం, జైలు గోడల మధ్య జరిగే కుల వివక్షను, విచారణకు అర్హమైన కేసుగా పరిగణించాలని కోర్టులకు, అధికార యంత్రాంగానికి సూచించడం నిజంగా మంచి పరిణామం. ఇది జైళ్లలోని ప్రస్తుత పరిస్థితులను మార్చటానికి, ఖైదీలనందరినీ సమానంగా చూడటానికి దోహదపడుతుందనే నమ్మకం కలుగుతోంది. కాస్త ఆలస్యంగానైనా, ఈ వివక్షాపూరిత నిబంధనల్ని కొనసాగించడం సమాజాన్ని వెనక్కి నడిపించడమేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించటమే గాక ఆ తప్పును సరిచేయటానికి వెంటనే ఆదేశాలివ్వటం ఆహ్వానించాల్సిన విషయం.

– విలేకరి రాజు

Related News

Land Fraud: అక్రమాల పుట్ట ఇంకా అవసరమా? జూబ్లీహిల్స్ సొసైటీలో అక్రమాలెన్నో- ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్ స్టోరీ

world mental health day: ప్రపంచ వ్యాప్తంగా మానసిక ఆరోగ్య సమస్యలున్నవారిలో.. భారత్‌లోనే అధికమంటా!

Haryana Congress: కాంగ్రెస్‌ను ఆదుకోలేకపోయిన జవాన్, కిసాన్, పహిల్వాన్.. బీజేపీకి కలిసొచ్చిన అంశాలివేనా?

AP Liquor shops: లిక్కర్ ఫికర్.. ఏపీలో మద్యం షాపు లైసెన్స్ టెండర్లు డీలా, 951 దుకాణాలకు దరఖాస్తులు నిల్

Kolagatla Veerabhadra Swamy: కూతురు కోసం పాట్లు.. జనసేన వైపు కోలగట్ల చూపు? అప్పుడు తిట్లు, ఇప్పుడు పవన్ జపం

Damagundam Forest: అన్నింటికీ ఆలవాలమైన దామగుండాన్ని కాపాడుకుందాం

Big Stories

×