EPAPER
Kirrak Couples Episode 1

Nandagiri Hills: నెట్ నెట్ వెంచర్స్.. అడ్డగోలు నిర్మాణాలకు కేరాఫ్..!

Nandagiri Hills: నెట్ నెట్ వెంచర్స్.. అడ్డగోలు నిర్మాణాలకు కేరాఫ్..!

– నివాస కాలనీలో 20 అంతస్తుల వాణిజ్య భవనం
– అనుమతులేమో జీ + 4
– కడుతోంది మాత్రం జీ + 13
– 6 వేల కార్లు, 2 వేల బైకుల పార్కింగ్‌కు సెల్లార్లు
– ఇష్టం వచ్చినట్టు 2 లక్షల అడుగుల కెపాసిటీతో నిర్మాణాలు
– 100 మీటర్ల లోతునున్న బండరాళ్లు సైతం పెకిలింపు
– 2021 నుంచి అడిగిన వెంటనే అనుమతులు
– పదేళ్లుగా మొద్దు నిద్రలో అధికారులు
– విజిలెన్స్‌ విచారణలో నిర్ధారణ.. బిల్డర్‌పై కేసు
– అడ్డగోలు అనుమతులిచ్చిన అధికారులపై చర్యలకు సిఫారసు
– హైడ్రా దగ్గరకు వెళ్తామంటున్న చుట్టుపక్కల ప్రజలు


దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809

Violations of rules in building constructions in Nandagiri Hills: హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్కుకు కూతవేటు దూరం. జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 45కు దగ్గర ప్రాంతం. నందగిరి హిల్స్‌లో 20 అంతస్తుల నిర్మాణం. జీహెచ్ఎంసీ అధికారులను మచ్చిక చేసుకుని, 2013లో జీ + 4కు అనుమతి పొందిన యజమాని 2023 వరకు దశల వారీగా దీనిని నిర్మిస్తున్నారు. జీహెచ్ఎంసీ, కేంద్ర వన్యప్రాణి చట్టం మొదలు పదికి పైగా చట్టాలను ఉల్లంఘిస్తూ పదేళ్లుగా సాగుతున్న ఈ భారీ నిర్మాణంతో కేబీఆర్ పార్క్‌లోని అరుదైన వన్యప్రాణుల ఉనికి ప్రమాదంలో పడటమే గాక, రెండు కిలోమీటర్ల పరిధిలో ఉన్న వాతావరణం కాలుష్య భరితంగా మారనుందని స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు. తక్షణమే ఈ నిర్మాణాన్ని ఆపి ఇక్కడి పర్యావరణాన్ని కాపాడాలని తెలంగాణ ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు.


జరిగింది ఇదే!

షేక్‌పేట్‌ మండల పరిధిలోని నందగిరి హిల్స్‌ కాలనీలోని ప్లాట్ నెంబర్ 1లో 4.748 ఎకరాల భూమి ఉంది. 2012లో హెచ్‌ఎండీఏ నుంచి హుడా వేలంలో నెట్‌ నెట్‌ వెంచర్స్‌ సంస్థ దీన్ని దక్కించుకుంది. ఈ కంపెనీ ఓనర్ జీ అమరేందర్‌ రెడ్డి. అక్కడ 12 అంతస్తుల (జీ + 4, 7 సెల్లార్లు) నిర్మాణం చేపట్టేందుకు 2013లో జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతి పొందింది. తర్వాత 2015లో దీనికి ఆనుకుని ఉన్న జూబ్లీహిల్స్‌ హౌజింగ్‌ సొసైటీలోని 411 చదరపు గజాల భూమిని, దాని పక్కనే ఉన్న మరో 455 చదరపు గజాలను 2021లో నెట్ నెట్ వెంచర్స్ కొనుగోలు చేసింది. రెండు దఫాలుగా 866 చదరపు గజాల భూమిని దక్కించుకున్నారు అమరేందర్ రెడ్డి. ఈ రెండూ జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్ 45కు ఆనుకునే ఉండటం, వీటి వెనకనే తమ నెట్‌ నెట్‌ వెంచర్స్‌ స్థలం ఉండటంతో భారీ కాంప్లెక్స్ నిర్మాణానికి పూనుకున్నారు. ఈ క్రమంలో రోడ్డు నెంబర్ 45కు ఇరువైపులా ఉన్న స్థలాల్లో నిర్మాణాలకు కొంత వెసులుబాటు కలిగిస్తూ 2017లో ప్రభుత్వం జీవో 305 విడుదల చేసింది. దాని ప్రకారం, రోడ్డుకు ఇరువైపులా ఉన్న స్థలాల్లో 30 మీటర్ల వరకు నిర్మాణాలు చేసుకునే వెసులుబాటు కలిగింది.

