EPAPER

Welfare Schemes: సంక్షేమ రథంతోనే అభివృద్ధి పథం..!

Welfare Schemes: సంక్షేమ రథంతోనే అభివృద్ధి పథం..!

Development: అభివృద్ధి, సంక్షేమం అనే మాటలను రోజూ నేతల నోట మనం వింటున్నాం. అలాగే, ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయనో లేక సంక్షేమం పేరుతో ఖజానాను గుల్లచేసి, అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నాయనే వాదనలూ మన చెవినపడుతూనే ఉంటాయి. అయితే, సంక్షేమం, అభివృద్ధి అనేవి రెండు వేర్వేరు అంశాలు. ఇవి ఒకదానితో ఒకటి పోటీ పడే అంశాలు కావు. అవి పరస్పరాధారితాలు. సంపూరకాలు. సంక్షేమం అనేది కాలక్రమంలో అభివృద్ధికి దారితీస్తుంది. ప్రజల ఆర్థిక పరిస్థితిని, జీవన ప్రమాణాలను తర్వాతి స్థాయికి తీసుకుపోతుంది. సరైన దిశగా దీనిని అమలు చేస్తే, కాలక్రమంలో ఇక.. సంక్షేమ కార్యక్రమాలతో పనిలేని సమాజం ఏర్పడుతుంది. తొలిదశలో ప్రాథమిక అవసరాలైన కూడు, గూడు, గుడ్డ వంటివి సమకూర్చటం, తర్వాతి దశలో విద్య, వైద్య సౌకర్యాలు అందించడం ద్వారా పౌరుల ఆర్థిక, సామాజిక స్థితి దిగజారకుండా చూస్తూనే, కొంతకాలానికి వాటిని మెరుగుపడేలా చేయటమే సంక్షేమం యొక్క అసలైన అర్థం. పౌరులకు కనీస అవసరాలు, విద్య, వైద్యంతో బాటు తగిన ఉపాధి, కనీస విరామం, వినోదాలను అందిస్తే వచ్చే సానుకూల ప్రగతినే ఆర్థికవేత్తలు.. అభివృద్ధి అంటున్నారు. అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతుల్యతను పాటిస్తూ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవటమే ఇప్పుడు వాటికి పెద్ద కసరత్తుగా మారుతోంది.


మనదేశంలో కొన్ని పార్టీలు రాజకీయ లబ్ది కోసం కొన్ని అనవసర పథకాలను అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీలు ఎన్నికల వేళ.. ఓట్ల కోసం హడావుడిగా ఆయా పథకాలను అమలు చేసిన ఘటనలు గతంలో, వర్తమానంలోనూ చాలానే ఉన్నాయి. ఓటర్లను ఏమార్చుతూ, ఓట్లు రాల్చుకునేందుకు ఆయా పార్టీలు ప్రజలు పన్నులుగా కట్టిన డబ్బును స్వలాభం కోసం పథకాలకు వెచ్చించటం ఖచ్చితంగా అభ్యంతరకరమే. వాటిని ఉచితాలు అనటంలో తప్పులేదు. కానీ, ఒక నిర్దిష్టమైన సామాజిక, ఆర్థిక ప్రగతిని సమాజంలో తీసుకొచ్చేందుకు, నిపుణులతో చర్చించి, ఒక స్పష్టతతో, పథకాల లక్ష్యాలను ముందుగా నిర్దేశించుకుని, ఎన్నికలకు ముందే తమ పథకం లక్ష్యం, దానిని అమలుచేసే మార్గం గురించి నిర్దిష్టంగా ప్రజలకు ముందే చెబితే వాటిని ఉచిత పథకాలు అనలేము. పైగా, మన రాజ్యాంగం పౌరులకు సంక్షేమ రాజ్యమనే హామీనిచ్చింది. మన రాజ్యాంగంలోని 14వ అధికరణ సమానత్వపు హక్కును ప్రతిపాదించగా, 38వ అధికరణ పౌరులందరికీ సమాన అవకాశాలను ఇచ్చేలా పూచీ పడింది. రాజ్యాంగం ప్రవచించిన ఆదేశిక సూత్రాలు రాజకీయ ప్రజాస్వామ్యాన్నే గాక సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని, సంక్షేమ రాజ్యాన్ని ప్రతిపాదించాయి. కనుక ఆ సమానత్వ లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వాలు తీసుకోవాల్సిందే.

