EPAPER

Union Budget | మొరార్జీ దేశాయ్ పేరున ఎక్కువసార్లు ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డ్.. త్వరలో ఆ రికార్డు బ్రేక్!

Union Budget | మొరార్జీ దేశాయ్ పేరున ఎక్కువసార్లు ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డ్..  త్వరలో ఆ రికార్డు బ్రేక్!

Union Budget | భారత దేశానికి నాలుగో ప్రధానమంత్రిగా మొరార్జీ రాంచోడ్‌జీ దేశాయ్ పనిచేశారు. అంతకు ముందు ఆయన ఆర్థిక మంత్రి హోదాలో ఉన్నప్పడు ఆయన రికార్డులే వేరు. ఎవరూ అధిగమించలేని రీతిలో అత్యధికంగా పది సార్లు బడ్జెట్‌ను మొరార్జీ దేశాయ్ సమర్పించారు. 1959 నుంచి 1964 వరకు, తిరిగి 1967 నుంచి 1969 వరకు మొరార్జీ మొత్తం 8 వార్షిక బడ్జెట్లు, 2 తాత్కాలిక బడ్జెట్లు ప్రవేశపెట్టారు.


ఆర్థిక మంత్రిగా ఆయన మరో విశిష్ఠతను కూడా సొంతం చేసుకున్నారు. పుట్టినరోజు నాడే బడ్జెట్ సమర్పించిన ఏకైక ఆర్థిక మంత్రి ఆయనే. మొరార్జీ ఫిబ్రవరి 29న జన్మించారు. అంటే లీపు సంవత్సరం. 2016 వరకు బడ్జెట్‌ను ఫిబ్రవరి నెలలో చివరి వర్కింగ్ డే రోజు సమర్పించేవారు. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి వచ్చే లీపు సంవత్సరంలో ఫిబ్రవరి 29న బడ్జెట్‌ లోక్ సభ ముందుకొచ్చేది. అలా ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో రెండు లీపు సంవత్సరాలు వచ్చాయి.

1964, 1968 సంవత్సరాల్లో ఫిబ్రవరి 29న ఆయన పార్లమెంట్ బడ్జెట్ సమర్పించారు. అలా రెండు సార్లు తన పుట్టిన రోజునాడే బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఘనత మొరార్జీ దేశాయ్‌కే దక్కింది. మొరార్జీ పేరున ఉన్న ఎక్కువసార్లు బడ్జెట్ సమర్పించిన రికార్డును బ్రేక్ చేసే నిర్మలా సీతారామన్‌కు ఉంది. మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక నిర్మలా సీతారామన్ పూర్తి అయిదేళ్లు ఆర్థిక మంత్రిగా ఉంటే ఆమె ఈ రికార్డును బ్రేక్ చేసే అవకాశాలున్నాయి.


మొరార్జీ రికార్డు
అత్యధికంగా బడ్జెట్లను సమర్పించింది మొరార్జీ దేశాయ్. ఆర్థిక మంత్రిగా ఆయన తన హయాంలో మొత్తం పది బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఇప్పటికీ ఆయనదే రికార్డు. ఆ తర్వాత స్థానాల్లో పి.చిదంబరం(9 బడ్జెట్లు), ప్రణబ్ ముఖర్జీ(8), యశ్వంత్ సిన్హా(8), నిర్మలా సీతారామన్ (7), మన్మోహన్ సింగ్(6) నిలిచారు.

బడ్జెట్ సమర్పించని మంత్రులు
మొరార్జీ పది బడ్జెట్లు సమర్పించి రికార్డు సృష్టిస్తే.. ఒక్కసారి కూడా బడ్జెట్ సమర్పించని ఆర్థిక మంత్రులు కూడా ఉన్నారు. బడ్జెట్లు సమర్పించని ఆర్థిక మంత్రులుగా హెచ్‌ఎన్ బహుగుణ, కేసీ నియోగి మిగిలిపోయారు. ఇప్పటివరకు వీరిద్దరు మాత్రమే బడ్జెట్ సమర్పించకుండానే పదవి నుంచి వైదొలిగారు. బడ్జెట్లు సమర్పించే రెండు ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో వారా పదవిని నిర్వహించడం.. అది కూడా కొద్ది కాలం మాత్రమే వీరిద్దరూ ఆ బాధ్యతలు నిర్వర్తించాల్సి రావడమే ఇందుకు కారణాలు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రెండో ఆర్థికమంత్రిగా 1950లో నియోగి నియమితులయ్యారు. అయితే ఆప్పుడాయన ఆ పదవిలో ఉన్నది 35 రోజులే. ఇక బహుగుణ 1979-80 మధ్య ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆయన మంత్రి హోదాలో ఉన్నది ఐదున్నర నెలలు మాత్రమే.

