EPAPER
Kirrak Couples Episode 1

BRS BC Plan: బీసీ మంత్రాన్ని జపిస్తోన్న బీఆర్ఎస్.. కాంగ్రెస్ పోస్ట్ తో కేటీఆర్ కామెంట్స్ వైరల్

BRS BC Plan: బీసీ మంత్రాన్ని జపిస్తోన్న బీఆర్ఎస్.. కాంగ్రెస్ పోస్ట్ తో కేటీఆర్ కామెంట్స్ వైరల్

BRS Plan for Localbody Elections: చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అనే సామెత ఇప్పుడు బీఆర్‌ఎస్‌ పార్టీకి అతికినట్లు సరిపోతుంది. గత ఎన్నికల్లో చేజేతులా కొన్ని వర్గాలను దూరం చేసుకున్న బీఆర్ఎస్ తన గొయ్యి తానే తవ్వుకుంది. ఈటలపై కోపంతో ఆయన సామాజికవర్గానికి చెందిన ముదిరాజ్‌లకు కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. దాంతో ఆ వర్గంతో పాటు బీసీల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు తీరిగ్గా జ్ఞానోదయం అయినట్లు బీసీలను దగ్గర చేసుకునే పనిలో పడ్డారు కేటీఆర్.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అయిన పరువు కాపాడుకోవడానికి బీసీలపై తెగ ప్రేమ ఒలకపోస్తున్నారాయన.


తెలంగాణలో బీసీ జనాభా దాదాపు 56 శాతం.. రాష్ట్రవ్యాప్తంగా యాదవ, గౌడ, ముదిరాజ్ ఇలా బీసీ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు అన్ని సెగ్మెంట్లలో కీలకంగా ఉన్నారు. ఎన్నిక ఏదైనా రాష్ట్రంలో డిసైడింగ్‌ ఫ్యాక్టర్‌ మాత్రం బీసీలే.. ఆయా వర్గాల ఓట్లు 50 శాతానికి పైగా ఉంటాయని గణాంకాలు చెప్తున్నాయి. అయితే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ బీసీలను దూరం చేసుకుని అధికారం కోల్పోయింది. ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై కోపంతో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆ సామాజికవర్గానికి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. ఆ ఇంపాక్ట్ ఎన్నికల ఫలితాల్లో స్పష్టం కనిపించింది.

అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలంతా గంపగుత్తగా కాంగ్రెస్‌వైపు మళ్లడంతో గులాబీ పార్టీ హ్యాట్రిక్‌ ఆశలు గల్లంతయ్యాయి. మూడోసారి సీఎం పీఠం అధిరోహించాలని అనుకున్న కేసీఆర్‌ కలలు కల్లలుగా మిగిలిపోవడానికి కారణం బీసీ ఫ్యాక్టరేనని గులాబీ శ్రేణులే అంటున్నాయి. ఆ ఎఫెక్ట్‌తోనే కనీసం ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేకపోయామంటూ గులాబీ పార్టీ నేతలు తెగ బాధపడిపోతుంటారు. అందుకే ఇప్పుడు ప్యాచప్‌ వర్క్‌ మొదలుపెట్టినట్టు చెబుతున్నారు. అధికారం కోల్పోయి.. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కుకుండా పోయాక గులాబీ పెద్దలకు జ్ఞానోదయం అయినట్లు కనిపిస్తుంది.


Also Read: లడ్డూ కాంట్రవర్సీ.. దేవదేవుడి ప్రసాదంపైనే ఇన్ని రాజకీయాలా ?

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీసీలను తమ వైపునకు తిప్పుకోవాలని గులాబీ పార్టీ ప్లాన్‌ చేస్తున్నట్టు కనిపిస్తుంది. వాతావరణాన్ని అనుకూలంగా మల్చుకోవడానికి అనువైన అంశం కోసం చూస్తున్న గులాబీ పార్టీ.. ఇప్పుడు బీసీ కుల గణన టాపిక్‌ అందుకుందట. అసలు రాష్ట్ర జనాభాలో బీసీలు ఎంత మంది ఉన్నారో లెక్కించాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేస్తోంది. బీసీ డిక్లరేషన్ పేరు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఇప్పుడు దానిని వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ పట్టుపడుతోంది. బీసీల కులగణన జరిగితేనే లోకల్ ఎలక్షన్లలో ఆయా సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందన్న రాగాన్ని అందుకుంది బీఆర్ఎస్.

