EPAPER

Aruna Asaf Ali: క్వీన్ ఆఫ్ క్విట్ ఇండియా.. అరుణ

Aruna Asaf Ali: క్వీన్ ఆఫ్ క్విట్ ఇండియా.. అరుణ

Aruna Asaf Ali death Anniversary (National news today India): 1942 ఆగస్టు 8. బొంబాయిలో భారత జాతీయ కాంగ్రెస్‌ క్విట్‌ ఇండియా తీర్మానాన్ని ఆమోదించింది. ఈ సందర్భంగా గాంధీజీ ఇచ్చిన ‘డూ ఆర్ డై’ నినాదం జాతిని కదిలించింది. ఆరునూరైనా ఈ ఉద్యమంతో స్వాతంత్య్రం సాధించి తీరాలనే పట్టుదలతో వారంతా కార్యాచరణకు సిద్ధమయ్యారు. అయితే, బ్రిటిష్ పాలకులు మాత్రం ఈ ఉద్యమాన్ని ఆదిలోనే అణిచివేయాలని నిర్ణయించారు. ఎక్కడికక్కడ బ్రిటిష్ అధికారులు విరుచుకుపడి, మహాత్మాగాంధీతో సహా కాంగ్రెస్ నేతలందరినీ అరెస్టు చేశారు. దీంతో ఉద్యమానికి మార్గదర్శకత్వం చేసే వారు లేకుండా పోయారు. ఊహించని పరిణామంతో కాంగ్రెస్ కార్యకర్తలంతా దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.


పెద్ద నాయకులంతా జైళ్లలో ఉన్నందున ఉద్యమం ఆగిపోయిందని బ్రిటిషర్లు సంబరపడిపోయారు. అయితే, సరిగ్గా ఆ సమయంలోనే అప్పటికి పదేళ్లుగా కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్న ఓ ధీర ధైర్యంగా ఉద్యమంలోకి దూసుకొచ్చి క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించింది. ఆగస్టు 9న బొంబాయి గొవాలియా ట్యాంక్‌ మైదానంలో కాంగ్రెస్‌ జెండాను ఎగరేసి, కాంగ్రెస్ సదస్సును నిర్వహించి, గాంధీజీ ప్రకటించిన క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని కొనసాగించాలని దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసింది. ఆమె మరెవరో కాదు.. అరుణా అసఫ్ అలీ. ఈమె ప్రకటనతో కాంగ్రెస్ కార్యకర్తలంతా ఒక్కసారి రెట్టించిన ఉత్సాహంతో ఉద్యమంలోకి దూకారు. దీంతో ఉద్యమం పతాకస్థాయికి చేరింది.

ఆనాటి యునైటెడ్ ఫ్రావిన్స్ (నేటి హర్యానా)లోని కల్కలో 1909 జూలై 16వ తేదీన అరుణ జన్మించారు. తల్లిదండ్రులు అంబాలికా దేవి, ఉపేంద్రనాథ్ గంగూలీ. తండ్రి బ్రహ్మసమాజ ఆచారాలను పాటించేవారు. తండ్రి ఉపాధి దృష్ట్యా కొన్నాళ్లు లాహోర్‌లో ఉండటంతో అక్కడి ‘Sacred Heart Convent’లో అరుణ విద్యాభ్యాసం సాగింది. ఆ రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావటంతో నైనిటాల్ తిరిగివచ్చారు. అరుణ అక్కడి All saints Collegeలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తర్వాత కలకత్తాలోని గోఖలే మెమోరియల్ కాలేజీలో అరుణ లెక్చరర్‌గా చేరారు. ఆ సమయంలోనే ఆమెకు కాంగ్రెస్ పార్టీతో పరిచయం ఏర్పడింది. పార్టీ సమావేశాలకు హాజరై నేతల ప్రసంగాలను వింటూ ప్రేరణ పొందేవారు. ఈ సమయంలో అసఫ్ అలీ అనే యువకుడితో ఏర్పడిన పరిచయం, ప్రేమగా మారింది. మతం, వారిద్దరికి 20 ఏళ్ల వయసు తేడా ఉండటంతో వీరి వివాహానికి తల్లిదండ్రులు అడ్డుచెప్పినా, పెళ్లితో వీరిద్దరూ ఒక్కటయ్యారు. వీరి వివాహానికి మహాత్మా గాంధీ, నెహ్రూ, సరోజినీ నాయుడు, రాజాజీ, మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ వంటి కాంగ్రెస్ పెద్దలు హాజరై ఆశీర్వదించారు.


