EPAPER

GHMC Council Meeting: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం రచ్చ రచ్చ!

GHMC Council Meeting: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం రచ్చ రచ్చ!
  • మేయర్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ పట్టు
  • అధికారులు తీరుపై మండిపడ్డ బీజేపీ 
  • ఫిరాయింపులపై సభలో వాగ్వివాదం
  • వివాదానికి దారితీసిన ఫ్లకార్డులు
  • బీజేపీ, ఎంఐఎం మధ్య పిడిగుద్దులు
  • మార్షల్స్‌ను దించినా దారికి రాని సమావేశం
  • అధికారుల గైర్హాజరీపై ఆమ్రపాలి ‘సారీ’
  • ఉద్రికత్తల కారణంగా  కౌన్సిల్ నిరవధిక వాయిదా 
GHMC Council meeting begins and ends in chaos: జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. శనివారం ఉదయం కౌన్సిల్‌ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు మేయర్‌, డిప్యూటీ మేయర్ రాజీనామా కోరుతూ నినాదాలు చేయడంతో గందరగోళంగా మారింది. దీనికి తోడు బీజేపీ-ఎంఐఎం సభ్యుల మధ్య వాగ్వివాదం జరగడం, బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ మీద ఎంఐఎం సభ్యులు దాడికి దిగడంతో సమావేశం రసాభాసగా మారటంతో మేయర్ సమావేశాన్ని పలుమార్లు వాయిదా వేసినా ఫలితం లేకపోయింది. దీంతో సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు మేయర్ విజయలక్ష్మి  ప్రకటించారు.
రాజీనామాకు బీఆర్ఎస్ డిమాండ్ 
దాదాపు నాలుగున్నర నెలల తర్వాత జరుగుతున్న ఈ సమావేశంలో నగరాభివృద్ధి, సమస్యల మీద ఆయా పార్టీల నేతలు ఇచ్చిన 23 ప్రశ్నలపై చర్చించాలని కౌన్సిల్ ఎజెండాను నిర్ణయించిందని, నగర సమస్యల మీద సమావేశం చర్చించాల్సి ఉందని మేయర్ గుర్తుచేశారు. ఇది రాజకీయాలు చేయాల్సిన సమయం కాదని, సభ్యులెవరికైనా అభ్యంతరాలుంటే.. మేయర్ ఛాంబర్ ముందు ధర్నా చేయండి గానీ, ఇలా కౌన్సిల్ సమావేశంలో రభస చేయడం తగదని ఆమె బీఆర్ఎస్, బీజేపీ సభ్యులకు పదేపదే విజ్ఞప్తి చేశారు. దీనికి బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే తమ పార్టీ తరపున గెలిచి, కాంగ్రెస్ పార్టీలో చేరిన మేయర్ తక్షణం రాజీనామా చేయాల్సిందేననే డిమాండ్ చేస్తూ వారంతా పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. దీంతో మేయర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.
దీటుగా స్పందించిన మేయర్..
స్వల్ప విరామం తర్వాత సమావేశం తిరిగి ప్రారంభమైన తర్వాత మాజీ ఎమ్మెల్యే, దివంగత లాస్య నందిత మృతికి సంతాపం తెలుపుతూ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా అన్ని పార్టీల కార్పొరేటర్లు ఆమె మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మేయర్ రాజీనామా కోరుతూ నినాదాలు చేస్తున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిరాయింపులను ప్రోత్సహించింది గులాబీ పార్టీయేనని, ఫిరాయింపులపై మాట్లాడే హక్కు ఆ పార్టీకి లేదని మేయర్ వ్యాఖ్యానించారు. అభివృద్ధిని అడ్డుకునేందుకే బీఆర్ఎస్ సమావేశాన్ని జరగనీయకుండా ప్రయత్నం చేస్తోందని, ఆ నేతల వద్ద సబ్జక్టు లేకనే అల్లరికి దిగుతున్నారని మేయర్ వ్యాఖ్యానించారు. దీంతో సమావేశంలో మరోసారి గందరగోళం నెలకొనగా మేయర్ మరో 15 నిమిషాల పాటు సమావేశాన్ని వాయిదా వేశారు.
