EPAPER

Telangana: అక్షర శరథి.. మన దాశరథి..!

Telangana: అక్షర శరథి.. మన దాశరథి..!

Dasarathi Rangacharyulu: అక్షరమే ఆయన ఆయుధం. తెలంగాణ సాయుధ పోరాటంలో రొమ్మువిరిచి నిలబడిన అసమాన వీరుడు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటిన ద్రష్ట. తన రచనలతో నిజాం సంస్థానంలోని యువతను చైతన్య పరచి పోరుబాట పట్టించిన అక్షర వాచస్పతి. పోరాటంలోనే కాదు.. సాహిత్య సాగరంలోనూ ఆయన ఉరికే కెరటమే. తెలంగాణ సాయుధ పోరాటకాలంలో తుపాకి పట్టి మృత్యువును అత్యంత సమీపంలో నగ్నంగా చూసిన యోధుడు. ‘వేదం జీవన నాదం’ అంటూ వేదాలను పామరులకు అర్థమయ్యేలా తెలుగు వచనంలో అందించిన సాహితీవేత్త. అభ్యుదయ సమాజం కోసం తాపత్రయపడిన ప్రగతిశీలవాది. ఆయనే.. దాశరథి రంగాచార్య. నేడు ఆ మహామనీషి జయంతి.


రంగాచార్యులు గారిది ఒక ఆశ్చర్యకరమైన ధృక్పథం. వారిని గుర్తుచేసుకోగానే ఊర్ధ్వపుండ్రాలు ధరించిన సంప్రదాయ రూపం మనకు గుర్తుకొస్తుంది. విచిత్రంగా అదే సమయంలో ఆ రూపం వెనకాల ఉన్న మార్క్సిజం నిలువెత్తు మానవతలా దర్శనమిస్తుంది. కార్ల్ మార్క్స్‌ను మహర్షిగా ఆయన అభివర్ణించారు. నిజానికి మార్క్సిజం, సంప్రదాయం భిన్నధ్రువాలు. ఆ రెండింటి లక్ష్యం ఒక్కటే అయినా దారులు వేరు. అవి ఏనాటికీ కలవని రైలు పట్టాలు. కానీ, దాశరథి రంగాచార్యులు ఆ రెండు వాదాలనూ ఒడిసి పట్టుకుని, ఒక బాటన నడిపించారు. ఆయన సంప్రదాయ కుటుంబ నేపథ్యం, ఉద్యమ జీవితాలే ఆయనకు ఆ సామార్థ్యాన్ని, విలక్షణతను, ఆమోదయోగ్యతను కలిగించాయనిపిస్తుంది.

దాశరథి రంగాచార్య 24 ఆగస్టు, 1928లో జన్మించారు. తల్లిదండ్రులు వెంకటాచార్యులు, వెంకటమ్మ. వీరి పూర్వీకులది భద్రాచలం. విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించిన భగవద్రామానుజార్యుల అంతరంగ శిష్యులతో ఒకరైన దాశరథి అనే శిష్యుని వారసుల్లో వీరి కుటుంబమూ ఒకటి. రంగాచార్యుల తాత లక్ష్మణాచార్యులు గొప్ప విద్వాంసులు, ఆయుర్వేద వైద్యులు. భద్రాచల రామాలయంలో అర్చకుడిగా ఉంటూ వైద్యం కూడా చేసేవారు. ఆయన కుమారుడు.. వెంకటాచార్యులు. కాలక్రమంలో వీరి కుటుంబం భద్రాచలం నుంచి నేటి మహబూబాబాద్ జిల్లాలోని చిన్నగూడురు గ్రామానికి చేరింది. వెంకటాచార్యులు మద్రాసులో వైద్యవిద్య చదివి, చిన్నగూడూరు చేరి అక్కడే వైద్యసేవలు అందించేవారు. అదే సమయంలో తండ్రి నుంచి సంస్కృత, తమిళ, తెలుగు భాషల్లో ఉద్దండ పండితులుగా గుర్తింపుపొందారు. తమిళం నుంచి అనేక ప్రబంధాలను తెనిగించారు. అటు.. తల్లి తరపు తాతగారైన భట్టార్‌ దేశికులు కూడా సంస్కృతాంధ్రాల్లో పండితులే.


