EPAPER

Hamas Khaled Meshaal: హమాస్ తదుపరి అధ్యక్షుడు ఖాలిద్ మిషాల్.. ఇతన్ని చంపడం అంత సులువు కాదు!

Hamas Khaled Meshaal: హమాస్ తదుపరి అధ్యక్షుడు ఖాలిద్ మిషాల్.. ఇతన్ని చంపడం అంత సులువు కాదు!

Hamas Khaled Meshaal| : రెండు రోజుల క్రితం హమాస్ అధ్యక్షుడు ఇస్మాయిల్ హానియెను.. ఇజ్రాయెల్ హత్య చేసింది. ఇరాన్ కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన తరువాత ఇస్మాయిల్ తన నివాసానికి తిరిగి వెళ్లిన కొద్ది సేపటికే ఆయనపై రాకెట్ దాడి జరిగింది. ఈ దాడిలో ఆయనతోపాటు ఒక ఇరాన్ బాడీగార్డ్ కూడా చనిపోయాడు. అయితే ఇప్పుడు ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిగా ఖాలిద్ మిశాల్ బాధ్యతలు చేపట్టనున్నారు. తన శత్రువులను చేతికి మట్టి అంటకుండా హత్య చేయడంలో ఇజ్రాయెల్ కు మంచి పేరుంది. అలాంటిది.. ఒక హమాస్ నాయకుడిని చంపేందుకు ప్రయత్నించి విమర్శల పాలైంది. ఫలితంగా ఆ నాయకుడిపై హత్యాయత్నం చేసి మళ్లీ తనే కాపాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ హమాస్ నాయకుడు మరెవరో కాదు.. తదుపరి హమాస్ అధ్యక్షుడు ఖాలిద్ మిశాల్.


ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య యుద్ధం కొన్ని దశాబ్దాల నాటిది. బద్ధ శత్రువులైన వీరిద్దరూ ఒకరి మీద మరొకరు హింసాత్మక దాడులు చేసుకుంటుంటారు. అలాంటిది ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి తన శత్రువు అయిన హమాస్ నాయకుడి ప్రాణాలు కాపాడారు. అవును మీరు చదివింది అక్షరాలా నిజం. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తన బద్ధ శత్రువు హమాస్ నాయకుడు ఖాలిద్ మిశాల్‌పై విష ప్రయోగం చేయించి మళ్లీ తనే అతని ప్రాణాలు కాపాడాల్సి వచ్చింది. ఆ పరిస్థితులేంటో వివరంగా..


1997 సంవత్సరంలో ఇప్పుడున్న ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అప్పుడు కూడా అదే పదవిలో ఉన్నారు. హమాస్ పొలిటికల్, మిలిటరి వింగ్ అగ్రనాయకులలో ఒకరు ఖాలిద్ మిశాల్. ఖాలిద్‌ని అంతం చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని ఆదేశించడంతో ఆ దేశ గూఢాచార సంస్థ మొసాద్ ఒక ప్లాన్ రూపొందించింది. మొసాద్ గూఢాచార సంస్థకు.. ప్రపంచంలోకెల్లా ఉన్న అత్యంత శక్తివంతమైనదిగా పేరు ఉంది.

ఖాలిద్ మిశాల్.. పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్ నుంచి కార్యకలాపాలు నిర్వహించేవారు. హమాస్ నాయకులపై దాడులు జరుగుతున్న సందర్భంలో ఆయన పాలస్తీనా మిత్ర దేశమైన జోర్డాన్‌లో స్థిరపడ్డారు. జోర్డాన్ రాజు హుస్సేన్.. పాలస్తీనా ప్రజలకు యుద్ధ సమయంలో ఆదుకున్న మానవతావాది. ఆయనతో హమాస్ నాయకులు సన్నిహితంగా ఉండేవారు. అందుచేత హమాస్ నాయకులకు జోర్డాన్ దేశ రాజధాని అమ్మాన్‌లో కార్యాలయాలు ఉండేవి. ఖాలిద్ మిశాల్ కూడా అమ్మాన్‌ నగరంలో ఉండేవాడు.