Also Read: ఢిల్లీ రావూస్ కోచింగ్ సెంటర్ ఎఫెక్ట్..13 కేంద్రాలు క్లోజ్

యువతను ఆకట్టుకునేలా ప్రసంగాలు చేయటంలో అరుణ మంచి పేరు సంపాదించింది. ఉప్పు సత్యాగ్రహ సమయంలో ఆమె ప్రసంగాలు పెద్దసంఖ్యలో ప్రజలు కాంగ్రెస్ పోరాటాల్లో భాగస్వాములయ్యేందుకు దోహదపడ్డాయి. ఈమె దూకుడును గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం 1932లో అరుణను అరెస్టు చేసి తీహార్ జైలుకు తరలించారు. జైలులో రాజకీయ ఖైదీల పట్ల బ్రిటిష్ అధికారులు వ్వవహరించే తీరును నిరసిస్తూ ఆమె జైలులో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఆమె దీక్ష మరోసారి చర్చకు దారితీయటంలో సర్కారు దిగివచ్చి.. ఖైదీలకు మెరుగైన సదుపాయాలు కల్పించినా అరుణను అంబాలా జైలుకు తరలించి, ఏకాంత ఖైదీగా ఉంచారు. అయితే, తర్వాత జరిగిన గాంధీ – ఇర్విన్ ఒప్పందం ప్రకారంగా రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే, అరుణను కూడా విడుదల చేస్తేనే తాము జైలు నుంచి వెళతామని తోటి మహిళా ఖైదీలంతా ఉద్యమించటం, అరుణ విడుదలకు గాంధీజీ సైతం సర్కారు మీద ఒత్తిడి పెంచటంతో ఆమె జైలు నుంచి విడుదలయ్యారు. ఆ సమయంలో చిత్తశుద్ధి లేని నాయకుల తీరుతో ఆమె తీవ్రంగా నిరాశకు లోనయ్యారు. ఈ క్రమంలోనే కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితురాలయ్యారు. ఇలా పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండిపోయారు.

క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో నాయకులంతా జైళ్లలో ఉండిపోవటంతో అప్పటివరకు మౌనంగా ఉన్న అరుణ.. ఒక్కసారిగా ఉద్యమంలోకి దూకారు. 1942 ఆగష్టు 9 వ తేదీన ఉల్లాసంగా, ఉరకలేసే ఉత్సాహంతో బొంబాయి గోవాలియా ట్యాంక్ మైదానంలో కాంగ్రెస్ జెండా ఎగరవేశారు. ‘నిష్క్రియాత్మక క్రియాశీలతతో కాదు.. క్రియాశీల విప్లవం ద్వారా స్వాతంత్ర్యపోరాటం చేద్దాం’ అని పిలుపునిచ్చారు. ‘రిస్క్ తీసుకునేంత ధైర్యం లేనివాడు జీవితంలో ఏమీ సాధించలేడు’ అంటూ భారత స్వాతంత్ర పోరాటంలో ఇదే చివరి సమరం కావాలని ప్రకటించారు. పోలీసులు అరెస్టు చేయబోగా, కార్యకర్తలతో కలిసి తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. బ్రిటిష్ అధికారులు ఆమె ఆస్తులను జప్తు చేశారు. ఆమెను ఆచూకీ చెబితే రూ.5000/-లు రివార్డునిస్తామని ప్రకటించారు. అజ్ఞాతంలో వెళ్లిన అరుణ.. భూగర్భ రేడియో, కరపత్రాల ద్వారా తన భావాలను వ్యాప్తి చేశారు. ‘ఇంక్విలాబ్’ పత్రికలో వ్యాసాలు వ్రాసి ప్రచురించారు. అదే సమయంలో లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్, ప్రముఖ సోషలిస్టు నేత రామ్ మనోహర్ లోహియా వంటి నేతలతో తన అభిప్రాయాలను పంచుకుంటూ తన పోరాటాన్ని కొనసాగించారు.

