EPAPER

YSRCP : వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్.. ఆ నేతలపై గురి?

YSRCP : వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్.. ఆ నేతలపై గురి?

YSRCP : ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని జోరుగా ప్రచారం సాగుతోంది. మరోసారి అధికారం కైవసం చేసుకునేందుకు వైఎస్ఆర్ సీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ వేగంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఒకవైపు నియోజకవర్గాల సమీక్షలు నిర్వహిస్తూ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. పార్టీ పదవుల్లోనూ ప్రక్షాళన చేపట్టారు. సజ్జల, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ లాంటి కీలక నేతలకు గతంలో ఇచ్చిన పార్టీ కోఆర్డినేటర్ బాధ్యతలను తప్పించారు. చాలా చోట్ల జిల్లాల అధ్యక్షులను మార్చేశారు. ప్రతి నియోజకవర్గానికి ఒక పరిశీలకుడిని నియమిస్తున్నారు. అలాగే నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లను కొన్నిచోట్ల మారుస్తారనే ప్రచారం సాగుతోంది. ఇలా పార్టీని సమూలంగా ప్రక్షాళన చేస్తూ జగన్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.


వికేంద్రీకరణ నినాదం
మరోవైపు ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి పెట్టారు జగన్. గత ఎన్నికల్లో పార్టీకి లభించిన పట్టును నిలుపుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. విశాఖను పాలన రాజధానిని చేస్తామని స్పష్టం చేశారు. మూడు రాజధానుల నినాదంతో సెంటిమెంట్ రగులుస్తున్నారు. ఇటు రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తామని గతంలోనే ప్రకటించారు. ఈ ప్రాంతంలోనూ చంద్రబాబును దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారమే హామీలు అమలు చేసుకుంటూపోతున్నారు. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో సంక్షేమ పథకాల నిధులు జమ చేస్తున్నారు. ఇలా జగన్ బహుముఖ వ్యూహాలతో ఎన్నికల రణరంగంలోకి దిగేందుకు ప్రయత్నిస్తున్నారు.

బలమైన నేతలకు గాలం..
కొన్నిచోట్ల అభ్యర్థులను మార్చే యోచనలో ఉన్న సీఎం జగన్ ఇప్పుడు ఈ ప్రక్రియను ముమ్మరం చేశారు. గతంలోనే కొందరు టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకొచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వాసుపల్లి గణేష్ , వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్ వైసీపీ పక్షానే ఉన్నారు. ఇక టీడీపీకి మిగిలింది 19 మంది ఎమ్మెల్యేలు. ఈ 19 స్థానాల్లోనూ బలమైన అభ్యర్థులను నిలబెట్టేందుకు జగన్ పావులు కదుపుతున్నారు. గతంలో గెలిచిన కొన్ని ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో అభ్యర్థులను మార్చుతారని ప్రచారం సాగుతోంది. అలాంటి చోట్ల బరిలోకి దించేందుకు బలమైన నేతల కోసం వైఎస్ఆర్ సీపీ అధిష్టానం అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ను ఆయన నివాసంలో ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ కలవడం చర్చనీయాంశమైంది. ఇటీవల కొత్త పీసీసీ కార్యవర్గంలో తనకు ఇచ్చిన పదవిని హర్షకుమార్‌ తిరస్కరించారు. తాజాగా ఇదే విషయాన్ని ఆయన ఢిల్లీ వెళ్లి పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేకు వివరించారు. దీంతో హర్షకుమార్ పార్టీ మారవచ్చనే ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో బోస్‌ కలవడం ఆసక్తిని కలిగిస్తోంది.


అమలాపురం నుంచి బరిలో
హర్షకుమార్ గతంలో రెండుసార్లు అమలాపురం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం వైఎస్ఆర్ సీపీ నుంచి ఎంపీగా ఉన్న చింతా అనురాధ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎంపీగా హర్షకుమార్ ను బరిలోకి దించాలని వైఎస్ఆర్ సీపీ అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. హర్షకుమార్ లాంటి బలమైన నేతలను మరింత మందిని పార్టీలోకి తీసుకొచ్చేందుకు జగన్ కొందరి నేతలకు బాధ్యతలు అప్పగించారని ప్రచారం సాగుతోంది. టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు కూడా వైఎస్ఆర్ సీపీలో చేరతారని ప్రచారం సాగుతోంది. మరి ముందుముందు ఎవరెవరు ఫ్యాన్ కిందకు వస్తారో చూడాలిమరి. వై నాట్ 175 నినాదంతో ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్న జగన్ అందుకు అనుగుణంగా వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలిమరి.

Related News

Kadambari Jethwani: బట్టబయలైన కుట్ర.. ఏపీ పోలీసులు నటి జత్వానీని అందుకే అరెస్టు చేశారంటా!

Choreographer: జానీ మాస్టర్ పై పవన్ కళ్యాణ్ యాక్షన్

Alluri Sitharama Raju district: అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేక విద్యార్థిని మృతి.. డోలీపై మోసుకెళ్లినా దక్కని ప్రాణం

Tdp office attack case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. ఆ మూడే సమాధానాలు, అదుర్స్ మూవీని తలపిస్తోందా?

Fire Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..

IPS Secret Operation Fail: ముంబై నటి కేసు.. లాజిక్ మిస్సయిన ఐపీఎస్‌లు, గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు

Kadambari Jethwani: జత్వానీ కేసులో మరో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు

Big Stories

×