EPAPER

Israel-Hezbollah War: ఇజ్రాయెల్‌ను ఇంతగా వణికిస్తున్న.. ఈ హిజ్బుల్లా కథేంటీ..?

Israel-Hezbollah War: ఇజ్రాయెల్‌ను ఇంతగా వణికిస్తున్న.. ఈ హిజ్బుల్లా కథేంటీ..?

హమాస్ తర్వాత ఇజ్రాయెల్‌ను ఇంతగా ఇబ్బందిపెడుతున్న హిజ్బుల్లా సంస్థ సామర్థ్యం మామూలుది కాదు. హిజ్బుల్లా అనేది షియా ముస్లిం సంస్థ. లెబనాన్‌లో రాజకీయంగా చాలా ప్రభావవంతమైన సంస్థ. లెబనాన్‌లోని అత్యంత శక్తిమంతమైన సాయుధ దళం కూడా దీని నియంత్రణలోనే ఉంది. ఇది 1980ల ప్రారంభంలోనే ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఏర్పడిన సంస్థ. ఈ ప్రాంతంలోని ఆధిపత్య షియా శక్తి అయిన ఇరాన్ దేశం ‌దీనిని స్థాపించింది. లెబనాన్ అంతర్యుద్ధం సమయంలో హిజ్బుల్లా ఉద్భవించింది. 1975లో దేశంలో భారీగా ఉన్న సాయుధ పాలస్తీనియన్ ఉనికిపై సుదీర్ఘకాలం జరిగిన అసంతృప్తి ఫలితంగా ఏర్పడింది.

లెబనాన్ అంతర్యుద్ధం సమయంలో ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్‌ను ఆక్రమించాయి. అయితే, 1992 నుంచి హిజ్బుల్లా లెబనాన్ జాతీయ ఎన్నికలలో పాల్గొంటూ, ప్రధాన రాజకీయ శక్తిగా మారింది. 2000 సంవత్సరంలో లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ వైదొలిగినప్పుడు, తామే వారిని తరిమి కొట్టామని హిజ్బుల్లా చెప్పుకుంది. అప్పటి నుంచి హిజ్బుల్లా దక్షిణ లెబనాన్‌లో వేలాది మంది సిబ్బంది, క్షిపణులతో సహా అనేక రకాల ఆయుధాలను సమకూర్చుకుంటూ, వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ ఉనికిని వ్యతిరేకిస్తూ వస్తోంది.


అయితే, 2006లో హిజ్బుల్లా సరిహద్దులు దాటి దాడి చేసినప్పుడు కూడా హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరిగింది. ఈ పరిస్థితుల్లో హిజ్బుల్లాను నిర్మూలించడానికి ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్‌పై దాడి చేసినా, అది నిలదొక్కుకుని అప్పటి నుంచి తన సైన్యం సంఖ్యను పెంచుకుంటూ.. మరింత మెరుగైన ఆయుధాలను సమకూర్చుకుంది. అయితే, ఈ సంస్థ ఆయుధగారంలో లక్షకు పైగా రాకెట్లు ఉన్నట్లు అంచనా ఉంది. వీటితో పాటు స్వల్పదూర క్షిపణులు కూడా ఉన్నాయి. సైనికశిక్షణ పొందిన లక్షమందికి పైగా వాలంటీర్లు ఉన్నారు. ఈ ఆయుధ సామర్థ్యం లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడి చేయకుండా నివారించేందుకేనని ఆ సంస్థ చెబుతోంది. అయితే, అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు, ఇజ్రాయెల్, గల్ఫ్ అరబ్ దేశాలు, అరబ్ లీగ్ కూడా హిజ్బుల్లాను ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తున్నాయి. కొన్ని దేశాలు కేవలం దాని సైన్యన్ని ఉగ్రవాదులుగా చెబుతాయి. ఏది ఏమైనా సిరియా, ఇరాన్‌లు కలిసి వాటి దీర్ఘకాల శత్రువైన ఇజ్రాయెల్‌ను ఎదురించడానికి హిజ్బుల్లాను పెంచి పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: పాక్ లో ఉగ్రవాదుల ఎటాక్..73 కు పెరిగిన మృతుల సంఖ్య