జీ + 4 కు బదులు జీ + 13

ప్రభుత్వ నిబంధన జూబ్లీహిల్స్‌ హౌజింగ్‌ సొసైటీ లే అవుట్‌కు మాత్రమే వర్తిస్తుంది. దాని వెనుక ఉన్న హుడా లే అవుట్‌ (హెచ్‌ఎండీఏ నుంచి కొనుగోలు చేసిన స్థలం)కు వర్తించదు. అయినా, ఆ నిబంధనను ఉల్లంఘించి తమకు 30 మీటర్లలో నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటూ నెట్‌ నెట్‌ వెంచర్స్‌ దరఖాస్తు పెట్టుకుంది. 2013లో 30 మీటర్లలో జీ + 4కు అనుమతి సంపాదించి 2023 వరకు దశలవారీగా ఒక సెల్లార్‌, 5 స్టిల్టులతో కలిపి జీ + 13 భవనాన్ని (అంటే మొత్తం 20 అంతస్తులు) నిర్మించింది. 2,09,620 చదరపు అడుగుల విస్తీర్ణంలో గల ఈ బహుళ అంతస్తుల భవనంలో సెవెన్‌ స్టార్‌ హోటల్‌, మల్టీప్లెక్స్‌, షాపింగ్‌ మాల్‌ నిర్మాణాన్ని చేపట్టింది నెట్ నెట్ వెంచర్స్ సంస్థ.

విజిలెన్స్ నివేదికలో కీలక అంశాలు

ఈ ఏడాది జూన్ 24న జీహెచ్ఎంసీ విజిలెన్స్ విభాగం ఈ కాంప్లెక్స్ నిర్మాణంలో జరిగిన అనేక అవకతవకలను బయటపెట్టింది. నందగిరి హిల్స్ సొసైటీ నియమాల ప్రకారం, అక్కడి ప్లాట్లలో ఇళ్లు మాత్రమే కట్టుకోవాలి. ఒకవేళ ఇతరత్రా నిర్మాణాలు చేపట్టాలంటే సొసైటీ అనుమతి అవసరం. కానీ, అవేమీ లేకుండానే ఈ నిర్మాణం సాగింది. కాంప్లెక్సులో ఏకంగా 6 వేల కార్లు, 2 వేల టూవీలర్ పార్కింగ్ ఉండటంతో దీనివల్ల కేబీఆర్‌ పార్క్‌ పర్యావరణానికి తీవ్ర ఇబ్బంది కలగనుందని, వాహనాల శబ్ధాలు, హారన్లు, కాలుష్యంతో, ప్రజలతోపాటు పార్క్‌లో వన్య ప్రాణుల ఉనికి ప్రమాదంలో పడనుందని అధికారులు గుర్తించారు. 115 మీటర్ల ఎత్తులో వచ్చే ఈ నిర్మాణంతో అక్కడి వాతావరణం పూర్తిగా దెబ్బతింటుందని సొసైటీ వాసులు ఆరోపిస్తున్నారు. ఈ నిర్మాణం కోసం 100 మీటర్ల లోతు వరకు రాళ్లను బ్లాస్టింగ్‌ చేస్తున్నారని, అందుకు అనుమతులు లేవని చెబుతున్నారు. మరోవైపు, జూబ్లీహిల్స్‌ సొసైటీ నుంచి కొనుగోలు చేసిన రెండు ప్లాట్లను కాంప్లెక్సుకు వెళ్లే దారిగా చూపించారు. రోడ్డు నెంబర్ 45 కమర్షియల్‌ రోడ్డు కనుక ఇక్కడ 30 మీటర్ల ఎత్తు వరకూ మాత్రమే భవన నిర్మాణాలకు అనుమతిస్తారు. ఇంపాక్ట్‌ ఫీజు కడితే మరిన్ని అంతస్తులకు జీహెచ్ఎంసీ అనుమతినిస్తుంది. కానీ, హుడా లే అవుట్‌లో మాత్రం 15 అంతస్తులకే అనుమతి ఉంటుంది. కానీ, నాటి జీహెచ్‌ఎంసీ అధికారులు నిబంధనలకు వ్యతిరేకంగా, ఇంపాక్ట్ ఫీజు కట్టించుకుని, హుడా లే అవుట్‌లోని స్థలంలోనూ 45 మీటర్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చేశారు. ఇందులో ఆర్‌సీసీ శ్లాబులు 4.5 మీటర్ల ఎత్తులోనే ఉండాల్సి ఉండగా, 5 మీటర్ల వరకు ఉండొచ్చంటూ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు అనుమతి ఇవ్వడమూ నిబంధనల ఉల్లంఘనే. జీహెచ్‌ఎంసీ అధికారులు బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ ప్రత్యేక నిబంధనలను ఉల్లంఘించారు. జీవో 168 ప్రకారం భవనం ఎత్తును రోడ్డు నుంచి కొలవాలి. పిట్టగోడ, వాటర్‌ ట్యాంకు వంటి వాటిని ఎత్తు నుంచి మినహాయించాలి. కానీ, భవనం ఎత్తును తప్పుగా కొలిచారు. ఈ కాంప్లెక్స్‌లో 5 సెల్లార్లు నిర్మించారు. 2021లో జీహెచ్‌ఎంసీ సిబ్బంది సెల్లార్లను 5 స్టిల్టులుగా చూపించేశారు. కనీసం 10 మీటర్ల మేర సెట్‌బ్యాక్‌లు ఉండాలి. కానీ, ఇక్కడి సెల్లార్లను సెట్‌బ్యాక్‌ లేకుండానే ఇష్టం వచ్చినట్టు కట్టేశారు. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం, నిర్మిత ప్రాంతం 1.50 లక్షల చదరపు అడుగుల లోపు ఉండే భవనాలకు పబ్లిక్‌ హియరింగ్‌ నుంచి మినహాయింపు ఉంటుంది. కానీ, ఈ భవనం 2,09,620 చదరపు అడుగులు. అందువల్ల స్థానికుల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా, వారి అభ్యంతరాలను పట్టించుకోకుండానే ఈసీ జారీ చేయటం చట్ట విరుద్ధం. ఈ నేపథ్యంలో స్థానికులు ఫిర్యాదులు చేశారు. ఎన్టీజీ వరకు వెళ్లారు.

