EPAPER
Kirrak Couples Episode 1

Older Persons Day: వృద్ధుల కోసం అంగన్‌వాడీ తరహా కేంద్రాలు.. దేశంలో ఎక్కడెక్కడున్నాయో తెలుసా?

Older Persons Day: వృద్ధుల కోసం అంగన్‌వాడీ తరహా కేంద్రాలు.. దేశంలో ఎక్కడెక్కడున్నాయో తెలుసా?

International Day of Older Persons: విశ్వంలో విలువకట్ట లేనిది ఏదైనా ఉన్నదంటే అది ప్రాణం ఒక్కటే. మనకు జన్మనిచ్చి, మన భవిత కోసం తమ సుఖాల్ని, సంతోషాల్ని త్యాగం చేసిన పెద్దలు నేడు పిల్లల ఆదరణ కోసం పరితపించాల్సిన పాడు కాలం నేడు సమాజానికి దాపురించింది. మన సంస్కృతిలో తల్లిదండ్రులకు ఉన్నతమైన స్థానం ఉంది. ఉమ్మడి కుటుంబాలు ఉన్నంత కాలం దేశంలో వృద్ధుల జీవితాలు బాగానే సాగాయి. కానీ, 90వ దశకం తర్వాత వచ్చిన ప్రపంచీకరణ, నూతన ఆర్థిక, సామాజిక విధానాలు, మార్పులు మన ఉమ్మడి కుటుంబ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయటంతో వృద్ధుల జీవితాలు ప్రమాదంలో పడిపోయాయి. ఉద్యోగాల కోసం పిల్లలు విదేశాలకో లేదా సుదూర ప్రాంతాలకో వెళ్లిపోవటంతో ముదిమిలో అన్నీ ఉన్నా ఏమీలేని వారుగా పెద్దలు జీవించాల్సి వస్తోంది. కొందరు తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నా, నేటి ఆధునిక జీవనశైలి, నాగరికత వంటి అంశాలు పెద్దలు, పిల్లల మధ్య విభజన రేఖలుగా మారుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో పెద్దలు అన్నీ చెప్పుకోలేని పరిస్థితి ఉంది. ఇంకొందరు పలు కారణాల వల్ల తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్పించి చేతులు దులుపుకోవటం జరుగుతోండగా, కొందరు దుర్మార్గులు పెద్దలపై చేయి చేసుకొని హింసిస్తున్న ఘటనలూ అక్కడక్కడ సమాజం దృష్టికి వస్తూనే ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో పెద్దలు తమ కుటుంబ పరువు కారణంగా, పిల్లల వైఖరిని బయట చెప్పుకోలేక, ఇదేంటని నిలదీయలేక మనసులోనే కుమిలిపోతున్నారు.


వృద్ధుల పట్ల నేటితరం చూపిస్తున్న నిరాదరణను పరిగణనలోకి తీసుకుని 1984లో వియన్నాలో తొలిసారి వృద్ధుల సమస్యలపై అంతర్జాతీయ సదస్సు జరిగింది. ‘సీనియర్‌ సిటిజన్‌’ అనే పదాన్ని ఇక్కడే తొలిసారి వాడారు. సరిగ్గా ఆరేళ్ల తర్వాత 1990 డిసెంబర్‌ 14న ఐక్యరాజ్యసమితి వృద్ధుల కోసం ఒక నిర్దిష్ట ప్రణాళికను తయారుచేసి ప్రపంచ దేశాలన్నీ తప్పనిసరిగా అమలుచేయాలని ఆదేశించింది. తొలిసారి 1991 అక్టోబర్‌ 1న ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల దినోత్సవం నిర్వహించారు. 1999లో భారతదేశ ప్రభుత్వం వృద్ధుల సంక్షేమం కోసం ఒక జాతీయ ప్రణాళికను రూపొందించింది. ఇందులో వారి ఆహార భద్రత, ఆరోగ్యం, నివాసం వంటి అంశాలను ప్రతిపాదించినా అమలులో ఇది ఆశించిన ఫలితాలను అందించలేకపోయింది.

