EPAPER
Kirrak Couples Episode 1

Tirupati Laddu Controversy: ఎంత అపచారం.. తిరుమల కొండపై ఇన్ని పాపాలా? వడ్డికాసులవాడు చక్రవడ్డీతో సహా తిరిగిచ్చేస్తాడా?

Tirupati Laddu Controversy: ఎంత అపచారం.. తిరుమల కొండపై ఇన్ని పాపాలా? వడ్డికాసులవాడు చక్రవడ్డీతో సహా తిరిగిచ్చేస్తాడా?

Tirupati Laddu Controversy: తిరుమల అంటే కలియుగ వైకుంఠం.. వెంకటేశ్వరుడు అంటే కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలుచుకుంటారు అశేషభక్తజనం. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా తిరుమల విరాజిల్లుతుంటుంది. అందుకే అక్కడ నిత్య కల్యాణం, పచ్చతోరణం అన్నట్లుగా స్వామి వారి సన్నిధి భక్తజనం, వేద మంత్రోచ్ఛరణాలతో కళకళలాడుతుంటుంది. మరి అలాంటి అత్యంత పరమ పవిత్రమైన సన్నిధిలో అపచారాలు జరిగితే.. అంతకు మించిన మహా పాపం మరొకటి ఉండదు. కానీ గత ఐదేళ్లు ఇవే పాపాలు జరిగాయి. వాటిపై శ్రీనివాసుడు ఊరుకుంటాడా.. ఎవరి లెక్కలు వారికి ఇచ్చేశారని అంటున్నారు.


తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే చాలా పవర్ ఫుల్ గాడ్. ఎప్పటి లెక్కలు అప్పుడే సెట్ చేస్తాడు. అంటే ఇప్పుడు పాపం చేస్తే వచ్చే జన్మ కాదు, ఈ జన్మలోనే వారి అకౌంట్లు సెట్ చేస్తాడన్న పేరుంది. ఆర్తులకే ఆపదమొక్కుల వాడు. అన్యాయం చేసిన వారికి మాత్రం కాదని చాలా సందర్భాల్లో రుజువు చేసుకున్నాడు కూడా. అత్యంత పవర్ ఫుల్ గాడ్ తిరుమలేశుడే. ఎందుకంటే ఇప్పటికీ రోజూ 70 వేలకు తగ్గకుండా భక్తజనం వస్తున్నారంటే ఆయన మహిమలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. ఈ భూమ్మీద ఉన్న విగ్రహాలన్నిట్లో కంటే తిరుమల కొండపై ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి విగ్రహం చాలా శక్తిమంతమైంది. స్వామి వారిని రెప్పపాటు దర్శనం చేసుకున్న వారు మనసులో అనుకున్నది జరుగుతుంది. అందుకే కలియుగ ప్రత్యక్ష దైవంగా వెంకటేశ్వరస్వామిని అశేష భక్తజనం కొలుస్తుంటారు. అంతటి నమ్మకం కూడా. ఇది శతాబ్దాలుగా వస్తున్న నమ్మకం.

