EPAPER

RRR Route Map: రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి స్వరూపం ఇదే.. ఏయే జిల్లాల్లో ఏయే ప్రాంతాలు కలుస్తాయంటే?

RRR Route Map: రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి స్వరూపం ఇదే.. ఏయే జిల్లాల్లో ఏయే ప్రాంతాలు కలుస్తాయంటే?

స్వేచ్ఛ, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రీజనల్‌ రింగ్‌ రోడ్డు (ట్రిపుల్‌ ఆర్‌) నిర్మాణంపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేస్తోంది. ఉత్తర, దక్షిణ రెండు భాగాలుగా 352 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండే.. రీజనల్‌ రింగ్‌ రోడ్డులో భాగంగా 1,712 కిలోమీటర్ల పొడవునా మొత్తం 60 రేడియల్‌ రోడ్లను నిర్మించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో తొలి, రెండో దశలో 1,281 కిలోమీటర్ల మేర 32 రేడియల్‌ రోడ్లను, మూడో దశలో 28 లింక్‌ రోడ్లను నిర్మించాలని నిర్ణయించింది.


200 అడుగుల వెడల్పుతో..

రేడియల్‌ రోడ్లు 200 అడుగుల వెడల్పుతో ఉంటాయి. ప్రధాన రేడియల్‌ రోడ్‌ వంద అడుగులు కాగా.. భవిష్యత్తు అవసరాల కోసం దానికి ఇరువైపులా 50 అడుగుల చొప్పున బఫర్‌గా ఉంచుతారు. ఉత్తర భాగంలో తూప్రాన్‌–గజ్వేల్‌–చౌటుప్పల్‌లను కలుపుతూ 158 కిలోమీటర్లు, దక్షిణ భాగంలో చౌటుప్పల్‌ -షాద్‌నగర్‌ -సంగారెడ్డిలను కలుపుతూ 194 కిలోమీటర్ల మేర రీజనల్‌ రోడ్డు ఉండనుంది.


లీ అసోసియేట్స్‌కు 10 రేడియల్‌ రోడ్లు

ప్రభుత్వం ట్రిపుల్‌ ఆర్‌ ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పన, సాంకేతిక సేవల బాధ్యతలను కెనడాకు చెందిన లీ అసోసియేట్స్‌ సౌత్‌ ఏషియా సంస్థకు అప్పగించింది. ఉత్తర భాగంలో ఓఆర్‌ఆర్, ట్రిపుల్‌ ఆర్‌ను కలిపేందుకు 10 రేడియల్‌ రోడ్ల నిర్మాణ పనులను ఈ సంస్థకు అప్పగించారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఈ సంస్థ హెచ్‌ఎండీఏ, టీజీఆర్డీసీ, ఓఆర్‌ఆర్‌ రోడ్ల నిర్మాణం, మాస్టర్‌ ప్లాన్‌ వంటి ప్రాజెక్టులను పూర్తి చేసింది.

మూడు దశల్లో రేడియల్‌ రోడ్ల స్వరూపమిదీ:

ఫేజ్‌ -1: రేడియల్‌ రోడ్ల సంఖ్య: 16; రోడ్ల పొడవు: 748 కి.మీ.
1) 5 రేడియల్‌ రోడ్లు ఓఆర్‌ఆర్‌ నుంచి రీజనల్‌ రింగ్‌రోడ్డుకు అనుసంధానమై ఉంటాయి. మిగతా 11 రేడియల్‌ రోడ్లలో 9 జాతీయ రహదారులు, 2 రాష్ట్ర రహదారులను కలుపుతూ ట్రిపుల్‌ ఆర్, ఓఆర్‌ఆర్‌ గుండా సాగుతాయి.
2) ఓఆర్‌ఆర్‌తో అనుసంధానమయ్యే రోడ్లలో.. యాద్గార్‌పల్లి నుంచి ఇటిక్యాల వరకు, కీసర నుంచి దత్తాయిపల్లి, నాగులపల్లి నుంచి మందాపూర్, నార్సింగి నుంచి చీమలదరి, రాజేంద్రనగర్‌ ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ నంబరు-17 నుంచి కంకాల్‌ వరకు నిర్మించనున్నారు. అలాగే హైదరాబాద్‌ మీదుగా వెళ్లే మెదక్, నాగ్‌పూర్, ముంబై, వికారాబాద్, బెంగళూరు, శ్రీశైలం, విజయవాడ, మందాపురం, వరంగల్‌ జాతీయ రహదారులను, నాగార్జునసాగర్, కరీంనగర్‌ రాష్ట్ర రహదారులను కలుపుతూ ట్రిపుల్‌ ఆర్‌ సాగుతుంది.

