EPAPER

Haryana Congress: కాంగ్రెస్‌ను ఆదుకోలేకపోయిన జవాన్, కిసాన్, పహిల్వాన్.. బీజేపీకి కలిసొచ్చిన అంశాలివేనా?

Haryana Congress: కాంగ్రెస్‌ను ఆదుకోలేకపోయిన జవాన్, కిసాన్, పహిల్వాన్.. బీజేపీకి కలిసొచ్చిన అంశాలివేనా?

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు బోర్లాపడ్డాయి. కాంగ్రెస్ కలలన్నీ నీరుగారిపోయాయి. హర్యానా ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైన గంటలోనే… అంటే, ఉదయం 9 గంటల ప్రాంతంలో, కాంగ్రెస్ పార్టీ బీజేపీ కంటే చాలా ముందుంది. మరో రాష్ట్రం మన చేతిలోకి వచ్చేసిదంటూ కాంగ్రెస్ వర్గాలు ఉత్సవాలకు ప్రిపేర్ అయిపోయారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జిలేబీలు, ఢోళాలతో సంబరాలు షురూ అయ్యాయి. పదులు సంఖ్యలో లీడ్స్ చూసి, ప్రభుత్వం తమదేనని ఫిక్స్ అయ్యారు. జవాన్, కిసాన్, పహిల్వాన్.. ఓట్లు తమకే అనుకున్నారు. కానీ.. కొన్ని గంటల్లోనే అంచనాలు తారుమారు అయ్యాయి. ఆశలన్నీ అడియాశలయ్యాయి.


డీలా పడ్డారు.. సంబరాలు చేసుకున్నారు

మరోవైపు, బిజేపీ కార్యాలయం బోసి పోయింది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లే పదేళ్లు పాలించిన హర్యానా చేజారిపోయిందని బీజేపీ వర్గాలన్నీ ఒక అంచనాకు వచ్చేశారు. సరిగ్గా, మరో గంట తర్వాత వాతావరణం అంతా రివర్స్ అయ్యింది. టీవీ స్క్రీన్లపై పట్టికలు మారుతూ కనిపించాయి. బీజేపీ మళ్లీ గేమ్‌లో నిలిచింది. ఆట అడ్డం తిరిగిన పరిస్థితులు వచ్చాయి. మరో రెండు గంటల తర్వాత, ఎగ్జిట్ పోల్ అంచనాలను భారీ తేడాతో మారుస్తూ హర్యానాలో బీజేపీ బలంగా ముందంజలోకి వచ్చింది. ఇప్పుడు లడ్డూలు, జిలేబీలు, సంబరాలతో బీజేపీ ప్రధాన కార్యాలయం దద్దరిల్లింది.


ఎర్లీ ట్రెండ్స్ తారుమారు

మొదట్లో అంచనా వేసిన స్క్రీన్‌ ప్లై మలుపు తిరిగింది. ఎర్లీ ట్రెండ్స్‌ తారుమారు కావడంతో కాంగ్రెస్ నేతలు ఖంగుతిన్నారు. ఆశించిన ఫలితాలు ఆమడ దూరం పరిగెత్తుతుంటే చేసేది లేక చూస్తూ ఉండిపోయారు. అప్పటికే చాలా రౌండ్ల లెక్కింపు మిగిలే ఉంది. కానీ, అప్పటికే సినిమా అందరికీ అర్థమయ్యింది. ఇక, ఈ చిత్రంలో పెద్దగా మార్పు ఏమీ ఉండదని తెలిసిపోయింది. 2019 ఎన్నికల్లో హర్యానాలో కాంగ్రెస్ 31 సీట్లు గెలుచుకుంది. అయితే, ప్రస్తుత ఫలితాల్లోనూ సంఖ్యలు దాదాపుగా అలాగే కనిపించాయి.

అంతర్గత పోరే కారణమా?

కాంగ్రెస్‌‌కు ఇలాంటి పరిస్థితి ఎదురుకావడానికి కొన్ని ముఖ్యమైన అంశాలు ప్రభావం చూపించాయి. అందులో అత్యంత ప్రభావం చూపించిన అంశం హర్యానా కాంగ్రెస్‌లో అంతర్గత పోరు. పార్టీలోని అంతర్గత పోరుకు కారణం ఆ పార్టీలోని అగ్రనేతలు అధికారం కోసం తహతహలాడడం. ఎన్నికలకు చాలా ముందు నుంచే కాంగ్రెస్ నేతలు విజయం తథ్యమని భావించి, ముఖ్యమంత్రి పదవి కోసం కసరత్తు ప్రారంభించారు. కాంగ్రెస్‌లో అనుభవజ్ఞుడైన భూపిందర్ సింగ్ హుడా, సీనియర్ నాయకురాలు కుమారి సెల్జా మధ్య అధికార పోరు బహిరంగంగా కనిపించింది. రెండు వర్గాల మధ్య కుమ్ములాటలతో కాంగ్రెస్ ఓట్లు చీలి ప్రత్యుర్థులకు అధికారం ఇచ్చాయి.

