EPAPER

HYDRA: హైడ్రాకు ఎంపీ అనిల్ 25 లక్షల విరాళం

HYDRA: హైడ్రాకు ఎంపీ అనిల్ 25 లక్షల విరాళం

– హైడ్రా పేరుతో బెదిరింపులు మానండి
– అవినీతికి పాల్పడుతూ దొరికితే వేటే
– ఏసీబీ, విజిలెన్స్ నిఘా మరింత పెరగాలి
– హైడ్రాకు చెడ్డపేరు తెస్తే ఊరుకునేది లేదు
– అక్రమ అనుమతులిచ్చిన వారిపైనా చర్యలు?
– హైడ్రా పేరుతో అవినీతి వార్తలపై సీఎం హెచ్చరిక
– కూల్చివేత నోటీసులు ఇక.. హైడ్రా పేరుతోనే: సీఎస్
– దుర్గం చెరువు పరిధిలోని 204 భవనాలకు నోటీసులు
– సీఎం సొంత సోదరుడి ఇంటికీ నోటీసులు
– హైడ్రా సంస్థకు ఎంపీ అనిల్ రూ. 25 లక్షల విరాళం


MP Anil Donations: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రాకు అప్రతిష్ట తెచ్చేలా వ్యవహరించే ఏ అధికారినీ తాను ఉపేక్షించనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్‌లో కొంద‌రు కిందిస్థాయి అధికారులు హైడ్రా పేరుతో భవనాల యజమానులను భయపెట్టి, అవినీతికి పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదులపై సీఎం ఘాటుగా స్పందించారు. అలాంటి అక్రమాలకు పాల్పడే అధికారుల మీద నిఘా పెట్టాలని సీఎం ఏసీబీ, విజిలెన్స్ అధికారులను ఆదేశించారు.

అక్రమాలకు పాల్పడితే.. వేటే..
గ‌తంలో ఇచ్చిన‌ నోటీసులు, రెండు మూడేండ్ల కింద‌టి ఫిర్యాదుల‌ను అడ్డంగా పెట్టుకొని కొన్ని చోట్ల రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు డ‌బ్బులు డిమాండ్ చేస్తున్నట్లు త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని సీఎం వెల్లడించారు. అమయాకులను బెదిరించి, డబ్బు గుంజాలని చూసే అలాంటి వారిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవటం ఖాయమని సీఎం ఘాటుగా హెచ్చరించారు. భాగ్యనగరాన్ని కబ్జా కోరల నుంచి విముక్తం చేసేందుకే హైడ్రాను తెచ్చామని, ఈ విషయంలో ఆ సంస్థకు పూర్తి స్వేచ్ఛనిచ్చి పనిచేయమని చెబుతున్నామని పేర్కొన్నారు. సొంత పార్టీ నేతల ఇళ్లైనా ఉపేక్షించాల్సిన పనిలేదని ఆయన స్పష్టం చేశారు.


సీఎస్ సమీక్ష
రాజధానిలోని చెరువుల ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన ఆదేశాల అమలుకు ఒక సమగ్ర కార్యాచరణను రూపొందించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఓఆర్ఆర్ పరిధిలోని అన్ని చెరువులు, పార్కులు, నాలాలతో పాటు అన్ని ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యతలను పూర్తిస్థాయిలో హైడ్రాకు అప్పగించేందుకు విధి విధానాలను రూపొందిస్తున్నట్టు ఆమె తెలిపారు. హైడ్రా చర్యలు ప్రణాళికా బద్ధంగా సాగేందుకు ప్రభుత్వంలోని కీలక విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆయా విభాగాల అధికారులకు సూచించారు.

హైడ్రా పేరుతోనే నోటీసులు
చెరువులు, కుంటలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల తొలగింపుపై ప్రస్తుతం నీటిపారుదల శాఖ, జీహెచ్ఎంసీ, పురపాలక శాఖ, పంచాయితీ రాజ్, వాల్టా తదితర విభాగాలు వేర్వేరుగా నోటీసులు జారీ చేస్తున్నారని, దీనివల్ల కొంత గందరగోళం ఏర్పడుతోందని, దీనిని నివారించటానికి ఇకపై.. హైడ్రా ద్వారానే నోటీసులు జారీ చేయాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. భూఆక్రమణ చట్టం, వాల్టా చట్టం, నీటిపారుదల శాఖ చట్టాల ద్వారా జారీ చేసే నోటీసులు, తొలగింపుల ప్రక్రియపై ఇకపై పూర్తి అధికారం హైడ్రాదేనని, ఆ సంస్థ సూచనల మేరకే ఆయా విభాగాలు మందుకు సాగాలని తెలిపారు.