ఫేజ్‌-2 : రేడియల్‌ రోడ్ల సంఖ్య: 16; రోడ్ల పొడవు: 533 కి.మీ.

ఇందులో ఫ్యూచర్‌ సిటీ భవిష్యత్తు అవసరాల నిమిత్తం రావిర్యాల నుంచి ఆమన్‌గల్‌ వరకు 41.5 కిలోమీటర్ల మేర 300 ఫీట్ల వెడల్పుతో గ్రీన్‌ఫీల్డ్‌ రేడియల్‌ రోడ్‌ ఉంటుంది. ఇక ఆదిభట్ల నుంచి తుర్కాలకుంట వరకు.. కోహెడ నుంచి కోతులాపురం.. పెద్ద అంబర్‌పేట నుంచి మందోళ్లగూడెం.. కొర్రెముల నుంచి ఎర్రంబెల్లి.. పడమట సాయిగూడ నుంచి దాతర్‌పల్లి.. ధర్మవరం నుంచి చేబర్తి..

మునీరాబాద్‌ నుంచి రంగంపేట.. ఓఆర్‌ఆర్‌ ఇంద్రజీత్‌ మెహతా నుంచి తియల్పూర్‌.. ఎగ్జిట్‌ నంబర్‌ -4ఏ నుంచి కాసాల.. ఎగ్జిట్‌ నంబర్‌–4 నుంచి శివంపేట.. కర్దనూరు నుంచి గోపులారం.. వెలిమల నుంచి తేలుపోల్‌.. జన్వాడ ఎస్‌ఆర్‌ఆర్‌సీ క్రికెట్‌ గ్రౌండ్‌ నుంచి అక్నాపూర్‌.. ఎగ్జిట్‌ నంబర్‌–15 నుంచి మధురాపూర్‌.. ఎగ్జిట్‌ నంబరు–15 నుంచి కేశంపేట వరకు రేడియల్‌ రోడ్లు ఉంటాయి.

ఫేజ్‌-3: లింక్‌ రోడ్ల సంఖ్య: 28; రోడ్ల పొడవు: 431 కి.మీ.
ఫేజ్‌-1 లేదా ఫేజ్‌-2లను కలుపుతూ ట్రిపుల్‌ ఆర్‌ వరకు ఉంటాయి.

ఓఆర్‌ఆర్, ట్రిపుల్‌ ఆర్‌లను కలుపుతూ 18 లింక్‌ రోడ్లు. అలాగే ఓఆర్‌ఆర్, గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్ల నుంచి జాతీయ, రాష్ట్ర రహదారులను అను సంధానం చేస్తూ 10 లింక్‌ రోడ్లు ఉంటాయి.

రావిర్యాల నుంచి గుమ్మడవల్లి.. మాల్‌ నుంచి వట్టిపల్లి.. గున్‌గల్‌ నుంచి కొత్తాల.. ఇబ్రహీంపట్నం నుంచి జనగాం.. కొత్తూరు నుంచి చౌలపల్లి.. తుక్కుగూడ నుంచి మహేశ్వరం మీదుగా తలకొండపల్లి.. నేదునూరు క్రాస్‌రోడ్‌ నుంచి చీపునుంతల.. కడ్తాల్‌ నుంచి చుక్కాపూర్‌.. రూప్‌సింగ్‌ తండా నుంచిపాంబండ.. ఇలా లింక్‌ రోడ్లు నిర్మిస్తారు.

ఆర్ఆర్ఆర్ నుంచి ఓఆర్ఆర్‌కు లింక్..

గ్రేటర్‌ హైదరాబాద్‌ సమగ్రాభివృద్ధిలో భాగంగా 352 కి.మీ. మేర రూపు దిద్దుకోనున్న రీజనల్‌ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)కు చేరుకొనేందుకు వీలుగా ఔటర్‌ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ ఆర్‌) నుంచి గ్రీన్‌ఫీల్డ్‌ రహదా రులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తంగా 216.9 కిలోమీటర్ల మేర తొమ్మిది గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్లను నిర్మించనుంది.