Also Read: KTR: రేపు మహిళా కమిషన్ ముందుకు కేటీఆర్

భూస్వాములు, పెత్తందార్ల చర్యలను సహించలేని దాశరథి తండ్రిగారు.. నేటి మహబూబాబాద్ జిల్లాలోని గార్లకు మకాం మార్చారు. అక్కడే రంగాచార్య విద్యాభ్యాసం కొనసాగింది. చదువులో చురుకైన విద్యార్థిగా రాణించారు. ఆ రోజుల్లో నిజాం రాజ్యం శాశ్వతంగా నిలిచి ఉండాలని రోజూ బడిలో ప్రతిజ్ఞ చేయించేవారు. అలాగే, విద్యార్థులు కుచ్చు రూమీ టోపీ పెట్టుకోవటం తప్పనిసరి. ఈ రెండు రూల్స్‌కు వ్యతిరేకంగా ఆరవ తరగతిలో ఉండగానే, తోటి విద్యార్థులను కూడగట్టి నిజాంకు వ్యతిరేకంగా సమ్మె చేశారు. దీంతో బడి నుంచి ఆయనను బహిష్కరించటమే గాక నిజాం సంస్థానంలోని ఏ బడిలోనూ చేర్చుకోరాదని విద్యాశాఖ ఫర్మానా జారీ చేసింది. పన్నెండవ ఏట నుంచే నిజాం వ్యతిరేక ప్రజా పోరాటాలలో పాల్గొన్నారు. దీంతో ప్రభుత్వం 16 ఏళ్ల జైలు శిక్ష వేసింది. కానీ, అప్పటికి ఆయనకు మైనారిటీ తీరకపోవటంతో ఆ జైలుశిక్ష తప్పిపోయింది. 1946 – 1951 మధ్యకాలంలో అజ్ఞాతంలో ఉంటూ నిజాం వ్యతిరేక పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకి పట్టి ప్రత్యక్ష పోరాటం చేశారు. అనంతరం 1951లో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించారు. తరువాత 1957లో సికింద్రాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌లో చేరి, 32 ఏళ్లు ఉద్యోగం చేస్తూనే బీఏ, ఎల్‌ఎల్‌బీ చేశారు. 1988లో అసిస్టెంట్‌ ‌కమిషనర్‌గా ఉద్యోగ విరమణ చేశారు.

రంగాచార్యులు జీవితంలో ప్రతి దశలోనూ సాహిత్యంలో పలు ప్రయోగాలు చేశారు. తెలంగాణ సాయుధపోరుకు ముందు తెలంగాణ పల్లెల్లో ప్రజల జీవితాలను వస్తువుగా.. 1964 అక్టోబర్ 13న ఒక నవలను ప్రారంభించి 27 రోజుల్లో చిల్లరదేవుళ్లు నవల రాశారు. అలాగే మోదుగుపూలు, జనపదం, రానున్నది ఏది నిజం? వంటి నవలలతో సహా 50కి పైగా పుస్తకాలు రాశారు. రామాయణం, భారతం, భాగవతం, నాలుగు వేదాలను సంస్కృతం నుంచి వ్యాఖ్యాన సహితంగా ప్రతికృతి చేసిన ఏకైక రచయితగా రంగాచార్య చరిత్రకెక్కారు. శూద్రులు వేదాలను చదువరాదని వేదాలలో ఎక్కడాలేదని, వేదం భారతజాతికి దక్కిన జ్ఞాన భాండాగారమని, అది అందరిదీ అని ప్రకటించారు. కమ్యూనిజం, మార్క్సిజంల స్ఫూర్తిని తనదైన దృక్కోణంలో అర్థం చేసుకుని, నమ్మి, చివరివరకూ తన జీవితంలో ఆ విలువలను పాటించారు గానీ అందులోని నాస్తికత్వాన్ని విసర్జించారు. సంపద, జ్ఞానం ఏ ఒక్కరి చేతిలో బందీ కాకూడదని నమ్మిన వ్యక్తిగానే వేదాలను అనువాదం చేసి పామరులకూ అందించారు. కుల, వర్గ, లింగ బేధాలను పాటించని వ్యక్తిగా వేదాల అనువాద పుస్తకావిష్కరణ వేళ.. ఒక మహిళకు, ఒక దళితుడికి, ఒక చెంచు యువకుడికి తొలి పుస్తకాలు అందించి, వారిని పూలమాలతో సత్కరించారు. 1998లో ఈ పుస్తకం విడుదలకు ముందే.. 2 వేల కాపీలకు (వాటి విలువ రూ. 30 లక్షలు) ముందస్తు ఆర్డర్లు రాగా, పుస్తకం విడుదలైనప్పుడు జనం పుస్తకాల షాపుల ముందు బారులు తీరి మరీ కొనుక్కున్నారు.

