EPAPER

Kolkata Doctor Rape-Murder Case: డాక్టర్ హత్యాచార ఘటనలో.. మమతా చేసిన తప్పేంటి?

Kolkata Doctor Rape-Murder Case: డాక్టర్ హత్యాచార ఘటనలో.. మమతా చేసిన తప్పేంటి?

Kolkata doctor rape and murder Highlights: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్‌కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసుతో ఆ రాష్ట్రం అట్టుడుకుతోంది. అత్యంత ఘోరమైన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిందితుణ్ని ఉరి తీయాలనే డిమాండ్‌తో పాటు ఇది సామూహిక అత్యాచారమనే వాస్తవాన్ని దాస్తున్నారనే ఆరోపణలు ఎక్కువయ్యాయి. రాజకీయ రంగు పులుముకున్న ఈ కేసులో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ, కోల్‌కతా రేప్, మర్డర్ ఘటనలో సీఎం మమతా చేసిన తప్పేంటి? అసలు ఏం జరిగింది..? పోస్ట్ మార్టమ్ రిపోర్ట్‌ ఏం చెబుతోంది?


దేశంలో అన్ని రాష్ట్రాల్లో కోల్‌కతా అత్యాచార, హత్య ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆసుపత్రుల్లో అత్యవసర విభాగం మినహా సాధారణ సేవలను వైద్యులు బహిష్కరిస్తున్నారు. కోల్‌కతాలోని ఆర్‌జీ కార్‌ ఆస్పత్రిలో ఆగస్టు 9న జరిగిన పీజీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనపై త్వరగా న్యాయం చేయాలని ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత అత్యున్నత న్యాయస్థానం ఆగస్ట్ 18న సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ కేసులో కోల్‌కతా పోలీసుల దర్యాప్తుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కలకత్తా హైకోర్టు సిబిఐకి విచారణను బదిలీ చేసిన కొన్ని రోజుల తర్వాత ఈ పరిణామం జరిగింది. సిజెఐ డివై చంద్రచూడ్ స్వయంగా క్రిమినల్ రిట్ పిటిషన్‌ను నమోదు చేయాలని ఆదేశించారు. న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఆగస్ట్ 20 ఉదయం 10.30 గంటలకు విచారణను ప్రారంభించనుంది.

అయితే, ఇప్పటికే, హైకోర్టు సీరియస్‌గా తీసుకున్న సమస్యను సుప్రీం కోర్టు సుమోటుగా స్వీకరించడం చాలా అరుదనే చెప్పాలి. అత్యున్నత న్యాయస్థానం ఈ సంఘటనను పరిశీలించడం సంచలన పరిణామంగా గుర్తించాలి. ఎందుకంటే, దేశంలో ఇలాంటి దుశ్చర్యలు దారితీస్తున్న పరిస్థితులను దీర్ఘకాలంగా నిర్లక్ష్యం చేయబట్టే మళ్లీ మళ్లీ ఇవి జరుగుతున్నాయనీ.. కాబట్టి, వ్యవస్థాగత లొసుగులను పరిశీలించాలనే ఉద్దేశాన్ని ఈ పరిణామం సూచిస్తుంది.


దేశంలో వైద్యులకు భద్రత లేకపోవడంపై సుప్రీం కోర్టు పాన్-ఇండియా లెవల్లో ఒక సందేశాన్ని పంపుతోంది. కొనసాగుతున్న సీబీఐ దర్యాప్తుల పర్యవేక్షణను కొనసాగించడానికి హైకోర్టు అనుమతించినప్పటికీ.. ఆసుపత్రుల్లో వైద్యులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, ముఖ్యంగా, మహిళలకు భద్రత లేకపోవడంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసే పరిస్థితి ఈ పరిణామంతో కనిపిస్తోంది. సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఈ సమస్యను పరిష్కరించడం కోసం పశ్చిమ బెంగాల్‌తో పాటు కేంద్ర ప్రభుత్వం నుండి కూడా సమాధానాలు కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ఇలాంటి ఘటనలపై దేశవ్యాప్తంగా సేఫ్టీ గైడ్‌లైన్‌ను నిర్దేశిస్తే.. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేసులో పార్టీలుగా చేర్చే అవకాశం లేకపోలేదు.

ఇక, కోల్‌కతా ఆసుపత్రిలో ఆగస్ట్ 14 అర్ధరాత్రి విధ్వంసం కేసును కూడా సుప్రీం కోర్టు టేకప్ చేయడం మరింత ఆసక్తిని రేపుతోంది. కోల్‌కతా నగరం అంతటా ఒకే సమయంలో వైద్యులు, విద్యార్థులు చేపట్టిన ప్రణాళికాబద్ధమైన ర్యాలీని భగ్నం చేయడం దీని వెనుక కారణంగా తెలుస్తోంది. ఎందుకంటే, ఆందోళన చేస్తున్న వారు.. ఆసుపత్రిలో రోగులు, సిబ్బంది, వైద్య పరికరాలు, ఆసుపత్రి ఆస్తులను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ హింసాత్మక నిరసనలో నర్సులు, సెక్యూరిటీ గార్డులు, సందర్శకులు కూడా ఆందోళనకారుల బెదిరింపుల్లో గాయాలపాలయ్యారు. ఆ తర్వాత, ఆసుపత్రిలో వైద్య, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, సిబ్బందికి భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం అసమర్థతపై కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Also Read: సీఎం మమతా అలా చేస్తారని అనుకోలేదు.. కోల్‌కతా బాధితురాలి తండ్రి