ఒకే సంవత్సరంలో రెండు బడ్జెట్లు.. వేర్వేరు మంత్రులు..
బడ్జెట్ల సమర్పణలో ఇదో విచిత్రం. తాత్కాలిక, వార్షిక బడ్జెట్లను వేర్వేరు వ్యక్తులు సమర్పించారు. అదీ ఆ ఇద్దరూ వేర్వేరు పార్టీలకు చెందిన వారు కావడం విశేషం. 1991-92 సంవత్సరానికి గాను జనతాదల్ కు చెందిన యశ్వంత్ సిన్హా తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 1991లో సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అప్పటి ప్రధాన మంత్రి పివీ నరసింహారావు.. ఆర్థిక మంత్రిగా మన్మోహన్ ‌సింగ్‌ని నియమించారు. ఆ ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ను ఆయనే ప్రవేశపెట్టారు. దేశ ఖజానా దాదాపు ఖాళీ అయిపోయిన సమయంలో మన్మోహన్ విధానాలు దేశ ఆర్థిక రంగంలో ఒక విప్లవాన్ని తీసుకువచ్చాయి. ఆయన ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఆర్థికరంగ ముఖచిత్రాన్నే మార్చేసింది. ఆర్థిక సరళీకరణకు పునాదులు పడింది అప్పుడే. విదేశీ పెట్టుబడులను పెద్దఎత్తున ఆకర్షించేందుకు దిగుమతి సుంకాన్ని భారీగా తగ్గించారు. 300 శాతానికిపైగా ఉన్న ఆ సుంకాన్ని 50 శాతానికి తగ్గించేశారు. సర్వీస్ టాక్స్ ప్రతిపాదనను తీసుకొచ్చిందీ ఆ బడ్జెట్లోనే. మన్మోహన్ ఆర్థిక విధానాలు ఆ తరువాత వచ్చిన ఆర్థిక మంత్రులకు ఎన్నో పాఠాలు నేర్పాయనే చెప్పాలి.

Also Read: కొత్త బడ్జెట్‌లో ఆదాయపు పన్ను పరిమితి పెరుగబోతోందా?.. పాత లేదా కొత్త టాక్స్ స్లాబ్‌లో ఏది ఉచితం?

సీతారామన్ రికార్డులు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరో బడ్జెట్‌ను సమర్పించేందుకు సిద్ధమయ్యారు. జూలై 23న ఆమె ఎనిమిదో సారి బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక ఇదే పూర్తి స్థాయి బడ్జెట్. బడ్జెట్‌ల సమర్పణ విషయంలో నిర్మల సీతారామన్ పేరిట కొన్ని రికార్డులున్నాయి. ఇందిరాగాంధీ తరువాత ఆర్థిక మంత్రి పదవిని చేపట్టిన రెండో మహిళ ఆమె. ఫుల్‌టైమ్ ఆర్థిక మంత్రిగా పనిచేచేస్తున్న తొలి అతివ రిక్డారు ఆమెకే సొంతం.

అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టిన తొలి మహిళామంత్రి
అత్యధిక బడ్జెట్లు సమర్పించిన మహిళా ఆర్థికమంత్రి కూడా నిర్మలే. 1970లో ఆర్థిక మంత్రిగా ఉన్న మొరార్జీ దేశాయ్ రాజీనామా చేయడంతో ఆ శాఖ బాధ్యతలను కూడా ప్రధాని ఇందిరాగాంధీయే చూశారు. తొలి ఆర్థిక మంత్రిగా ఆమె 1970-71 బడ్జెట్‌ను సమర్పించారు. ఆ తరువాత దేశ చరిత్రలో మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ 2019లో బాధ్యతలు చేపట్టారు.

ఏకధాటి ప్రసంగంలోనూ రికార్డ్
తొలి బడ్జెట్ సమయంలోనే ఆమె రికార్డు సృష్టించారు. సుదీర్ఘంగా బడ్జెట్ ప్రసంగం చేసిన ఆర్థిక మంత్రిగా చరిత్ర సృష్టించారు. సాధారణంగా 90 నుంచి 120 నిమిషాల సమయంలో బడ్జెట్ ప్రసంగం పూర్తవుతుంది. కానీ 2019-20 బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పుడు ఆమె అంతకు మించి ఎక్కువ సమయమే తీసుకున్నారు. ఏకంగా 2 గంటల 17 నిమిషాలు మాట్లాడారు. అప్పటి వరకు జశ్వంత్ సింగ్ పేరిట ఉన్న రికార్డును సీతారామన్ చెరిపేశారు. 2003లో 2 గంటల 15 నిమిషాలు జశ్వంత్ సింగ్ బడ్జెట్ ప్రసంగం చేశారు.

తన రికార్డును తానే అధిగమించిన సీతారామన్
బడ్జెట్ ప్రసంగం విషయంలో నిర్మల సీతారమన్ తన రికార్డును తానే అధిగమించడం విశేషం. రెండో బడ్జెట్(2020-21) సమర్పణ సమయంలో ఆమె ఏకధాటిగా 2 గంటల 42 నిమిషాలు ప్రసంగించారు. అప్పటికీ ఆ ప్రసంగం పూర్తి కాలేదు. ఇంకా రెండు పేజీలు మిగిలే ఉన్నాయి. ఆ సమయంలో అనారోగ్యంగా ఉండటంతో ప్రసంగాన్ని అక్కడితో ముగించారు. అంతకుముందు నిర్మల దాదాపు గంటన్నర పాటు బడ్జెట్ ప్రసంగం చేశారు. ఇప్పటివరకు ఆమె సమర్పించిన బడ్జెట్లలో 2021లో అతి తక్కువగా 100 నిమిషాలు బడ్జెట్ ప్రసంగం చేశారు. మరి ఆర్థిక బడ్జెట్ 2024-25లో ఆమె ఎంత సేపు ప్రసంగం చేస్తారో చూడాలి.

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×