Also Read: Double Ismart Losses: భారీ నష్టాల్లో హనుమాన్ ప్రొడ్యూసర్‌.. కొత్త ఆఫర్ తీసుకొచ్చిన పూరీ!

తన ఆత్మకథను ‘జీవనయానం’ పేరుతో రచించారు. ఇందులో తన జీవితంలోని ఆరాట పోరాటాలు, కలలు కన్నీళ్లు, గెలుపోటముల మధ్య సంఘర్షణను తనదైన శైలిలో చిత్రీకరించారు. తన జీవితంలో ఎదురైన బీభత్సాలను, భయాలను, చేసిన సాహసాలను, సాధించిన విజయాలను, అనుభవించిన విషాదాలను, ఆస్వాదించిన ఆనందాలను పామరులకు సైతం అర్థమయ్యేలా రాశారు. 70 ఏళ్ల తెలుగుజాతి జీవన చిత్రణ ఇందులో కనిపిస్తుంది. స్వాతంత్ర్య పోరాటం, రజాకార్ల దౌష్టీకాలు, తెలంగాణా సాయుధపోరాటం, ప్రత్యేక తెలంగాణ, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాలు, సాహిత్యోద్యమాలు…అన్నీ ఇందులో ఉన్నాయి. ఈ పుస్తకాన్ని చదవటమంటే తెలంగాణ సమాజాన్ని అన్ని కోణాలలో సమగ్రంగా చదివినట్టు. భారతీయ తాత్త్వికత, దాని ఉత్కృష్టమైన మహోన్నత రూపాన్ని ఆధునిక దృక్పథంతో వ్యాఖ్యానించి, సులభశైలిలో అవగతంచేసే ఆయన చేసిన రచనలు తెలుగుజాతికి దక్కిన అపూర్వ సంపద. సంప్రదాయాల పునాదులమీద ఎదిగిన అభ్యుదయ సాహిత్య గోపురమైన దాశరథి రంగాచార్యులు గారు 2015 జూన్‌ 8‌వ తేదీన పరమపదించారు. ఎవరేమన్నా… ఆయన ఒక ఆకాశమంత విశాల హృదయం ఉన్న నిరాడంబరమైన మనిషి. ‘సాహిత్యంతో ఉద్యమాలు పుట్టవు… ఉద్యమాలతోనే సాహిత్యం పుడుతుంది’ అని ప్రకటించిన దాశరథి రంగాచార్యులు తెలంగాణ సమాజానికి ఎన్నటికీ మార్గదర్శనం చేసే ఒక నిత్య చైతన్యస్ఫూర్తి.

– పీవీ శ్రీనివాస్
ఎడిటర్ ఇన్ చీఫ్, బిగ్ టీవీ

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×