EPAPER

Medigadda: కూలిన నిర్మాణాలు.. నిధులు నీళ్లపాలు..! పదేళ్ల ప్రభుత్వ నిర్మాణాల వైఫల్యాలపై స్పెషల్ స్టోరీ

Medigadda: కూలిన నిర్మాణాలు.. నిధులు నీళ్లపాలు..! పదేళ్ల ప్రభుత్వ నిర్మాణాల వైఫల్యాలపై స్పెషల్ స్టోరీ

– నాణ్యతా లోపాలతో నిర్మాణ వైఫల్యాలు
– పైసలు పోయినా ప్రజలకు ప్రయోజనం నిల్
– చిన్న వంతెన నుంచి కాళేశ్వరం దాకా లోపాలమయం
– ఎన్ని జరిగినా నిర్మాణ సంస్థలపై చర్యలేవి?
– వాటా వచ్చిందని మొద్దు నిద్రలోకి జారుకున్నారా?
– పదేళ్ల ప్రభుత్వ నిర్మాణ వైఫల్యాలపై స్వేచ్ఛ స్పెషల్


Kaleshwaram Project: ప్రభుత్వ నిర్మాణ పనుల ప్రయోజనం అంటే దీర్ఘకాలికం. కానీ, గత పదేళ్లుగా ఎన్నో లోపాలు వెలుగుచూశాయి. నాణ్యతతో సంబంధం లేదు. నిధులు వచ్చాయా, పనులు చేశామా, బిల్లులు తీసుకున్నామా అన్నట్టుగా సాగింది బీఆర్ఎస్ పాలన. వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం పోసి చేసిన నిర్మాణాలు అనేకం నిర్మాణం సమయంలోనే కుప్పకూలిపోయి నాణ్యతలోని డొల్లతనాన్ని బయటపెట్టాయి. దీర్ఘకాల లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణాలు చెపట్టిన అనేక కట్టడాలు నిర్మాణ దశలో కొన్ని, నిర్మాణం పూర్తి అయ్యి ప్రారంభం అయిన కొంతకాలానికే ఇంకొన్ని నేలమట్టం అయ్యాయి. ములుగు జిల్లాలోని జంపన్న వాగుపై నిర్మాణం చేసిన వంతెన మొదలుకొని నల్లగొండ జిల్లాలోని సుంకిశాల ప్రాజెక్ట్ వరకు కూలిపోయిన తీరు చూస్తే నాటి ప్రభుత్వ నిర్లక్ష్యం ఏంటో అర్థం అవుతుంది. పర్యవేక్షణ లేక వాటాల మత్తులో మునిగిన ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్యం కారణంగా అనేక మంది గుత్తేదారులు ఇష్టారాజ్యంగా నాణ్యత లేకుండా నిర్మాణాలు చేపట్టారనే ఆరోపణలు ఉన్నాయి. సుమారు రూ.లక్ష కోట్ల పెట్టుబడితో హడావుడిగా నిర్మాణం చేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిస్థితి ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఇలా అనేక వంతెనలు, నిర్మాణాలు నాణ్యత లేక కుప్పకూలిన ఘటనలపై స్వేచ్ఛ ప్రత్యేక కథనం.

ప్రాజెక్ట్ ఏదైనా.. నాణ్యతా లోపాలే!


రాజుల సొమ్ము రాళ్ళ పాలు అనేది నాటి నానుడి. కానీ, ఇప్పుడు ప్రజల సొమ్ము పాలకుల పాలు అన్నట్టుగా తయారైంది. ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలు, మన్నికతో సంబంధం లేదు. ప్రభుత్వ ఖజానా ఖాళీ అయినా ఫర్వాలేదు. కట్టిన కట్టడాలు, చేసిన నిర్మాణాలు ఏమైనా ఫర్వాలేదు. ప్రజా ప్రయోజనాలు మట్టిలో కలిసినా, ప్రజల ప్రాణాలు గాల్లో కలిసినా, మనం బాగున్నామా, మన ఖజానా నిండిందా అన్నట్టుగానే బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యవహారం నడిచింది. కాళేశ్వరం వంటి పెద్ద ప్రాజెక్టు మొదలుకుని గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన చిన్న నిర్మాణాల వరకు ఎక్కడ చూసినా నాణ్యత లేమి కనబడుతుంది. గ్రామాల్లో వేసిన సీసీ రోడ్లు, నిర్మాణం చేసిన మురికి కాలువలు మొదలుకుని వాగులపై కట్టిన భారీ వంతెనల వరకు లోపాలమయం. కోట్లాది రూపాయలతో వాగులపై నిర్మాణం చేసిన చెక్ డ్యాంలు పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి. అనేక భవనాలు చిన్నపాటి వర్షం వస్తే కురిసే దుస్థితిలో ఉన్నాయి. గ్రామాల్లో రోడ్లు కొట్టుకుపోయి ఇసుక, కంకర మిగిలాయి.