రావిర్యాల – ఆమన్‌గల్‌ వయా ఫ్యూచర్‌ సిటీ

సుమారు 14 వేల ఎకరాలలో రానున్న ఫ్యూచర్‌ సిటీతో ఈ మార్గంలో రాకపోకలు పెరుగుతాయని ఉద్యేశంతోనే ఈ మార్గాన్ని ఫ్యూచర్‌ సిటీ మీదుగా సర్కారు ప్రతిపాదించింది. ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ నంబర్‌-13 రావిర్యాల నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ లో ని ఆమన్‌గల్‌ ఎగ్జిట్‌ నంబర్‌- 13 వరకు 300 అడుగుల మేర గ్రీన్‌ఫీల్డ్‌ రేడియల్‌ రోడ్డు నిర్మించనుంది. ఈ మార్గం 15 గ్రామాల మీదగా, మొత్తం 41.5 కిలోమీటర్ల మేర ఉంటుంది. మహేశ్వరం మండలంలోని కొంగరఖుర్డ్, ఇబ్రహీంపట్నంలోని కొంగరకలాన్, ఫిరోజ్‌గూడ, కందుకూరులోని లేమూర్, తిమ్మాపూర్, రాచులూర్, గుమ్మడవెల్లి, పంజగూడ, మీర్‌ఖాన్‌పేట్, ముచ్లెర్ల, యాచారంలోని కుర్మిద్ద, కడ్తాల్‌ మండలంలోని కడ్తాల్, ముద్విన్, ఆమన్‌గల్‌ మండలంలోని ఆమన్‌గల్, ఆకుతోటపల్లి గ్రామాల గుండా ఈ రోడ్డు వెళ్లనుంది.

916 ఎకరాల భూసమీకరణ..

గ్రీన్‌ఫీల్డ్‌ రేడియల్‌ రోడ్డు నిర్మాణానికి 916 ఎకరాల భూమిని ప్రభుత్వం సమీకరించాల్సి ఉంది. ఇందులో 8 కిలోమీటర్ల మేర 169 ఎకరాల అటవీ శాఖ భూములు ఉండగా 7 కిలోమీటర్లలో 156 ఎకరాలు టీజీఐఐసీ భూములు, కిలోమీటరులో 23 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. 25.5 కిలో మీటర్ల మేర పట్టా భూములు ఉన్నాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగం సంగారెడ్డి -తూప్రాన్‌-గజ్వేల్‌-చౌటుప్పల్‌ మీదుగా కిలోమీటర్లు, దక్షిణ భాగం చౌటుప్పల్‌- షాద్‌నగర్‌- సంగారెడ్డి మీదుగా 194 కిలోమీటర్ల మేర నిర్మాణం కానుండటం తెలిసిందే.

3 నదులు.. 3 వంతెనలు

రీజనల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగంలో మూడు నదులపై వంతెనలను ఖరారు చేశారు. దక్షిణ భాగం రోడ్డును సొంతంగానే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే యోచనలో ఉండటంతో ఉత్తర భాగాన్ని పట్టాలెక్కించే పనిలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) తలమునకలై ఉంది. భూసేకరణ ప్రక్రియలో కీలక అంకమైన అవార్డులను పాస్‌ చేసే ప్రక్రియకు సిద్ధమవుతోంది. ఆ తర్వాత టెండర్‌ నోటిఫికేషన్‌ ఇవ్వబోతోంది. ఆపై మరో 6 నెలల్లో రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని యోచిస్తోంది.

ఈ నేపథ్యంలో రోడ్డు డిజైన్‌ సహా ఇంటర్‌చేంజ్‌ వంతెలు, నదీ వంతెనలు, అండర్‌పాస్‌లు తదితర స్ట్రక్చర్‌ డిజైన్లు సిద్ధం చేసుకుంది. ఉత్తర భాగంలో మూడు చోట్ల రీజనల్‌ రింగురోడ్డు నదులను క్రాస్‌ చేస్తుంది. ఆ మూడు ప్రాంతాల్లో వంతెనలు నిర్మించనుంది. మూసీ నదిపై వలిగొండ మండలం పొద్దుటూరు గ్రామ సమీపంలో, మంజీరా నదిపై పుల్కల్‌ మండలం శివంపేట గ్రామ సమీపంలో, హరిద్రా నది (హల్దీ నది/హల్దీ వాగు) తూప్రాన్‌ దగ్గర ఈ వంతెనలను నిర్మించనున్నారు.

మూసీపై కిలోమీటర్‌ పొడవుతో..

