EPAPER

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

వైఎస్ఆర్ కాంగ్రెస్ లో పరిస్థితి రోజురోజుకూ మారుతోంది. జగన్ కు కాస్త దూరంగా ఉన్న నేతలే ఇప్పటి వరకు వెళ్తున్నారని అనుకుంటే.. ఇప్పుడు ఏకంగా వైఎస్ కుటుంబంతో చాలా దగ్గరి సాన్నిహిత్యం ఉన్న వారూ మాజీ సీఎం జగన్ కు గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇక ఈ బంధం చాలు అంటున్నారు. వైసీపీ నుంచి వెళ్లిపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అందులో వీరు వారు అన్న తేడా లేకుండా అందరూ రూట్ మార్చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి జగన్ కు గుడ్ బై చెప్పడం సంచలనంగా మారింది. గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన ఆ పార్టీలో ఉక్కపోత తట్టుకోలేక బయటికొచ్చేశారా అన్న చర్చ జరుగుతోంది. రాజీనామా లేఖను డైరెక్ట్ జగన్ కు పంపించి ఇక పార్టీకి తాను చేసిన సేవలకు గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించేశారు.

నిజానికి వైసీపీకి ఇప్పటికే ఇద్దరు రాజ్యసభ ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు గుడ్ బై చెప్పారు. అయితే తాజాగా బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ వీడడమే చర్చనీయాంశమైంది. చాలా కాలంగా వైసీపీ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో కనిపించిన బాలినేనిని చాలా సార్లు జగన్ మోహన్ రెడ్డి స్వయంగా తాడేపల్లి పిలిపించి బుజ్జగించి మరీ పంపించారు. అప్పట్లో మెత్తబడ్డట్లే కనిపించిన ఆయన.. వైసీపీ అధికారం కోల్పోవడం, ఒంగోలులో తాను ఓడిపోవడంతో ఇక మారాల్సిన టైం వచ్చిందనుకున్నారు. ఇక బుజ్జగింపులకు స్థానం లేదని తేల్చేశారు. ఎవరి మాట వినే ప్రసక్తే లేదన్నారు. తన రూటే సపరేటు అన్నారు. జగన్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు.


నిజానికి వైసీపీ నుంచి మిగిలిన వారు వెళ్లడం వేరు. బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి నేతలు వెళ్లడం వేరు. ఎందుకంటే వైఎస్ తోడల్లుడు వైవీ సుబ్బారెడ్డి. అంటే జగన్ కు వరుసకు బాబాయి వరుస. అలాంటి వైవీ సుబ్బారెడ్డికి బాలినేని స్వయానా బావమరిది. దగ్గరి బంధుత్వం ఉంది. అయితే బావతోనూ బాలినేనికి విబేదాలు ఉన్నాయంటారు. జగన్ తో చాలా సన్నిహితంగా ఉండే అవకాశమూ ఉంది. అందుకే చాలా ఏళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో బాలినేని పని చేశారు. జిల్లా పార్టీలో పూర్తిస్థాయి హవా నడిపించుకున్నారు కూడా. ప్రభుత్వం నుంచి అడిగింది ఇప్పించుకున్నారు. పనులు సాంక్షన్ చేయించుకున్నారు. జగన్‌ ప్రభుత్వంలో మొదటి రెండున్నర సంవత్సరాలు మంత్రిగా కూడా బాలినేని పనిచేశారు. ఆ తర్వాత క్యాబినెట్ విస్తరణలో ఆయన్ను నాడు జగన్‌ తప్పించారు. ప్రకాశం జిల్లాకు చెందిన మరో నేత ఆదిమూలపు సురేశ్‌ను మంత్రివర్గంలోకి తీసుకుని బాలినేనిని తప్పించడంతో ఆయనలో అసంతృప్తి మొదలైందంటారు.

Also Read: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు రియాక్ట్, శారదా పీఠం సైలెంట్ వెనుక..

నాటి నుంచి నేటి వరకు జగన్ చాలా రకాల బుజ్జగింపులు చేయడంతో ఇన్నాళ్లూ బాలినేని బండి వైసీపీలోనే ఆగిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం వైసీపీ బండి దిగేశారు బాలినేని. రాజకీయాలకు, బంధుత్వాలకు సంబంధం లేదంటున్నారు. ఎవరి మాటా విననంటున్నారు. స్వయంగా బావ చెప్పినా నో అంటున్నారట. వెళ్తూ వెళ్తూ బాలినేని వైసీపీలో జరుగుతున్న కొన్ని పరిణామాలపై తన అసంతృప్తి వెళ్లగక్కారు. కొన్ని లీకులిచ్చారు. ఇంకొన్ని మైనస్ పాయింట్లు బయటపెట్టారు. పార్టీలో కోటరీ రాజ్యం నడుస్తోందని.. ఇకపైనా నడుస్తుందని, తనను నిర్లక్ష్యం చేశారని బాలినేని ఆరోపించారు. ఇదొక్కటే కాకుండా తాను పార్టీ వీడటానికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు. వాటన్నిటినీ ఒక్కొక్కటిగా బయటపెట్టేందుకు రెడీ అవుతున్నారు.

తనపై పనిగట్టుకుని వైసీపీలోనే అసత్య ప్రచారాలు మొదలు పెట్టారంటున్నారు బాలినేని. తల్లి కాంగ్రెస్ లో పిల్ల కాంగ్రెస్ కలిసిపోతుందని తాను అనకపోయినా అన్నట్లుగా చీప్ ట్రిక్స్ ప్లే చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని వాపోయారు. అంతే కాదు తాను వైసీపీలో ఉండడం కొంతమందికి ఇష్టం లేదని కూడా బాంబు పేల్చారు.

గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తప్పుడు నిర్ణయాల వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని తాను మంచిగా చెబితే.. తననే నెగెటివ్ గా ప్రొజెక్ట్ చేశారంటున్నారు. మంచి చేయబోతే తనకే చెడు చేశారని వాపోయారు. పార్టీలో తన మాటకే చెల్లుబాటు లేకుండా పోయిందంటున్నారు. వైసీపీలో బాలినేని బాంబ్ పేలిందనుకుంటే.. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఈయన ప్రభుత్వ విప్‌గా పని చేశారు. వైఎస్ కుటుంబానికి చాలా దగ్గరి వ్యక్తిగా, విధేయుడిగా పేరుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి అధినేత జగన్‌తోనే ఉన్నారు. ఆయన వెంటే నడిచారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రి పదవి ఆశించారు. కానీ విప్ పదవి దగ్గరే ఆగిపోయారు. అయితే రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా.. అందుకే ఆయన కూడా జనసేనలో వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అటు పవన్, ఇటు సామినేనిది ఒకే సామాజికవర్గం కావడం మరింత కలిసి వచ్చిందంటున్నారు. ఇక ఆలస్యం చేయడం మంచిది కాదన్న ఉద్దేశంతో నిర్ణయం తీసేసుకున్నారు. ఎవరికీ ఇబ్బంది రాకుండా కోఆర్డినేట్ చేసుకుని పని చేస్తామంటున్నారు సామినేని. వైసీపీకి గుడ్ బై చెబుతున్న నేతలు ఇప్పుడు జనసేనవైపు చూస్తుండడమే ఇంట్రెస్టింగ్ గా మారుతోంది.

Related News

Tirumala Laddu Politics: లడ్డూ కాంట్రవర్సీ.. దేవదేవుడి ప్రసాదంపైనే ఇన్ని రాజకీయాలా ?

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Big Stories

×