మూణ్ణాళ్ల ముచ్చటగా దొడ్ల వంతెన

ములుగు జిల్లా ఏటూరునాగరం మండలం దొడ్ల – కొండాయిల మధ్య జంపన్న వాగుపై వంతెన లేక ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం జంపన్న వాగు పొంగి ప్రవహిస్తే వాగు అవతల ఉన్న కొండాయి సహా అనేక గ్రామాలకు కనీసం కాలినడకన వెళ్ళే దారికూడా లేకుండపోయింది. ఆ సమయంలో గ్రామాలకు వైద్య సదుపాయం, నిత్యావసర సరుకుల రవాణా లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతారు. అనేక దశాబ్దాలుగా వంతెన నిర్మాణం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. చివరికి 2015లో కల సాకారం అయ్యి రూ.5 కోట్లతో వాగుపై వంతెన నిర్మాణం చేసారు. నిర్మాణం పూర్తి అయిన కొంతకాలానికే ప్రజల సంతోషం విచారంగా మారింది. వంతెన నాణ్యత లేమి కారణంగా కుంగిపోయింది. 2022లో వచ్చిన వరదల్లో కొట్టుకుపోయింది. 2023 రూ.20 లక్షలతో వేసిన తాత్కాలిక రోడ్డు కూడా కొట్టుకుపోయింది. తరువాత రూ.35 లక్షలతో నిర్మాణం చేసిన తాత్కాలిక ఇనుప వంతెన కూలిపోయింది. ఇన్ని కోట్ల రూపాయల ప్రజాధనం వాగులో కొట్టుకుపోయింది.

గాలికే కూలిన ఓడేడు వంతెన

ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాలను కలిపే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మానేరుపై మంథని – ఓడేడు వంతెన నిర్మాణం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం 2016లో రూ.47.40 కోట్లతో నిర్మాణ పనులు ప్రాంరంభించింది. ఇంకా వంతెన నిర్మాణం పనులు పూర్తి కాలేదు. అయితే, 2024 ఏప్రిల్‌లో గాలికే నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. అనేక దశాబ్దాలుగా వంతెన లేక రాకపోకలకు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వంతెన నిర్మాణం అవుతుంది తమ సమస్య పరిష్కారం అవుతుందని ఆశ పడ్డ ప్రజలకు నిరాశే ఎదురైంది. నిర్మాణంలో ఉన్న వంతెన గాలికే కూలిపోవడం చూసి షాకయ్యారు.

టేకుమట్ల బ్రిడ్జికి శాపం

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపేల్లి మండలం టేకుమట్ల, రాఘవరెడ్డి పల్లి గ్రామాల మధ్య చలి వాగు ఉంది. దీనిపై వంతెన లేక వరంగల్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లోని అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రూ.23 కోట్లతో చలి వాగుపై వంతెన నిర్మాణం చేపట్టారు. నిర్మాణం చివరి దశకు చేరుకుంటున్న సమయంలోనే గత ఏడాది వచ్చిన వరదకు వంతెన కూలిపోయింది. రూ.5కోట్లతో పునర్ నిర్మాణ పనులు మొదలు పెట్టారు.

వరద స్థాయిని తట్టుకోలేని స్థితిలో మొరంచపల్లి వంతెన

బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత భూపాలపల్లి, హనుమకొండ రహదారి విస్తరణలో భాగంగా మొరంచపల్లి వద్ద వాగుపై కొత్త వంతెన నిర్మాణం చేశారు. పాత వంతెన పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. అయితే, కొత్తడి వరద స్థాయికి తగినట్టుగా నిర్మాణం చేయకపోవడంతో గత వర్షకాలం వచ్చిన వరదకు ఇరువైపులా కొట్టుకుపోయింది.

Also Read: HYDRA: నెక్లెస్ రోడ్డు తొలగిస్తారా?: హైడ్రాపై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

కూలిపోయిన సుంకిశాల రక్షణ గోడ

నల్లగొండ జిల్లాలో నాగార్జున సాగర్ జలాశయానికి ఆనుకుని నిర్మాణం చేస్తున్న సుంకిశాల ప్రాజెక్ట్ ఇంటెక్ వెల్ రక్షణ గోడ ఈ నెల 2న కుప్పకూలిపోయింది. రూ.20 కోట్ల మేర నష్టం వాటిల్లింది. సుంకిశాల షెడ్‌లో ఒక షిప్ట్‌కు 100 మంది కార్మికులు పని చేస్తారు. గోడ కూలిన సమయంలో కూలీలు ఎవ్వరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. కార్మికులు పని చేసే సమయంలో కూలీలు ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం, నాణ్యత లేని పనుల వల్లే ఈ ప్రమాదం జరిగిందని అనేక విమర్శలు వస్తున్నాయి. ఇంకా కాళేశ్వరం సంగతి సరేసరి, మేడిగడ్డ పిల్లర్లు కుంగగా, ఈ ఏడాది నీటి నిల్వ సాధ్యపడలేదు. ఇంకా మిగిలిన ప్రాజెక్టుల నిర్మాణాలపైనా అనుమానాలు ఉన్నాయి.

నిర్మాణాలపై న్యాయ విచారణ చేపట్టాలి

దీర్ఘకాలం మన్నికగా ఉండాలని ప్రజాధనం పోసి నిర్మాణం చేసిన అనేక నిర్మాణాలు ఇలా అర్ధాంతరంగా కూలిపోవడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. ప్రజాధనం వృధా కావడంతోపాటు అనేక సంవత్సరాలుగా పేరుకుపోయిన సమస్య అలాగే మిగిలిపోతోంది. నిర్మాణంలో జరిగిన లోపాలను సరి చేసేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టకపోవడంపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి ప్రభుత్వమైనా గతంలో నాణ్యత లేకుండా నిర్మాణాలు జరిగి కూలిపోయి పనికి రాకుండా పోయిన వాటిపైన న్యాయ విచారణ జరిపి, నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడంతో పాటు మళ్లీ ఇలాంటివి రీపీట్ కాకుండా చూసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×