EPAPER

Future City: రేవంత్ కలల ప్రాజెక్ట్.. ఫ్యూచర్ సిటీ..!

Future City: రేవంత్ కలల ప్రాజెక్ట్.. ఫ్యూచర్ సిటీ..!

CM Revanth Reddy: రాజధాని అంటే ఒకప్పుడు జంట నగరాలే! ఆ తర్వాత ఐటీ బూమ్‌తో సైబరాబాద్‌ రూపంలో మూడో మహానగరం ఆవిష్కృతమైంది. ఈ క్రమంలోనే 2007లో 12 మున్సిపాలిటీలు, 8 గ్రామపంచాయతీలతో జీహెచ్ఎంసీ ఏర్పాటైంది. దాదాపు కోటి జనాభా ఉండగా 150 డివిజన్లు ఏర్పాటు చేశారు. ఈ 150 డివిజన్లలో బల్దియాకు వచ్చిన నిధులతో, పెరిగిన ఆదాయంతో నగరంలో మంచి మౌలిక సదుపాయాలు ఏర్పడ్డాయి. కానీ హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న 7 కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీలు, అనేక గ్రామాలకు మాత్రం అభివృద్ధిలో చెప్పుకోదగినంతగా భాగస్వామ్యం దక్కలేదు. ఈ నేపథ్యంలోనే గ్రేటర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి గత ఎనిమిది నెలలుగా ప్రత్యేక దృష్టి సారిస్తూ వచ్చారు. అలాగే, రాజధాని పరిధిలో ప్రస్తుతం 5 మాస్టర్‌ప్లాన్లు ఉండటంతో గందరగోళ పరిస్థితులున్న నేపథ్యంలో నగరాభివృద్ధి, విస్తరణ, భద్రత కోసం స్పష్టమైన విధానాలతో ముందడుగు వేశారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్ పరిధి నుంచి రీజినల్ రింగ్ రోడ్ వరకు విస్తరించే దిశగా ముందడుగు వేశారు. ఈ క్రమంలోనే ముచ్చెర్ల కేంద్రంగా ప్యూచర్ సిటీ పేరుతో మరో మహా నగర నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుంది.


మారిన పరిస్థితులు, పెరిగిన జనాభా, అందివస్తున్న సాంకేతికత, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముచ్చర్ల కేంద్రంగా ప్యూచర్ సిటీ పేరుతో మరో నగరాన్ని నిర్మించాలని రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో రాబోతున్న ఈ నగర నిర్మాణం పూర్తయితే, రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగరం అంతర్జాతీయ వేదిక మీద సరికొత్త గుర్తింపును పొందనుంది. ఫ్యూచర్ సిటీలో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, మెడికల్, టూరిజం, స్పోర్ట్స్, సాఫ్ట్‌వేర్, ఫార్మా హబ్‌లు రానుండటంతో ఇక్కడ పెట్టే పెట్టుబడికి భద్రత చేకూరటమే గాక ఎంతోమందికి ఉపాధి లభించనుంది. మరోవైపు, తెలంగాణలో వ్యాపారాలు, పెట్టుబడుల విస్తరణను సులభతరం చేసేలా కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధం కావటంతో తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు రానున్నాయి. మొత్తంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాబోయే రోజుల్లో రాష్ట్ర ఖజానాకు స్థిరమైన రెవెన్యూ సమకూరే అవకాశాలూ స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మరోవైపు.. తెలంగాణకు పెట్టుబడులను రాబట్టటమే లక్ష్యంగా సాగిన సీఎం అమెరికా, దక్షిణ కొరియా పర్యటన విజయవంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పదిరోజుల పర్యటనలో తెలంగాణకున్న అవకాశాలు, ఆకర్షణల గురించి సీఎం ఆయా దేశాల్లోని పలు బహుళజాతి సంస్థల ప్రతినిధులకు వివరించారు. రూ. 16 వేల కోట్ల రూపాయల పెట్టుబడిల ఆకర్షణే లక్ష్యంగా విదేశీ పర్యటకు వెళ్లిన సీఎం బృందం అంచనాలకు మించి అమెరికా నుండి 31,532 కోట్ల రూపాయల పెట్టుబడులు దక్షిణ కొరియా నుండి 4500 కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు కుదురుచుకోగలిగారంటే దానికి ప్రధాన కారణం తెలంగాణ ముఖ్యమంత్రి ప్రతిపాదిస్తున్న ఫ్యూచర్ సిటీ అని చెప్పక తప్పదు. అంతేగాక, విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన రోజే.. పెట్టుబడి ఒప్పందాలలో భాగంగా హైదరాబాదులో 15 వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కాగ్నిజెంట్ ఐదవ క్యాంపస్ శంకుస్థాపన చేయటం జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తమ పోటీ దేశంలోని ఇతర రాష్ట్రాలతో కాదని, తాము అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ప్రకటించారు. రాబోయే పదేళ్లలో తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టాలంటే హైదరాబాదు నగరాన్ని గ్రోత్ ఇంజన్‌గా పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని అభిప్రాయపడ్డారు. కోటికి పైగా జనాభాతో ఉన్న రాజధాని నగరం ఏటా రూ. 45 వేల కోట్ల రెవెన్యూను అందించటమే గాక, లక్షలాదిమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న నేపథ్యంలో నగరాన్ని మరింతగా విస్తరించి, ఇప్పుడున్న సదుపాయాలను రెట్టింపు చేయటం ద్వారా ఆర్థికంగా రాష్ట్రాన్ని మరింత బలోపేతం చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగటం ఖచ్చితంగా సానుకూల పరిణామమే.