తిరుమల కొండ కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతోందంటే కారణం. అక్కడి ఆధ్యాత్మిక వాతావరణమే. ఆనంద నిలయంలో సువర్ణ కాంతులతో కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు స్వామివారు. భక్త ప్రియుడైన వెంకటేశ్వర స్వామి స్వయం వ్యక్తమై వెలిశారని ఆగమ శాస్త్రం సహా అనేకానేక పురాణాలు చెబుతున్నాయి. ఆనంద నిలయంలో కొలువైన శ్రీ శ్రీనివాసునికి నిత్య, వార, పక్ష, మాస, సాలకట్ల ఉత్సవాలు ఆగమ శాస్త్రం అనుసారం సాగుతూ వస్తుంది. స్వామి వారికి అలంకరించే పుష్పాల నుంచి, అభిషేకం, నైవేద్యం, అర్చన, సేవలు ఇలా ఆలయంలో నిర్వహించే ప్రతి పని ఆగమ శాస్త్రం ప్రకారమే నిర్వహించాలి. శ్రీ వైఖాసన మహర్షి రచించిన ఆగమ శాస్త్రంలో శేషాచల పర్వతం ఎంతో మహిమగల పర్వతం. అలాంటి పర్వతంపై శ్రీ మహా విష్ణువు అర్చవతార మూర్తిగా వెలిశారని ఆగమం చెప్తుంది. తిరుమలలో వేంకటేశ్వరస్వామి కొలువైన ఆలయం మహిమాన్విత శక్తి కలిగినది. వైకుంఠంలోని క్రీడాద్రి పర్వతాలే తిరుమల క్షేత్ర పర్వతాలు. ఆలయంలో శ్రీవారు దివ్యశక్తితో ఉంటారు. దీన్ని వెంకటేశ్వరస్వామి భక్తులు గ్రహించగలుతారు. వేంకటేశ్వరస్వామితో సరిసమానమైన దేవుడు కానీ, తిరుమలతో సరిసమానమైన క్షేత్రం కానీ ఈ భూమండలంలోనే లేవని పురాణాలు చెబుతున్న మాట మరి అలాంటి పరమ పవిత్రమైన క్షేత్రంలో గత ఐదేళ్లు ఏం జరిగింది?


ఎంతో చరిత్ర, ఎంతో మహిమాన్వితమైన తిరుమల శ్రీనివాసుని దివ్య ధామంలో గత ఐదేళ్లు చాలా అపచారాలు జరిగాయన్నది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా లడ్డూ వివాదం తెరపైకి వచ్చిన తర్వాత గత ఐదేళ్లు జరిగిన అరాచకాల గురించి కూడా చర్చ జరుగుతోంది. నిజానికి భక్తప్రియుడైన వెంకటేశ్వర స్వామి… అన్యాయాలు జరుగుతుంటే చూస్తూ ఊరుకోడు అన్నది చాలా మంది నమ్మకం. స్వయంగా తాను వెలసిన కొండపై అపచారాలు, అన్యాయాలు, ఆగమ శాస్త్రానుసారం కాకుండా ఇష్టానుసారం కైంకర్యాలు, కార్యక్రమాలు జరుగుతుంటే ఊరుకుంటాడా. వడ్డీ కాసుల వాడు చక్రవడ్డీతో సహా తీర్చేస్తాడని ఇప్పటికే చాలా మంది భక్తులు అనుకుంటున్నారు. స్వామి వారి దర్శనం కాకపోతే లడ్డూ ప్రసాదంలోనే స్వామి వారిని చూసుకుని మొక్కి మహా ప్రసాదాన్ని తీసుకుంటారు. అలాంటి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందన్న విషయం భక్తుల మనోభావాలను, మనసులను కలిచివేసింది. శ్రీనివాసుడికి ఇన్నాళ్లూ నైవేద్యం పెట్టింది, భక్తులకు పంచి పెట్టింది ఈ ప్రసాదమేనా అన్న విషయం చాలా మంది మనోభావాలను దెబ్బతీసింది కూడా.

Also Read: తిరుమల లడ్డూ వివాదం.. జరగబోయేది ఇదేనా?

ఇదొక్కటే కాదు కొండపై లెక్కలేనన్ని అపచారాలు జరిగాయన్న లెక్కలు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. అసలు హైందవం గురించి పెద్దగా తెలియని వారిని అందలమెక్కించారని, శ్రీనివాసుడి భక్తులను కాకుండా ఇతరులకు పట్టం కట్టారన్న చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున సాగుతోంది. వెంకటేశ్వరుడంటే భయం భక్తి లేని వారే కొండపై ఆడింది ఆట పాడింది పాటగా ఇన్నాళ్లూ వ్యవహారాలు నడిపారన్న ఆరోపణలు చేస్తున్నారు. సామాన్య భక్తులను స్వామి వారికి దూరం చేసే కార్యక్రమం గత ఐదేళ్లుగా జరిగిందంటున్నారు. శ్రీవాణి టిక్కెట్ల పేరుతో ధనికులకే సత్వర దర్శనాల దగ్గర్నుంచి అంతా వారికే అన్నట్లుగా కార్యక్రమాలు నడిచాయి. తిరుమలలో ఆగమశాస్త్ర నియమాలు పాటించడం లేదని, శాస్త్ర నియమాలకు విరుద్ధంగా పని చేస్తున్నారని, సొంత ప్రణాళిక ప్రకారం టీటీడీ అధికారులు వ్యవహరిస్తున్నారని, ధనికులైన భక్తులకే ప్రాధాన్యత ఇస్తున్నారని, వీఐపీల సేవలో అధికారులు తరిస్తున్నారని, టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు గతంలోనే అలర్ట్ చేశారు.