మరోవైపు, కోల్‌కతాలోని ఆర్‌జి.కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో అత్యాచారం, హత్యకు గురైన వైద్యురాలి తల్లిదండ్రులు, నిందితులందరినీ పట్టుకునే వరకు దేశప్రజలందరూ తమ వెంట నిలబడాలని కోరుతున్నారు. ఈ కేసును సరైన విధంగా పరిష్కరించడంలో విఫలమైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని వైద్యురాలి తల్లి తీవ్రంగా విమర్శించారు. నిరసనలను ఆపడానికి చూపించే ఆసక్తి నిందులందర్నీ పట్టుకోవడంపై చూపించడం లేదని ఆమె ఆరోపించారు. అయితే, నిందితులను వీలైనంత త్వరగా అరెస్టు చేస్తామని మమతా బెనర్జీ చెప్పినప్పటకీ, ఇప్పటి వరకూ ఒకరిని మాత్రమే అదుపులోకి తీసుకోవడంపై బాధిత కుటుంబ సభ్యులతో పాటు నిరసనకారులు కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఈ ఘటనలో ఎక్కువ మంది నిందితులు పాల్గొన్నారనీ మొదటి నుండీ అనుమానాలు ఉన్నా.. ముఖ్యమంత్రి వాటిని పరిగణలోకి తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. పైగా.. నిరసనకారుల సమావేశాన్ని ఆపడానికి పోలీసులు నిషేధ ఉత్తర్వులను అమలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆసుపత్రి అధికారులు మొదటగా చెప్పిన విషయాన్ని వైద్యురాలి తల్లి పేర్కొన్నారు. మొదట, మీ కుమార్తె అనారోగ్యంతో ఉందని ఆసుపత్రి నుండి తమకు కాల్ వచ్చిందనీ.. తర్వాత, కాల్‌ను డిస్‌కనెక్ట్ చేశారని ఆమె అన్నారు. ఆ తర్వాత ఫోన్ చేసి ఏమైందని అడిగితే ఆసుపత్రికి రమ్మని చెప్పారనీ.. తాము మరోసారి కాల్ చేసినప్పుడు, హాస్పిటల్ ‘అసిస్టెంట్ సూపర్‌వైజర్’ మాట్లాడుతూ.. మీ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని చెప్పాడని ఆమె వెల్లడించారు. ఇలా ఆసుపత్రి వర్గాలు ముందు నుండీ వాస్తవాలను స్పష్టంగా చెప్పలేకపోవడం కొందరు నిందితుల్ని తప్పించడంలో భాగమేనని తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.

అయితే, ఘటన రోజు అసలేం జరిగిందనేది ఓ సారి చూద్దాం.. ఆగస్ట్ 8న 31 ఏళ్ల వైద్య విద్యార్థిని కోల్‌కతాలోని ఆర్‌జి.కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌‌లో రోజువారీ డ్యూటీకి వెళ్లింది. అయితే, ఆ తర్వాత రోజు అంటే, ఆగస్ట్ 9న ఉదయం 10:53 గంటలకు ట్రైనీ డాక్టర్ ఇంటికి ఫోన్ కాల్ వచ్చింది. తల్లిదండ్రులు అక్కడికి చేరుకోగానే, ఆమెను చూడటానికి అనుమతించలేదు. మధ్యాహ్నం 3 గంటలకు బాడీని చూడటానికి అనుమతించారు. అప్పటికీ, విగతజీవిగా ఉన్న పీజీ వైద్య విద్యార్థిని ఒంటిపై ప్యాంటు తెరిచి ఉంది. ఆమె శరీరంపై దుప్పటి వంటి ఒక గుడ్డ మాత్రమే కప్పి ఉంది. ఆమె చేయి విరిగిపోయి, ఆమె కళ్ల నుంచి, నోటి నుంచి రక్తం కారుతోంది. ఆమెను చూస్తుంటే ఎవరో హత్య చేసినట్లు స్పష్టంగా కనిపించింది. అయితే, తమ కుమార్తెను ఆ పరిస్థితిలో చూసిన తల్లిదండ్రులు గుండెలవిశేలా ఏడ్చారు. కుమార్తె ఉన్న పరిస్థితిని చూసి, ఇది ఆత్మహత్య కాదు, హత్య అని రోధించారు.