Also Read: Bandru Shobha Rani: బయట తిట్టి.. లోపల విచారం వ్యక్తం చేసినట్టు నటిస్తే ఎలా కేటీఆర్? : బండ్రు శోభారాణి

స్పోర్ట్స్, మెడికల్, ఏఐ హబ్‌ల ఏర్పాటుతో బాటు వాటిని శంషాబాద్ విమానాశ్రయంతో అనుసంధానించేలా స్పెషల్ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేయటం వల్ల ఆ ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ ఏర్పడనుంది. మరోవైపు, ముచ్చెర్లలోని యూనివర్సిటీ ఏర్పాటుతో రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఏర్పడే పరిశ్రమలకు అవసరమైన మానవ వనరుల లభ్యత మెరుగుపడనుంది. అదే సమయంలో తెలంగాణలోని గ్రామీణ యువతకు మరిన్ని అవకాశాలు దక్కనున్నాయి. ఫోర్త్ సిటీ ప్రతిపాదన పట్ల వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాతో బాటు స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయాలు ఆసక్తి కనపరచటమే గాక, చార్లెస్ స్క్వాబ్ ఆర్‌సిజిఎం లాంటి సంస్థలు కూడా మొదటిసారి అమెరికా దాటి ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టటానికి సంసిద్ధతను తెలియజేయడం శుభ పరిణామంగానే భావించాలి. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టటానికి దక్షిణ కొరియాకు చెందిన ఫాక్స్ కాన్ సంస్థ, ఫ్యాషన్ సిటీ ఏర్పాటుకి కొబిటా లాంటి సంస్థలు సంసిద్ధతను వ్యక్తం చేయటమూ అలాంటిదే.

మొత్తంగా చూస్తే.. ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని ముఖ్యమంత్రి తన కలల ప్రాజెక్టుగానే భావిస్తున్నారు కాబట్టే ఎప్పటికప్పుడు దాని పురోగతిపై నిర్ణయాలు తీసుకుంటూ, స్పష్టమైన కార్యాచరణతో ముందుకు పోతున్నారు. ఫోర్త్ సిటీ నిర్మాణానికి సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయటమే గాక సంబంధిత పనులు పూర్తిచేసేందుకు అధికారులనూ సంసిద్ధులను చేస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కుదుర్చుకున్న రూ. 40232 పెట్టుబడి ఒప్పందాలు, తాజా విదేశీ పర్యటనతో సమకూరనున్న రూ 35000 కోట్ల రూపాయల పెట్టుబడుల తాలూకూ ప్రణాళికలను ఫాలో‌అప్ చేసి, వీలున్నంత త్వరగా అవి కార్యరూపం దాల్చటానికి ఒక ఇన్వెస్ట్‌మెంట్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలనే నిర్ణయంతో తెలంగాణ పెట్టుబడుల ఆకర్షణలో మరింత ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. శివారు వరకు మెట్రోసేవలు, ఫ్యూచర్ సిటీ ఏర్పాటు, స్కిల్ వర్సిటీ నిర్మాణం, హైడ్రా సమకూర్చనున్న భధ్రతతో రాబోయే రోజుల్లో మన భాగ్యనగరం అంతర్జాతీయ వేదికల మీద మరింత సమున్నతంగా నిలబడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తెలంగాణ సమాజం ఆసక్తిగా, సానుకూలమైన దృష్టితో గమనిస్తోంది. ఈ బృహత్ ప్రయత్నం సఫలీకృతం కావాలని, రాబోయే రోజుల్లో తెలంగాణ దేశంలోనే ఒక ప్రబల ఆర్థిక శక్తిగా ఎదగాలని ఆకాంక్షిద్దాం.

డాక్టర్ తిరునహరి శేషు
పొలిటికల్ ఎనలిస్ట్
కాకతీయ విశ్వవిద్యాలయం
9885465877

Related News

Tirumala Laddu Politics: లడ్డూ కాంట్రవర్సీ.. దేవదేవుడి ప్రసాదంపైనే ఇన్ని రాజకీయాలా ?

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Big Stories

×