EPAPER

Gaddar: గద్దర్ రచనలను ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి

Gaddar: గద్దర్ రచనలను ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి

Gaddar first death anniversary: ప్రజా వాగ్గేయకారుడు, ప్రజా యుద్ధనౌకగా పిలుచుకునే గద్దర్ అమరుడై ఏడాది గడిచింది. గద్దర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో స్థాపించిన గద్దర్ ఫౌండేషన్ ఆధ్వరంలో మంగళవారం రవీంద్ర భారతిలో ప్రథమ వర్ధంతి కార్యక్రమం జరిగింది. గద్దరన్న యాదిలో పేరుతో సాగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, సీపీఐ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మేధావులు, సాహితీరంగ ప్రముఖులు, వామపక్ష, హక్కుల సంఘాల ప్రతినిధులు హాజరై ఘనంగా నివాళులు అర్పించారు. గద్దర్ చిత్రపటానికి మాలలు వేసి నివాళులు అర్పించారు. నాలుగేళ్ల అజ్ఞాతంలో గద్దర్ రాసిన పుస్తకాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క ఆవిష్కరించారు. ఇందులో మధు యాష్కి, వివేక్, కూనంనేని, నారాయణ, జూలకంటి, అద్దంకి, విమలక్క తదితరులు పాల్గొన్నారు.


గద్దర్ గొప్ప తాత్వికుడు, వాగ్గేయకారుడు, విప్లవకారుడని అల్లం నారాయణ అన్నారు. నక్సల్బరీ ఉద్యమానికి జీవితాన్ని ధారపోశాడని, ఉద్యమం నుంచి బయటికి వచ్చినా విప్లవ స్ఫూర్తితోనే కొనసాగారని వివరించారు.

నక్సల్బరీ ఉద్యమం నుంచి శ్రీకాకుళం, జగిత్యాల పోరాటాల వరకు గద్దర్ ప్రస్థానం అద్భుతంగా సాగిందని, రెండు మూడు సంవత్సరాల జీవితాన్ని తీసుకుని విమర్శించడం కుసంస్కారం అని హక్కుల నేత చిక్కుడు ప్రభాకర్ అన్నారు.


ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి సారధిగా గద్దర్ నిలబడ్డారని, జై తెలంగాణ అన్నందుకు భువనగిరిలో బెల్లి లలితక్కను ముక్కలుగా నరికినప్పుడు ధైర్యంగా అక్కడికి వచ్చిన ధీశాలి గద్దర్ అని రచయిత నందిని శిధా రెడ్డి వివరించారు. గద్దర్ ప్రయాణంలో అందరూ కలిసి ముందుకు నడవాల్సిన అవసరముందన్నారు.

దండకారణ్యంలో ఆదివాసీలను ఎన్‌కౌంటర్ పేరిట పొట్టనబెట్టుకుంటున్నారని, వారికోసం వేసిన ఆదివాసీల హక్కుల పోరాట సంఘీభావ కమిటీ వేశామని, గద్దరన్న ఉంటే ఈ కమిటీ బాధ్యత వహించేవారని పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ అన్నారు.

గద్దర్ ఒక లెజెండ్ అని, తాను చేయాలనుకున్న పనులన్నీ గద్దర్ చేశాడని సినీ నిర్మాత నర్సింగారావు అన్నారు. తన ప్రొడక్షన్ సంస్థ మూసేసే ప్రమాదంలో ఉన్నప్పుడు తనను రక్షించిన రక్షకుడు గద్దర్ అని గుర్తు చేసుకున్నారు.

1857 సిపాయిల తిరుగుబాటులో ఖదార్ సింగ్ పాత్ర కీలకమని, భగత్ సింగ్ గురు ఆయనే అని కవిత అందె శ్రీ గుర్తు చేశారు. ఖదార్ సింగ్ నామవాచకమే ఈ గద్దర్ అని చెప్పారు.

గద్దర్‌ తెలంగాణ చైతన్యంలోంచి పుట్టారని, చైతన్యం కోసమే పుట్టారని, ఆయనను అంచనా వేయలేమని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. గద్దర్ పాట తనను కూడా ప్రభావితం చేసిందన్నారు.