తిరుమల కొండపై పవిత్రత చాలా ముఖ్యం. ఏ పని జరిగినా ఆగమ శాస్త్రం ప్రకారం జరగాలి. ఈ ఆగమ శాస్త్ర నిబంధనలు టీటీడీకి పూర్తిగా తెలుసు. తిరుమలకు వచ్చే హైందవేతరులు ఎవరైనా రూల్స్ 136, 137 ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ నియమాన్ని పాటించేలా చూడడంలో జాగ్రత్తలు తీసుకోలేదు. శ్రీవేంకటేశ్వర స్వామికి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించే సమయంలో ఆగమ శాస్త్ర విధానాలను అనుసరించాలని నాలుగేళ్ల క్రితం ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైందంటే పరిస్థితులు ఎలా మార్చేశారో అర్థమవుతోంది. తిరుమలలో మద్యం, మాంసంపై నిషేధం ఉన్నప్పటికీ కొందరు యధేచ్ఛగా కొండపైకి తెచ్చుకున్నారు. తనిఖీల్లో దొరికారు కూడా. అసలు ఇవన్నీ కొండపైకి ఎలా వచ్చాయంటే ఎవరూ జవాబు చెప్పలేకపోయారు. చాలా సందర్భాల్లో మద్యం, సిగరెట్లతో తిరుమలలో పట్టుబడ్డారు. ఆ ఘటనలపై భక్తులు అసహనం వ్యక్తం చేశారు కూడా. కొండపై వెళ్లే మార్గాల్లోనూ సిగరెట్లు తాగుతూ కనిపించిన వీడియోలు బయటికొచ్చాయి. అంటే తనిఖీలు తూతూ మంత్రంగానే జరిగాయా అన్నది అప్పట్లోనే తీవ్ర వివాదాస్పదంగా మారింది. సహకరించే వారు సహకరించారు.. వచ్చేవన్నీ కొండపైకి ఈజీగా వచ్చేశాయన్న మాట. ఎంత భయంలేకపోతే ఇలా జరుగుతుంది అని అప్పట్లో చాలా మంది భక్తులు ప్రశ్నించారు కూడా.

ఇవే కాదు చాలా అపచారాలు కొండపై జరిగాయన్నది ఇప్పుడు సగటు భక్తున్ని మనోవేదనకు గురి చేస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయ మాడవీధుల్లోకి CMO స్టిక్కర్ ఉన్న ఓ ఇన్నోవా వాహనం రావడం గతేడాది చర్చనీయాంశమైంది. ఇన్నోవాపై CMO స్టిక్కర్ ఉండటంతో భద్రతా సిబ్బంది చూసీ చూడనట్టు వదిలేశారు. ఎవరూ అడ్డు చెప్పకపోవడం ఆ వాహనం ఏకంగా మాఢ వీధుల్లోకే వచ్చింది. శ్రీవారు భక్తజనులను అనుగ్రహిస్తూ ఊరేగే మాఢ వీధుల్లో పరిస్థితి ఎలా మారిందో ఆ ఘటన రుజువు చేసింది. అప్పుడు శ్రీవారి ఆలయ భద్రతపైనా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇక తిరుమల శ్రీవారి ఆనంద నిలయంపై నుంచి ఏమీ ఎగరడానికి వీల్లేదు. ఏ వస్తూవూ ఉండొద్దు. అలాంటిది చాలా సార్లు విమానాలు ఎగిరాయి. శ్రీవారి ఆలయం పైనుంచే వెళ్లాయి. భక్తులు తీవ్ర ఆవేదనకు గురైనా తిరుమల నో ఫ్లై జోన్ కాదన్న మాటలే వినిపించాయి.

