EPAPER

HYDRA: పర్యావరణ పరిరక్షణకై సంధించిన పాశుపతాస్త్రమే హైడ్రా!

HYDRA: పర్యావరణ పరిరక్షణకై సంధించిన పాశుపతాస్త్రమే హైడ్రా!

Environment: మనదేశపు అయిదవ అతిపెద్ద నగరంగా, తెలంగాణ రాష్ట్ర రాజధానిగా విలసిల్లుతున్న హైదరాబాద్ నేడు ప్రపంచస్థాయి గుర్తింపును పొంది ఒక ప్రబల ఆర్థిక కేంద్రంగా నిలదొక్కుకుంది. అటు చారిత్రకంగా, సాంస్కృతికంగానూ నాలుగున్నర శతాబ్దాల చరిత్రగల నగరంగా దక్షిణాదిలో తనకంటూ ఒక విశిష్టతను, వైవిధ్యాన్ని కలిగిన నగరం ఇది. తొంభైయ్యవ దశకంలో మొదలైన ఆర్థిక సంస్కరణల కారణంగా భాగ్యనగరం ఐటీ, ఫార్మా, తయారీ, సేవా రంగాలకు ప్రధాన కేంద్రంగా మారింది. లక్షల కోట్ల పెట్టుబడులు ఇక్కడికి తరలి రావటంతో నేడు కోటి పది లక్షల జనసిరితో నగరం అలరారుతోంది. అతి తక్కువ సమయంలో ఆర్థిక సంస్కరణలను అందిపుచ్చుకుని బలమైన ఆర్థిక కేంద్రంగా హైదరాబాద్ నిలబడటానికి గల అనేక కారణాలలో ఇక్కడి ఆహ్లాదకరమైన సమశీతోష్ణ వాతావరణం కూడా ఒకటి. దేశంలోని అన్ని ప్రాంతాల వాసులకూ అనుకూలమైన వాతావరణం దక్షిణాదిలో బెంగళూరు తర్వాత ఉన్న ఏకైక నగరంగా భాగ్యనగరం పేరుపొందింది. అయితే, గత పాలకులు నగరాభివృద్ధిని కేవలం భౌగోళిక, ఆర్థిక, సామాజిక, రాజకీయ పరమైన కోణాల నుంచే చూడటానికి పరిమితం కావటంతో నగరంలోని పర్యావరణం క్రమంగా దెబ్బతింటూ వచ్చింది. నిజాం పాలకుల నాటి గొలుసుకట్టు చెరువులు, కుంటలు, సరస్సులు కబ్జాకోరుల కబంధ హస్తాలలో చిక్కటం, మురుగునీరు, వరదనీటి నాలాలను పూడ్చి వాటిపై పెద్దపెద్ద నిర్మాణాలు చేపట్టటంతో నేడు ఈ నగరం చిన్నపాటి వానకూ చిగురుటాకులా వణికిపోతోంది.