ఖద్దర్ అంటే గాంధేయవాదమని, గద్దర్ అంటే పిడికిలి బిగించడమని పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు. పాట, మాటతో సమాజాన్ని మార్చగలమని నిరూపించిన వ్యక్తి గద్దర్ అని వివరించారు. గద్దర్ అవార్డు ఇస్తామని చెప్పడం గర్వంగా ఉందన్నారు.

1983లో గద్దర్ అజ్ఞాతంలో ఉన్నారని, 1988 తర్వాత అజ్ఞాతం నుంచి బయటికి వస్తున్నప్పుడు గద్దర్ రాసిన పుస్తకాలను ప్రచురితం చేశామని, అప్పుడు కొన్నాళ్లు గద్దర్ తన గదిలోనే ఉన్నారని రచయిత ఎన్ వేణుగోపాల్ తెలిపారు.

గద్దర్ ఒక పరంపర చైతన్యమని, మార్క్సిజాన్ని స్వీకరించి చివరిదాకా అందుకు కట్టుబడి బతికారని వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న చెప్పారు. సోషలిజం లక్ష్యంగా కుల వ్యవస్థను బద్దలు కొట్టడమే గద్దర్ లక్ష్యంగా ఉండేదని వివరించారు.

ప్రజాస్వామ్య మార్పు కోసం తను ఎంచుకున్న పంథాలో కడదాక గద్దర్ నిలబడ్డారని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆయన ఆశయాలను సాధించాల్సిన అవసరం ఉన్నదని సూచించారు.

సాహిత్య, కళారంగం నిలబడాలంటే విరివిగా గద్దర్ విగ్రహాలు నిలబెట్టండని ప్రొఫెసర్ కంచె ఐలయ్య సూచనలు చేశారు. గద్దర్ విప్లవంలో ఉంటే ఈ స్థాయి గౌరవం దక్కేది కాదని పేర్కొన్నారు.

త్యాగమే జీవితానికి సార్థకమని చెప్పిన ఘనుడు గద్దర్ అని దేశపతి శ్రీనివాస్ తెలిపారు.

1989 నుంచి గద్దరన్న పాట ఎక్కుడుంటే అక్కడికి వెళ్లేవాన్ని అని కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేలు గుర్తు చేసుకున్నారు. గద్దరన్న పాటకు పల్లెల్లో గడీలు కూలి దొరలు పట్నం పారిపోయారన్నారు. గద్దరన్న పాట నాటి చంద్రబాబు ప్రభుత్వాన్ని వణికిందని తెలిపారు. గద్దరన్న యాదిలో ఓ పాట పాడారు.

గద్దర్ అవార్డు ప్రతిపాదనను స్వాగతిస్తున్నామని సినీ డైరెక్టర్ శంకర్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.

ఒక వీరుడు మరణిస్తే కోట్లాది మంది వీరులు పుడుతూనే ఉంటారని, గద్దరన్న పాట, మాటకు మరణం లేదని అరుణోదయ విమలక్క చెప్పారు.

‘మా నాన్న గద్దర్‌ను ఎంతో అభిమానించేవారు, ప్రేమించేవారు. గద్దర్ మాట, పాట పీడిత వర్గానికి దిక్సూచి. గద్దర్‌ను చూసి ఉద్యమస్ఫూర్తి నేర్చుకోవాలి’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చెప్పారు.

గద్దర్‌తో సైద్ధాంతిక విభేదాలున్నాయని, ఆయన ఆట, మాట సమాజంలో చెరగని ముద్రవేశాయని బీజేపీ నాయకులు రామచంద్రా రావు అన్నారు. గద్దర్‌ను తెలంగాణ సమాజం మరిచిపోదని, తమ పార్టీ తరఫున గద్దర్‌కు ఆయన నివాళి ప్రకటించారు.

సమసమాజం రావాలని పరితపించిన వ్యక్తి గద్దర్ అని, ఒంట్లో బుల్లెట్ పెట్టుకుని, అనేక దాడులు, ఒడిదుడుకులను ఎదుర్కొన్నా.. నమ్మిన ఆశయం కోసం నిలబడ్డారని సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి వివరించారు.

ఈ కార్యక్రమానికి అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్, మధు యాష్కిగౌడ్, సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×