ఇక పరమ పవిత్రమైన తిరుమల క్షేత్రం ఆనంద నిలయాన్ని వీడియో కెమెరాలతో షూట్ చేయడం మహా తప్పిదం. కానీ గత ప్రభుత్వ హయాంలో టీటీడీ ఇంజినీరింగ్ విభాగం వివిధ పనుల కోసం సర్వే చేసేందుకు ఓ సంస్థకు పనులు అప్పగిస్తే, ఆ సంస్థ ఉద్యోగులు ఏకంగా ఆనంద నిలయాన్ని డ్రోన్ తో షూట్ చేశారు. ఆ వీడియోలు చాలా వైరల్ అయ్యాయి. దీనిపై అప్పట్లో పెద్దలంతా గప్ చుప్. కల్యాణ వేదిక, ఆక్టోపస్‌ కొత్త భవనం, శ్రీవారి సేవా సదన్‌ ప్రాంతాల్లోనే సర్వే చేపట్టాల్సి ఉండగా… ఆ ప్రతినిధులు శ్రీవారి ఆస్థాన మండపం వద్దకు చేరుకుని అక్కడి నుంచి డ్రోన్‌ను ఎగరేసి షూట్ చేశారు. వాటిని తప్పు పట్టాల్సింది పోయి ఆ వీడియోలు, ఫోటోలు ఒరిజినలా లేద యానిమేట్ చేశారా గ్రాఫిక్స్ వాడారా అన్నది తేల్చేందుకు ఫోరెన్సికర్ ల్యాబ్ కు పంపించారు. అదీ పరిస్థితి.

తిరుమల పాపవినాశనం మార్గంలోని పార్వేట మండపం నిర్మాణం విషయంపైనా చాలా దుమారమే నడిచింది. జీర్ణావస్థకు చేరుకోవడంతో ఆ మండపాన్ని పునరుద్ధరిస్తున్నామని.. నాటి ఈవో ధర్మారెడ్డి సమర్థించుకున్నారు. పాపవినాశన మార్గంలో ఉన్న పార్వేట మండపం అతి పురాతనమైంది. ఏటా కార్తీక వన భోజనాల సమయంలోను, సంక్రాంతి మరుసటి రోజున జరిపే పార్వేట ఉత్సవం సమయంలోనూ ఉత్సవమూర్తులను ఈ మండపంలో కొలువుదీర్చి స్నపన తిరుమంజనం నిర్వహిస్తుంటారు. ఈ మండపం చాలా పురాతనమైనదని.. చాలా ప్రాశస్త్యం ఉందని.. టీటీడీ కూల్చివేయడం దారుణమంటూ వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేసినా నాడు వినలేదు.  మ్యాటర్ అక్కడితో ఆగలేదు. స్వయంగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచారానికి సైతం వేదికగా మార్చుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. తిరుమల పవిత్రను కాపాడాల్సిన నాటి ఛైర్మన్ భూమన తన కుమారుడికి ఓటు వేసి గెలిపించాలంటూ కుల సంఘాలతో సమావేశం నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

Related News

YS Jagan: పిన్నెల్లే దిక్కయ్యారా?.. జగన్ వ్యూహమేంటి?

Israel-Hezbollah conflict: రగిలిపోతున్నఇజ్రాయెల్ హిజ్బుల్లా బూడిదే!

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదం.. జరగబోయేది ఇదేనా?

High Tension At Anantapur: టెన్షన్ లో అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు.. ఎందుకంటే..?

Katipally Venkataramana Reddy: ఆరు నెలలకే కథ రివర్స్.. అయోమయంలో కాటిపల్లి

Tirupati Laddu Sanctity Restored: తిరుమలలో దోషం ఎలా పోగొట్టారంటే..

Big Stories

×