EPAPER

Public Health: ప్రజారోగ్యం పట్టాలెక్కేది ఎన్నటికో?

Public Health: ప్రజారోగ్యం పట్టాలెక్కేది ఎన్నటికో?

Peoples Welfare: వైద్యుడిని దైవంగా భావించే సంస్కృతి మనది. అయితే నేడు దేశంలో వైద్యరంగానికి, వైద్యులకు అలాంటి గుర్తింపు లేదు. గత రెండు దశాబ్దాల కాలంలో వైద్యం అనేది ఒక సేవగా గాక వ్యాపారంలా మారిపోయింది. ఈ నేపథ్యంలో సామాన్యుడికి వైద్యం అందని ద్రాక్షగా మారింది. ముఖ్యంగా కరోనా మహమ్మారి ప్రజారోగ్య వ్యవస్థ పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యం, నిధుల కేటాయింపులో ఉన్న లోటు పాట్లను స్పష్టంగా బయట పెట్టింది. సర్కారు హాస్పిటల్స్‌లో తగిన సౌకర్యాలు సరిపడినంతగా లేక, మెజారిటీ రోగులు ప్రైవేటు ఆసుపత్రికి పోవాల్సి వచ్చింది. దీంతో ఆ దవాఖానాలు యధేచ్ఛగా రోగులను దోచుకున్నాయి. డబ్బులు పూర్తిగా కట్టనిదే శవాన్ని కూడా బయటకు ఇవ్వని దారుణాలు ఎన్నో వెలుగు చూశాయి. కరోనా తర్వాత అయినా, ప్రభుత్వ వైద్యరంగాన్ని ప్రక్షాళన చేసుకోవాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ పదేపదే మొత్తుకున్నా.. మన ప్రభుత్వాలు మాత్రం విఫలమైన పాత ఆరోగ్య విధానాలనే నేటికీ కొనసాగిస్తున్నాయి. దీనివల్ల ఏటా ఖర్చు తప్ప ప్రజలకు మెరుగైన ఆరోగ్యం అందటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నాణ్యమైన ఆరోగ్యాన్ని జనాభా మొత్తానికి అందించడం అతి పెద్ద సవాలే.


2014లో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం 2002 నాటి జాతీయ ఆరోగ్య పథకానికి మార్పులు చేసి 2017లో జాతీయ ఆరోగ్య విధానాన్ని ప్రకటించింది. అప్పట్లో 2022 నాటికి ఆరోగ్య శాఖ బడ్జెట్ జీడీపీలో 2.25 శాతానికి పెంచుతామని ప్రకటించారు. అయితే, అది మాటలకే పరిమితమైంది. 2017 నాటి కొత్త జాతీయ ఆరోగ్య విధానాన్ని.. మరుసటి ఏడాది ఆయుష్మాన్ భారత్‌గా మార్చారు తప్ప కేటాయింపులు పెంచలేదు. బ్రిటన్‌ ప్రభుత్వం తన బడ్జెట్‌లో 19శాతాన్ని, అమెరికా ప్రభుత్వం కనీసం 20 శాతాన్ని ఆరోగ్యరంగానికి కేటాయిస్తున్నాయి. అలాగే చాలా పేద దేశాలు కూడా తమ బడ్జెట్‌లలో పది శాతానికి మించి ఖర్చు చేస్తున్నాయి. మన దేశంలో మాత్రం గత 30 ఏండ్లుగా కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు 1.15 శాతానికి మించలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైద్య, ఆరోగ్యరంగానికి 4 శాతం నిధులు కేటాయించే వారు. స్వతంత్ర తెలంగాణలోనూ అదే దుస్థితి కొనసాగుతూ రాగా, 2023లో నాటి సీఎం కేసీఆర్ దానిని 3.5 శాతానికే పరిమితం చేశారు.

దేశాభివృద్ధిలో ఆరోగ్యం అతి ముఖ్యమైన కొలమానం. మన దేశంలో గత రెండు దశాబ్దాల్లో జాతీయ ఆరోగ్య మిషన్, 108 అంబులెన్స్ సౌకర్యం, ఆరోగ్యశ్రీ, అర్బన్ హెల్త్ సెంటర్లు, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలొచ్చాయి. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచటమూ మంచి పరిణామమే. అయితే, ఇవన్నీ ఏదైనా తీవ్ర అనారోగ్యం వచ్చి ఆసుపత్రికి వెళితే ఉపయోగపడే ప్రత్యామ్నాయాలే తప్ప.. ప్రాథమిక ఆరోగ్యం స్థాయిలో మనకంటూ సమగ్ర విధానం లేదు. అనారోగ్యం వల్ల దేశంలో ఏటా 7 కోట్ల మంది పేదరికంలోకి జారిపోతున్నారు. తీవ్ర అనారోగ్యం పాలై ఒక్క తెలంగాణలోనే ఏటా 2 లక్షల కుటుంబాల పేదరికంలో కూరుకుపోతుండగా, ఆ కుటుంబాల్లోని పిల్లల చదువు, ఉపాధులు దెబ్బతింటున్నాయి. తమ ఆదాయంలో పదిశాతానికి పైగా ఆరోగ్యం మీద ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. అందుకే ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా, ఎన్నేండ్లు గడిచినా దేశంలో పేదరికం విషవలయంలా కొనసాగుతోంది.