ఇజ్రాయెల్ ప్లాన్ ప్రకారం.. ఇద్దరు మొసాద్ గూఢాచార ఏజెంట్లు అమ్మాన్ నగరానికి మారురూపంలో వెళ్లారు. అక్కడ ఖాలిద్ మిశాల్ పని చేస్తున్న ఆఫీస్‌కు చేరుకొని ఆయన ముక్కు, నోరుపై ఒక విషం కలిగిన స్ప్రేని చల్లాలి. దాంతో ఆయన కొన్ని గంటల వ్యవధిలో చనిపోవాలి. అది ప్రత్యేకమైన విషం కావడంతో పోస్టుమార్టంలో దాని ఆధారాలు దొరకవు. కానీ అంతా ప్లాన్ చేసుకున్నట్టుగా జరగలేదు. చిన్న పొరపాటు జరిగిపోయింది.

Also Read: ఇరాన్ లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హానియె మృతి.. ధృవీకరించిన పాలస్తీనా మిలిటెంట్లు

ఎలా జరిగిందంటే..
అనుకున్నట్లుగానే ఖాలిద్ మిశాల్ తన ఆఫీసుకు కారులో చేరుకున్నాడు. కానీ ఖాలిద్‌తో పాటు అతని చిన్నారి కూతురు కూడా వచ్చింది. ఖాలిద్ అతని కూతురితో ఆఫీస్‌లోని మెట్లు ఎక్కుతున్న సమయంలో ఇద్దరు మొసాద్ ఏజెంట్లు అతని ముఖంపై విషం కలిగిన స్పే చల్లారు. కానీ ఖాలిద్ అదృష్టం.. అతని కూతురు వెనుకనుంచి నాన్న అని పిలిచింది. దీంతో ఖాలిద్ అదే సమయానికి వెనక్కు మళ్లారు.. అప్పుడు ఆ విషయం కలిగిన స్ప్రే అతని చెవిలోకి వెళ్లింది.

అక్కడ వెనుక నిలబడి ఉన్న ఖాలిద్ బాడీగార్డులు ఇది గమనించారు. వెంటనే ఆ ఇద్దరు మొసాద్ ఏజంట్లని పట్టుకున్నారు. విషం చెవిభాగాన ఖాలిద్ శరీరంలో ప్రవేశించడంతో అతని ఆరోగ్యం మెల్లగా క్షీణించింది. అతను స్పృహ కోల్పోగా వెంటనే ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల తరువాత డాక్టర్లు ఖాలిద్‌పై ఏ విషాన్ని ప్రయోగించారో తెలియడంలేదని తెలిపారు. ఇలాగే ఉంటే.. ఆయన కొద్ది రోజుల్లో ప్రాణాలు కోల్పోతారని చెప్పారు.

ఈ విషయం జోర్డాన్ రాజు హుస్సేన్‌కు తెలిసింది. ఆయన వెంటనే ఖాలిద్ ప్రాణాలు కాపాడాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఒక సంవత్సరం కిందటే ఇజ్రాయెల్.. పాలస్తీనా మధ్య అమెరికా సహాయంతో సంధిని చేయించారు. అప్పుడు అమెరికా అధ్యక్షుడిగా బిల్ క్లింటన్ ఉన్నారు. దీంతో జోర్డాన్ రాజు అమెరికా అంబాసిడర్‌ను పిలిపించి వెంటనే బిల్ క్లింటన్‌తో మాట్లాడాలని అన్నారు.

Also Read: ఇంగ్లాండ్ లో ముగ్గురు స్కూల్ పిల్లల హత్య.. పోలీసులపై రాళ్లు రువ్విన ప్రజలు

బిల్ క్లింటన్ ఫోన్లో జోర్డాన్ రాజుతో మాట్లాడారు. తాము శాంతి కోసం చేయించిన సంధిని ఇజ్రాయెల్ ఉల్లఘించిందని వెంటనే ఖాలిద్ ప్రాణాలను కాపాడేందుకు ఇజ్రాయెల్ స్వయంగా విషానికి విరుగుడు మందు యాంటిడోట్ పంపాలని అడిగారు. లేకపోతే విష ప్రయోగం చేసిన మొసాద్ ఏజెంట్లకు చట్ట ప్రకారం ఉరి శిక్ష తప్పదని హెచ్చరించారు.

ఇది తెలిసిన బిల్ క్లింటన్ అమెరికా నుంచి ముగ్గురు అధికారులను పంపారు. ఆ ముగ్గురు జోర్డాన్ రాజు ముందు హాజరయ్యారు. వారి ముందు రాజు హుస్సేన్ రెండు డిమాండ్లను పెట్టారు. ఒకటి ఖాలిద్ ప్రాణాలు కాపాడాలి.. రెండవి ఇజ్రాయెల్ జైలులో ఉన్న పాలస్తీన మత గురువు హమాస్ అధ్యక్షుడు షేక్ అహ్మద్ యాసీన్‌ను విడుదల చేయాలి. అలా జరగకపోతే బందీలుగా ఉన్న ఇద్దరు ఇజ్రాయెల్ గూఢాచారులకు మరణ శిక్షతో పాటు యుద్ధం తప్పదు.

