EPAPER

Narsingi: నార్సింగిలో బంగారు గని..?

Narsingi: నార్సింగిలో బంగారు గని..?

– నార్సింగిలో పొంగులేటి గ్యాంగ్ భూ స్కామ్
– టైటిల్ లేని వివాదాస్పద భూమిలోకి ఎంట్రీ
– ఇష్టానుసారంగా వ్యవహరించిన గత ప్రభుత్వాలు
– అత్యంత విలువైన భూముల్లో పిసినారి వ్యవహారాలు
– టైటిల్‌పై క్లారిటీ లేకుండానే రెవెన్యూ రికార్డుల్లో ఎంట్రీలు
– కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అమోయ్ కుమార్
– కాశం రాజేశ్వర్, వంశీరాం సుబ్బారెడ్డి ఎంట్రీతో ఈజీగా అనుమతులు
– 66 ఎకరాల ప్రభుత్వ భూమిలో రోడ్డు కోసం పొయింది ఎంత? మిగిలింది ఎంత?
– బౌండరీలేంటో గుర్తించకుండానే పొజిషన్‌లోకి పొంగులేటి ఫ్యామిలీ
– అంబేద్కర్ విగ్రహ ఆనవాళ్లు లేకుండా చేసి ఆక్రమణ
– మిగిలిన భూములపై ఇష్టారాజ్యంగా వ్యవహరించిన గత కలెక్టర్లు?
– అడ్డగోలు నిర్మాణంతో ప్రమాదంలో నార్సింగి చౌరస్తా
– కమర్షియల్ కాంప్లెక్స్ కథేంటి? స్వేచ్ఛ ఇన్వెస్టిగేటివ్ స్టోరీ


దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809

స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం తర్వాత హైదరాబాద్ భూములకు రెక్కలొచ్చాయి. చూస్తుండగానే, ఎకరం వంద కోట్లు దాటేసింది. ముఖ్యంగా నార్సింగి ఏరియా అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బంగారు గని. ఇప్పుడు అక్కడ వంద కోట్లు ఇచ్చినా ఎకరం భూమి దొరకదు. మూడేళ్లలో 30 వేల కుటుంబాలు ఈ ఏరియాకు షిఫ్ట్ అయ్యారంటే అర్థం చేసుకోండి డిమాండ్ ఏ రేంజ్‌లో ఉందో. అలాంటి ప్రాంతంలో ప్రభుత్వ భూమి ఉంటే పొలిటీషియన్స్ ఊరుకుంటారా? ఫ్యూచర్‌ని ముందే ఊహించి పదేళ్ల క్రితమే పట్టుబట్టి మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి కమర్షియల్ ప్లాట్ 5 ఎకరాలకు ఎసరు పెట్టారు. అనుకున్నది అనుకున్నట్లు సక్సెస్ అయ్యారు. అన్ని అనుమతులు వచ్చాయి. 38 అంతస్తుల కమర్షియల్, మల్టిప్లెక్స్ బిల్డింగ్ నిర్మాణం మొదలైంది. సర్వే నెంబర్ 205లో జరిగిన అక్రమాలపై ఆరా తీస్తే, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి, క్రెడాయికి చెందిన కాశం రాజేశ్వర్, వంశీరాం సుబ్బారెడ్డి ఘనకార్యం బయటపడింది. గత ప్రభుత్వాలను మేనేజ్ చేసి స్పెషల్ జీవోలు ఇప్పించుకున్నా, చిన్న చిన్న తప్పిదాలతో టైటిల్ వివాదాలు కొనసాగుతున్నాయి. అయితే, అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్ క్లియరెన్స్‌తో పొజిషన్‌లో ఉన్నవారిపై కేసులు పెట్టించి, హడావుడి అనుమతులతో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు. మరో మహిళా కలెక్టర్ ఇదే దారిలో వెళ్లి మరొకరికి రెండున్నర ఎకరాలు రాసి ఇచ్చారు. నార్సింగిలో అత్యంత విలువైన 66 ఎకరాల ప్రభుత్వ భూమి వెనుక ఉన్న లిటిగేషన్స్‌పై స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ చేయగా సంచలన విషయాలు వెలుగుచూశాయి.


