EPAPER

Jammu and Kashmir: కాశ్మీర్‌లో ఓటమి.. బీజేపీ ఆ మాట నెలబెట్టుకుంటుందా? కాంగ్రెస్ గెలిచినా.. ఆ నిర్ణయం మోడీదే!

Jammu and Kashmir: కాశ్మీర్‌లో ఓటమి.. బీజేపీ ఆ మాట నెలబెట్టుకుంటుందా? కాంగ్రెస్ గెలిచినా.. ఆ నిర్ణయం మోడీదే!

పది సంవత్సరాల సుదీర్ఘ ఎదురు చూపుల తర్వాత జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. ప్రజలంతా పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొని, తమ నిర్ణయాన్ని వెల్లడించారు. గతంతో పోలిస్తే పెద్దగా మార్పుల్లేని ఫలితాల్లో జమ్మూ కాశ్మీర్‌‌లో కాంగ్రెస్ పొత్తుతో నేషనల్ కాన్ఫిరెన్స్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక, బీజేపీ కాస్త ఎక్కువ ఆశించినప్పటికీ అనుకున్నట్లే జమ్మూలో ఉనికి చాటుకుంది. అయితే, ఎన్నికలకు ముందు ఈ రెండు పార్టీలూ ఇచ్చిన హామీ ఒక్కటే… ఎన్నికల తర్వాత జమ్మూ కశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా ఇస్తామూ అని! మరి, ఈ హామీ నెరవేరుతుందా? జమ్ముకాశ్మీర్‌కు ఇప్పట్లో రాష్ట్ర హోదా సాధ్యమా?


పాకిస్థాన్ బూచికి చిక్కకుండా.. 

బీజేపీ రాజకీయాల్లో జమ్మూ కాశ్మీర్‌కు ఒక ప్రత్యేక స్థానం ఎప్పుడూ ఉంటుంది. పదేళ్లు భారతదేశాన్ని పాలించి, మూడో సారి కూడా కేంద్రంలో పవర్‌ సాధించిన బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ కాశ్మీర్‌‌పై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. ఇలా ఎందుకు అనే ప్రశ్నకు అనేక వాదనలు ఉన్నాయి. అయితే, బీజేపీ చెప్పేది మాత్రం ఆ ప్రాంతంపై పాకిస్థాన్ హస్తం పడకుండా చేయడం కోసమేననీ, అక్కడి తీవ్రవాదాన్ని అంతం చేయడానికే అని చెబుతోంది. అందుకే ఆర్టికల్ 370 రద్దు చేసినట్లు వెల్లడించింది.


భవిష్యత్తు ఏమిటీ? 

కాశ్మీర్ రీఆర్గనైజేషన్ చట్టాలు అన్నీ అందులో భాగంగానే చెబుతారు. మొత్తానికి ఎన్నికల ముందే కేంద్ర ప్రభుత్వం అన్ని సర్దుబాట్లూ చేసింది. జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ సీట్ల కేటాయింపులు, లెఫ్టినెంట్ గవర్నర్లకు పెంచిన అధికారాలతో బీజేపీ వ్యూహం పకడ్బంధీగా ఉంది. సుప్రీం కోర్టు ప్రమేయంతో జరిగిన ఎన్నికల్లో గెలుపు తమదంటే, తమదంటూ సవాళ్లు విసురుకున్న పార్టీలకు ఓటర్లు తమ తీర్పును చెప్పారు. ఇప్పుడున్న ప్రశ్నల్లా… జమ్మూ కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా దక్కుతుందా..? లేదంటే, కేంద్ర పాలిత ప్రాంతంగానే కొనసాగుతుందా? అని.

ముఖ్యమంత్రిగా ఒమర్, కానీ.. 