మన దేశంలోని ఆర్థిక అసమానతల గురించి, వాటికి గల చారిత్రక, ఆర్థిక, సామాజిక నేపథ్యాల గురించి, ఈ అసమానతలను సరిదిద్దటానికి రాజ్యం.. ఏ విధంగా సంక్షేమంపై దృష్టి పెట్టాలనే అంశాలను నోబెల్‌ పురస్కార గ్రహీత అమర్త్యసేన్‌ తన ‘అన్‌సర్టెన్ గ్లోరీ: ఇండియా అండ్ ఇట్స్ కాంట్రడిక్షన్స్’ అనే పుస్తకంలో వివరంగా రాశారు. ఇందులో పలు రాష్ట్రాల అభివృద్ధి నమూనాలను సేన్ చర్చించారు. తమిళనాడు ఇతర రాష్ట్రాల కంటే ఎందుకు, ఏ రంగాలలో ముందున్నదనే విషయాన్ని ఆయన గణాంక సహితంగా చెప్పుకొచ్చారు. దేశ ఆర్థిక ప్రగతి తీవ్ర మందగమనంలో ఉన్నప్పుడూ.. తమిళనాడు వృద్ధి బాటలోనే పయనించిందని సేన్ ప్రశంసించారు. దేశం మొత్తంలో తయారీ రంగంలో గుజరాత్ ముందంజలో ఉన్నప్పటికీ, అభివృద్ధి పంపిణీ, మానవ వనరుల అభివృద్ధిలో బాగా వెనకబడి ఉందని, కేరళ మానవ వనరుల అభివృద్ధిలో ముందంజలో ఉన్నా.. తయారీ రంగం, ఐటీలో బాగా వెనుకబడిందని వివరించారు. కానీ, అన్ని రంగాలలో సంతులిత అభివృద్ధి సాధించిన ఏకైక రాష్ట్రంగా తమిళనాడు నిలిచిందని, ఇదంతా తమిళనాడు పాలకులు ఆచరించిన రాజకీయ సిద్ధాంతం చలువేనని ఆయన విశ్లేషించారు. స్వాతంత్ర్యానికి పూర్వమే ఆ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిందని, గ్రామీణ స్థాయి నుంచే ఉచిత వృత్తి విద్యకు ప్రాథాన్యతనిచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.


Also Read: Congress: అభిషేక్ మను సింఘ్వీ ఎన్నిక ఏకగ్రీవం

మరోవైపు తమ పన్నుల డబ్బును ప్రభుత్వాలు తమ ఇష్టం వచ్చినట్లుగా పేదల పథకాలకు వాడటంపై దేశంలోని పన్ను చెల్లింపుదారుల్లో కొంత అసహనం కనిపిస్తోంది. అలాగే, మూలధన వ్యయం కోసం ప్రభుత్వాలు అప్పులు చేస్తే ఫరవాలేదు గానీ, రోజువారీ పాలన, రెవిన్యూ వ్యయం కోసం అప్పులు చేయడం వినాశనకరమనే భావన కూడా కొందరు మేధావులు, ఆర్థిక వేత్తలలో బలంగా ఉంది. ఈ వాదనలో బలమున్నట్లు కనిపించినా, ఇది సరైనదని అన్నిసార్లూ చెప్పటం సాధ్యంకాదు. నగదు ఆధారిత ప్రభుత్వ గణాంక వ్యవస్థలో శాశ్వత ప్రాతిపదికన కంటికి కనిపించే ప్రభుత్వ ఆస్తిని ఏర్పరచటాన్ని మూలధన వ్యయం అంటున్నాం. ఉదాహరణకు.. రోడ్లు, ప్రాజెక్టులు, ప్రభుత్వ రంగ సంస్థలు వంటివి ఏర్పాటు చేయటం అన్నమాట. అయితే, మన ప్రభుత్వాలు ఏర్పరచిన ఇలాంటి ఆస్తులలో ఎన్ని ఆదాయాన్ని సమకూర్చుతున్నాయనే ప్రశ్న వేసుకున్నప్పుడు ఈ వాదన సరైనది కాదేమోనని అనిపిస్తుంది. అయితే, దీనికి కొన్ని మినహాయింపులున్నమాట మాత్రం నిజం.