సైలెంట్‌గా లీగలైజేషన్

హైదరాబాద్‌లో 1960 నాటికి విస్తరించిన ప్రాంతం నుంచి 26 కిలోమీటర్ల దూరం వరకు ఎవరికీ భూమి అసైన్డ్ చేయరాదని ఆనాటి ప్రభుత్వం జీవో (1122 ఆఫ్ 1961) విడుదల చేసింది. అందులో నార్సింగి గ్రామం పేరు కూడా ఉంది. అయితే బీ మోహన్ లాల్ అనే ఫ్రీడమ్ ఫైటర్‌కి పొలిటికల్ సఫరర్స్ కోటాలో 1962లో 10 ఎకరాల భూమి (ప్రొసీడింగ్ నెం. ఏ9/1525/61)ని కేటాయించారు. ఈ కేటాయింపులు అక్రమమని జీవో 1122కి విరుద్ధంగా భూమి కేటాయించారని జాయింట్ కలెక్టర్ రివ్యూ చేసి కేటాయించిన భూమిని 1982లో రద్దు (ప్రొసీడింగ్ నెం. డీ1/1031/79 ) చేశారు. అయితే, 1978లోనే జీవో నెంబర్ 1409తో నార్సింగి గ్రామం భూములను అసైన్డ్ చేయవచ్చని జీవో ఇచ్చారు. తర్వాత తమ భూమి రద్దు చేశారని జాయింట్ కలెక్టర్ ఆర్డర్‌పై సీసీఎల్ఏ వద్దకు అప్పీల్‌ (బీసీడబ్ల్యూ/4218/1993)కు వెళ్లారు బాధితులు. 1996లో సీసీఎల్ఏ కమిషనర్, జాయింట్ కలెక్టర్ ఆర్డర్స్‌ని సమర్ధిస్తూ అది ప్రభుత్వ భూమిగా ప్రకటించారు. 1961 నుంచి 1978 మధ్య కేటాయించిన భూములు చెల్లవని జాయింట్ కలెక్టర్ ఆర్డర్స్‌ను సీసీఎల్‌ఏ సమర్ధించింది. అదంతా ప్రభుత్వ భూమిగా ప్రకటించింది. వీరితో పాటు అసైన్డ్ అయిన వారందరికీ అప్పటికే రద్దు అయిన భూమి మొత్తం 25 ఎకరాలు ఉంటుంది. దాన్ని టూరిజం డిపార్ట్‌మెంట్‌కు కేటాయిస్తూ ఉత్తర్వులు వచ్చాయి. అయితే, మోహన్ లాల్, అతని భార్య అప్పటికే చనిపోయారు. వీరికి ఇద్దరి కుమారులు. 1996 ఏప్రిల్ 26న భూ కేటాయింపులు రద్దు అవ్వగా, అదే ఏడాది ఆగస్ట్ 27న మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఆయన సంబంధీకులకు 10 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేశారు. వారి బంధువులకు 1997లో రిజిస్ట్రేషన్ చేసేలా ప్లాన్ చేసినా, సంబంధిత శాఖ ఒప్పుకోలేదు. ఏడాది పాటు రిజిస్ట్రేషన్ పెండింగ్‌లో పెట్టి 1998 ఏప్రిల్ 4న మరో 5 ఎకరాలకు వివిధ వ్యక్తుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేశారు. ఇదంతా అక్రమమని తెలిసినా, 1996 వరకు పహాణీలో పేరు వచ్చిందని మేనేజ్ చేసి రిజిస్ట్రేషన్ పక్రియ పూర్తి చేశారు. వీరి బౌండరీలు అన్నీ గతంలో ఇతరులకు కేటాయించి, రద్దు చేసిన 205/3, 4తోపాటు 205 సర్వే నెంబర్లతో ఉన్నాయి. ఇప్పుడున్న బౌండరీలకు అవేవీ మ్యాచ్ కావు.