కాకతీయులు, తర్వాతి రోజుల్లో నిజాం పాలకులు భాగ్యనగరంలో తాగు, సాగు నీటి అవసరాలకు నిర్మించిన జలాశయాలు.. పెరిగిన పట్టణీకరణ, జనాభాల కారణంగా ప్రభావితమవుతూ వచ్చాయి. ఇదే సమయంలో నగరంలోని భూమి ధరలు ఆకాశాన్ని అంటటంతో గత పాలకుల హయాంలో నేతల అండతో ఎక్కడిక్కడ కబ్జాకోరులు రెచ్చిపోయారు. జలాశయాలు, నాలాలు, ప్రభుత్వ స్థలాలను దర్జాగా కబ్జా చేసి బహుళ అంతస్తుల భవనాలు, విల్లాలు, వాణిజ్య కాంప్లెక్స్‌లు కట్టిపారేశారు. ఇందులో నేతలు, సినిమా నటులు, అనేక రంగాల ప్రముఖులు, అనేకమంది లంచగొండి ప్రభుత్వాధికారులకూ వాటా ఉందనేది కాదనలేని వాస్తవం. అటు జీహెచ్ఎంసీ, హెచ్‌ఎండీఏ, నగర శివారులోని అనేక మునిసిపాలిటీలు, గ్రామ పంచాయితీలకు చెందిన సిబ్బంది తోడ్పాటు కూడా ఈ కబ్జాకోరులకు లభించింది. ఇటీవల అరెస్టయిన హెచ్ఎండీఏ ఉన్నతాధికారి ఇంట్లో దొరికిన డబ్బు, ఆస్తిపత్రాలు వందల కోట్లలో ఉండటాన్ని బట్టి నగరం పరిధిలో అక్రమ అనుమతులు ఏ స్థాయిలో నడిచాయో అర్థమవుతోంది. మరో వైపు ఎలాంటి ప్రణాళికా లేకుండా లోతట్టు ప్రాంతాల్లోని ప్రభుత్వం భూములను పేదల ఇళ్ల నిర్మాణాలకు ఇవ్వటంతో ఎక్కడికక్కడ చిన్నచిన్న బస్తీలు వెలిశాయి. ఈ బస్తీలలో మురుగునీటి సరఫరా, వరద నీటి పారుదల వంటి సౌకర్యాల మీద గత పాలకులు దృష్టి పెట్టటపోవటంతో చిన్నపాటి వానకే ఇక్కడి ఇళ్లు నీటమునిగి ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారు. మరోవైపు, పెద్ద, చిన్న నీటి రిజర్వాయర్లు, చెరువులూ, కుంటలకు సంబంధించి ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్) మరియు బఫర్ జోన్లలో సొంత పట్టా భూములున్నా భవన నిర్మాణాలు చేపట్టరాదని చట్టాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, గతంలో అధికారులు.. ఈ జలాశయాలకు సంబంధించిన సర్వేలు చేసి నిర్ధారిత పరిధిని సూచించేలా హద్దులు నిర్ణయించకపోవటం కూడా ఆక్రమణదారులకు కలిసి వచ్చింది. ఆ కబ్జా భూముల్లో వీరు నిర్మించిన అపార్ట్‌మెంట్‌లు, భవనాలలను అప్పోసప్పో చేసి సొంత నీడ ఏర్పడిందని సంబరపడిన దిగువ మధ్యతరగతి, ఉద్యోగ వర్గాలు నేడు తమ నిర్మాణం ఆక్రమిత భూమిలో కట్టిందని తెలిసి గుండెలు బాదుకుంటున్నారు. కళ్లముందే తమ నిర్మాణాలను కూలగొడుతుంటే.. న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. పర్యావరణాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేసిన గత పాలకుల పాపం, అవినీతి అధికారుల ధనదాహం వీరి పాలిట నేడు శాపాలుగా మారాయి.

Also Read: Kamal Haasan – Radhika : ఆ సన్నివేశంలో నటించమని బలవంతం చేశాడు.. కమల్ హాసన్ పై రాధిక షాకింగ్