Also Read: Minister Seethakka: మీ తండ్రి నేర్పిన సంస్కారం ఇదేనా?: కేటీఆర్ పై మంత్రి సీతక్క ఫైర్

మనదేశంలో పేదలు ఇంకా పేదలుగానే మిగిలిపోవడానికి గల కారణం ఆరోగ్య సమస్యలు, వాటి కోసం వెచ్చిస్తున్న డబ్బులే. నాణ్యమైన ఆరోగ్య సేవలు ఉచితంగా అందితే.. పేదల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 ఏండ్లు గడుస్తున్నా.. నేటికీ వందలో 70 మంది నాణ్యమైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాల్సిన దుస్థితి. పేదలు చికిత్సల కోసం ప్రభుత్వ దవాఖానల చుట్టూ తిరుగుతుంటారు. అక్కడ డాక్టర్లు ఉంటే మందులు ఉండవు. మందులుంటే సిబ్బంది ఉండరు. సిబ్బంది ఉంటే వసతులుండవు. ఇలాంటి పరిస్థితిని ఇప్పటికైనా మార్చాలి. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు తెచ్చినా, దాని వల్ల ప్రైవేటు వైద్య రంగ సంస్థలు లాభపడుతున్నాయే తప్ప ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రం సౌకర్యాలు మెరుగుపడలేదు. వీధికొకటి చొప్పున వెలిసిన ప్రైవేటు ఆసుపత్రులు, గల్లీకొకటి లెక్కన వస్తున్న డయాగ్నిస్టిక్ సెంటర్‌లు విపరీతమైన ఫీజులు వేస్తూ.. పేదవారి జేబు గుల్ల చేస్తున్నా వాటి నియంత్రణకు ప్రభుత్వాల నుంచి తగిన చొరవ లేదు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో మెరుగైన పరికరాలు, సరిపడా సిబ్బంది ఉంటే ఈ దుస్థితిని దూరం చేయవచ్చు.

మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం అందరికీ జీవించే హక్కు ఉంది. అయితే, జీవించటం అంటే కేవలం బతికి ఉండటం మాత్రమే కాదు. ఆరోగ్యంగా బతకటమని అర్థం. కానీ వాస్తవిక పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. నేటికీ సగటు గ్రామీణ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, అటవీ ప్రాంతాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేవు. ఉన్నచోట సదుపాయాలు, సిబ్బంది లేరు. వాటిని పర్యవేక్షించే పకడ్బందీ వ్యవస్థ లేదు. ఏజెన్సీ ఏరియాల్లోనైతే రోగి సమస్య ఏ వైద్యం చేస్తున్నారు? చికిత్స తరువాత రోగి స్థితి ఏమిటి? అనేవి జవాబు లేని ప్రశ్నలు. రోడ్డు ప్రమాద బాధితులకు వైద్యం అందించే వసతుల గురించి చెప్పాల్సిన పనేలేదు. వర్షాకాలంలో గర్భిణులు వాగులు, వంకలు దాటి పట్నానికి పోవాల్సిన దుస్థితే ఉంది. కార్పొరేట్లకు పన్నులను తగ్గించడానికి, రుణాలు మాఫీ చేయటానికి, రాయితీలివ్వటానికి వెనకాడని మన పాలకులు ప్రజారోగ్యాన్ని రవ్వంత పట్టించుకున్నా ఈ పరిస్థితిని మార్చవచ్చు. భారత్‌లో ప్రతి 834 మందికి ఒక డాక్టర్ ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలు 1:1000 కంటే ఇది మెరుగ్గానే ఉందని అనిపించినా, ఉన్న డాక్టర్లలో సేవలందిస్తున్నవారు ఎందరు? ఎందరికి సరైన అర్హతలున్నాయనేదీ ప్రశ్నార్థకమే. మన లోపభూయిష్ట విధానాల వల్ల పేదలు తమ ఆరోగ్య అవసరాల కోసం సమాజం మీద ఆధారపడాల్సిన పరిణామాలూ చోటుచేసుకుంటున్నాయి. తరచూ పత్రికలలో ఫలానా రోగికి, అరుదైన వైద్యం కోసం పెద్ద మొత్తంలో డబ్బు అవసరమనే ప్రకటనలను మనం నేడు చూస్తున్నాం. ప్రభుత్వ రంగంలోనే వైద్య సౌకర్యాలు మెరుగ్గా ఉన్నప్పుడు ఈ రకంగా పేద ప్రజలు బిచ్చమెత్తుకోవలసిన అవసరం ఉంటుందా? అనేది మన సమాజం ఆలోచించాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ప్రభుత్వాలు మెరుగైన విధానాలతో ముందుకొచ్చి తమ చిత్తశుద్ధిని చాటుకోవాల్సిన అవసరం ఉంది.

డాక్టర్. రక్కిరెడ్డి ఆదిరెడ్డి
కాకతీయ విశ్వవిద్యాలయం

Related News

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Big Stories

×