EPAPER

Somesh Kumar: రూ.1400 కోట్ల స్కామ్.. మాజీ సీఎస్‌కు సీఐడీ నోటీస్

Somesh Kumar: రూ.1400 కోట్ల స్కామ్.. మాజీ సీఎస్‌కు సీఐడీ నోటీస్

– జీఎస్టీ స్కామ్‌లో సీఐడీ దూకుడు
– మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌కు నోటీస్
– రేపో మాపో కేసులో నిందితుల విచారణ
– ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ చెల్లింపుల్లో గోల్‌మాల్
– నకిలీ ఇన్ వాయిస్‌లు సృష్టించి ప్రభుత్వానికి టోపీ
– సీఐడీ విచారణలో వెలుగులోకి సంచలన నిజాలు


GST Scam: కేసీఆర్ పాలనలో కీలకంగా వ్యవహరించిన అధికారుల్లో సోమేశ్ కుమార్ ఒకరు. సీఎస్‌గా ఈయన ఎంత దూకుడుగా వ్యవహరించారో, అదే స్థాయిలో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. ఆమధ్య భార్య పేరు మీద 25 ఎకరాల 19 గుంటల భూమి వ్యవహారంపై అనేక చర్చలు జరిగాయి. అదంతా అక్రమమా? సక్రమమా? అని రాష్ట్రవ్యాప్తంగా తెగ మాట్లాడుకున్నారు. అదే సమయంలో జీఎస్టీ స్కామ్ వెలుగు చూసింది. రూ.1400 కోట్ల అవతవకలకు సంబంధించిన ఈ కేసులో సోమేశ్ కుమార్ నిందితుడిగా ఉన్నారు.

అసలేంటీ కేసు..?


ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ చెల్లింపుల్లో స్కామ్ జరిగినట్లు, నకిలీ ఇన్ వాయిస్‌లు సృష్టించి మోసాలకు పాల్పడినట్లు రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఫోరెన్సిక్‌ అడిట్‌తో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మొదట వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్‌ ఎస్‌‌వీ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్‌ (హైదరాబాద్‌ రూరల్‌) శివరామప్రసాద్, ఐఐటీ హైదరాబాద్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ శోభన్‌ బాబు, ప్లియాంటో టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను నిందితులుగా పేర్కొనగా, తర్వాత మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌ను ఏ5గా పేర్కొంటూ కేసు పెట్టారు. పన్ను ఎగవేతదారులకు వీరంతా సహకరించడం ద్వారా కోట్ల అక్రమాలు జరిగినట్లు ఆ శాఖ జాయింట్‌ కమిషనర్‌ రవి కానూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ అయింది.

సీసీఎస్ టు సీఐడీ

ఈ కేసును మొదట సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం మానవ వనరులను సరఫరా చేసే బిగ్‌లీప్‌ టెక్నాలజీస్‌ అండ్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ, ఎలాంటి పన్ను చెల్లించకుండానే రూ.25.51 కోట్ల ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ తీసుకుని మోసానికి పాల్పడినట్లు ప్రస్తావించారు. దీనిపై చేసిన విచారణలో ఆశ్చర్యపోయే వాస్తవాలు బయటికి వచ్చాయి. వాణిజ్య పన్నుల శాఖకు ఐఐటీ హైదరాబాద్‌ టెక్నికల్ సపోర్టును అందిస్తోంది. తెలంగాణలో పన్ను చెల్లింపుదారులు నమోదు చేసే ఐటీ రిటర్న్‌ల్లో అక్రమాలను గుర్తించటం, డేటాను విశ్లేషించడంలో సాయపడుతోంది. ట్యాక్స్ కట్టాల్సిన వారిలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే సర్వీస్‌ ప్రొవైడర్‌ హోదాలో ఐఐటీ తన ‘స్క్రూటినీ మాడ్యూల్‌’ గుర్తించాలి. కానీ, విచిత్రంగా బిగ్‌ లీప్‌ టెక్నాలజీస్‌ అక్రమాలకు పాల్పడినా ఈ మాడ్యూల్‌ గుర్తించలేదు. విచారణలో ఇది పొరబాటున జరిగలేదని, కావాలనే కొందరి పేర్లను సర్వీస్ ప్రొవైడర్ తన జాబితా నుంచి తప్పించినట్లు ప్రాథమికంగా వెల్లడైంది. సోమేశ్‌ కుమార్‌ ఆదేశాలతోనే సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసినట్లు నిందితులు వెల్లడించారు. అయితే, వాణిజ్య పన్నుల శాఖకు తాము ఎలాంటి సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయలేదని ప్లియాంటో టెక్నాలజీస్‌ సంస్థ వివరణ ఇచ్చింది. ఈ కేసును తొలుత హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు విచారణ చేపట్టారు. అయితే, తవ్వే కొద్దీ ఆశ్చర్యపోయే వాస్తవాలు బయటపడటంతో ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది.