Also Read: TTD Assets : టీటీడీ ఆస్తులు, ఆభరణాల సంగతేంటీ? జగన్ టీమ్‌పై సందేహాలు.. చంద్రబాబుకు పవన్ లేఖ!

హైడ్రాకు ప్రత్యేక వినతి

నగరంలో అక్రమ కట్టడాలను చిన్నా పెద్దా తేడా లేకుండా కూల్చేస్తోంది హైడ్రా. ఇదేవిధంగా నందగిరి హిల్స్ సొసైటీలో జరుగుతున్న ఈ అక్రమ కట్టడాలను కూడా కూల్చివేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇందులో చట్టాల ఉల్లంఘన భారీగా జరిగిందని వివరిస్తున్నారు.

‘స్వేచ్ఛ’తో మాట్లాడిన సొసైటీ ప్రెసిడెంట్

మా కాలనీలోని ప్లాట్ కొని, దానికి ఆనుకుని ఉన్న జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లోని రెండు బిట్లు కలుపుకుని 20 అంతస్తుల కాంప్లెక్స్ కడుతున్నారు. జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు ఒకలా తీసుకుని మరోలా నిర్మాణాలు సాగుతున్నాయి. ఈ స్థలానికి ఆనుకుని ఉన్న సహజ సిద్ధమైన కొండవాలు(లోయ)ను సైతం జీహెచ్ఎంసీకి పెనాల్టీ కట్టేసి సొంతం చేసుకుని అక్కడా నిర్మాణాలు చేపట్టడంతో పక్కనే ఉన్న కేబీఆర్ పార్కు ఉనికి ప్రమాదంలో పడనుంది. ఇంత జరిగినా, గత పదేళ్లలో జీహెచ్ఎంసీ దీనిని చూసీ చూడనట్లు వదిలేసింది. నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మితమవుతున్న ఈ కాంప్లెక్స్ రాకతో నందగిరి హిల్స్ కొండ ఉనికే ప్రమాదంలో పడనుంది. కోర్టులో విచారణ జరుగుతున్నా, విజిలెన్స్ విభాగం నివేదిక ఇచ్చిన తర్వాత కూడా రాత్రీ పగలూ తేడా లేకుండా పనులు సాగుతూనే ఉన్నాయి. ఎన్జీటీకి ఫిర్యాదు చేశాం. అనుమతులు ఆరు నెలలు దాటినందున వారు మళ్లీ దరఖాస్తు చేయాలన్నారు. దీనిపై హైడ్రాకూ ఫిర్యాదు చేయబోతున్నాం.
– అధ్యక్షులు, నందగిరి హిల్స్ సొసైటీ

Related News

Kimidi Family Cold War: కిమిడి ఫ్యామిలీ వార్.. 40 ఇయర్స్ ఇండస్ట్రీలో కత్తులు దూసుకునే రాజకీయం

DY CM Pawan Kalyan: పవన్ ప్రాయశ్చిత దీక్షవెనుక ఇంత కథ ఉందా ?

Telangana BJP: అభయ్ ఆగయా.. టీ బీజేపీకి వెన్నులో వణుకు?

KA Paul And JD Lakshmi Narayana: సరిపోయారు ఇద్దరూ.. విశాఖ నుండి ఔట్?

Khajaguda Land Kabja: ఖాజాగూడలో కబ్జా బాగోతం.. రూ.3000 కోట్ల భూమి ఖతం.. ఆ మాజీ మంత్రే సూత్రధారా?

మేఘా అవినీతి ముసుగులో అధికారులు..!

Big Stories

×