మూడు నదులపై నిర్మించే వంతెనల్లో మూసీ నదిపై దాదాపు కిలోమీటరు పొడవుతో వంతెన నిర్మాణం కానుంది. నల్లగొండ–భువనగిరి రోడ్డులో భాగంగా ఇప్పటికే వలిగొండ వద్ద వంతెన ఉండగా ఇప్పుడు వలిగొండ మండలం పొద్దుటూరు గ్రామ శివారులో ఈ వాగును రీజనల్‌ రింగురోడ్డు క్రాస్‌ చేయనుంది. అక్కడ కిలోమీటరు పొడవుతో వంతెనకు ఎన్‌హెచ్‌ఏఐ సిద్ధమవుతోంది. దీనికి దాదాపు రూ. 100 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు.

నాందేడ్‌ జాతీయ రహదారికి సమాంతరంగా..

మెదక్‌–సంగారెడ్డి రోడ్డు 161వ నంబర్‌ నాందే డ్‌–హైదరాబాద్‌ జాతీయ రహదారిలో కలిసిన ప్రాంతంలో మంజీరా నదిపై వంతెన నిర్మించనున్నారు. పుల్కల్‌ మండలం శివంపేట గ్రామ సమీపంలో మంజీరా నదిని రీజనల్‌ రింగు రోడ్డు క్రాస్‌ చేయనుంది. దీంతో అక్కడ దాదాపు 600 మీటర్ల పొడవైన వంతెన నిర్మించనున్నారు. దీనికి దాదాపు రూ. 75 కోట్లు ఖర్చవుతుందని భావిస్తున్నారు.

తూప్రాన్‌ సమీపంలో..

గజ్వేల్‌ మీదుగా ప్రవహిస్తూ మంజీరా నదిలో కలిసే హరిద్రా నదిపై తూప్రాన్‌ వద్ద మూడో వంతెనకు ఎన్‌హెచ్‌ఏఐ సిద్ధమవుతోంది. 44వ నంబర్‌ జాతీయ రహదారిపై ఇప్పటికే అక్కడ ఓ వంతెన ఉంది. దానికి దాదాపు చేరువలో తూప్రాన్‌ వద్ద మరో వంతెన రానుంది.

తొలుత నాలుగు వరసలకే..

రీజనల్‌ రింగు రోడ్డును 8 వరుసలతో నిర్మించేలా ప్రణాళిక రచించినా తొలుత నాలుగు లేన్లకే పరిమితమవుతున్నారు. మిగతా నాలుగు లేన్లను భవిష్యత్తు అవసరాల దృష్ట్యా తగు సమయంలో నిర్మించనున్నారు. అయితే ఆ నాలుగు వరుసలకు సరిపడా భూమిని సైతం సేకరించి చదును చేసి వదిలేయనున్నారు. మిగతా నాలుగు లేన్లను మాత్రం ఇప్పుడు నిర్మించనున్నారు. ఈ కారిడార్‌లో భాగంగానే వంతెనలు ఉంటున్నందున వాటిని కూడా ఎనిమిది వరుసలకు సరిపడేలా నిర్మించాల్సి ఉంటుంది.

ఇప్పుడు ప్రధాన క్యారేజ్‌ వేను నాలుగు లేన్లకు పరిమితం చేసినందున వంతెనలను కూడా నాలుగు లేన్లకే సరిపడేలా నిర్మించనున్నారు. ఇప్పుడు నిర్మించే వంతెనల పక్కనే తదుపరి నాలుగు వరుసల వంతెనలు నిర్మించాల్సి ఉంటుంది. పక్కపక్కనే నిర్మించేప్పుడు పాత వంతెనల పిల్లర్లకు ఇబ్బంది ఏర్పడే ప్రమాదం పొంచి ఉంటుంది. అలాంటి ప్రమాదం లేకుండా ఫౌండేషన్‌లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిసింది. ఇందుకోసం వాటికి ప్రత్యేక డిజైన్‌ను అనుసరించనున్నారు.

సొంతగానే దక్షిణ భాగం

రీజినల్‌ రింగురోడ్డు (ట్రిపుల్‌ ఆర్‌) దక్షిణ భాగాన్ని సొంతంగా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అలైన్‌మెంట్‌ రూపొందించటంసహా భూసేకరణ, రోడ్డు నిర్మాణం అంతా సొంతంగానే చేపట్టే దానిపై కసరత్తు ప్రారంభించింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్ద జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చించినట్టు తెలిసింది.