ఎప్పటిలాగే ఫలితాల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. జమ్మూలో బీజేపీ తన ఉనికిని చూపించగా… కాశ్మీర్ వ్యాలీలో నేషనల్ కాన్ఫిరెన్స్ ప్రభావం కొనసాగింది. గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న మరో ప్రాంతీయ పార్టీ పీడీపీకి చుక్కెదురయ్యింది. ఎగ్జిట్ పోల్స్‌లో చెప్పినట్లు హంగ్ ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశమే లేదు. కాంగ్రెస్‌తో కలిసిన నేషనల్ కాన్ఫిరెన్స్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఒమర్ అబ్ధుల్లా ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

మళ్లీ రాష్ట్ర హోదా ఇస్తారా? 

అయితే, ఎన్నికలకు ముందు అటు ఒమర్… ఇటు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇద్దరి హామీల్లో కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇవ్వడం ప్రధానాంశంగా ఉంది. బీజేపీ అయితే ఎన్నికల ప్రచారంలో ఇంకాస్త ముందుకెళ్లి, బీజేపీ గెలిస్తే పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను కూడా భారత్‌ తిరిగి సొంతం చేసుకుంటుందని ప్రకటించారు. ఇప్పుడు, ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ఈ సంగతి పక్కన పెడితే… బీజేపీ చెప్పినట్లు జమ్ము కాశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా ఇస్తారా లేదా అన్నదే ఇక్కడ ప్రశ్న.

మోడీని కలుస్తారా?

ఒమర్ అబ్ధుల్లా కూడా, ఎన్నికల గెలుపు తర్వాత మాట్లాడుతూ… రాష్ట్ర హోదా ఇవ్వాలనే తీర్మానాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి సమర్పిస్తామని అన్నారు. ఇందులో భాగంగానే నియోజవర్గాల పునర్విభజన, ఎన్నికలు, రాష్ట్ర హోదా వరుసుగా జరుగుతాయని అన్నారు. అయితే, ఎన్నికల మూడ్‌లో ఉన్నప్పుడు కొందరు నేతలు జమ్మూ కశ్మీర్‌ను భారత రాజధాని ఢిల్లీతో పోల్చుతూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై, ఒమర్ అబ్ధుల్లా ఘాటుగా స్పందించారు.

ఢిల్లీ వేరు, కాశ్మీర్ వేరు.. 

కాశ్మీర్‌ను ఢిల్లీతో పోల్చవద్దనీ… బీజేపీ పెద్దలే ఎన్నికల తర్వాత కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇస్తామని చెప్పినట్లు గుర్తు చేశారు. ఇక, 2019 వరకూ కాశ్మీర్ రాష్ట్రంగానే ఉందనీ… ఈ ప్రాంత ప్రజలకు తిరిగి రాష్ట్రాన్ని ఇవ్వడం కేంద్రం బాధ్యత అని అన్నారు. 2019లో జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అక్కడ రాష్ట్ర హోదా రద్దయ్యింది. జమ్మూ కశ్మీర్‌ను రెండుగా చీల్చి, లద్ధాక్, జమ్మూ కశ్మీర్‌లను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చారు. అప్పటి నుండీ కాశ్మీర్ ఎన్నికలపై కాలయాపన జరుగుతూనే ఉంది.

అమిత్ షా హామీ.. ఒమర్ శపథం

ఇప్పుడు, ఎన్నికలు జరిగాయి. అయితే, ఈ ఎన్నికల ప్రచారంలో పలుసార్లు కేంద్ర మంత్రి అమిత్ షా.. ఎన్నికల తర్వాత జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇస్తామని అన్నారు. హోం మంత్రి అమిత్ షా చెప్పినట్లు జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇస్తామని చెప్పినప్పటికీ… ఎప్పుడు ఇస్తామన్నది మాత్రం స్పష్టంగా చెప్పలేదు. సమయం వచ్చినప్పుడు యూటీ నుండి రాష్ట్రంగా చేస్తామని అన్నారు. నిజానికి, 2019లో కశ్మీర్ రాష్ట్ర హోదాని రద్దు చేసి, కేంద్ర పాలిత ప్రాంతంగా చేసినప్పడు ఒమర్ అబ్ధుల్లా ఒక శపథం చేశారు. కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నంత వరకూ జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో అడుగుపెట్టనని అన్నారు.

పరిపాలన సాగాల్సిందే.. 