కొంప ముంచిన హుడా

ఎన్నికలకు ముందు రెండు వర్గాలను కలిపి, విజయాన్ని కట్టబెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం కష్టపడుతున్న తరుణంలోనే ఈ అంతర్గత విభేధాలు పీక్స్‌కెళ్లాయి. దిద్దుబాటు చర్యలకు దిగిన అధిష్టానం, అభ్యర్థులు, పొత్తులో సీట్లు నిర్ణయించడం వంటి అంశాల్లో హుడాకు స్వేచ్ఛ ఇచ్చారు. అయితే, ఇది మరింత అగ్గిని రాజేయడంతో అధిష్టానం అనుకున్న అంచనా తల్లకిందులయ్యింది. వచ్చిన ఫలితాలు చూస్తే ఇది పని చేయలేదని స్పష్టంగా అర్థమయ్యింది.

ఓట్ల షేర్‌లో స్వల్ప తేడా, కానీ..

ఇక, కాంగ్రెస్ ఓటమిలో మరో ప్రధాన అంశం… హర్యానాలోని ప్రాంతీయ శక్తులు, ఇండిపెండెంట్లు ప్రతిపక్షాన్ని మరింత కుదేలు చేయడం. ఓట్ల-షేర్‌లో కాంగ్రెస్ బిజెపి కంటే స్వల్పంగా ముందంజలో ఉన్నప్పటికీ, ఈ ఓట్లను సీట్లుగా మార్చడంలో కాంగ్రెస్ పెద్దగా విజయవంతం కాలేకపోయింది. ఫలితాల పోకడలు దాన్ని స్పష్టంగా చూపించాయి. చాలా స్థానాల్లో కాంగ్రెస్‌ ప్రత్యర్థుల ఆధిక్యం చాలా తక్కువగా ఉంది. ఈ కోణం నుండి చూస్తే… హర్యానాలో అధికార వ్యతిరేక ఓట్లను ప్రాంతీయ పార్టీలు, ఇండిపెండెంట్లు తినేశాయని అర్థమవుతుంది. సరిగ్గా, ఈ పరిస్థితి బిజెపికి ప్రయోజనం చేకూర్చింది.

అదే బీజేపీకి కలిసొచ్చిందా?

పోనీ, ప్రాంతీయ పార్టీలు గానీ, ఇండిపెండెంట్లు గానీ లాభపడ్డాయా అంటే, అవి కూడా విజయం సాధించలేకపోయాయి. ఫలితాలు దాదాపు ఖరారు అయ్యే సమయానికి.. ఐఎన్‌ఎల్‌డీ, బీఎస్‌పీ ఒక్కో స్థానంలో ఆధిక్యంలో ఉండగా, నలుగురు స్వతంత్రులు ఆధిక్యంలో ఉన్నారు. ఈ పరిస్థితి కచ్ఛితంగా బిజేపీకి లాభంగా మారింది. ఇక, హర్యానాలో జాట్ వ్యతిరేక ఏకీకరణ కూడా కాంగ్రెస్‌ ఓటమికి దారి తీసింది. హుడా నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ జాట్ ఓట్లపై దృష్టి సారించగా… బీజేపీకి అనుకూలంగా జాట్-యేతర ఓట్లు.. కౌంటర్ కన్సాలిడేషన్ వ్యూహాన్ని అమలు చేశాయి.

ఇది బీజేపీకి బాగా కలిసొచ్చినట్లు స్పష్టంగా కనిపించింది. ఎన్నికలకు ముందు, ‘జాట్‌ల ఆధిపత్యం’ అనే పదం హర్యానాలో మారు మోగింది. ఇది జాట్ వ్యతిరేక ఓటు బ్యాంక్ ఏకీకరణకు మార్గం వేసింది. అయితే, ఒక్క మాట చెప్పి తీరాలి. ఈ ఫలితాలతో రాష్ట్రంలో ప్రభావవంతమైన సామాజికవర్గ పునరాగమనం సాధ్యమయ్యింది. ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధించినప్పటికీ… బదులుగా, జాట్ వ్యతిరేక సంఘాలు అధికార పార్టీ బీజేపీకి అనుకూలంగా ఓటు వేసినట్లు తెలుస్తోంది.