ఢిల్లీ తరహాలో..

ఢిల్లీ ఔటర్‌ రింగురోడ్డులో వెస్ట్రన్‌ పెరిఫెరల్‌ ఎక్స్‌ప్రెస్‌ వేను హరియాణా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ఈస్ట్రన్‌ పెరిఫెరల్‌ ఎక్స్‌ప్రెస్‌వేను ఎన్‌హెచ్‌ఏఐ నిర్మించింది. ఇప్పుడు ఇదే తీరుగా.. హైదరాబాద్‌ రీజినల్‌ రింగురోడ్డులో ఉత్తర భాగాన్ని ఎన్‌హెచ్‌ఏఐ, దక్షిణభాగాన్ని తెలంగాణ చేపట్టాలన్న ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళుతోంది.

ఖర్చు భరించగలదా..?

దాదాపు ఐదేళ్ల క్రితం ట్రిపుల్‌ ఆర్‌ ప్రతిపాదన వచ్చినప్పుడు రెండు భాగాలు కలిపి రూ.17 వేల కోట్ల వ్యయంలో పూర్తవు తుందని అంచనా వేశారు. కానీ, గతేడాది జనవరిలో దక్షిణ భాగానికి సంబంధించిన కన్సల్టెన్సీ సంస్థ రూ.12,900 కోట్ల అంచనాతో నివేదిక సమర్పించింది. ఇప్పుడు అది రూ.19 వేల కోట్లకు చేరింది. ఇంతపెద్ద మొత్తాన్ని సమకూర్చుకోవటంపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. అయితే ప్రస్తుతం రోడ్ల నిర్మాణంలో ప్రైవేట్‌ సంస్థలే కీలకపాత్ర పోషిస్తుందున, బీఓటీ, హెచ్‌ఏఎం పద్ధతులను పాటిస్తే, ఈ భారాన్ని మేనేజ్ చేయొచ్చిన ప్రభుత్వం భావిస్తోంది.

రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్)

కీలక అధికారులు…
1. వికాస్ రాజ్, ఐఎఎస్, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (మొత్తం ప్రాజెక్టు పర్యవేక్షణ)
2. నవిన్‌ మిట్టల్‌, ఐఎఎస్, రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి (భూ సమస్యలు)
3. సర్ఫరాజ్ అహ్మద్, ఐఎఎస్, మున్సిపల్ కమిషనర్, హెచ్ఎండీఏ (రేడియల్ రింగ్ రోడ్స్, వాటికై భూసేకరణ)
4. దాసరి హరిచందన, ఐఎఎస్, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి (ప్రాజెక్ట్ సూత్రీకరణ, సమన్వయం)
5. విష్ణు వర్థన్, ఐఎఫ్‌ఎస్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి (పారిశ్రామిక జోన్ల ఏర్పాటు, అభివృద్ధి)

టేబుల్ 1
పొడవు: 340 కి.మీ
దక్షిణం వైపు: 182 కి.మీ
ఉత్తరం వైపు: 164 కి.మీ
ప్రతిపాదిత వ్యయం: రూ. 17 వేల కోట్లు
వరుసలు: 4
యాజమాన్యం: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా
నిర్వహణ: జీహెచ్ఎంసీ, హుడా, హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్

టేబుల్ 2
ఉత్తరం వైపు వచ్చే ప్రాంతాలు: సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, యాదాద్రి, ప్రజ్ఞాపూర్, భువనగిరి, చౌటుప్పల్
దక్షిణం వైపు వచ్చే ప్రాంతాలు: చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, కందుకూర్, ఆమన్‌గల్, చేవెళ్ల, శంకర్‌పల్లి, సంగారెడ్డి

టేబుల్ 3
జిల్లాల వారీగా వచ్చే గ్రామాలు

సంగారెడ్డి జిల్లా:

కందుకూర్ మండలం: మల్కాపూర్, గిర్మాపూర్
సదాశివపేట మండలం: పెద్దాపూర్
సంగారెడ్డి మండలం: నాగపూర్, ఇరిగిపల్లి, చింతల్ పల్లి, కలబ్‌గూర్, సంగారెడ్డి, తాడ్లపల్లి, కులబ్‌గూర్
హత్నూర మండలం: కాసల, దేవులపల్లి, హత్నూర, దౌలతాబాద్
చౌట్‌కూర్ మండలం: శివంపేట, వెండికోల్, వెంకట కిష్టాపూర్, లింగంపల్లె, కోర్పోల్