హిజ్బుల్లాకు హసన్ నస్రల్లా నాయకత్వం వహిస్తున్నారు. నస్రల్లా 1992లో సెక్రటరీ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు. నస్రల్లా హిజ్బుల్లాకు చెందిన ఏడుగురు సభ్యుల షురా కౌన్సిల్, దాని ఐదు ఉపకౌన్సిళ్లను పర్యవేక్షిస్తారు. రాజకీయ అసెంబ్లీ, జిహాద్ అసెంబ్లీ, పార్లమెంటరీ అసెంబ్లీ, కార్యనిర్వాహక అసెంబ్లీ, న్యాయ అసెంబ్లీ పేరుతో ఇవి ఉంటాయి. ఇక, యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ అంచనా ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా పదివేల మంది హిజ్బుల్లా సభ్యులు, ఇతర మద్దతుదారులు కూడా చాలా మంది హిజ్బుల్లా వెనుక ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, లెబనాన్‌లోని షియా మెజారిటీ ప్రాంతాలలో చాలా వరకు హిజ్బుల్లా నియంత్రిస్తుంది. వీటిలో బీరూట్, దక్షిణ లెబనాన్, తూర్పు బెకా వ్యాలీ ప్రాంతాలున్నాయి. ఇక, హిజ్బుల్లా లెబనాన్‌ కేంద్రంగా ఉన్నప్పటికీ…. దాని కార్యకలాపాలు, ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్‌ను లక్ష్యంగా చేసుకున్న కార్యకలాపాలు దేశీయ సరిహద్దుల ద్వారా మాత్రమే పరిమితం కాదు దాని మానిఫెస్టో స్పష్టం చేస్తుంది. ఈ గ్రూపు.. విదేశాల్లో ఉన్న ఇజ్రాయెల్, యూదుల లక్ష్యాలకు వ్యతిరేకంగా ఉగ్రవాద చర్యలను ప్లాన్ చేస్తుంది. ఆఫ్రికా, అమెరికా, ఆసియాల్లో కూడా హిజ్బుల్లా కార్యకలాపాలకు ఆధారాలు ఉన్నాయి.

నిజానికి, ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన ప్రభుత్వేతర సాయుధ దళాల్లో హిజ్బుల్లా ఒకటి. దీనికి ఇరాన్ నిధులు, ఆయుధాలను సమకూరుస్తోంది. హిజ్బుల్లా చీఫ్ అయిన షేక్ హసన్ నస్రల్లా తమ వద్ద లక్ష మంది యుద్ధ వీరులు ఉన్నారని చెప్పుకుంటున్నారు. కానీ, వాస్తవ అంచనాల ప్రకారం ఈ సంఖ్య 20 వేల నుండి 50 వేలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, వీరిలో అనేక మంది సాయుధ శిక్షణ పొందినవాళ్లు, సిరియా అంతర్యుద్ధంలో పోరాడిన వాళ్లు కూడా ఉన్నారు. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ అనే సంస్థ నివేదికల ప్రకారం… వీరి వద్ద లక్షా 20 వేల నుండి రెండు లక్షల రాకెట్లు, క్షిపణులు ఉన్నాయని అంచనా. ఇక, హిజ్బుల్లా ఆయుధాల్లో ఎక్కువ భాగం చిన్న, అన్-గైడెడ్ సర్ఫేస్-టు-సర్ఫేస్ ఆర్టిల్లరీ రాకెట్‌లున్నట్లు తెలుస్తోంది. అలాగే, యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్, యాంటీ-షిప్ క్షిపణులు, ఇజ్రాయెల్ భూభాగంపై దాడి చేయగల గైడెడ్ క్షిపణులూ ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇవి గాజా స్ట్రిప్‌లోని హమాస్ వద్ద ఉన్న వాటికంటే అత్యంత అధునాతన ఆయుధాలుగా పరిగణిస్తున్నారు.

ఒక విధంగా… ప్రపంచంలోని అత్యంత భారీ ఆయుధాలున్న నాన్-స్టేట్ గ్రూపుల్లో ఒకటైన హిజ్బుల్లా ఇప్పటివరకు తన ఆయుధాల్లో కొన్నింటిని మాత్రమే ఉపయోగించినట్లు చెబుతోంది. యూఎస్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, వరల్డ్ ఫ్యాక్ట్‌బుక్ ప్రకారం.. ఇజ్రాయెల్‌లోని అన్ని ప్రాంతాలపై దాడి చేయగల రాకెట్లు హిజ్బుల్లా దగ్గర ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఖచ్చితమైన టార్గెట్ ఛేదించగల క్షిపణులు, డ్రోన్‌లు, యాంటీ ట్యాంక్, యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్, యాంటీ షిప్ క్షిపణులు కూడా ఉన్నాయి. హిజ్బుల్లా దగ్గరున్న ఆయుధాల్లో చాలా వరకూ ఇరానియన్, రష్యన్, చైనీస్ ఆయుధాలే. 2006లో ఇజ్రాయెల్‌తో జరిగిన యుద్ధంలో హిజ్బుల్లా దాదాపు 4 వేల మందిని కాల్చింది. దీనికి ఎక్కువగా 30 కిమీ ఛేదించగల కటియుషా తరహా క్షిపణులు వాడారు. ఇక, లెబనాన్‌లో వీరికున్న వ్యవస్థలతో రాకెట్‌లను తిరిగి అమర్చగల సామర్థ్యం కూడా ఉంది.