ఆ సమయంలోనే అరుణ ఆరోగ్యం దెబ్బతిన్నదని తెలుసుకున్న గాంధీజీ అరుణకు ఓ ఉత్తరం రాశారు. ‘నీ ధైర్య సాహసాలు నాకు సంతోషాన్ని కలిగిస్తున్నా.. నీ ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్నా. ఉద్యమ లక్ష్యం దాదాపు నెరవేరేలా ఉంది గనుక ఇక అజ్ఞాతం వీడి లొంగిపో.. నీపై ప్రభుత్వం ప్రకటించిన రివార్డును అంటరానితనం నిర్మూలనకు ఉపయోగించు’ అని ఆయన కోరారు. కానీ, గాంధీజీ విజ్ఞప్తిని అరుణ అంగీకరించలేదు. తన తలకు వెలను తొలగించి, అరెస్టు వారెంటు వెనక్కి తీసుకునేదాకా అజ్ఞాత పోరాటం ఆగదని ఆమె స్పష్టం చేయటంతో వారెంటును బ్రిటిష్ పాలకులు వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది. 1946లో అజ్ఞాతం వీడిన అరుణ.. ఆ ఏడాది జరిగిన బొంబాయి నౌకాదళ తిరుగుబాటులో పాల్గొన్నారు. స్వాతంత్య్రానంతరం, ‘కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ’లో చేరారు. 1954లో నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ వుమెన్ అనే సంస్థను స్థాపించారు.

ఇది భారత కమ్యూనిస్ట్ పార్టీ మహిళా విభాగం. దీనిలో పనిచేస్తూ పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత, దళితుల అభ్యుదయానికి కృషి సలిపారు. మహిళాభివృద్ధి కోసం, మహిళావిద్యకోసం కృషి చేశారు. కమలాదేవి ఛటోపాధ్యాయతో కలిసి మహిళల హక్కుల ఉద్యమాన్ని నడిపారు. మహిళలకు రిజర్వేషన్ల కంటే ఆరోగ్య రక్షణ, విద్య, ఆత్మరక్షణ అవసరమని ప్రభుత్వానికి నివేదించారు. ఈ క్రమంలోనే ‘లింక్’ అనే వారపత్రికను, ‘పేట్రియాట్’ అనే దినపత్రికను నడిపారు. పత్రికల ద్వారా స్వాతంత్రోద్యమ ఘట్టాలను ప్రచారం చేశారు. 1958లో కాంగ్రెస్‌‌లో చేరి ఢిల్లీ తొలి మేయర్‌గా ఎన్నికైనా, రాజకీయ ఒత్తిళ్లతో ఆ పదవిని వదిలేసి సామాజిక, సాంస్కృతిక, రచనా రంగాల్లో బిజీబిజీగా గడిపారు. 1964వ సంవత్సరంలో మళ్ళీ భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరినా, ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగానే ఉండిపోయారు.

Also Read: వ్యూహకర్తగా ఫుల్ స్టాప్.. ఇక ఫుల్ టైమ్ పొలిటిషయన్

ఇండో సోవియట్ సాంస్కృతిక సమాజం, ఆలిండియా పీస్ కౌన్సిల్‌లలో అరుణ ప్రముఖ పాత్రను పోషించారు. 1964లో కమ్యూనిస్ట్ రష్యా అందించే లెనిన్ శాంతి పురస్కారాన్ని పొందారు. బ్రెజ్నెవ్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని స్వీకరించారు. 1991లో ‘అంతర్జాతీయ అవగాహన’ కోసం కృషి చేసినందుకు గాను భారత ప్రభుత్వం ఇచ్చే ‘జవహర్‌లాల్ నెహ్రూ అంతర్జాతీయ అవగాహన’ పురస్కారాన్ని, 1987లో జాతీయ సమైక్యత కోసం కృషి చేసినందుకు ఇచ్చే ‘ఇందిరా గాంధి జాతీయ సమైక్యతా పురస్కారాన్ని’ అందుకున్నారు.

1992లో పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న అరుణ 1996 జూలై 29వ తేదీన ఢిల్లీలో కన్నుమూశారు. 1997లో భారత ప్రభుత్వం అరుణకు భారత రత్న పురస్కారాన్ని ప్రకటించింది. అరుణ సేవలకు గుర్తుగా ఏటా ‘అఖిల భారత మైనారిటీల ఫ్రంట్’ ‘డాక్టర్ అరుణ అసఫ్ అలీ సద్భావన్ అవార్డు’ను మైనారిటీ ప్రముఖులకు అందించి గౌరవిస్తోంది. స్వాతంత్య్ర పోరాటం చేస్తూనే అణగారిన వర్గాలు, మహిళాభివృద్ధి కోసం, సాంఘిక సమానత కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం ఎనలేని కృషి చేసిన అరుణ..‘Queen of Quit India’గా చరిత్రలో నిలిచిపోయారు.

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×