పట్టుబట్టి 2008లో కేటాయింపులు

టైటిల్ రద్దు అయిన తర్వాత ఉద్దేశపూర్వకంగా రిజిస్ట్రేషన్ పక్రియ పూర్తి చేశారు. 66 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఔటర్‌కి భూ సేకరణకు ఇబ్బంది ఉండదని ఎగ్జిట్ ఇస్తూ, టూరిజంకు కేటాయించిన 25 ఎకరాల్లో చాలా భూమిని వాడుకున్నారు. దీంతో పాటు మరో 2 బిట్స్ 5 ఎకరాల చొప్పున టూరిజం వద్ద ఉంది. అప్పటికే అక్కడ 4 నుంచి 5 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఎస్సీ కాలనీ ఏర్పడింది. వారికి ప్రభుత్వం 60 గజాల చొప్పున పట్టాలు ఇచ్చింది. ఓఆర్ఆర్‌ కోసం మిగిలిన భూములకు డిమాండ్ పెరిగింది. దీంతో 2005, 2007లో ఫ్రీడం ఫైటర్ భూమిని అక్రమంగా అమ్ముకున్న తర్వాత కూడా, రెజ్యూమ్ చేయాలని అప్లికేషన్ పెట్టుకున్నారు. ఆనాటికి అక్కడ భూమి విలువ ఎకరం రూ.4 కోట్లు పలుకుతోంది. 2008లో రద్దు అయిన భూమికి మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి పట్టుబట్టి 10 ఎకరాలకు గాను 5 ఎకరాల 12 గుంటలు వచ్చేలా జీవో నెంబర్ 1096ని తెప్పించుకున్నారు. మళ్లీ ఆ ఫ్రీడమ్ ఫైటర్ వారసులకు కేటాయించేశారు. జాయింట్ కలెక్టర్ ఆర్డర్స్‌ని సెట్‌సైడ్ చేశారు. ఫ్రీడమ్ ఫైటర్స్ అసైన్డ్ భూములు రద్దు అయిన తర్వాత వారసులకు మళ్లీ కేటాయించడం చరిత్రలో జరగలేదు. ఈ భూమి విలువ ఆనాటికి రూ.20 కోట్లు. ఇప్పుడైతే, రూ.500 కోట్లకు పైనే. అత్యంత విలువైన భూమిని కేటాయించడంపై ఇప్పటికీ విమర్శలకు తావిస్తోంది.

పొజిషన్ కోసం పడిగాపులు

ప్రభుత్వం నుంచి అక్రమంగా లీగలైజేషన్ చేసుకున్న పొంగులేటి సుధాకర్ రెడ్డి కుటుంబం, ఆ తర్వాత పొజిషన్ తెచ్చుకోవడానికి చాలా కష్టపడింది. అప్పటికే అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్లేస్ ఖాళీగా ఉండటం, 205/1 అని చెప్పడమే కానీ, బౌండరీలు ఫిక్స్ కాకపోవడంతో మ్యూటేషన్, సక్సెషన్ కావడానికి 5 ఏండ్ల సమయం పట్టింది. అయితే, గతంలో ఓ మూడేళ్ల పాటు అనుభవదారుని కాలంలో ఉన్న రైతులు, ఇటు దళితులు పొజిషన్ ఇవ్వకుండా అడ్డుకున్నారు. 2019లో డెవలప్మెంట్‌కి కాశం రాజేశ్వర్ అనే బిల్డర్ తీసుకుని బీఆర్ఎస్ సహాయ సహకారాలతో క్లియర్ చేసుకున్నారు. 2020లో ధరణిలో మళ్లీ అమోయ్‌ కుమార్ గత చరిత్ర తవ్వి కొర్రీలు పెట్టారు. ఆయనకు పర్సంటేజీలు వెళ్లడంతో ధరణిలో క్లియర్ చేశారు. ఇదంతా వంశీరాం సుబ్బారెడ్డి ఎంట్రీతో క్లియర్ అయిందని వినికిడి.

