EPAPER

Exclusive Story: జంతర్ మంతర్.. జన్వాడ ఫాంహౌస్ చూ మంతర్

Exclusive Story: జంతర్ మంతర్.. జన్వాడ ఫాంహౌస్ చూ మంతర్

– నరసింహా సినిమా డైలాగ్‌ మాదిరి కేటీఆర్ వ్యాఖ్యలు
– పెళ్లి కొడుకు అతనే.. షర్టు నాది అన్నట్టు జన్వాడ ఫాంహౌస్‌పై రియాక్షన్
– లీజుకు మాత్రమే తీసుకున్నానంటూ మాటలు
– ఈ మాట గతంలో హైకోర్టుకు ఎందుకు చెప్పలేదు?
– ఫాంహౌస్ దగ్గరలో భార్య పేరు మీద భూములు ఉన్నది నిజం కాదా?
– చుట్టుపక్కల బినామీ ల్యాండ్స్ లేవంటారా?
– జీవో 99 ప్రకారమే ముందుకు పోవాలన్న హైకోర్టు
– నిబంధనల ప్రకారమే కూల్చివేత ఉండాలని స్పష్టం
– ప్రదీప్ రెడ్డి పిటిషన్‌ను తోసిపుచ్చిన న్యాయస్థానం
– ఫాంహౌస్ పత్రాలు పరిశీలించనున్న హైడ్రా అధికారులు
– కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం


దేవేందర్ రెడ్డి, 9848070809

స్వేచ్ఛ-బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ టీం:


తెలంగాణలో చాలామంది లీడర్లకు ఫాంహౌస్‌లు ఉన్నాయి. కానీ, జన్వాడ ఫాంహౌస్ వెరీ వెరీ స్పెషల్. 111 జీవో పరిధిలో అక్రమంగా దీన్ని నిర్మించారనే ఆరోపణలున్నాయి. దీనిపై స్వేచ్ఛ-బిగ్ టీవీ పక్కా ఆధారాలతో ఫాంహౌస్ ఎవరిది? దాని చుట్టుపక్కల భూములు ఎవరివి అనేది బయటపెట్టింది. ఇప్పుడు హైడ్రా ఈ ఫాంహౌస్‌పై దృష్టి సారించిన నేపథ్యంలో, ఓనర్‌గా చెప్పుకుంటున్న ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో ఈ ఫాంహౌస్‌‌పై మరోసారి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

హైకోర్టులో వాదనలు.. పిటిషనర్‌కు షాక్

నగరంలో కబ్జాలపై దృష్టి పెట్టిన హైడ్రా, 111 జీవో పరిధిలోని అక్రమ కట్టడాలపై ఫోకస్ పెట్టింది. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న కట్టడాలపై కొరడా ఝులిపిస్తోంది. ఈ క్రమంలో జన్వాడ ఫౌంహౌస్ కూల్చోద్దంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రదీప్ రెడ్డి ఈ పిటిషన్ వేశాడు. జన్వాడ ఫౌంహౌస్ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉండడంతో తమ కట్టడాన్ని హైడ్రా కూల్చే అవకాశం ఉందని ముందస్తు పిటిషన్ దాఖలు చేశాడు. కూల్చకుండా స్టే ఇవ్వాలని కోరాడు. ప్రతివాదులుగా తెలంగాణ ప్రభుత్వం, హైడ్రా కమిషన్, రంగారెడ్డి కలెక్టర్, శంకర్ పల్లి రెవెన్యూ అధికారి, చీఫ్ ఇంజినీర్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులను చేర్చాడు. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం, హైడ్రా విధి విధానాలు ఏంటని ప్రశ్నించింది. ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేశారని, కమిటీ లీగల్ స్టేటస్‌ను ప్రశ్నించింది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని చెరువులు, కుంటలను కాపాడడమే హైడ్రా విధి అని ఏజీ హైకోర్టుకు వివరించారు. విచారణ అనంతరం, పిటిషనర్ వాదనను తోసిపుచ్చింది న్యాయస్థానం. కూల్చివేత నిబంధనల ప్రకారమే ఉండాలని స్పష్టం చేసింది. జీవో 99 ప్రకారం ముందుకు సాగాలని హైడ్రాను సూచించింది.

ఎవరీ ప్రదీప్ రెడ్డి?

