EPAPER

Farm Loans: రైతుల సొమ్ము.. రాబందుల పాలు.. వ్యవసాయ సొసైటీల్లో అవినీతి తిమింగలాలు

Farm Loans: రైతుల సొమ్ము.. రాబందుల పాలు.. వ్యవసాయ సొసైటీల్లో అవినీతి తిమింగలాలు

– రైతులకు తెలియకుండా వారి పేరుపై రుణాలు
– జనగామ జిల్లా నిడిగొండ సొసైటీలో నిధుల గోల్‌మాల్
– మాజీ సీఈవో కన్నుసన్నల్లో రూ.2.55 కోట్ల అవినీతి
– ఒకే ఆధార్ కార్డుతో పలువురికి రుణాలు ఘనులు
– బాకీలు తిరిగి కట్టినా.. రెన్యువల్ చేయని సిబ్బంది
– మంచిర్యాల జిల్లాలో 18 మంది పేరుతో రూ.30 లక్షల స్వాహా
– వరంగల్ జిల్లా చింతలపల్లి సొసైటీలోనూ అక్రమాలు
– ఫోర్జరీలతో సిబ్బంది వేతనాల దిగమింగిన సీఈవో
– రుణమాఫీ కాలేదంటూ రైతుల గోస.. న్యాయంచేయాలని వినతి
– అక్రమార్కులకు చెక్ పెట్టాలంటూ వేడుకుంటున్న రైతన్నలు


వరంగల్, జనగామ, మంచిర్యాల స్వేచ్ఛ-బిగ్ టీవీ: సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన రైతు రుణమాఫీ స్ఫూర్తికి కొందరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘ బ్యాంక్ (పీఏసీఎస్ ) అధికారులు తూట్లు పొడుస్తున్నారు. సాగుబడికి పంటరుణాలు తీసుకుని వాటిని సకాలంలో కట్టిన బాకీలను జమ చేయకుండా తమ ఖాతాలకు మళ్లించుకుని పెద్దమొత్తంలో అవినీతికి పాల్పడ్డారు. దొంగ సంతకాలతో రైతులకు తెలియకుండా వారి పేరు మీద పంట రుణాలు తీసుకుని వాటిని కాజేసిన ఘనులు కొందరైతే, ఒకే ఆధార్ కార్డ్ మీద పలువురికి రుణాలు మంజూరు చేసి దిగమింగిన అక్రమార్కులు ఇంకొందరు. వీరి నిర్వాకంతో అర్హులైన రైతులు రుణమాఫీ కాక నానా తిప్పలు పడుతూ బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఒకవైపు, ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీతో మెజారిటీ రైతాంగం ఆనందోత్సాహాల మధ్య మళ్లీ రుణాలు తీసుకుంటుంటే.. తమకు జరిగిన అన్యాయాన్ని తలచుకుని అక్రమార్కుల బాధితులుగా మారిన రైతాంగం ఆందోళన బాట పడుతోంది. జనగామ, వరంగల్, మంచిర్యాల, జిల్లాల పరిధిలోని కొన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోని కొందరు అధికారుల నిర్వాకంతో రోడ్డున పడిన రైతాంగంపై.. స్వేచ్ఛ ప్రత్యేక కథనం…..

రైతులకు తెలియకుండా రుణాలు..
జనగామ జిల్లా రఘునాథ పల్లి మండలం, నిడిగొండ గ్రామంలోని 600 మంది రైతులు అక్కడి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘ బ్యాంకు(పీఏసీఎస్)లో సభ్యులుగా ఉన్నారు. వీరిలో 300 మంది అదే బ్యాంకులో పంట రుణాలు తీసుకోగా, ఆ మిగిలిన వారిలో కొందరు అదే ఊళ్లో ఉన్న గ్రామీణ వికాస బ్యాంక్‌లో పంట రుణాలు తెచ్చుకున్నారు. కాగా, ఇటీవల నిడిగొండ గ్రామీణ వికాస్ బ్యాంక్‌లో పంటరుణాలు తీసుకున్న రైతులు కొందరు తమకు రుణమాఫీ కాలేదంటూ.. అక్కడి మేనేజర్‌ని సంప్రదించారు. వారు అక్కడి రికార్డులను పరిశీలించి ‘మీకు నిడికొండలోని ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంకులో అప్పు ఉంది. కనుక మీకు అక్కడే రుణమాఫీ అవుతుంది’ అని జవాబిచ్చారు. దీంతో ఆ రైతులంతా అవాక్కయ్యారు. తమకు అక్కడ ఖాతా ఉందిగానీ, అక్కడ తాము ఎలాంటి పంట రుణాలు తీసుకోలేదని, తమకు తెలియకుండానే అక్కడ తమ పేరుతో ఎవరో పంట రుణాలు తీసుకున్నారనే అనుమానంతో పీఏసీఎస్ బ్యాంకులో సంప్రదించారు. అక్కడి సిబ్బంది రికార్డుల ప్రకారం నిజంగానే ఈ రైతులకు అక్కడ పంటరుణాలు మంజూరైనట్లుగా తేలింది.