అయితే, తాజా ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేసి, రెంటిలోనూ విజయం సాధించారు. ఇక, ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా ఆయనే ఏర్పాటు చేయనున్నారు. మరి, రాష్ట్ర హోదా వచ్చినప్పడే అసెంబ్లీలో అడుగుపెడతానన్న అబ్ధుల్లా… కేంద్రం కశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇచ్చేవరకూ పరిపాలన కొనసాగించరా అంటే కాకపోవచ్చు. ఆయన మాటలను ప్రజలు మరో విధంగా అర్థం చేసుకోవాలి. గెలిస్తే త్వరగా తీసుకొస్తామనే ఆలోచనలో అబ్ధుల్లా ఆ శపథం చేసుండాలి. ఏది ఏమైనా, అమిత్ షా మాట మీద నిలబడతారా లేదా అన్నదే ఇప్పుడు తేలాల్సి ఉంది.

లద్దాక్ మినహా.. 

ఒకవేళ జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇస్తే… గతంలో ఉన్నట్లే అది లద్ధాక్‌తో కలిసి ఉంటుందా..? కాదు, ఉండదు. ఇది స్పష్టంగానే ఉంది. లద్ధాక్ ఇకపైన కూడా కేంద్ర పాలితంగా ఉంటుందన్నది స్పష్టం. ఎందుకంటే, ఆర్టికల్ 370తో ప్రత్యేక ప్రతిపత్తి గల జమ్మూ కశ్మీర్‌లో ఉన్న లద్ధాక్ మళ్లీ అందులో కలవడానికి ఆర్టికల్ 370 లాంటి పరిస్థితులు రానే రావు. ఇది కూడా అమిత్ షా గతంలోనే స్పష్టం చేశారు.

ఆ ఛాన్స్ ఇస్తారా? కాలాయాపన చేస్తారా? 

అమిత్ షా వ్యాఖ్యలను బట్టి, జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 అంశమనేది చరిత్రలో కలిసిపోయింది. ఎందుకంటే, దాని వల్లనే కశ్మీర్‌లో తీవ్రవాదం వేళ్లూనుకుంది. అందుకే, దాన్ని రద్దు చేసి, కాశ్మీర్‌ని శాంతికి, అభివృద్ధికి దగ్గర చేశాము అన్నది అమిత్ షా వ్యాఖ్యలకు అర్థం. అయితే, కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇచ్చి, తాజాగా గెలిచిన ఒమర్ అబ్ధుల్లా చేతికి పగ్గాలు ఇస్తే… మళ్లీ పాత పరిస్థితులే వస్తాయనే వాదన భవిష్యత్తులో బీజేపీ నేతలు తీసుకువస్తారా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే, రాష్ట్ర హోదా ఇచ్చేది మోడీ మాత్రమే అని చెప్పిన అమిత్ షా… దీన్ని ఒమర్ అబ్ధుల్లా ఖాతాలోకి చేరనిస్తారా అనేది సందేహం. అది అవ్వదమ్మా అంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.

Related News

Roja vs Syamala: రోజా ఏమయ్యారు? మీడియా ముందుకు రాలేక.. రికార్డెడ్ వీడియోలు, ఉనికి కోసం పాట్లు?

Land Fraud: అక్రమాల పుట్ట ఇంకా అవసరమా? జూబ్లీహిల్స్ సొసైటీలో అక్రమాలెన్నో- ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్ స్టోరీ

Discrimination: జైళ్లను కూడా వదలని కుల వివక్ష

world mental health day: ప్రపంచ వ్యాప్తంగా మానసిక ఆరోగ్య సమస్యలున్నవారిలో.. భారత్‌లోనే అధికమంటా!

Haryana Congress: కాంగ్రెస్‌ను ఆదుకోలేకపోయిన జవాన్, కిసాన్, పహిల్వాన్.. బీజేపీకి కలిసొచ్చిన అంశాలివేనా?

AP Liquor shops: లిక్కర్ ఫికర్.. ఏపీలో మద్యం షాపు లైసెన్స్ టెండర్లు డీలా, 951 దుకాణాలకు దరఖాస్తులు నిల్

Big Stories

×