EPAPER

CM Revanth Reddy: రేషన్ కార్డు లేకున్నా ఆరోగ్య శ్రీ.. సీఎం కీలక ఆదేశాలు

CM Revanth Reddy: రేషన్  కార్డు లేకున్నా ఆరోగ్య శ్రీ.. సీఎం కీలక ఆదేశాలు

Aarogyasri: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. దీనికితోడు ఆరోగ్య శ్రీ కి రేషన్ కార్డుతో అనుసంధానం వ్యవహారమై ప్రజల్లో గందరగోళం ఉన్నది. రేషన్ కార్డులు లేకుండా ఆరోగ్య శ్రీ సేవలు అందుకునేదెలా? ఒక వేళ రేషన్ కార్డుతో ఆరోగ్య శ్రీతో లింక్ లేకుంటే ఎలా అనే ఆందోళనలు, ఇబ్బందులూ ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్య శ్రీ కార్డుకు, రేషన్ కార్డుకు లింకు పెట్టొద్దని ఆయన స్పష్టం చేశారు. అలాగే.. తెలంగాణలో అందరికీ ఆరోగ్య శ్రీ కార్డులు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రేషన్ కార్డులతో సంబంధం లేకుండా.. అవి లేకున్నా సరే ఆరోగ్య శ్రీ కార్డులు అందించాలని అధికారులకు చెప్పారు.


రాష్ట్రంలో ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే, ఆర్ఎంపీ, పీఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇవ్వాలనే డిమాండ్‌ను ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇందుకు సంబంధించి అధ్యయనం చేసి కొత్త జీవో తీసుకువచ్చే అంశాన్ని పరిశీలించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే వైద్యులకు పారితోషికం పెంచి అక్కడ పని చేయడానికి ప్రోత్సహించేలా చర్య లు తీసుకోవాలని సూచనలు చేశారు. ప్రభుత్వ హాస్పిటల్‌లో ప్రతి బెడ్‌కు ఒక సీరియల్ నెంబర్ ఉండేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలతోపాటు గిరిజన ప్రాంతాల్లోనూ సరైన వైద్య సదుపాయం అందించేలా కలెక్టర్లు అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండాలని పేర్కొన్నారు.


Also Read: నితీష్ కుమార్ డిమాండ్స్‌లో న్యాయం ఉందా? ఎన్నికల స్టంటా?

ఆరోగ్య శ్రీపై సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన క్లారిటీ ప్రజలకు ఒక గుడ్ న్యూస్ వంటిదే. ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతున్నది. ఇప్పటికీ పేద ప్రజలు ఆరోగ్య శ్రీపై ఎక్కువ ఆధారపడుతున్నారు. ఏదైనా పెద్ద ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వెంటనే రేషన్ కార్డు లేదా ఆరోగ్య శ్రీ కార్డు తీసుకుని సమీపంలోని పెద్ద ప్రభుత్వ హాస్పిటల్‌కు వెళ్లిపోతున్నారు. అక్కడ ఆ వైద్య చికిత్సను ఆరోగ్య శ్రీ సేవలోకి మార్చుకుని లబ్ది పొందుతున్నారు. ఇప్పటికీ చాలా మంది ఈ పథకాన్ని వినియోగించుకుంటున్న తరుణంలో ఆ సేవలను మరింత ఎక్కువ మందికి అందించేలా నిర్ణయాలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించడంపై సర్వత్రా సంతోషం వ్యక్తం అవుతున్నది.

సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యారు. ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరేనని, ప్రతి అధికారి ఒక శంకరన్, ఒక శ్రీధరన్‌ల పని చేయాలని కలెక్టర్లకు సూచించారు. ప్రజా సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించే క్రమంలో కలెక్టర్లు తప్పకుండా క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలన్నారు. గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లపైనే ఉన్నదని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను పరిశీలించి వాస్తవ లబ్దిదారులను గుర్తించి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చెప్పారు.

స్వాగతిస్తున్నాం: హరీశ్ రావు

రేషన్ కార్డులు లేకున్నా ఆరోగ్య శ్రీ కార్డులు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఇచ్చిన ఆదేశాలను మాజీ మంత్రి హరీశ్ రావు స్వాగతించారు. హరీశ్ రావు ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు. ఇదే సూత్రాన్ని రైతు రుణమాఫీకి వర్తింపజేయాలనీ, రేషన్ కార్డు నిబంధన ఎత్తేయాలని డిమాండ్ చేశారు. పాస్ బుక్‌నే ప్రామాణికంగా తీసుకుని రుణమాఫీ చేయాలని కోరారు.

కాగా, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఈ విషయంపై ఇది వరకే స్పష్టత ఇచ్చారు. రేషన్ కార్డులను కేవలం కుటుంబాన్ని ధ్రువీకరించడానికి మాత్రమే అడుగుతున్నామని, రేషన్ కార్డు లేని వారి గురించి ప్రత్యేకంగా వివరాలు తెలుసుకుని రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×