ప్రదీప్ కన్‌స్ట్రక్షన్ ఓనర్ ప్రదీప్ రెడ్డి. పేరుకి జన్వాడ ఫాంహౌస్ ఓనర్. ఇది పక్కాగా ఇల్లీగల్ నిర్మాణం. కానీ, అందులో ఉండేది మాత్రం కేటీఆర్ కుటుంబం. అందుకు ప్రదీప్‌కి అనేక చోట్ల రియల్ ఎస్టేట్ క్లియరెన్స్‌లు ప్రతిఫలంగా అందాయి. సోమాజిగూడలో యూఎల్సీ ల్యాండ్‌ను మాజీ మేయర్‌తో కలిసి బెదిరించి క్లియర్ చేసుకున్నారు. ఈ ఫాంహౌస్‌ను కేటీఆర్‌కు లీజ్‌కి ఇచ్చి ప్రభుత్వంతో అనేక పనులు చేయించుకున్నాడు ప్రదీప్ రెడ్డి. అప్పటి ప్రభుత్వ పెద్దలతో సాగిన ఇతని ప్రయాణాన్ని రాస్తే అదో క్రైమ్ మహా కావ్యం అవుతుంది. తీస్తే బ్లాక్ బస్టర్ సినిమా అవుతుంది.

నాకేం సంబంధం లేదంటున్న కేటీఆర్

జన్వాడ ఫాంహౌస్‌పై హైకోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలోనే కేటీఆర్ దీనిపై స్పందించారు. తనకు ఎటువంటి ఫాంహౌస్ లేదన్నారు. అది తన మిత్రుడిదిగా చెప్పుకొచ్చారు. తాను కేవలం లీజ్‌కు మాత్రమే తీసుకున్నానని స్పష్టం చేశారు. ఫాంహౌస్‌పై హైడ్రా ఎటువంటి చర్యలు తీసుకున్నా తనకేం ఇబ్బంది లేదని, ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉంటే తప్పకుండా కూల్చవచ్చు అని, కావాలంటే తానే దగ్గరుండి కూలగొట్టిస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఎఫ్‌టీఎల్ పరిధిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకట స్వామి, గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫాంహౌస్‌లు ఉన్నాయని ఆరోపించారు.

Also Read: Panchayat Elections: గ్రామ పంచాయతీ ఎన్నికల తాజా అప్డేట్.. షెడ్యూల్ విడుదల

ఫాంహౌస్‌కు దగ్గరలో కేటీఆర్ భార్యకు భూములు

కేటీఆర్ ఈ ఫాంహౌస్‌లో ఉండడానికి ప్రత్యేక కారణం ఉంది. దీని వెనుకే ఉన్న సర్వే నెంబర్ 301లో ఆయన భార్య శైలిమ భూమిని కొనుగోలు చేశారు. అక్కడ పండ్ల తోటను వేశారు. ఆ భూమిలోకి వెళ్లాలంటే, ఫాంహౌస్‌కు వెళ్లే గేటులో నుంచే వెళ్లాలి. అంతేకాదు, శంకర్ పల్లికి వెళ్లే ప్రధాన రహదారి నుంచి కూడా శైలిమ భూమి మీదుగా ఫాంహౌస్‌కు ప్రత్యేకంగా మరో రోడ్డును నిర్మించారు. ఓవరాల్‌గా చూస్తే ఈ రెండు గేట్ల మధ్య ఉన్న స్థలం అంతా రకరకాల పేర్ల మీద ఉన్నా, అక్కడ వేసిన రోడ్లు, సెటప్‌ను చూస్తే మాత్రం కంట్రోల్ అంతా ఒక్కరిదే అని స్పష్టంగా అర్థమైపోతుంది. అంతేకాదు, ఫాంహౌస్ నుంచి మరో వైపున ఉన్న ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుకు కనెక్ట్ అయ్యేలా మరో రోడ్డును కూడా ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఎటువైపు నుంచి వచ్చినా ఫాంహౌస్‌కు వెళ్లొచ్చు.