కొట్టుకున్న కార్పొరేటర్లు
విరామం తర్వాత తిరిగి మేయర్ రాగానే మరోసారి బీఆర్ఎస్ కార్పొరేటర్లు రాజీనామా చేయాలని, బీజేపీ కార్పొరేటర్లు అభివృద్ధి అంశాలపై నినాదాలు చేస్తూ మీటింగ్ హాల్‌ను హోరెత్తించారు. ఈ సమయంలో కాంగ్రెస్ కార్పొరేటర్ ఫసుద్దీన్ రాజ్యాంగం బుక్‌ను పట్టుకురావడంతో బీజేపీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఒకవైపు ఫిరాయింపులకు పాల్పడుతూ మరోవైపు రాజ్యాంగాన్ని పట్టుకోవడమేంటని కమలం పార్టీ సభ్యులు అనడంతో.. కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మధ్య గలాటా మొదలై, అది పిడిగుద్దులకు దారితీసింది. ఇదే సమయంలో ఫ్లకార్డుల విషయంలో వివాదం తలెత్తటంతో ఎంఐఎం సభ్యులు బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ మీద దాడికి దిగటంతో బీజేపీ కార్పొరేటర్లూ వారిపై తిరగబడ్డారు. దీంతో మేయర్..  మార్షల్స్‌ను రంగంలోకి దించినా ప్రయోజనం లేకపోవటంతో సమావేశాన్ని మేయర్ నిరవధికంగా వాయిదా వేశారు.
సారీ చెప్పిన ఆమ్రపాలి.. ! 
ఈ గొడవకు ముందు.. తాగునీరు సరఫరా చేసే లైన్లలో మురుగు నీరు కలుస్తోందంటూ బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. దీనిపై స్పందించిన మేయర్.. తమ డివిజన్‌లోనూ ఈ సమస్య ఉందని మేయర్ అన్నారు. దీంతో.. జలమండలి ఎండీ ఎక్కడంటూ మేయర్ వాకబు చేయగా, ఆయన సెలవులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇంత కీలక సమావేశానికి ఆయన గైర్హాజరు కావడమేంటని ఆయనపై కార్పొరేటర్ల ఆగ్రహం వ్యక్తం చేయగా, మీటింగ్‌ నుంచే జలమండలి ఎండీతో అశోక్ రెడ్డితో మేయర్ ఫోన్‌లో మాట్లాడారు. జ్వరం కారణంగా తాను సెలవు తీసుకున్నట్లు ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కలగజేసుకుని.. కార్పొరేటర్లకు సారీ చెప్పటంతో పాటు వచ్చే సమావేశానికి ఆయన హాజరయ్యేలా చర్యలు తీసుకుంటానని చెప్పటంతో వారు కాస్త శాంతించారు.


Tags

Related News

Narsingi: నార్సింగిలో బంగారు గని..?

Sabarmati and Thames River: సబర్మతి, థేమ్స్ నదులు ఎలా బాగుపడ్డాయి?

Israel-Iran War: ఇరాన్‌పై దాడికి ఇజ్రాయెల్ వ్యూహం ఇదే!

Osho Rajneesh: కళ్ళకు కట్టినట్టుగా ఓషో రజనీష్ నిజస్వరూపం

YS Jagan: కడపలో జగన్ ప్లాన్ సక్సెస్.. ఎలాగంటే..

YS Jagan in Confusion: అంబటి, రజిని దెబ్బకి.. అయోమయంలో జగన్

Bigg Boss 8 Day 33 Promo1: మార్నింగ్ మస్తీ.. చిలకజోస్యంతో అదరగొట్టిన మణికంఠ..!

×