ఇక.. సంక్షేమ పథకాలను ‘ఉచితాలు’ అంటూ ఎద్దేవా చేస్తూ.. వాటి సామాజిక,ఆర్థిక ప్రయోజనాలను తక్కువ చేసి చూపే ప్రయత్నాలను ప్రధాని మోదీ గత లోక్‌సభ ఎన్నికల్లో చేశారు. ప్రజల సొమ్మును మిఠాయిలుగా పంచుతున్నారన్నది ఆయన వాదన. అదే నిజమైతే మరి కేంద్రం దేశవ్యాప్తంగా కట్టించిన ఉచిత టాయిలెట్లు, అందించిన గ్యాస్ కనెక్షన్లు, గృహ పథకాలూ అలాంటివేనని భావించాలా అనే విమర్శలు వచ్చాయి. మధ్యప్రదేశ్‌, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఓటేస్తే ఇంటికి ఒక ఆవును ఉచితంగా ఇస్తామన్న బీజేపీ వాగ్దానాలూ చర్చకు వచ్చాయి. ఈ నేపథ్యంలో మన పథకాలలో ఏవి ఉచితాలు, ఏవి అనుచితాలనేది నిర్దిష్టంగా గీతగీసినట్లు వేరుచేయటం కష్టంగా మారుతోంది. బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రభుత్వ స్కూలులో చదివే బాలికలకు సైకిళ్ల పంపిణీ జరుగుతోంది. తమిళనాడులో గతంలో అమ్మ క్యాంటీన్లు, వర్తమానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘అన్న’ క్యాంటీన్లు నడుస్తున్నాయి. అయితే, సదరు పార్టీలు పంచిన సైకిళ్ల మూలంగా ఆ రాష్ట్రాల్లో బాలికా విద్య పెరిగింది. పొరుగూళ్లకు వెళ్లి చదువుకునే వసతి ఏర్పడింది. క్యాంటీన్ల మూలంగా పట్టణ, నగర ప్రాంతాలలోని వీధి వ్యాపారులు, శ్రామిక వర్గం వేళకింత చౌకగా పొట్ట నింపుకుంటున్నారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్ ఉన్నత, మధ్య తరగతికి కంటగింపుగా ఉన్నప్పటికీ, దేశ రాజధానిలో ఈ వర్గాలకు సేవలందించే లక్షలాది పేద, అసంఘటిత రంగ కార్మికులకు మేలు జరుగుతోంది. తెలంగాణలో ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం విషయంలోనూ పేద, దిగువ మధ్యతరగతి శ్రామిక వర్గాలకు కలుగుతున్న మేలును నేడు ప్రత్యక్షంగా చూస్తున్నాం.

Also Read: Pushpa 2 Climax: పుష్ప క్లైమాక్స్ పీక్ లెవెల్ అంటున్న అల్లు అర్జున్

ఏది సంక్షేమ పథకం?, ఏది ఉచితం? అనే విషయంలో సామాన్యులతో పోల్చితే కంటే సామాజిక వేత్తలు, ఆర్థికవేత్తల దృష్టికోణం భిన్నంగా ఉంది. వ్యక్తి ప్రయోజనం కంటే సామాజిక ప్రయోజనం చేకూర్చే విద్య, ఆరోగ్య సేవలు పౌరులకు ఉచితంగా లభిస్తే, దీర్ఘకాలంలో వాటి ఫలితం ఉంటుందని వారి వాదన. ఉచితాలపై గతంలో సుప్రీంకోర్టులో దాఖలైన కేసు విచారణ సమయంలో నాటి చీఫ్ జస్టిస్ ఎన్‌.వి రమణ మాట్లాడుతూ.. ‘ఒక క్షురకునికి షేవింగ్ కిట్, ఒక విద్యార్థికి సైకిల్, గీత కార్మికులకు అవసరమైన పనిముట్లు, రజకునికి ఇస్త్రీ పెట్టె ఇవ్వడం వల్ల వారి జీవన ప్రమాణాలు తప్పక పెరుగుతాయి’ అని వ్యాఖ్యానించారు. చివరగా.. మన స్వరాజ్య పోరాట లక్ష్యం కేవలం స్వాతంత్ర్యాన్ని పొందటమే కాదు. ఒక సర్వసత్తాక, సంక్షేమ, స్వావంలంబన గల దేశంగా దీనిని మలచటం కూడా. కనుక, ఉమ్మడి అవసరాల్ని తీర్చటానికి పౌరులు ఏర్పరుచుకున్న పాలనా వ్యవస్థలు.. తమ రాజకీయ అధికారం కోసం అసలు లక్ష్యాన్ని పణంగా పెట్టి పౌరుల పేదలను తాత్కాలికంగా సంతోషపెట్టినా దీర్ఘకాలంలో నష్టపోయేది పేదలేనని వాస్తవాన్ని ఎరుకలో ఉంచుకుంటూ పథకాల రూపకల్పన చేయాలి. సకల జనులకు స్వాతంత్ర ఫలాలు అందే వరకు అవసరమైన మేర సంక్షేమం అందించాల్సిన బాధ్యత నుంచి మన ప్రభుత్వాలు వైదొలగకుండా చూడాల్సిన బాధ్యత పౌరసమాజం మీదే ఉంది.

Related News

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Jammu Kashmir Elections: కశ్మీర్ ఎన్నికలు.. కమలానికి అగ్నిపరీక్షే..

Why Atishi as Delhi CM: సీఎంగా అతిశీనే ఎందుకు? కేజ్రీవాల్ ప్లాన్ ఏంటి?

Amaravati: అమరావతి సేఫ్.. ఇక దూసుకుపోవడమే

Arvind Kejriwal Resignation: కేజ్రీ కొత్త వ్యూహం ఫలిస్తుందా?

Arvind Kejriwal: అరవింద్ ‘క్రేజీ’వాల్.. బీజేపీకి చుక్కల్!

Big Stories

×