గతంలో కోర్టునే తప్పుదోవ పట్టించిన వైనం

ట్రిపుల్ వన్ జీవో పరిధిలో ఉన్న జన్వాడలోని సర్వే నెంబర్ 311లో అక్రమంగా కేటీఆర్ ఫాంహౌస్ నిర్మించారంటూ గతంలో ఎన్జీటీలో ఫిర్యాదు చేశారు సీఎం రేవంత్‌ రెడ్డి. దీనిపై నిజానిజాలు తేల్చడానికి ఎన్జీటీ ఓ కమిటీని కూడా నియమించింది. ఆ కమిటీ రంగంలోకి దిగకుండానే హైకోర్టును ఆశ్రయించారు కేటీఆర్‌. తనకు ఆ ఫాంహౌస్‌తో ఎలాంటి సంబంధం లేదంటూ రిట్‌ పిటిషన్ వేశారు. అంతేకాదు, అది తనదంటూ ప్రదీప్‌ రెడ్డి కూడా హైకోర్టులో పిల్ వేశాడు. 2014లో 111 జీవో నిబంధనలకు లోబడి, పంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకుని ఆ భవనాన్ని కట్టారని, దాన్నే తాను కొనుగోలు చేశానన్నాడు. ఒకవేళ అభ్యంతరాలుంటే పర్మిషన్ తీసుకున్న ఆర్నెళ్లలోనే చెప్పాలి తప్ప, ఇప్పుడు అక్రమమని చెప్పడం కరెక్ట్ కాదంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. అసలు ఓనరే కాని కేటీఆర్‌కు నోటీసులు ఎలా ఇస్తారంటూ ఆయన న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. వీళ్ల వాదనలతో ఏకీభవించిన జస్టిస్ రాజశేఖర్‌ రెడ్డి, జస్టిస్ నవీన్‌ రావు ధర్మాసనం ఎన్జీటీకి ఈ కేసులో జోక్యం చేసుకునే అధికారం లేదంటూ తీర్పు చెప్పింది. దీంతో ఈ కేసు క్లోజ్ అయ్యింది. అయితే, 2020లో బాల్క సుమన్ చెప్పిన మాటలను బట్టి, నాలుగేళ్ల క్రితమే కేటీఆర్ ఆ ఫాంహౌస్‌ను లీజ్‌కు తీసుకున్నట్టు తేలింది. అప్పటి నుంచి ఆయన కుటుంబం అక్కడే ఉంటోంది. ఇటు, రేవంత్‌ రెడ్డిపై నార్సింగి పోలీసులు పెట్టిన కేసులోనూ కేటీఆర్ అక్కడే ఉంటున్నారన్న విషయాన్ని ప్రస్తావించారు. కాబట్టి కేటీఆర్ తనకు సంబంధం లేదంటూ కోర్టుకు చెప్పిన మాట అవాస్తవం. ఆయన దాన్ని లీజుకు తీసుకుని ఉంటున్నానన్న విషయాన్ని కోర్టుకు చెప్పకుండా దాచి పెట్టారు. వాస్తవానికి ఈ భూములు సత్యం రామలింగరాజు కుటుంబానివి. సత్యం స్కామ్ తర్వాత ఐటీ ఆధీనంలోకి వెళ్లాయి. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక, జన్వాడలోని భూములు ఐటీ డిపార్ట్‌మెంట్‌ సీజ్‌లో ఉన్నప్పటికీ, సర్వే నెంబర్ 311లో ఫాంహౌస్ నిర్మాణం జరిగింది.

కేటీఆర్‌కు కాంగ్రెస్ నేతల వార్నింగ్

జన్వాడ ఫాంహౌస్‌ను తాను లీజ్‌కు మాత్రమే తీసుకున్నానని తాజాగా మరోసారి చెప్పిన కేటీఆర్, కాంగ్రెస్ నేతల ఫాంహౌస్‌లపై ప్రశ్నించారు. ఈ క్రమంలో తన పేరును ప్రస్తావించడంపై ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి స్పందించారు. తాము 111 జీవో ఉల్లంఘించలేదన్నారు. తన పై అబద్దాలను ప్రచారం చేస్తే ఊరుకోనేది లేదన్నారు. కేటీఅర్‌పై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఒకవేళ తాను నిబంధనలు ఉల్లంఘిస్తే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మరోవైపు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ, హైడ్రాను చూసి కేటీఆర్ భయపడుతున్నారని అన్నారు. ఫిరంగి నాలా మూసేసి, ఇంద్రభవనం లాంటి ఫాంహౌస్‌ను కేటీఆర్ కట్టారని ఆరోపించారు. ఎవరైనా ఇళ్లను లీజుకు తీసుకుంటారని, కేటీఆర్ మాత్రం ఫాంహౌస్‌ను తీసుకున్నానని చెబుతున్నారని, బినామీల పేరుతో ఆక్రమణలకు పాల్పడ్డారని మండిపడ్డారు. దీన్ని తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి బయటపెట్టారని గుర్తు చేశారు.

జన్వాడ ఫాంహౌస్‌పై అనుమానాలెన్నో!

1. జీవో 111 పరిధిలోని భూముల్లో ఫాంహౌస్‌ను అక్రమంగా నిర్మించింది వాస్తవం కాదా?
2. ఈ అక్రమ కట్టడాన్ని కేటీఆర్ లీజుకు ఎలా తీసుకున్నారు?
3. అసలు, ఈ అక్రమ కట్టడానికి అనుమతి ఇచ్చింది ఎవరు?
4. లీజుకు తీసుకున్నందుకు ఎన్ని డబ్బులు కట్టారు? ఎలా ఇచ్చారు?
5. ట్రిపుల్‌ వన్ జీవోకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు జరిగిన మాట నిజం కాదా?
6. ఫాంహౌస్ ఎవరు కట్టినా, ఎవరు కొన్నా, అనుభవిస్తోంది మాత్రం కేటీఆర్ కుటుంబం కాదా?
7. ఫాంహౌస్‌లో కేటీఆర్ ఉండడం, ఆయన సన్నిహితులే ఫాంహౌస్‌ను, చుట్టూ ఉన్న భూములను కొనుగోలు చేయడం చూస్తే బినామీ లావాదేవీలే అన్న అనుమానాలు ఉన్నాయి

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×