చక్రం తిప్పిన ధర్మేంద్ర ప్రధాన్..

ఇక, రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న బీజేపీ బ్యాక్‌ గ్రౌండ్ వర్క్ కూడా కాంగ్రెస్‌కు ప్రతికూల ఫలితాలను తెచ్చిపెట్టింది. ఎన్నికల విశ్లేషకులు కొందరు హర్యానాలో బీజేపీని తప్పుపట్టినప్పటికీ, అన్నింటినీ ఎదుర్కుంటూనే మౌనంగా పని చేసుకుంటూ వెళ్లడం అధికార బీజేపీకి అనుకూలంగా మారింది. కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నేత ధర్మేంద్ర ప్రధాన్‌కు ఎన్నికల బాధ్యత అప్పగించడంతో పార్టీ ప్రచారం చాలా వ్యూహాత్మకంగా జరిగింది. ముఖ్యంగా కుమారి శైలజా అంశాన్ని బీజేపీ ఎన్నికల్లో ఎక్కువగా ప్రస్తావిస్తూ వచ్చింది.

కుమారి శెల్జాను పక్కన పెట్టండం

కుమారి శైల్జా కోరుకున్నప్పటికీ అసెంబ్లీ టిక్కెట్ రాకపోవడం, సన్నిహితులకు తక్కువ టిక్కెట్లు రావడంతో బీజేపీ దీన్ని అస్త్రంగా చేసుకుని ఎదురుదాడికి దిగింది. దళిత నేతలను కాంగ్రెస్ గౌరవించదన్న స్పష్టమైన సందేశం ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ విషయంపై స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి కౌంటర్‌గా రాజ్యాంగాన్ని మార్చే కథనాన్ని కాంగ్రెస్ ఎలా అమలు చేసిందో.. శెల్జా అంశాన్ని కూడా బీజేపీ తన కౌంటర్ కథనంగా ఉపయోగించుకుంది. దీంతో, బీజేపీ మళ్లీ ఒకసారి కాంగ్రెస్‌ నుంచి విజయాన్ని లాగేసుకుంది.

ఆత్మ పరిశీలన చేసుకోవల్సిందే..

హర్యానాలో కాంగ్రెస్‌కు గ్రామీణ ఓటు బ్యాంక్ ఆసరాగా నిలిచినా… పట్టణాల్లో బీజేపీ ఆధిపత్యం కొనసాగించింది. గత పదేళ్లలో, బీజేపీ, హర్యానాలోని గుర్గావ్, ఫరీదాబాద్ వంటి సీటీల్లో మద్దతును భారీగా కూడగట్టింది. అనుకున్నట్లే సీటీ ఓటును కొట్టేసింది. అయితే, కాంగ్రెస్‌కు గ్రామీణ ప్రాంతాల్లో మంచి మద్దతు లభించినప్పటికీ… గ్రామీణ సీట్లలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయలేకపోయింది. జవానులు, రైతులు, ఫహిల్వాన్‌లు అండగా ఉంటారని ఆశించినప్పటికీ అనుకున్నంత రాబట్టలేకపోయింది. ఇప్పుడు హర్యానాలో బీజేపీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యింది. ఇప్పుడు కాంగ్రెస్ ముందున్న దారి ఒక్కటే… హర్యానాలో తమకు ఉంటుందనుకున్న ప్రజా మద్దతును ఎందుకు ఓట్లుగా మార్చుకోలేకపోయారో ఆత్మపరిశీలన చేసుకోవడం.

Related News

AP Liquor shops: లిక్కర్ ఫికర్.. ఏపీలో మద్యం షాపు లైసెన్స్ టెండర్లు డీలా, 951 దుకాణాలకు దరఖాస్తులు నిల్

Kolagatla Veerabhadra Swamy: కూతురు కోసం పాట్లు.. జనసేన వైపు కోలగట్ల చూపు? అప్పుడు తిట్లు, ఇప్పుడు పవన్ జపం

Damagundam Forest: అన్నింటికీ ఆలవాలమైన దామగుండాన్ని కాపాడుకుందాం

BJP: విద్య కాషాయీకరణను ఆపుదాం..

Raj Pakala: 111 జీవోలో.. ‘రాజ్’ దర్బార్, బావమరిది కళ్లలో ఆనందమే లక్ష్యం – జన్వాడలో కేటీఆర్ భూ జైత్రయాత్ర

Nagendrababu Rajyasabha : ఫైనల్ డెసిషన్ కు వచ్చేసిన డిప్యూటీ సీఎం.. రాజ్య సభకు మెగా బ్రదర్?

Big Stories

×