అయితే, ఆగస్ట్ 8న రాత్రి ఏం జరిగిందో పరిశీలిస్తే.. సెకండియర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న ట్రైనీ డాక్టర్ ఎప్పటిలాగానే ఆ రాత్రి కూడా డ్యూటీలో ఉంది. ఘటనకు కొన్ని గంటల ముందు, జూనియర్లతో కలిసి డిన్నర్ చేసిన ఆమె, తెల్లవారుజామున 2 గంటలకు విశ్రాంతి తీసుకోవాలని అనుకుంది. అంత పెద్ద ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకోడానికి స్థలం లేకపోవడంతో, ఆమె విశ్రాంతి కోసం సురక్షితంగా ఉంటుందనే అభిప్రాయంతో ఎప్పటి లాగానే హాస్పిటల్ సెమినార్ హాల్‌కి వెళ్లింది. అయితే, ఆగస్టు 9న సెమినార్ హాల్‌లో అర్థనగ్నంగా ఆమె శవం కనిపించింది. అత్యాచారం జరిగినట్లు స్పష్టమైన గుర్తులు ఉన్నాయి. అయితే, ఆసుపత్రి అధికారులు మాత్రం ఆమె తల్లిదండ్రులకు ఆ విషయాన్ని సరిగ్గా చెప్పలేకపోయారు. ఇక, ఇదే అంశం తల్లిదండ్రులతో పాటు నిరసనకారుల్ని కూడా ఆవేశానికి గురిచేసింది.

ఇక, పోస్ట్‌మార్టమ్ నివేదికను పరిశీలించిన పలువురు వైద్యులు సామూహిక అత్యాచారం జరిగి ఉంటుందని వెల్లడించారు. ఆమె ఒంటిపై ఉన్న గాయాలు చూస్తే ఒకే వ్యక్తి చేసినట్లు కనిపించట్లేదని అన్నారు. ఈ రిపోర్ట్‌లో నిందితులు ఆమెను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసినట్లు తేలింది. తీవ్రమైన చిత్రహింసలకు గురిచేసినట్లు వెల్లడైంది. ఆమె అరవకుండా ఉండటానికి నోటిలో గుడ్డలు కుక్కి, తలను గోడకు బలంగా నొక్కినట్లు తేలింది. బాధితురాలి తల, మెడ, ముఖం, చేతులు, జననాంగాలతో కలిపి మొత్తం 14 చోట్ల గాయాలైనట్లు నిర్దారించారు. గొంతు నులమడంతో ఊపిరాడక చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడించారు. అలాగే, ఆమె జననాంగంలో 151 మిల్లీ గ్రాముల వీర్యాన్ని గుర్తించినట్లు తేల్చారు. ఊపిరితిత్తుల్లో రక్త స్రావం… శరీరంలోని పలు చోట్ల రక్తం గడ్డకట్టినట్లు గుర్తించారు. నేరం తెల్లవారుజామున 3 నుండి 6 గంటల మధ్య జరిగినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం, రక్తం, ఇతర శరీర ద్రవాల నమూనాలను ఫోరెన్సిక్ ఎనాలిసిస్ కోసం పంపించారు.

Also Read: ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం..వెలుగులోకి సంచలన విషయాలు!

అయితే, ఈ నేరంలో ప్రాథమికంగా 33 ఏళ్ల సంజోయ్ రాయ్ అనే సివిల్ వాలంటీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తెగిపడిన బ్లూటూత్ ఇయర్‌ఫోన్‌ ఆధారంతో అతన్ని పట్టుకున్నారు. ఇతడి వైవాహిక జీవితం కూడా సక్రమంగా లేదనీ, అశ్లీల చిత్రాలకు బానిస అని, పలు ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఈ ఘటనలో హాస్పిటల్ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ వ్యవహారం కూడా విమర్శలకు తావిచ్చింది. ఈ కేసులో ఆందోళనలు పెరిగిన తర్వాత ప్రిన్సిపాల్ సెలవుపై బయటకెళ్లారు. ఆ తర్వాత, ఆసుపత్రిలో తగిన భద్రత కల్పించడంలో విఫలమయ్యానని చెబుతూ అతను పదవికి రాజీనామా చేశాడు. అయితే, కేవలం 24 గంటల తర్వాత, కలకత్తా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రిన్సిపాల్‌గా సందీప్ ఘోష్‌ను నియమించారు. సరిగ్గా, ఇది నిరసనకారుల్లో మరింత ఆగ్రహాన్ని పెంచింది.

మొదటి నుండీ ఆసుపత్రి విచారణలో జాప్యం జరుగుతుందని పేర్కొంటూ ఆమె తండ్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రిలోని పిజిటి వైద్యులు అత్యవసర సేవలు మినహా అన్ని విభాగాల్లో పని చేయడం నిలిపివేశారు. సత్వర విచారణ కోసం విద్యార్థి సంఘాలు ర్యాలీలు నిర్వహించాయి. బెంగాల్ బిజెపి శాసనసభ్యులతో సహా ప్రతిపక్ష నాయకులు స్వతంత్ర మేజిస్ట్రేట్ నేతృత్వంలో విచారణకు పిలుపునిచ్చారు. మరోవైపు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా నిరసనల్లో భాగమయ్యారు. నిందితులకు మరణశిక్ష విధించాలని పిలుపునిచ్చారు. నిరసన తెలిపిన వైద్యులకు తన మద్దతును ప్రకటించారు. ఈ పరిణామాల మధ్య, కేసును సీబీఐకి అప్పగించిన పశ్చిమ బెంగాల్ హైకోర్టు.

 

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×