Also Read: Ponnam Angry On Ktr: కేటీఆర్‌కు మంత్రి పొన్నం కౌంటర్, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టిందెవరు?

సోమేశ్‌ కుమార్‌కు సీఐడీ నోటీసులు

వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణంపై తెలంగాణ సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. మొత్తం రూ.1400 కోట్ల స్కామ్ జరిగినట్లు గుర్తించింది. ఈ క్రమంలోనే మాజీ చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్‌కు సీఐడీ పోలీసులు నోటీస్ పంపారు. వస్తువులు సరఫరా చేయకపోయినా చేసినట్లు, బోగస్ ఇన్వాయిస్‌లు సృష్టించారని గుర్తించగా, త్వరలోనే నిందితులను విచారించి స్టేట్మెంట్ నమోదు చేయనున్నట్టు తెలిపారు.

ట్యాక్స్ కట్టని వారికీ చెల్లింపులు

స్పెషల్ ఇనిషియేటివ్స్ వాట్సాప్ గ్రూప్ పేరుతో సోమేశ్ కుమార్ సర్వీస్ ట్యాక్స్ అధికారులైన విశ్వేశ్వరరావు, శివరామ ప్రసాద్, ఐఐటీ తరపున టెక్నికల్ సపోర్టు ఇస్తున్న శోభన్ బాబులకు ఆదేశాలు ఇచ్చినట్లు సీఐడీ అధికారులు విచారణలో గుర్తించారు. కమర్షియల్ ట్యాక్స్ సెంట్రల్ కంప్యూటర్ వింగ్ జాయింట్ డైరెక్టర్ రవి కానూరి అందించిన ఆడిట్ రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు జరిపారు. అసలు జీఎస్టీ కట్టని వారికీ ఇన్‌పుట్ ట్యాక్స్ కింద నిధుల బదిలీ, పన్ను కట్టాల్సిన పెద్ద సంస్థల పేర్లు డేటాబేస్ నుంచి మాయం కావటం, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ సహా 75 కంపెనీలకు లబ్ధి చేసినట్లు ఆధారాలు లభించటంతో ఈ కేసులో దారి మళ్లించిన మొత్తం రూ.1400 కోట్లుగా తేల్చారు అధికారులు. ఐదు సంవత్సరాల క్రితమే సాఫ్ట్‌వేర్ డెవలప్మెంట్‌కు ఐఐటీ హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు, మాజీ సీఎస్ సోమేష్ కుమార్ శ్రీకారం చుట్టారు. ఇది బడా వ్యాపారవేత్తలకు ఉపయోగపడింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్ కట్టకుండా ఐదేళ్లపాటు కంపెనీల వ్యవహారాలు కనబడకుండా మాస్క్ విధించారు. కమర్షియల్ ట్యాక్స్ కొత్త కమిషనర్ శ్రీదేవి వచ్చిన తర్వాత సాఫ్ట్‌వేర్‌లో లోపాలు బయటపడ్డాయి. బిగ్‌లీప్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఐదు సంవత్సరాల నుంచి 25 కోట్ల ట్యాక్స్ చెల్లించలేదని గుర్తించారు. ఆ సంస్థపై దర్యాప్తు చేసి ట్యాక్స్ కట్టకుండా ఫ్రాడ్ చేశారని గుర్తించిన తర్వాత అధికారులు నిర్వాహకుడిని అరెస్టు చేశారు. ఇలా 70 కంపెనీలు సాఫ్ట్‌వేర్‌లో కనపడకుండా మాస్క్ వేసినట్టు గుర్తించారు. బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు సంబంధించి 5 సంవత్సరాల నుంచి ట్యాక్స్ కనపడకుండా చేశారు. ఈ నేపథ్యంలో నిందితులకు నోటీసులు ఇస్తున్నారు సీఐడీ అధికారులు.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×