EPAPER

CM Revanth on Kavitha bail: కవిత బెయిల్ వెనుక.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

CM Revanth on Kavitha bail: కవిత బెయిల్ వెనుక.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy Reaction on Kavitha bail: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి విడుదలయ్యారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టై ఐదున్నర నెలలపాటు జైలులో ఉన్న ఆమె మంగళవారం తీహార్ జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. అయితే, కవిత బెయిల్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ ను బీజేపీకి ట్రాన్స్ ఫర్ చేశారన్నారు. అందుకే కవితకు ఐదు నెలల్లో బెయిల్ వచ్చిందంటూ సీఎం ఆరోపణలు చేశారు. అయితే, ఇదే కేసులో నిందితుడైన మనీష్ సిసోడియాకు ఏడాది వరకు బెయిల్ రాలేదని, మరో నిందితుడైన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంకా జైల్లోనే ఉన్నారని గుర్తుచేశారు. కవితకు ఇంత త్వరగా బెయిల్ రావడం వెనుక బీజేపీ మద్దతు ఉందనే అనుమానం కలుగుతోందని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు గెలవటం కోసం హరీష్ రావు నాయకత్వంలో గులాబీ పార్టీ గట్టిగా పనిచేసిందని, వారి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారమే కవితకు బెయిల్ వచ్చిందని ఆరోపించారు.


కొందరు తనను, మాజీ సీఎం కేసీఆర్‌ను పోల్చే ప్రయత్నం చేస్తున్నారని, నిజానికి తమ ఇద్దరికీ ఎలాంటి పోలిక లేదన్నారు. తాను కొడంగల్, కోస్గి, కొండారెడ్డి పల్లికి మాత్రమే గాక యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న బాధ్యత గల ముఖ్యమంత్రినని, కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ తక్షణం ప్రజల కోసం ఫామ్‌హౌజ్ నుంచి బయటికి రావాలి. ప్రతిపక్ష నాయకుడు హోదాలో ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బును జీతంగా తీసుకుంటున్నందుకైనా కేసీఆర్ బయటికి రావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వ్యవస్థలు కల్పించే సౌకర్యాలను వాడుకుంటూ పనిచేయకుండా కూర్చుంటామంటే కుదరదని స్పష్టం చేశారు. తన కొడుకును కేసీఆరే నమ్మటం లేదని సీఎం వ్యాఖ్యానించారు. కర్ణాటకలో వాల్మీకి స్కామ్‌తో మాకు ఎలాంటి సంబంధమూ లేదని, కర్ణాటక బోర్డర్ ప్రాంతాల్లో ఖాతాలు ఉన్నంత మాత్రాన మాపై ఆరోపణలు చేస్తే ఎలా? అని ప్రశ్నించారు. ఆ స్కామ్‌లో బీఆర్ఎస్ నేతలకే లింకులు ఉండొచ్చని, కొందరు బీఆర్ఎస్ నేతలు డ్రగ్స్ కోసం బెంగుళూరు వెళ్లడం అందరికీ తెలిసిందేనని అన్నారు.

Also Read: జన్వాడ ఫామ్‌హౌస్ వద్ద మరోసారి అధికారుల సర్వే.. చివరకు ఏం తేలిందంటే..?


రుణమాఫీ విషయంలో హరీష్ రావు సవాల్ చేసి పారిపోయారని సీఎం ఎద్దేవా చేశారు. హరీష్ రావు దొంగ అని తనకు తెలుసునని, ఆయనకు రుణమాఫీపై మాట్లాడే నైతిక హక్కు లేదని సెటైర్లు వేశారు. ‘రుణమాఫీ అనేది నా కమిట్మెంట్. నేను చెప్పాను. చేసి చూపించాను. ఈ విషయంపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలతో ఏ చర్చకైనా సిద్ధమే’ అని సవాలు విసిరారు. హరీష్ రావు, కేటీఆర్ తెలంగాణలోని ప్రతి రైతు దగ్గరకు వెళ్లి, రుణమాఫీ కాని వారి వివరాలు సేకరించి, జిల్లా కలెక్టరేట్‌లో ఇవ్వటం ద్వారా తమ గత పాపాలను ప్రక్షాళన చేసుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘హరీష్ మంత్రిగా ఉండగా మిషన్ కాకతీయ.. కమిషన్ కాకతీయ అయింది. చెరువుల కబ్జాలపై నిజనిర్ధారణ కమిటీ వేద్దాం. హరీష్ రావును ముందు పెడదాం. ఎవరి కబ్జాలు ఏంటో అప్పుడు తేలుతుంది’ అని కామెంట్ చేశారు. రుణమాఫీపై ధర్నాలు చేసేది బీఆర్ఎస్ కార్యకర్తలేనని, బీఆర్ఎస్ ధర్నాల్లో రైతులు లేరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరేవారు తమ పాలన నచ్చి చేరుతున్నారని, ఎవరినీ భయపెట్టి పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం లేదని, తమ ప్రభుత్వానికి సరిపడినంత బలం ఉందని తెలిపారు.

రెండు లక్షల రూపాయలకు పైబడిన రుణాల విషయంలో రుణమాఫీ జరగలేదని కొందరు రైతులు కంగారుపడుతున్నారని, వారు ఆ పై మొత్తం కడితే వెంటనే రుణమాఫీ జరుగుతుందని సీఎం హామీ ఇచ్చారు. కాస్త ఆలస్యమైనా అర్హేలైన రైతులందరికీ రుణమాఫీ జరుగుతుందని తెలిపారు. అన్ని జిల్లా కలెక్టరేట్లలో రుణమాఫీ గ్రీవెన్స్ సెల్‌లు పెట్టామని, అధికారులు రుణమాఫీ కానివారి లిస్టులు కలెక్టరేట్‌లో ఇవ్వాలని సూచించారు. ఇప్పటివరకు రూ. 17,933 కోట్లు జమ చేశామని చెప్పారు.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×