బీఆర్‌ఎస్‌లో ఉన్న బీసీ నాయకులు ఇన్నాళ్లూ ప్రత్యేకంగా సమావేశాలు పెట్టుకునేవారు. కానీ.. ఇకపై పూర్తి స్థాయిలో పార్టీ పరంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. బీసీ అజెండాతో ముందుకు పోవాలని బీఆర్ఎస్ భావిస్తోందంట. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏకంగా పీసీసీ అధ్యక్ష పదవిని బీసీలకు కట్టబెట్టింది. ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా తమ రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీకే ఇవ్వాలని చూస్తుందంటున్నారు. దాంతో పార్టీ పరంగా ఆ వర్గానికిఎలాంటి ఉన్నత పదవి ఇవ్వాలో వెతికే పని మొదలుపెట్టిందట గులాబీ అధిష్టానం. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల్లో బీసీలకు సముచిత స్థానం కల్పించేలా వ్యూహరచన చేస్తోందంట.

ఇంకో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పోస్ట్‌ను కల్పించి ఆ పదవి బీసీకి ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారంట గులాబీ పార్టీ పెద్దలు. అలాగే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన బీసీ నేతల్ని యాక్టివ్ చేసే ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. బీసీల దగ్గరికి బీసీలు వెళ్తేనే వర్కవుట్‌ అవుతుందన్న ఆలోచనతో పార్టీలోని సీనియర్‌ బీసీ లీడర్స్‌ని ఫీల్డ్‌కు పంపే ఆలోచన చేస్తున్నారంట. బీసీలకు ఏం కావాలో.. అందుకు పార్టీ ఏం చేస్తుందో.. ఆ విషయాన్ని ఆయా సామాజికవర్గాల నేతలతోనే చెప్పించి వారిని దగ్గర చేసుకోవాలని చూస్తున్నారంట.

Also Read: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం పరువు కాపాడుకోకపోతే కారు పార్టీ అడ్రస్ గల్లంతవ్వడం ఖాయం. అందుకే బీసీలను దగ్గర చేసుకోవడానికి హైరానా పడుతున్నారంట. పార్టీ పదవులతో పాటు ఎన్నికల్లో కూడా బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని భావిస్తున్నారంట. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ సీట్లు ఇవ్వడమే కాకుండా.. ఆర్థికంగా కూడా సాయం చేసి ఎక్కువ మందిని గెలిపించుకుని పునాదుల్ని పటిష్టం చేసుకోవాలనుకుంటున్నట్టు సమాచారం. లోకల్‌ బాడీస్‌ ఎన్నికలలోపే.. బీసీలతో భారీ బహిరంగ సభ పెట్టే యోచనలో ఉందట బీఆర్‌ఎస్‌ అధిష్టానం. అందుకే ఇవాల కల్వకుంట్ల చిన్న దొర బీసీలపై తెగ ప్రేమ ఒలకపోస్తున్నారంట.

వాస్తవానికి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ బీసీలను చిన్నచూపు చూసిందన్న విమర్శలున్నాయి. ఇప్పుడు కేసీఆర్ వాయిస్ మారుతుండటంతో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం రంగంలోకి దూకేసింది. ఓట్ల కోసం బీసీలపై కేటీఆర్ ప్రేమ ఒలకబోస్తున్నారని.. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలను, గతంలో బీసీలపై ఆయన ఆయన చేసిన వ్యాఖ్యలను క్లబ్ చేసి వీడియోను పోస్టు చేసింది.

గతంలో అధికారమదంతో బీసీలను నానా మాటలు అన్న నువ్వు.. ఇప్పుడు బీసీల గురించి మాట్లాడుతున్నావా? డ్రామా రావు అని కాంగ్రెస్ కేటీఆర్‌ని ట్రోల్ చేస్తోంది. సదరు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్.. బీసీ ఆపరేషన్ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

Related News

Kutami Strategy: ఎన్నికల ప్రచారంలో పవన్ చేసిన ఛాలెంజ్ నిజమవుతోందా ? సీనియర్లు ఏమంటున్నారు ?

Young India Skill University: ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ తో స్కిల్ హబ్ గా తెలంగాణ..

Tirumala Laddu Politics: లడ్డూ కాంట్రవర్సీ.. దేవదేవుడి ప్రసాదంపైనే ఇన్ని రాజకీయాలా ?

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Big Stories

×