విస్తరిస్తున్న హైదరాబాద్ భవిష్యత్ తాగునీటి అవసరాల నిమిత్తం 1996లో నాటి రాష్ట్ర ప్రభుత్వం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ల పరీవాహక ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని 111 ఓవోను తీసుకొచ్చింది. అయితే 2022లో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తన సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం ఆ జీవోను రద్దుచేసింది. దీంతో ఈ రెండు భారీ జలాశయాల పరిధిలోని ప్రకృతి విధ్యంసం యధేచ్ఛగా జరగటానికి నాటి ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చినట్లయింది. పైగా, పై రెండు చెరువులూ భారీ మంచి నీటి చెరువులు కాదని, సాధారణ చెరువులేనని నాటి ప్రభుత్వం ప్రకటించడం కొసమెరుపు. గత పదేళ్ల కాలంలోనే 10 వేల ఎకరాల విస్తీర్ణం గల ఈ రెండు చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిలోని 3700 ఎకరాల భూమి రికార్డుల నుంచి గల్లంతు కాగా, దుర్గం చెరువు, రామంత పూర్ పెద్ద చెరువు, కాప్రా చెరువు, మూసీ సమీప ప్రాంతాలదీ అదే పరిస్థితి. మొత్తంగా హెచ్‌ఎమ్‌డిఏ పరిధిలో మొత్తం 2857 చెరువులుండగా, ఔటర్ రింగ్ రోడ్ లోపల 455 మరియు బయట 2402 చెరువులు ఉన్నట్లు శాటిలైట్ చిత్రాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఇవి కాక 153 చెరువులను రెవెన్యూ రికార్డుల్లోనే చేర్చలేదని తెలుస్తోంది. మరో 100 చెరువులను రెవెన్యూ రికార్డుల్లో చేర్చి, ఆ తర్వాత మాయం చేశారు. వీటికి అదనంగా 427 చెరువులను ఆనవాలు కోల్పోయినవి ప్రకటించారు. ఈ రకంగా చెరువుల దురాక్రమణ జరగటంతో చిన్నపాటి వానకే భాగ్యనగరం వణికి పోవటమే గాక ప్రతిసారీ భారీ ఆస్తినష్టం, ప్రాణ నష్టం జరుగుతోంది.

ఈ పరిస్థితిని మార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్స్ మానిటరింగ్ ఏజెన్సీ (హైడ్రా) అనే వ్యవస్థకు ప్రాణప్రతిష్ట చేసింది. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం నిన్నటి వరకు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాటి నుండి ప్రజలను రక్షించడానికి పని చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ (ఇ.వి.డి.యమ్) విభాగం స్థానంలో దీనిని తీసుకువచ్చారు. నగరంలోని అక్రమ నిర్మాణాలను కూల్చి, కబ్జాదారుల చేతుల్లో చిక్కిన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుని వాటిని సామాజిక ప్రయోజనాలకు వాడాలనే లక్ష్యంతో బాటు విపత్తు సమయంలో నగర పౌరులకు, ఆస్తులకు భద్రత కల్పించటమే హైడ్రా ప్రధాన లక్ష్యంగా ఉంది. దశాబ్దాల తర్వాత నగరపు ఆయువు తీస్తున్న ఆక్రమణల నిర్మూలనకు సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన ఈ హైడ్రా వ్యవస్థ.. స్వేచ్ఛగా, పారదర్శకంగా పనిచేస్తున్న తీరుకు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు జైజైలు పలుకుతున్నారు. తరతమ భేదాలకు అతీతంగా సాగుతున్న హైడ్రా కూల్చివేతలతో రాబోయే రోజుల్లో భాగ్యనగరం తిరిగి తాను కోల్పోయిన శోభను సంతరించుకోనుందని రాజధాని వాసులు సంతోష పడుతున్నారు. మరోవైపు హైడ్రా సేవలు మాకూ కావాలంటూ వరంగల్, కరీంనగర్ వంటి అనేక నగరాలతో బాటు మండల కేంద్రాల నుంచీ పర్యావరణ వేత్తలు, సామాజిక కార్యకర్తలు తమ ప్రాంతాల్లో కబ్జాకు గురైన పార్కులు, ప్రభుత్వ భూముల వివరాలను ధైర్యంగా హైడ్రాకు అందించేందుకు ముందుకు వస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారుడు ప్రొ. డి.నర్సింహా రెడ్డి , ఇరిగేషన్ రంగ నిపుణులు బి.వి.సుబ్బారావు వంటి ఎందరో హైడ్రాను స్వాగతించారు. ఈ పర్యావరణ పరిరక్షణ యజ్ఞంలో యువత, విద్యార్థులు సైతం భాగస్వాములు కావటానికి ఉత్సాహం చూపించటం తెలంగాణ సమాజానికి ప్రకృతి పట్ల ఉన్న మమకారాన్ని రుజువుచేయటమే గాక, పారదర్శకమైన పాలన అందించే నేతలు వచ్చినప్పుడు సమాజ నిర్మాణంలో పౌరులు స్వచ్ఛందంగా కదలివస్తారనటానికి ఒక చక్కని ఉదాహరణగా నిలుస్తోంది.