మెదక్ జిల్లా:

నర్సాపూర్ మండలం: నాగులపల్లె, మూసాపేట, మహమ్మదాబాద్, పెద్ద చింతకుంట, రుస్తుం పేట, సీతారాంపూర్, మాలపర్తి, అచపేట్, రెడ్డిపల్లె, చిన్న చింతకుంట, కాజీపేట, మంటూరు, గొల్లపల్లె, తిర్మలాపూర్, తుల్జాపూర్
కౌడిపల్లె మండలం: వెంకటాపుర
శివ్వంపేట మండలం: లింగోజి గూడ, కొత్తపేట, రత్నాపూర్, పాంబండ, ఉసిరికపల్లె, పోతుల బొగుడ, గుండ్లపల్లె, కొంతన్‌పల్లి,
తూప్రాన్ మండలం: వట్టూరు, దండుపల్లె, నాగులపల్లె, తూప్రాన్, ఇస్లాంపూర్, దాతరపల్లె, గుండ్రెడ్డి పల్లె, కిస్తాపూర్, వెంకటాయపల్లె, నర్సంపల్లె, మల్కాపూర్,
మాసాయిపేట మండలం: మాసాయిపేట

Also Read: తగ్గేదేలే.. మాకు ప్రజా సంక్షేమం ముఖ్యం.. మూసీ ప్రక్షాళనపై కోమటిరెడ్డి

సిద్దిపేట జిల్లా గ్రామాలు:

రాయపోల్ మండలం: బేగంపేట
గజ్వేల్ మండలం: బంగ్లా వెంకటాపూర్, మక్తా మసాన్ పల్లె, కోమటి బండ, గజ్వేల్, సంగపూర్, ముట్రాజ్ పల్లె, ప్రజ్ఞాపూర్, సిరిగిరి పల్లె
వర్గల్ మండలం: మాజీదల్ పల్లె, మెంటూర్, జబ్బాపూర్, మైలారం, కొండయ్ పల్లె
మర్కూక్ మండలం: మర్కూక్, పాములపర్తి, అంగడి కిస్తాపూర్, చేబర్తి, ఎర్రవల్లి
జగదేవ్‌పూర్ మండలం: అలిరాజ్‌పేట, ఇటిక్యాల, పీర్లపల్లె

యాదాద్రి-భువనగిరి జిల్లా గ్రామాలు:

తుర్కపల్లి మండలం: గందమల్ల, వీరారెడ్డి పల్లె, కోనాపూర్, ఇబ్రహీంపూర్, దత్తాయి పల్లి, వేల్పుపల్లి
యాదగిరిగుట్ట మండలం: మల్లాపూర్, దాతర్‌పల్లి
భువనగిరి మండలం: భువనగిరి, రాయగిరి, కేసారం, పెంచికల పహాడ్, తుక్కాపూర్, చందుపట్ల, గౌస్ నగర్, ఎర్రంపల్లి, నందనం
వలిగొండ మండలం: పహిల్వాన్ పూర్, కాంచనపల్లి, టేకుల సోమరం, రెడ్లరేపాక, ప్రొద్దుటూరు, వర్కుట్ పల్లె, గోకారం, వలిగొండ
చౌటుప్పల్ మండలం: నేలపట్ల, చిన్న కొండూరు, తాళ్ల సింగారం, స్వాముల వారి లింగోతం, చౌటుప్పల్, లింగోజిగూడ, పంతంగి, తంగేడు పల్లి

Related News

Boduppal Incident: నవరాత్రుల్లో అపచారం.. అమ్మవారికి ఫ్రాక్ వేసిన పూజారి

Minister Komatireddy: తగ్గేదేలే.. మాకు ప్రజా సంక్షేమం ముఖ్యం.. మూసీ ప్రక్షాళనపై కోమటిరెడ్డి

KA Paul: హైడ్రాపై హైకోర్టుకు వెళ్లిన పాల్.. కూల్చివేత ఆపలేం కానీ..

Medigadda Repair Works: మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ల భారం ఎవరిది? నిర్మాణ సంస్థ మౌనానికి కారణం ఏంటి?

Konda Surekha: కేసీఆర్‌ను కేటీఆర్ చంపేశారేమో?

KVP: రండి మార్కింగ్ వేయండి.. నేనే కూల్చేస్తా.. సీఎం రేవంత్‌కు కేవీపీ లేఖ

Big Stories

×