EPAPER

YSRCP: ఆ నియోజక వర్గంలో వైసీపీ దుకాణం బంద్ ?

YSRCP: ఆ నియోజక వర్గంలో వైసీపీ దుకాణం బంద్ ?

Vizag West YSRCP Party Situation: విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ రాజకీయం ఆ పార్టీ వారికే అంతపట్టడం లేదంట. ఆ పార్టీలో ప్రతిసారి ఎమ్మెల్యే అభ్యర్ధి ఎవరనేది చివరి వరకు సస్పెన్సే ఎన్నికలకు ముందు ఒకరు. ఎన్నికల తర్వాత మరొకరు. ఎన్నికలకు రెండేళ్ల ముందు ఇంకొకరు. నియోజకవర్గ ఇన్చార్జిలుగా, ఎమ్మెల్యే అభ్యర్థులుగా తెరమీదకు వస్తారు. ఎన్నికల్లో సీటు అనౌన్స్ చేసి బి ఫాం ఇచ్చేవరకు పశ్చిమ నియోజకవర్గంలో ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరుంటారనేది క్లారిటీ ఉండదు. ఎంతోమంది నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. మొదటి నుండి ఉన్నవాళ్లు కూడా పార్టీ కోసం కోట్లు ఖర్చు చేసి కనుమరుగు అయిపోతూ ఉంటారు. అలా ఆ పార్టీ నుండి పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు రాజకీయ భవిష్యత్తు కూడా లేకుండా పోతున్నారు. అసలు విశాఖ వెస్ట్‌లో వైసీపీకి ఆ పరిస్థితి ఎందుకొచ్చింది?


విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసిపి నాయకులపై పగబట్టిందన్న అభిప్రాయం ఉంది. 15 ఏళ్లుగా గెలుపు కోసం ఎదురుచూస్తున్నా ఆ పార్టీకి అక్కడ విజయం అందరి ద్రాక్షగానే మిగిలిపోతుంది. 2014 ఎన్నికల నుంచి నేటివరకు విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీకి పీడకలగానే మిగిలింది. అంతేకాదు వైసిపి ఆవిర్భావం నుండి విశాఖపట్నం నియోజకవర్గంలో పోటీ చేసిన ఏ అభ్యర్థి కూడా భవిష్యత్తు రాజకీయాల్లో కనిపించకుండా కనుమరుగై పోతున్నారు. ఇన్నేళ్లుగా ఎంతోమంది నాయకులు విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఇన్చార్జిలుగా, ఎమ్మెల్యే అభ్యర్థులుగా బాధ్యతలు తీసుకుని ఎన్నికల్లో పోటీ తర్వాత కనిపించకుండా పోతున్నారు. ఇప్పుడు వరకు వైసిపి నుండి పోటీ చేసిన ఏ నాయకుడు ప్రస్తుత రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించడం లేదు. నియోజకవర్గ ఇన్చార్జిలుగా బాధ్యతలు నిర్వహించిన ఎవరూ కూడా పొలిటికల్ స్క్రీన్‌పై కనిపించడం లేదు. వైసిపి నాయకులపై పశ్చిమ నియోజకవర్గం పగబట్టింది అనే మాట విశాఖలో ఎవరి నోట విన్నా వినిపిస్తూనే ఉంటుంది.

2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి ఎంట్రీ ఇచ్చిన వ్యాపారవేత్త మళ్ళ విజయప్రసాద్ 4,300 ఓట్ల మెజారిటీతో ప్రస్తుత విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబుపై నెగ్గారు. 2009లో వైఎస్ మరణం తర్వాత మళ్ళ విజయప్రసాద్ వైసీపీలో జాయిన్ అయ్యారు. వైసీపీలో జాయిన్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు మళ్ళ విజయప్రసాద్‌ రాజకీయాల్లో అనామకంగా మారిపోయారు. 2014 ఎన్నికల్లో తొలిసారి రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేసిన వైసీపీ నుండి విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా దాడి వీరభద్రరావు కొడుకు దాడి రత్నాకర్ బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే గణబాబు చేతిలో రత్నాకర్ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత దాడి రత్నాకర్ విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. దాడి కుటుంబ రాజకీయం అంతా అనకాపల్లి కేంద్రంగా జరుగుతుంది కాబట్టి విశాఖ వెస్ట్ నియోజకవర్గం వైపు చూడటమే మానేశారు.


2019 ఎన్నికలు వచ్చే సరికి జగన్‌కు మాజీ ఎమ్మెల్యే మల్ల విజయప్రసాదే దిక్కయ్యారు. ఆ ఎన్నికల్లో 151 సీట్లు దక్కించుకున్న వైసీపీకి విశాఖ వెస్ట్ మాత్రం కలిసిరాలేదు టిడిపి అభ్యర్థి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే గణబాబు చేతిలో విజయ ప్రసాద్ పరాజయం పాలై పొలిటికల్ స్క్రీన్ మీద నుంచి మాయమయ్యారు. మళ్లీ షరా మామూలే.. ఓటమి పాలైతే అభ్యర్ధిని మార్చేసి కొత్త ఇన్చార్చిని ప్రకటిస్తుంటారు వైసీపీ అధ్యక్షుడు. 2024 ఎన్నికలు వచ్చేసరికి విశాఖ వెస్ట్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆడారి ఆనంద్ కుమార్ ను ప్రకటించారు. ఆడారి ఆనంద్ 2024 ఎన్నికలకు రెండు సంవత్సరాల ముందు విశాఖ వెస్ట్ నియోజకవర్గం ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టి ఆరోగ్యం సహకరించకపోయినా కష్టపడ్డారు.