తండ్రీకొడుకుల నిర్వాకం..
తర్వాత వీరంతా బ్యాంకు సీఈవో రాజయ్యను నిలదీయగా అసలు సంగతి బయటికొచ్చింది. పీఏసీఎస్ బ్యాంకు మాజీ సిఈఓ రాజయ్య, కొందరు సొసైటి డైరెక్టర్‌లతో కలిసి, తమ బ్యాంకులో ఖాతా ఉండీ, పంట రుణాలు తీసుకోని రైతుల ఆధార్ కార్డులు దొంగచాటుగా సేకరించి వారికి తెలియకుండానే లోన్ మంజూరుచేయించి, ఆ సొమ్మును తమ ఖాతాలకు మళ్లించుకున్నారని తేలింది. దీంతో ఆ రైతులంతా ఇప్పుడు ఆందోళన బాట పట్టారు. పీఏసీఎస్ రిటైర్డ్ సీఈఓ పెద్దగోని రాజయ్య, ప్రస్తుత సీఈవోగా ఉన్న ఆయన కుమారుడు రాజుకుమార్ ఈ వ్యవహారంలో కీలక సూత్రధారులని తేలింది. రూ.2.55 కోట్ల రుణాలలో వీరు అందిన కాడికి దండుకున్నారని తెలుస్తోంది.

Also Read: IC 814: The Kandahar Hijack Review: దేశ చరిత్రలోనే అతిపెద్ద హైజాక్.. అస్సలు మిస్ అవ్వొద్దు

ఆడిట్‌లో షాకింగ్ నిజాలు..
సొసైటీలో జరిగిన అక్రమాలను పరిశీలించేందుకు డీసీఓ రాజేందర్ రెడ్డి, ఆడిటర్ దివ్య నిడిగొండ పీఏసీఎస్ బ్యాంకులో విచారణ చేపట్టగా ఆశ్చర్యపోయే నిజాలు బయటికి వచ్చాయి. ఇందులో ఒకే రైతు ఆధార్ కార్డు మీద నలుగురికీ లోన్లు మంజూరు చేశారు. కొందరు రైతులు రెన్యు వల్ చేసుకోగా, మరికొంత మంది రైతులు గతంలో తీసుకున్న రుణాలు పూర్తిగా చెల్లించినా.. వారికి బకాయిలు ఉన్నట్లే రికార్డుల్లో ఉండటం విచారణలో తేలింది. దీంతో వీరు వేరే బ్యాంకులో తీసుకున్న పంట రుణం మాఫీ కాలేదు. అంతేగాక, రైతుల ఖాతా నంబర్లు, ఆధార్ కార్డు నంబర్లు తప్పుగా నమోదుకావటంతోనే అనేకమందికి రుణమాఫీ కాలేదని తేలింది. దీంతో ఉన్నతాధికారులు వారం రోజుల క్రితం సీఈఓ పెద్దగోని రాజుకుమార్‌ను సస్పెన్షన్ చేశారు.