Also Read: Mahabubabad Track: పూర్తికాని ట్రాక్ రిపేర్ పనులు.. మరో 28 రైళ్లు రద్దు

ప్రభుత్వంలోని డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారి కమీషనర్‌గా పోలీస్, సర్వే, నీటిపారుదల శాఖల అధికారులతో కూడిన 72 బృందాలతో హైడ్రా.. అక్రమ నిర్మాణాల మీద విరుచుకుపడుతోంది. గ్రేటర్ పరిధిలో పట్టణ భవన నిర్మాణ చట్టం, ల్యాండ్ ఎంక్రోచ్ మెంట్, ల్యాండ్ గ్రాబింగ్, వాల్టా చట్టం మరియు ఇరిగేషన్ చట్టాల ప్రకారం ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటలు, నాలాలు, ఇతర జలాశయాలు, పార్కులు, సర్కారీ భూముల లెక్కలు పక్కాగా తేల్చి, వాటిలోని అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసి, తిరిగి ఆ భూమిని ఆయా ప్రభుత్వ శాఖలకు అప్పగిస్తోంది. ఇప్పటి వరకు 18 ప్రాంతాలలో 166 అక్రమ కట్టడాలను కూల్చివేయటమే గాక 44 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవటమే గాక మరింత దూకుడును ప్రదర్శిస్తూ.. నగర పరిధిలోని చిట్టచివరి అక్రమ కట్టడాన్నీ కూల్చి తీరతామని ప్రకటిస్తోంది. అయితే, హైడ్రా కేవలం కూల్చివేతలకే పరిమితం కాకుండా, అక్రమ నిర్మాణాల మూలంగా కబ్జాదారులకు చేకూరిన ఆదాయంపై భారీ జరిమానాలు విధించాలని, తిరిగి స్వాధీనం చేసుకున్న సర్కారీ భూమిని తిరిగి రికార్డులకెక్కించి, దానిని సార్వజనిక కార్యక్రమాలకు వినియోగించాలని తెలంగాణ సమాజం ప్రభుత్వాన్ని కోరుతోంది. అప్పుడే.. శోభ కోల్పోయిన భాగ్యనగరానికి తిరిగి పాత వైభవం దక్కుతుందని, ఈ అక్రమార్కుల చర్యల వల్ల నగరానికి జరిగిన పర్యావరణ పరమైన నష్టాన్ని తగు వేదికల మీద నేతలు, అధికారులు వెల్లడించటం వల్ల ప్రజలలో మరింత చైతన్యం వస్తుందని సామాజిక వేత్తలు భావిస్తున్నారు. ఏది ఏమైనా, పర్యావరణ పరిరక్షణ నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఈ మహాయజ్ఞం నిర్విరామంగా కొనసాగాలని, ఈ ప్రయత్నంలో తెలంగాణ పౌర సమాజం, మేధావులు, సామాజిక వేత్తలు, ప్రకృతి ప్రియులు ముందుకొచ్చి తమ తమ ప్రాంతాల్లో జరిగిన ఆక్రమణలు, జరిగిన విధ్వంసాన్ని ధైర్యంగా హైడ్రా దృష్టికి తెచ్చి అక్రమార్కుల కబంధ హస్తాలలో చిక్కుకున్న ప్రభుత్వ భూములకు విముక్తి కలిగించాలని కోరుకుందాం.

డా. నీలం సంపత్
విశ్రాంత ప్రిన్సిపాల్, సామాజిక కార్యకర్త.

Related News

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

Big Stories

×