Also Read: పంచభక్ష పరమాన్నాలు అంటే ఏమిటి.. అందులో ఏమేమీ ఉంటాయో తెలుసా?


మన దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 60 ఏండ్లు దాటిన వృద్ధులు దాదాపు 11 కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడా సంఖ్య 14 కోట్లకు దగ్గరలో ఉంది. అంటే10 శాతం. 2036 నాటికి 15 శాతానికి అనగా సుమారు 22.7 కోట్లకు పెరుగుతుందని, 2050 నాటికి 20.8 శాతానికి అనగా సుమారు 34.7 కోట్లు కానుందని హెల్ప్ ఏజ్ ఇండియా, ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ వంటి సంస్థలు చెబుతున్నాయి. భారత్‌లో ఉమ్మడి కుటుంబ సంప్రదాయాలు విచ్ఛిన్నమైన ఈ సమయంలో, రాబోయే రోజుల్లో పెరగనున్న వృద్ధుల జనాభాకు తగినట్లుగా ప్రభుత్వాలు తగిన యాక్షన్ ప్లాన్‌తో సిద్ధం కావాలని ఐరాస సూచిస్తోంది. ముఖ్యంగా పేదరికంలో ఉన్న ఒంటరి వృద్ధ మహిళల ఆరోగ్య సంరక్షణ, గృహాలు,పెన్షన్‌ కోసం ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వాలు ఈ దిశగా ఇప్పటి నుంచే సిద్ధం కావాలని సంస్థ అభిప్రాయపడింది.

ఒడిసాలో అరవై ఏండ్లు దాటిన వృద్ధుల కోసం అంగన్‌వాడీ తరహా కేంద్రాలున్నాయి. రోజూ ఉదయాన్నే వృద్ధులు అక్కడికి చేరుకుని, పప్పుతో కూడిన భోజనం చేసి వెళుతుంటారు. అక్కడ వయోవృద్ధుల ఆకలి బాధ తీర్చడానికి ఒక్కోక్కరికి 200 గ్రాముల అన్నం, 50 గ్రాముల వవ్పు నిత్యం అందజేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నెలకు వృద్ధాప్య పెన్షన్ అందించటం ద్వారా కొంత ఆర్థిక భరోసాను ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. హర్యానా, తమిళనాడు రాష్ట్రాల్లో 60 ఏళ్లు దాటిన మహిళలకు రోడ్డు రవాణాసంస్థ బస్సుల్లో 50శాతం రాయితీ ఇస్తున్నారు. వ్రతీ డివిజన్‌లో ఆశ్రమం, సీనియర్‌ సిటిజన్‌ క్లబ్బుల ఏర్పాటు, ఉచిత పైద్యసేవలు అందుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో వృద్ధుల సంక్షేమం కోసం వ్రత్యేక శాఖలు వనిచేస్తున్నాయి. మహారాష్ట్రలో 75 శాతం, తమిళనాడు, పంజాబ్, రాజస్థాన్‌లలో 50 శాతం, రాజస్థాన్‌లో 25 శాతం రాయితీ ఇస్తున్నారు. వృద్ధుల శ్రేయస్సు దిశగా అనేక దేశాలు చట్టాలు చేసిన యాభై ఏళ్ల తరువాతగానీ భారతదేశం మేలుకోలేదు. ఎట్టకేలకు 2007లో ‘తల్లిదండ్రులు -పెద్దల పోషణ, సంక్షేమ చట్టం’ అమలులోకి వచ్చింది. ఈ చట్టంలోని రెండో సెక్షన్‌ ప్రకారం వృద్ధులు, తల్లిదండ్రుల పోషణ బాధ్యత వారి పిల్లలది. సంతానం లేకపోతే సమీప వారసత్వ బంధువులది. సెక్షన్‌ 4 ప్రకారం తల్లిదండ్రులు, వృద్ధులు తమ పోషణ ఖర్చులను ఇవ్వాల్సిందిగా తమ పిల్లలను లేదా వారసత్వ బంధువులను అడిగే హక్కుంది. ఈ హక్కు కోసం రెవిన్యూ డివిజనల్‌ అధికారి నేతృత్వంలోని ట్రైబ్యునల్‌ను ఆశ్రయించవచ్చు. దరఖాస్తు వచ్చిన 90 రోజుల్లోపు పోషణ ఖర్చుల చెల్లింపునకు ఆ ట్రైబ్యునల్‌ ఆదేశాలు ఇవ్వవలసి ఉంటుంది. ఈ చట్టంలోని 21వ సెక్షన్‌ ప్రకారం పోలీసులు వృద్ధుల ప్రాణాలకు, ఆస్తులకు సంపూర్ణమైన రక్షణ కల్పించాలి. అయినా, చట్టం కాగితాలకే పరిమితం కావడంతో వృద్ధుల సమస్యలు తీరటం లేదు. అనేక రాష్ట్రాల్లో ఈ చట్టం కింద కేసులూ పెద్దగా నమోదు కావటం లేదు. తల్లిదండ్రుల్ని పట్టించుకోనివారికి మూడు నెలల వరకు జైలు, అయిదు వేల రూపాయల జరిమానా లేదా రెండూ విధించే అధికారాన్ని ట్రిబ్యునళ్లకు ఈ చట్టం కల్పించినా, కన్నపేగు మీద మమకారంతో నేటికీ చాలామంది పెద్దలు తమ పిల్లల మీద కేసులు నమోదు చేసేందుకు రావటం లేదు.