ఈ ఘటనలో ఇజ్రాయెల్ తప్పు స్పష్టంగా ఉండడంతో అమెరికా అధికారులు జోర్డాన్‌ని సమర్థించారు. ఆ తరువాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో చర్చలు జరిపారు. అమెరికా ఇరు వర్గాల మధ్య కుదిర్చిన సంధిని ఇజ్రాయెల్ ఉల్లఘించడంతో ఆయన జోర్డాన్ చెప్పిన షరుతులను అంగీకరించాలని ఒత్తిడి చేసింది. ఇది ఇజ్రాయెల్‌కు ఒక రకంగా అవమానకర పరిస్థితి. అయినా తప్పలేదు.

మృత్యువుతో పోరాడుతున్న ఖాలిద్ మిఖాల్ కాపాడడానికి ఇజ్రాయెల్ ఆ విషానికి విరుగుడు మందు ‘యాంటీడోట్’ను అమెరికా అధికారుల చేతికి అందించింది. వెంటనే వారు జోర్డాన్ వరకు ఆ మందును చేర్చి ఆస్పత్రిలో ఉన్న ఖాలిద్ ప్రాణాలను కాపాడారు.

ఆ తరువాత ఇజ్రాయెల్ ప్రభుత్వం జైలులో ఉన్న హమాస్ లీడర్‌ షేక్ అహ్మద్ యాసీన్‌ను జోర్డాన్‌లో ఉన్న ఇద్దరు మొసాద్ ఏజెంట్లకు బదులుగా విడుదల చేసింది. కథ అక్కడే ముగిసిపోలేదు. కట్ చేస్తే 2004 సంవత్సరం ఇజ్రాయెల్ కుట్ర పన్ని షేక్ అహ్మద్ యాసీన్‌‌ను హత్య చేయించింది. ఆ తరువాత ఆయన స్థానంలో హమాస్ కొత్త నాయకుడు మరెవరో కాదు.. ఖాలిద్ మిశాల్ ఎన్నికయ్యాడు.

విచిత్రమేమిటంటే.. 1999 సంవత్సరంలో జోర్డాన్ రాజు హుస్సేన్ చనిపోయనప్పుడు ఆయన చివరిచూపు కోసం.. ఇద్దరు బద్ధశత్రువులు ఎదురుపడ్డారు. జోర్డాన్ రాజు చివరిచూపు కోసం ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు, హమాస్ సెకండ్ ఇన్ చీఫ్ ఖాలిద్ మిశాల్ ఇద్దరూ ఒకరినొకరు పలుకరించుకున్నారు. అయితే ఇప్పుడు దాదాపు 25 సంవత్సరాల తరువాత మళ్లీ వీరిద్దరూ ఒకరినొకరు ఢీకొట్టబోతున్నారు.

పాలస్తీనా ప్రజల ఉద్యమ పార్టీ హమాస్. వీరి వద్ద పెద్దగా ఆర్థిక వనరులు లేవు. కతార్, ఇరాన్ దేశాల సాయంతో సాయుధ పోరాటం చేస్తున్నారు. అయితే హమాస్ ని టెర్రరిస్ట్‌లు అమెరికా, పాశ్చాత్య దేశాలు ముద్ర వేశాయి. మరోవైపు ఇజ్రాయెల్ వెనుక ఏకంగా అగ్రరాజ్యం అమెరికా ఉంది. ఇప్పటివరకు ఇజ్రాయెల్.. పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించుకుంటూ.. పేద పాలస్తీనా ప్రజలను అక్కడి నుంచి బలవంతంగా ఖాళీ వెళ్లగొడుతోంది. ప్రపంచమంతా ఇది తప్పు అని ఎంత చెప్పినా.. అసలు పాలస్తీనా అనే దేశమే ఉండదు అని ఇజ్రాయెల్ చెబుతోంది.

Also Read: ఇజ్రాయెల్ మరో యుద్ధం ప్రారంభించబోతోందా?.. గాజా లాగా లెబనాన్ లో కూడా వినాశనం తప్పదా?..

 

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×