Also Read: బిగ్ అలర్ట్.. నేడే ఖాతాల్లో నగదు జమ.. డీబీటీ రూపంలో రూ.18.69 కోట్లు!

ఆనంద్‌కుమార్ ఎన్నికల వరకు నిరంతరం ప్రజల్లోనే ఉంటూ కోట్లు ఖర్చు చేసి భారీగా ప్రచారం చేసుకున్నారు. ఎన్నికల ముందు చేసిన అన్ని సర్వేల్లోనూ విశాఖ వెస్ట్ ఎమ్మెల్యేగాఆనంద్ కుమార్ గెలుపు నల్లేరు మీద నడకే అన్నట్లు నివేదికలు వచ్చాయి. దాంతో వైసీపీ క్యాడర్ లో ఆనందానికి హద్దు లేకుండా పోయింది. కానీ ఎన్నికల ఫలితాలు వైసీపీకి మళ్లీ షాక్ ఇచ్చాయి. తిరిగి గణబాబునే విజయం వరించింది. ఆయన 35 వేల పైచిలుకు మెజార్టీతో హ్యాట్రిక్ కొట్టారు. దాంతో విశాఖ వెస్ట్ నియోజకవర్గంలో వైసీపీ కథ మళ్ళీ మొదటికి వచ్చింది.

వైసిపి పార్టీ స్థాపించినప్పటి నుండి 2024 ఎన్నికల వరకు విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేసిన ప్రతి వైసీపీ అభ్యర్థి ఓటమి చవిచూశారు. దాంతో విశాఖ వెస్ట్ వైసీపీ పై పగ పట్టిందనే ప్రచారం జోరందుకుంది. 2024 ఎన్నికలు ముగిసాయి. మళ్లీ వైసీపీ అధినేత జగన్ నియోజకవర్గాల్లో ఇన్చార్జిలను, జిల్లా అధ్యక్షులను మార్చుకుంటూ వస్తున్నారు. మొన్న ఎన్నికల వరకు రెండు సంవత్సరాలు నిర్విరామంగా నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ.. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరేలా చూసిన వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్ ఓటమి తర్వాత విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో కనిపించడం మానేశారు.

అడారి ఆనంద్ కు ఆరోగ్యం సహకరించకపోయినా ఎన్నికల బరిలో నిలిచారు కానీ ఓటమి తర్వాత పూర్తిగా నియోజకవర్గానికి దూరమయ్యారు. వాస్తవానికి టిడిపి అధికారంలోకి వస్తే ఒక వేళ గెలిచినప్పటికీ ఆనంద్ పార్టీ మారే వారన్న ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది. ఇప్పుడు ఆయన సైడ్ అయిపోవడంతో వైసీపీ అధినేత జగన్ విశాఖ పశ్చిమ నియోజకవర్గం కొత్త ఇన్చార్జిగా మళ్లీ విజయప్రసాద్ ను నియమించారు. వెస్ట్ నియోజకవర్గ ఇన్చార్జిగా మళ్ల విజయ ప్రసాద్ 2029 ఎన్నికల్లో పోటీ చేస్తారో? లేదా ఎన్నికల ముందు కొత్త అభ్యర్ధి వస్తారో అని వైసీపీ వర్గాలే అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

వైసిపి ఆవిర్భావం నుండి నేటి వరకు బరిలో ఎవరు నిలిచినా గణబాబును ఓడించలేక పోతున్నారు. రానున్న రోజుల్లో గణబాబుని దీటుగా ఎదుర్కోవాలంటే బలమైన నాయకుడు నియోజకవర్గ ఇన్చార్జిగా ఉండాల్సిన అవసరం ఉందని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. మరి వైసీపీలో విజయప్రసాద్ అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి.

Related News

History of Naxalism: మావోయిస్టుల అంతం.. ఎందుకీ పరిస్థితి వచ్చింది?

Narsingi: నార్సింగిలో బంగారు గని..?

Sabarmati and Thames River: సబర్మతి, థేమ్స్ నదులు ఎలా బాగుపడ్డాయి?

Israel-Iran War: ఇరాన్‌పై దాడికి ఇజ్రాయెల్ వ్యూహం ఇదే!

Osho Rajneesh: కళ్ళకు కట్టినట్టుగా ఓషో రజనీష్ నిజస్వరూపం

YS Jagan: కడపలో జగన్ ప్లాన్ సక్సెస్.. ఎలాగంటే..

×