వీళ్ల దగ్గర.. హిజ్బుల్లా రాడ్ అని పిలిచే అరబిక్ ఫర్ థండర్, ఫజ్ర్ అనే డాన్, భూకంప రాకెట్‌ల వంటి ఇరానియన్ మోడళ్లు ఉన్నాయి. ఇవి కటియుషాస్ కంటే ఎక్కువ శక్తివంతమైన పేలోడ్, ఎక్కువ శ్రేణిని కలిగి ఉంటాయి. అక్టోబరు నుండి గాజా చేస్తున్న యుద్ధంలోఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా ప్రయోగించిన రాకెట్లలో 300 నుండి 500 కిలోల పేలుడు పేలోడ్‌తో కూడిన కటియుషాస్, బుర్కాన్ క్షిపణులు ఉన్నాయి. ఈ ఏడాది జూన్‌లో మొదటిసారిగా ఉపయోగించిన ఫలాక్ 2 రాకెట్లు గతంలో ఉపయోగించిన ఫలక్ 1 కంటే పెద్ద వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలవు. ఇక, రష్యా తయారుచేసిన కార్నెట్ అని పిలిచే గైడెడ్ యాంటీ-ట్యాంక్ మిసైళ్లు కూడా హిజ్బుల్లా దగ్గర ఉన్నాయి. ఇజ్రాయెల్ స్పైక్ క్షిపణి ఆధారంగా రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా ఇరాన్ తయారు చేసిన ఆయుధాలైన అల్మాస్ క్షిపణి కూడా హిజ్బుల్లా ఆయుధాల్లో భాగంగా ఉన్నాయి.

Also Read: ఇజ్రాయెల్, హిజ్బుల్లా వార్‌కు.. ఈజిప్ట్ చర్చలకు లింక్ ఏంటి?

హిజ్బుల్లా దగ్గరున్న యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ క్షిపణులు కూడా చాలా ప్రభావవంతమైనవి. ఇప్పిటికే హిజ్బుల్లా అనేక సార్లు ఇజ్రాయెలీ డ్రోన్‌లను ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే ఈ క్షిపణులను ఉపయోగించి కూల్చివేసింది. ఇజ్రాయెలీ హీర్మేస్ 450, హీర్మేస్ 900 డ్రోన్‌లను ఇవి కూల్చేశాయి. అలాగే, ఒక సందర్భంలో.. హిజ్బుల్లా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలపై కాల్పులు జరిపి, అది ఏ రకమైన ఆయుధాన్ని ఉపయోగించిందనది స్పష్టం చేయలేదు. ఇప్పుడు అలా ప్రపంచానికి తెలియని ఆయుధాలు కూడా హిజ్బుల్లా దగ్గర ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక, హిజ్బుల్లా వన్-వే పేలుడు డ్రోన్‌లతో ఇప్పటికే అనేక దాడులకు పాల్పడింది. బాంబులను పడేసి లెబనాన్‌కు తిరిగి వచ్చే డ్రోన్‌లు కూడా ఉన్నాయి. కొన్ని దాడుల్లో, ఈ డ్రోన్‌లు ఇజ్రాయెల్ వైమానిక దళాన్ని దారి మరల్చడానికి కూడా ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక, హిజ్బుల్లా ఆయుధాగారంలో స్థానికంగా సమీకరించిన అయౌబ్, మెర్సాడ్ నమూనాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని చౌకగానే కాకుండా ఎక్కువగా ఉత్పత్తి చేయడం సులభమని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే, హిజ్బుల్లా దగ్గరున్న యాంటీ షిప్ క్షిపణుల ద్వారా 2006లో తీరానికి 16 కిమీ దూరంలో ఉన్న ఇజ్రాయెల్ యుద్ధనౌకను ఢీకొట్టాయి. అయితే, 2006 యుద్ధంలోనే 300 కిమీ పరిధి కలిగిన రష్యా-నిర్మిత యాఖోంట్ యాంటీ షిప్ క్షిపణిని కూడా హిజ్బుల్లా కొనుగోలు చేసింది. అయితే, హిజ్బుల్లా మాత్రం తమ వద్ద ఆ ఆయుధం ఉన్నట్లు ధృవీకరించట్లేదు. నిజానికి, హిజ్బుల్లా దగ్గర 500 కిమీ రేంజ్ ఉన్న మిస్సైళ్లు ఉన్నాయని అందరూ ఒప్పుకుంటారు. ఇప్పుడు, వీటన్నింటితో హిజ్బుల్లా రెడీగా ఉంది. అయితే, ఈ యుద్ధం వల్ల హిజ్బుల్లాకు ఆయుధాలు సమకూరుస్తూ… పెంచి పోషిస్తున్న ఇరాన్ ఎక్కువ లాభపడుతుందని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు.

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×