పిసినారి వ్యవహారంతో ఇబ్బందుల్లో టైటిల్.. భారీగా స్టాంప్ డ్యూటీ ఎగవేత

మాజీ ఎమ్మెల్సీ ఒత్తిళ్లకు చట్టవిరుద్ధంగా 2008లో ప్రిన్సిపల్ సెక్రెటరీ 1096 జీవోని ఇచ్చేశారు. గతంలో తామే వారసులమని టైటిల్ లేకుండానే ఇద్దరు కుమారులు విక్రయించారు. మిగిలిన నలుగురు కూతళ్లతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ చెల్లించాల్సి వస్తుందని 2013లో 1996, 1998 నాలుగు డాక్యుమెంట్లకి రాటిఫికేషన్ చేసుకున్నారు. దీంతో టైటిల్ వివాదాస్పదంగా మారింది. ఆర్ఓఆర్ యాక్ట్ ద్వారా సంక్రమించిందని చెబుతున్నా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారానే వారికి టైటిల్ సంక్రమించింది. అప్పటి అక్రమాల కలెక్టర్‌గా పేరున్న అమోయ్ కుమార్ ధరణిలో ఎంట్రీలతోనే ప్రస్తుతం ఉన్న బౌండరీలు ఫిక్స్ చేసుకుని పొజిషన్‌లో ఉన్నవారిపై కేసులు పెట్టించి ఖాళీ చేయించారు. దీంతో ప్రభుత్వానికి 2013లోనే 50 లక్షల రూపాయల ఆదాయం రాకుండా పోయింది. నాలా కన్వర్షన్ చేసుకోకుండానే కేవలం వ్యవసాయ భూమి విలువతోనే డీజీపీఏ కమ్ జీపీఏ చేసుకున్నారు. దీంతో రూ.15 లక్షల్లో మొత్తం భూమి వంశీరాం వినీల్ వెంచర్స్ ఎల్ఎల్‌పీకి బదలాయించారు. ఇదే భూమి నాలా కన్వర్షన్ చేస్తే ప్రభుత్వానికి అక్షరాలా రూ.45 కోట్లకు స్టాంప్స్ అండ్ డ్యూటీ చెల్లించాల్సి ఉండేది. దీనికి బదులు హెచ్ఎండీఏకు 5 శాతం బిల్డప్ ఏరియాను మార్టిగేజ్ చేశారు. ఇదంతా ఎన్‌ఓసీ ఇచ్చి మార్టిగేజ్ రిలీజ్ చేస్తే తప్ప ఆ డబ్బులు ప్రభుత్వానికి చేరవు. దీంతో 5 ఏండ్ల వడ్డీ నష్టమే. ఇదంతా రియల్ ఎస్టేట్ రెసిడెన్సీ కోసం చేస్తున్నారంటే పొరపాటే. పక్కా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి, రూ.500 కోట్ల విలువ చేసే భూమిని అగ్రికల్చర్ ల్యాండ్‌గా చూపిస్తూ పన్నులు ఎగ్గొట్టారు. సర్వీస్ రోడ్డుకు ఎలాంటి భద్రత లేకుండానే నాలుగు సెల్లార్స్ తవ్వేస్తున్నారు. బఫర్ జోన్ చుట్టూ 45 ఫీట్లు వదిలేయాల్సి ఉండగా అలాంటివేం పట్టించుకోవడం లేదు. పైగా సైట్ ప్లాన్, అనుమతులు, నిర్మాణ సంస్థ ఎవరో అక్కడ ఫోటోలు మచ్చుకైనా కనిపించడం లేదు.

తర్వాతి కథనంలో సంచలన విషయాలు

మాజీ కలెక్టర్లు 66 ఎకరాల్లోని మిగిలిన భూములను, ఇల్లీగల్‌గా ఎలా క్లియర్ చేశారో? పక్క సర్వే నెంబర్లతో ప్రభుత్వ భూమిని దోచుకున్న తీరుపై తర్వాతి కథనంలో చూద్దాం.

Related News

Sabarmati and Thames River: సబర్మతి, థేమ్స్ నదులు ఎలా బాగుపడ్డాయి?

Israel-Iran War: ఇరాన్‌పై దాడికి ఇజ్రాయెల్ వ్యూహం ఇదే!

Osho Rajneesh: కళ్ళకు కట్టినట్టుగా ఓషో రజనీష్ నిజస్వరూపం

YS Jagan: కడపలో జగన్ ప్లాన్ సక్సెస్.. ఎలాగంటే..

YS Jagan in Confusion: అంబటి, రజిని దెబ్బకి.. అయోమయంలో జగన్

Bigg Boss 8 Day 33 Promo1: మార్నింగ్ మస్తీ.. చిలకజోస్యంతో అదరగొట్టిన మణికంఠ..!

×