హైడ్రా బలోపేతం
హైడ్రాకు కావాల్సిన అదనపు అధికారులు, సిబ్బందిని త్వరలోనే కేటాయించనున్నట్టు శాంతకుమారి తెలిపారు. ఎఫ్.టీ.ఎల్, నాలా ఎంక్రోచ్మెంట్, ప్రభుత్వ స్థలాలు, పార్కుల పరిరక్షణ కూడా హైడ్రా పరిధిలోకే తేనున్నామని చెప్పారు. గండిపేట, హిమాయత్ సాగర్ చెరువుల పరిరక్షణ బాధ్యతలనూ ఇకపై జల మండలి నుండి హైడ్రా పరిధిలోకి తేనున్నామని వెల్లడించారు. హైడ్రా ఆధ్వర్యంలో మొత్తం 72 బృందాలు ఏర్పాటయ్యాయని, వీటిని మరింత బలోపేతం చేయాడానికి కావాల్సిన పోలీస్, సర్వే, నీటిపారుదల శాఖల నుండి అధికారులు, సిబ్బందిని త్వరితగతిన కేటాయించనున్నట్టు శాంతకుమారి తెలిపారు. ఈ సమావేశంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్లతో బాటు పలు శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. గతంలో నిబంధనలు ఉల్లంఘించి భవన అనుమతులు మంజూరుచేసిన అయిదుగురు అధికారులకూ నోటీసులు ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

దూకుడు పెంచిన అధికారులు
హైడ్రా సంస్థ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. శేరిలింగంపల్లి మండల పరిధిలోని 5 చెరువుల పరిధిలోని ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లలో కట్టిన 204 భవనాల యజమానులకు వాల్టా చట్టంలోని సెక్షన్‌ 23(1) కింద నోటీసులు జారీ చేసింది. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నెక్టర్స్‌ కాలనీ, డాక్టర్స్‌ కాలనీ, కావూరి హిల్స్‌, అమర్‌ సొసైటీ వాసులకు 77 నోటీసులు అందజేసింది. యజమానులు లేనిచోట్ల అధికారులు ఆ ఇళ్లకు నోటీసులను అంటించారు. నెల రోజులలో యజమానులు స్వచ్ఛందంగా తమ నిర్మాణాలను కూల్చేయాలని, లేకుంటే తామే ఆ పనిచేస్తామని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు.

సీఎం సోదరుడి ఇంటికి నోటీసులు
మాదాపూర్ దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని అమర్ సొసైటీలోని సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటికి కూడా అధికారులు గురువారం నోటీసులు అంటించారు. కాగా, ఈ నోటీసులపై తిరుపతిరెడ్డి స్పందించారు. ‘అమర్ సొసైటీలో 2015లో ఇంటిని కొన్నాను. నాకు ఇల్లు అమ్మిన యజమాని అన్ని అనుమతులతోనే ఇంటిని నిర్మించినా.. అది బఫర్‌ జోన్‌లో ఉందని మాత్రం చెప్పలేదు. నోటీసులు వచ్చాకే ఈ విషయం తెలిసింది. సమయం ఇస్తే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతా’ అన్నారు. బీఆర్ఎస్ నేతలు తనను లక్ష్యంగా చేసుకొని అమర్‌ సొసైటీ వాళ్లను ఇబ్బంది పెడుతున్నారని, తనను లక్ష్యంగా చేసుకోకపోతే మిగతా వాళ్లు ఇబ్బంది పడేవాళ్లు కాదని తిరుపతిరెడ్డి అన్నారు.

హైడ్రాకు ఎంపీ భారీ విరాళం
రాజధాని పరిధిలోని కబ్జాదారులు, ఆక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న హైడ్రా చర్యలను సామాన్యులు, మేధావులు, పర్యావరణ వేత్తలు స్వాగతిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, గురువారం రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. హైడ్రా సంస్థ చర్యలను అభినందించి, ఆ సంస్థ అభివృద్ధి కొరకు తన ఎంపీ నిధుల నుంచి రూ.25 లక్షలను కేటాయిస్తున్నట్లు లేఖను అందజేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్‌ను సమూలంగా నిర్మూలించేందుకు కూడా ఇదే రీతిన స్పెషల్ డ్రైవ్ కూడా చేపట్టాలని పోలీసు శాఖను కోరినట్లుగా తెలిపారు. తన పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ హైదరాబాద్‌ను అమెరికా చేసినట్లు గొప్పలు చెప్పిందని కానీ, నగరంలో కబ్జాకు గురైన భూముల్లో మెజారిటీ ఆ పార్టీ నేతలు చేసినవేనని విమర్శించారు. ఎలాంటి రాజకీయ ఒత్తిడులు వచ్చినా.. ముందుకే సాగుతున్నామని రంగనాథ్ తనతో చెప్పినట్లు ఆయన వెల్లడించారు.

Tags

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×