మంచిర్యాలలోనూ ముంచేశారు..
మంచిర్యాల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం(పీఏసీఎస్) సీఈవో.. రుణం మాఫీ జాబితాను బయటపెట్టకుండా రేపు మాపు అంటూ తాత్సారం చేశాడు. ఇదేంటని యువకులు నిలదీయగా,18 మంది రైతులకు తెలియకుండా వారి పేరుతో రుణాలు తీసుకుని, రూ.30లక్షలు స్వాహా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలోని హాజీపూర్ మండలం ముల్కల్లకు చెందిన రైతు సిరిపెల్లి బాపు మంచిర్యాలలోని ఏడీసీసీ బ్యాంకులో 2015లో రూ. 65వేలు పంట రుణం తీసుకుని 2019 నవంబరులో తిరిగి పూర్తిగా చెల్లించాడు. 2023లో అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం రూ.లక్ష రుణమాఫీ చేయడంతో బాపు పేరిట రూ.67 వేలు బ్యాంకులో జమయ్యాయి. అప్పటి నుంచి ఆ రైతు ఎలాంటి క్రాప్ లోన్ తీసుకోలేదు. ఆయనకు ఆగస్టు 2న రూ.1,10,515 పంట రుణం మాఫీ అయినట్లు ఫోన్ కు మెసేజ్ వచ్చింది. ముల్కల్లకు చెందిన మరో రైతు కందుల లక్ష్మయ్యకు ఇదే అనుభవం ఎదురైంది. తాము ఎలాంటి లోన్ తీసుకోకున్నా.. రుణమాఫీ ఎలా అయిందంటూ.. బాపు, లక్ష్మయ్య.. పీఏసీఎస్ సీఈవో పెంట సత్యనారాయణ వద్దకు వెళ్లి ప్రశ్నించగా, అవి ఫేక్ మెసేజ్‌లని, వాటిని పట్టించుకోవద్దని, దీనిపై ఎవరికీ చెప్పొద్దని బతిమాలుకున్నాడు. దీంతో ఆ రైతులు ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా, స్పందించిన కలెక్టర్.. విచారణకు ఆదేశించారు. విచారణలో మరిన్ని అక్రమాలు బయటపడినట్లు తెలుస్తోంది.

సిబ్బంది జీతాలూ కొట్టేసిన సీఈవో
చింతలపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘంలో 644 మంది రైతులు సభ్యులుగా ఉండగా, రైతులు తీసుకున్న రూ.3.50 కోట్ల రుణాలు రెన్యువల్ చేయకపోవడంతో రుణమాఫీ వర్తించలేదు. ఇదంతా సీఈవో నిర్లక్ష్యం కారణంగా జరిగిందని రైతులు రోడ్డెక్కారు. విత్తనాలు, ఎరువుల అందజేతలోనూ ఇక్కడి సీఈవో ఇలాగే దండుకున్నాడని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు, తమ సొంత బ్యాంకులో పనిచేసే ముగ్గురు సిబ్బంది వేతనాలనూ ఈ సీఈవో ఫోర్జరీ చేసి కొట్టేసినట్లు తెలుస్తోంది. ఈ అన్యాయంపై బ్యాంకు అధికారులు, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరిగిన లాభం లేకుండా పోయిందని, ప్రభుత్వం స్పందించి రుణమాఫీ చేయాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Also Read: Viral Video: రోడ్డుపై యువతితో ఆకతాయి అసభ్య ప్రవర్తన.. చివరికీ ఏం జరిగిందంటే..

యూరియా అమ్ముకున్న సీఈవో..
హనుమకొండ జిల్లా కమలాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సిబ్బంది.. రైతులకు రాయితీపై ఇవ్వాల్సిన యూరియాను అక్రమంగా ప్రైవేట్ ఫర్టిలైజర్ దుకాణాలకు విక్రయిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. గతంలో మర్రిపల్లిగూడెం రైతులు ఇలా అక్రమంగా తరలిస్తున్న యూరియాను పట్టుకుని అధికారులకు సమాచారం ఇవ్వగా, గతంలో సంఘం సీఈవోగా పని చేసిన తోట మొగిలి దీనికి బాధ్యుడని అధికారులు గుర్తించారు.

రికవరీ చేయాల్సిందే..
రైతుల మేలు కోసం ఏర్పడిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను కొందరు భ్రష్టు పట్టిస్తున్నారు. రైతుల పేరిట ఫోర్జరీ సంతకాలు చేసి లక్షలు దండుకున్న పీఏసీఎస్‌ సీఈవో రాజయ్య నుంచి డబ్బులు రికవరీ చేయాలి. సీఈవో అక్రమాలకు తెరలేపాడు. సాంకేతికంగా రుణమాఫీ వర్తించకుండా నష్టం చేశాడు. సీఈవోపై చర్యలు తీసుకోని పక్షంలో ఆందోళనలు చేస్తాం.

– యాలపల్లి కరుణాకర్ రెడ్డి, రైతు,

ఇంత నిర్లక్ష్యమా?
మాఫీకి అర్హత ఉన్నా, పీఏసీఎస్‌లో అప్పు తీసుకోకున్నా తీసుకున్నట్టు రికార్డుల్లో చూపించడాన్ని బట్టి పై అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థమవుతోంది. వెంటనే దీనిపై విచారణ జరిపి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలంటే.. తక్షణం అధికారులు రంగంలోకి దిగాలి

– మసన్ పల్లి మహేందర్, రైతు

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×