Also Read: వంటింట్లో ఉండే పచ్చి కొబ్బరిని ఒక్క సారి వాడితే.. బ్యూటీ పార్లర్‌కు వెళ్లాల్సిన అవసరమే ఉండదు

సమాజానికి మార్గదర్శకులుగా భావించబడే వృద్ధులను ప్రస్తుతం ఒక అనుత్పాదక వర్గంగా, భారంగా సమాజంలోని కొందరు భావించటమే అన్నింటికంటే పెద్ద సమస్య. వారి కష్టంతో మన జీవితాలకు ఒక దారి ఏర్పరిచి, వారి కంటే మనం బాగా బతకాలని స్వప్నించిన తరం అది. నేడు మనం మన పిల్లలను పసితనంలో ఎంతగా సాకుతున్నామో.. అంతే ప్రేమగా మన పసితనంలో వాళ్ళు మనల్ని పెంచారని మరచిపోవటం సరికాదనే భావన సమాజంలో పెరిగితే, వృద్ధాప్యం ఎవరికీ శాపం కాబోదు.

Related News

World Heart Day: అతిగా పని చేయడం వల్ల మీ గుండె ఆరోగ్యం దెబ్బ తింటుందని మీకు తెలుసా

After Meals: పొట్ట రోజు రోజుకి పెరిగిపోతోందా? భోజనం చేశాక 20 నిమిషాల పాటు ఈ పని చేయండి, బరువు త్వరగా తగ్గుతారు

Panchabhakshya Paramannalu: పంచభక్ష పరమాన్నాలు అంటే ఏమిటి.. అందులో ఏమేమీ ఉంటాయో తెలుసా?

Milk Face Pack: పచ్చిపాలతో మీ అందం రెట్టింపు.. ఈ నేచురల్‌ మిల్క్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి

Chicken Wings: మీకు చికెన్ వింగ్స్ అంటే ఇష్టమా? ఆ రెసిపీని ఇంట్లోనే చాలా సులువుగా చేసుకోవచ్చు

Akukura Biryani : నాన్ వెజ్ బిర్యానీ బోర్ కొట్టిందా.. ఒక్కసారి ఈ ఆకు కూరతో బిర్యానీ ట్రై చేయండి.. అదిరిపోతుంది

Big Stories

×